సత్యజిత్ రాయ్ – ఓ చిన్న ఉపోద్ఘాతం

ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు. వీటిలో ఏ ఒక్క రంగంలో కృషి చేసినా అతను రాణించి ఉండేవాడని సమకాలీనులు ఆయనను ప్రశంసించారు. ద్రష్టగా, కళాస్రష్టగా ప్రపంచ సినీరంగపు అతిరథ మహారథుల చేత మన్ననలు పొందిన రాయ్ సినిమాలు అపూర్వమైన కళాకౌశలంతో బాటు స్థూలంగా భారతీయతనూ, కథనం, శిల్పాల్లో సూటిదనాన్నీ, నిజాయితీనీ ప్రతిబింబిస్తాయని ఆయన అభిమాను లందరికీ తెలిసినదే.

కలకత్తాలో పుట్టి, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో ఎకనామిక్స్ చదువుకున్న సత్యజిత్ 1940-41లో తమ కుటుంబానికి మిత్రుడైన రవీంద్రనాథ ఠాకూర్ బతికుండగానే శాంతినికేతన్ వెళ్ళి చిత్రకళ అభ్యసించాడు. సినిమాలూ, గ్రామఫోన్ రికార్డ్ల మోజుతో అతను 1942లో కలకత్తాకు తిరిగివచ్చాడు. 1943 నుంచి సుమారు పన్నెండేళ్ళపాటు ఒక బ్రిటిష్ అడ్వర్తైజింగ్ కంపెనీలో పనిచేశాక సినీరంగంలో కాలు మోపాడు. 1955లో పథేర్ పాంచాలీ సినిమాకు దర్శకత్వం వహించిన తరవాత అతను దర్శకుడుగా దేశవిదేశాల్లో పేరు సంపాదించుకోసాగాడు. అంతకు ముందే కలకత్తా ఫిల్మ్ సొసైటీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. 1949లో కలకత్తాకు వచ్చిన ప్రసిద్ధ ఫ్రెంచ్ దర్శకుడు ఝాఁ రెన్వార్ వెంట తిరిగి నవతరం సినిమా గురించి ఆకళించుకున్నాడు.

సంవత్సరానికొక సినిమా చొప్పున అతను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి. కొన్ని బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకున్న కథలైతే కొన్ని స్వయంగా రాసుకున్నవి. సీరియస్ కళాఖండాలే కాక పిల్లల కోసం సాహసాలూ, హాస్యంతో కూడిన సినిమాలూ తీశాడు. సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, వాస్తవిక జీవిత చిత్రణ, అపూర్వం అనిపించే సినీ పరిభాషా, కళానైపుణ్యం అడుగడుగునా ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ప్రపంచంలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేసే దర్శకుల్లో రాయ్ ఒకడు. రవీంద్రుడి ‘చారులతా’ మొదలుకొని పిల్లల సినిమా ‘గోపీ గాయేన్’ వంటి జానపద చిత్రాలూ, హిందీలో ప్రేంచంద్ కథ ఆధారంగా ‘శత్‌రంజ్ కే ఖిలాడీ’, రవీంద్రనాథ ఠాకూర్ మీద అద్భుతమైన డాక్యుమెంటరీ ఒకటీ ఇలా ప్రతీ ఒక్కటీ కళాఖండం అనిపించేట్టుగా నిర్మించాడు.

కంప్యూటర్ ఫాంట్‌లు వ్యాప్తిలోకి రాకముందే రాయ్ బెంగాలీ అక్షరమాలలో కొత్త శైలులని ప్రవేశపెట్టాడు. బెంగాలీలో అనేక కథలూ, వ్యాసాలూ, నవలలూ కూడా రాశాడు. సైన్స్ ఫిక్షన్, డిటెక్టివ్ సాహిత్యం మొదలైన ప్రత్యేక విషయాల గురించి కథలు రాసి, ఫేలూ దా మొదలైన పాత్రలతో జైసల్మేర్ కోట నేపథ్యంతో ‘షోనార్ కెల్లా’ వగైరా సినిమాలు కూడా తీశాడు. 40 ఏళ్ళు సినీరంగంలో వెలిగాక చనిపోయే ముందు లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఆస్కార్ బహుమతినీ, భారత రత్న బిరుదునూ పొందాడు.

బెంగాలీ సంస్కారాన్నీ, భారతీయతనూ ఒంటపట్టించుకుని ప్రపంచస్థాయికి ఎదిగిన సత్యజిత్ రాయ్ ఏ ప్రక్రియను చేపట్టినా ప్రతిభావంతంగా నిర్వహించగలిగాడు. తన చిన్నతనంలోనే ఆర్థర్ కోనన్ డాయిల్ డిటెక్టివ్ కథలనూ, ఎచ్.జి.వెల్స్ తదితరుల సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్నీ అభిమానించిన రాయ్ రాసిన కథల్లో ఆ ప్రభావం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

సత్యజిత్ రాయ్ కథాసాహిత్య సూచిక

Best of Satyajit Ray. Penguin India, 2001. ISBN 0143028057
Bravo Professor Shonku. Translated by Kathleen M. O’Connell. Delhi, Rupa & Co., 1986. ISBN 0318369443.
Phatik Chand – a novel Translated by Lila Ray. Delhi, Vision Books, 1984. ISBN: 086578230X, 0861868935
Stories. London, Secker & Warburg, 1987. ISBN 0436410109 / 0140097295.
The adventures of Feluda. Chitrita Banerji (Translator). India / U.S.A., Penguin Books, 1988. ISBN 0140112219.
The mystery of the elephant god : more adventures of Feluda, ISBN 0140251227.
Royal Bengal Mystery and Other Feluda Stories. Penguin Books India. ISBN 0140275908
Feluda’s last case, ISBN 0140257489.
House of Death and Other Feluda Stories. Penguin Books India. ISBN 0140268030
The unicorn expedition, and other fantastic tales of India. New York, E.P. Dutton, 1987. ISBN 0525245448.
Mystery of the Pink Pearl; The Final Feluda Stories. Penguin Books India; ISBN: 0140278214
Night of the Indigo. Penguin Books Australia Ltd., 2000. ISBN 0140294481
Twenty stories. Translated by Gopa Majumdar. New Delhi / New York, Penguin Books, 1992. ISBN 0140156380.
Nonsense rhymes. Ray, Sukumar. Translated by Satyajit Ray. Calcutta, Writers Workshop, 1970. ISBN 0882535870.
Henri Cartier-Bresson in India. Cartier-Bresson, Henri Foreword by Satyajit Ray. Mapin Publishing in association with Mapin International, New York, 1987. ISBN 0500277125.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...