అనుభవం

“నీతో చెప్పిందా?” రవళి చెప్పింది జీర్ణించుకుందుకు రెండు నిమిషాలు తీసుకుని అడిగాడు త్రిలోచన్.

“చూచాయగా.” పొడిగా చెప్పింది రవళి.

“అతని వివరాలేమీ చెప్పలేదా?”

“చెప్పలేదు.”

“చెప్పలేదు, చెప్పలేదంటావ్. నువ్వు అడగలేదని మాత్రం చెప్పవు.” కస్సుమన్నాడు త్రిలోచన్.

“అడగనిస్తేగా. నాతో అది పట్టుమని పదినిమిషాలు మాట్లాడి ఎన్నాళ్ళయింది?”

“ఘర్షణ వాయిదా వేయడానికి అడక్కుండా ఊరుకుంటావ్. దాన్ని కప్పిపుచ్చుకుందుకి ఏదేదో చెబుతావ్.”

తీవ్రంగా అతనికేసి ఓసారి చూసి మౌనం వహించింది రవళి.

“మనమేమీ పాతకాలపు చాదస్తాలు పట్టుకుని వేళ్ళాడట్లేదు. ఇలాంటివి మనని షాక్ చెయ్యవు. ఇంక ఘర్షణ ఎందుకు? అన్నీ ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చుగా?”

“మరి నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావ్?” చివ్వున తలెత్తి అడిగింది. ఈసారి మౌనం వహించింది త్రిలోచన్.

“ఏదో భయం. దిద్దుకోలేని తప్పు చేస్తుందేమోనని భయం.” ఒప్పుకోలుగా అన్నాడు త్రిలోచన్.

“దానిమీద మనకు నమ్మకం లేదా?”

స్వరాలు తగ్గించారిద్దరూ ఇప్పటికి.

“నమ్మకం లేదేమో.” చాలాసేపు ఆలోచించి అన్నాడు త్రిలోచన్.


“నా మీద నమ్మకం లేదా నాన్నా?”

అఖిల అడిగిన ప్రశ్నకి లేదని జవాబు చెప్పలేదు త్రిలోచన్. బదులుగా,

“చిన్నప్పుడు ఒక కుంటికుక్కని చూసి జాలిపడి తెచ్చి పెంచుకుందామన్నావు. గుర్తుందామ్మా?” అనడిగాడు.

“ఉంది.”

“అదంటే నీకు ఇష్టమయి తెచ్చుకున్నావా?”

“ఇష్టమయే తెచ్చుకున్నాను. నువ్వే తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసొచ్చావ్.” నిష్ఠూరంగా అంది.

“రెండు రోజుల తర్వాత.” ఆమె వాక్యాన్ని పూర్తి చేశాడు త్రిలోచన్.

“అయితే?”

“అలా ఎందుకు వదిలేసి వచ్చానంటావ్?”

“బహుశా మన సరౌండింగ్స్‌లో అది నీకు అగ్లీగా అనిపించుండొచ్చు.”

“నీకనిపించలేదా?”

“లేదు.”

నవ్వాడు త్రిలోచన్. “నీక్కూడా అలాగే అనిపించింది అని వాదించను. కానీ నీ ఫ్రెండు తన కుక్కనీ, నీ కుంటికుక్కనీ పోల్చి చెబుతుంటే నీ కళ్ళల్లో నేను న్యూనత చూశాను. మేము మప్పిన విలువలకింద నువ్వు నలిగిపోవడం ఇష్టం లేక, నువ్వు ఏడుస్తున్నా దాన్నెక్కడో వదిలేసొచ్చాను. నువ్వు నిష్ఠూరమాడినా నీ కళ్ళల్లో రిలీఫ్ చూశాననుకున్నాను.”

“వాట్ నాన్సెన్స్! అయినా ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావ్?”

“మనసు చంపుకుంటే, నువ్వు ఈసారి తెచ్చేది కుంటికుక్కపిల్లని కాదు నేనెక్కడో వదిలేసి వచ్చేందుకు. ఆలోచించు.”


“నిద్ర పట్టట్లేదా రవళీ?” పక్కమీద మాటిమాటికీ భంగిమ మారుస్తున్న రవళిని గమనించి అడిగాడు త్రిలోచన్.

“లేదు.” అంది రవళి కళ్ళు మూసుకునే.

“అక్కీ ఏవంటోంది?”

“దాని మనసు మారినట్టుంది. ఇప్పుడా విషయం తలవట్లేదు.”

“నాకు తెలుసు.”

“నువ్వు అక్కీతో మాట్లాడింది నేను విన్నాను.”

“నేను చెప్పింది నిజమేనా?”

“తెలీదు. మన పెళ్ళిముందు మా నాన్న కూడా నాతో ఇలాగే అన్నాడు.”

“నువ్వేమన్నావ్?” అకస్మాత్తుగా త్రిలోచన్‌లో రక్తప్రసరణ హెచ్చింది. అది గొంతులో ధ్వనించింది.

“నాన్నని తప్పన్నాను. నీ మాట విని అక్కీ సుఖపడుతుంది. నాకు తెలుసు.”

ఆ రాత్రి త్రిలోచన్‌కి నిద్ర పట్టలేదు.