పాలకడలిని పెద్ద కొండతో మధియించి
కాలకూట విషపు జ్వాలలని హరియించి
శ్రమ కోర్చి, పోరాడి సాధించినారంట
అమృతాన్నానాడు అందరూ ఒకటై!
ఆ కథను విన్న నే నవ్వుకున్నాను.
ఆ దేవతలు ఎంత వెర్రివారన్నాను!
చిన్న కడవని నేను చంకనెత్తాను
చిటికెలో మా వూరి చెరువుకెళ్ళాను
కడవలో అమృతం నింపి తెచ్చాను!
లేత కొబ్బరినీట జున్ను పాల్కలబోసి
పనస తొనలను తేన పానకంలో ముంచి
పండు మామిడి రసాల చెరకు సారము కలిపి
తినిచూడు తెలిసేను మా చెరువు నీళ్ళ రుచి!
జిహ్వనొకటే కాదు జీవులందరినీ
అలరించి మురిపించు మా వూరి చెరువు
పుల్ల మామిడికాయ కోసుకుని మీరు
కోతులై ఆడండి కొమ్మచ్చులంటు
కవ్విస్తూ ఉన్నది చెరువు గట్టున చెట్టు!
మా వూరి కన్నెలకు ఉయ్యాల పట్టు.
వెంటనే ఊగేటి కుర్రాళ్ళ చూపులు
చూచుటకు చాలవే ఈ రెండు కళ్ళు!
బండపై మోగేటి చాకళ్ళ దరువులు
నీటిలో ఈదేటి పిలవాండ్ల అరుపులు
నీళ్ళ కొచ్చిన అమ్మలక్కల కబుర్లు
కనులపండగే కాదు వీనులకు విందు!
ఎన్ననో చెప్పేను మా చెరువు కధలు
విని తమకు చూపమని మనవళ్ళ పోరు!
మా వూరు వదిలేసి గడిచె చాన్నాళ్ళు
మా చెరువు నీళ్ళకై లాగ ప్రాణాలు
ఊరికెళ్ళా నేను, వెంట మనవళ్ళు!!
చూచాక మా చెరువు నా కంట నీళ్ళు
చెరువు కానే కాదు చిన్ని కాలవ తీరు
కాళ్ళైన తడవవే ఏమైంది నీరు
ఏమయ్యిందా చెట్టు, మట్టి వాసన ఏది?
గట్టులో చాకళ్ళ ఆనవాలేదీ?
మనసులో మిగిలినవి ఆ జ్ఞాపకాలే
వాటితోనే నేను ఈ చెరువు చూసేను
ఎండిపోయెను కాని ఈనాటి చెరువు
మనసులో మెదిలేటి ఆనాటి చెరువే
పొంగింది నిండుగా నా కళ్ళలోన.