[1956 సంవత్సరంలో విడుదలైన అపరాజితో సినిమా ‘అపు చిత్రత్రయం’ లో రెండవది. నవంబర్ నెలలో పరిచయం చేసిన పథేర్ పాంచాలీ సినిమా లాగే, అపరాజితో సినిమాకి మూలం కూడా బెంగాలీలో వచ్చిన బిభూతి భూషన్ బందోపాధ్యాయ్ స్వీయ కథాత్మక నవల “పథేర్ పాంచాలీ” .]
అంతర్జాతీయంగా ‘పథేర్ పాంచాలి’కి వచ్చిన పేరుతో, రాయ్ తియ్యబోయే సినిమాలపై ఆశలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పథేర్ పాంచాలి సినిమా అంత బాగా ‘అపరాజితో’ తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు. కానీ, ఈ సినిమా తియ్యటంలో రాయ్, అతని బృందం ఏ విషయంలోనూ రాజీ పడలేదు.
సర్బజయ, అపు
అపరాజితో అంటే, ‘పరాజయం లేని’ అని అర్ధం. హరిహరన్ తన స్వగ్రామమైన నిశ్చిందపురం వదిలి, బెనారస్‌లో భార్య సర్బజయ, పదేళ్ళ అపులతో జీవితం గడపటంతో సినిమా మొదలవుతుంది. హరిహరన్ మరణంతో కథ మలుపు తిరుగుతుంది. హరిహరన్ చనిపోటంతో తల్లీకొడుకులు మాత్రమే ఒకరికొకరు మిగులుతారు. పెరుగుతున్న అపును, తండ్రి లాగే పౌరోహిత్యం చెయ్యమని తల్లి అడగటం, అపు అందుకు ఇష్టపడక స్కూల్లో చేరటం, తల్లి కష్టపడి కొడుకును చదివించటం ఈ సినిమా ముందు భాగంలో ప్రధానాంశాలు. తరవాత భాగంలో అపు పెరుగుతూ తల్లి నుంచి ఎలా దూరమవుతాడు అన్నది ముఖ్యాంశం. తల్లీకొడుకులు అనుబంధం, వారి మధ్య అంతఃఘర్షణలు ఈ అపరాజితో సినిమాకు కేంద్రం.
బెనారస్ డైరీ
అది మార్చ్ 1956 సంవత్సరం. స్థలం బెనారస్‌లోని గంగా ఘాట్, అక్కడికి దగ్గరగా ఉన్న మరికొన్ని ప్రదేశాలు. సత్యజిత్ రాయ్ ప్రతి రోజూ సినిమా తియ్యటంలో తనకు జరిగిన అనుభవాలను డైరీలో రాసుకొనేవాడు. అందులో కొన్ని విషయాలు రాయ్ మాటల్లో:
మార్చ్ 1:
పొద్దున్నే ఐదు గంటలకు గంగా ఘాట్‌ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామని ఒక్కడినే బయలుదేరాను. ఇంకో అరగంటలో సూర్యోదయం. అనుకున్నదాని కంటే వెలుతురూ, జనసమ్మర్ధం కూడా ఎక్కువగా అనిపించింది. …ఎటు చూసినా మనసుకు హత్తుకుపోయే దృశ్యాలే! …మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటికి అదే చోటుకెళ్ళా! పొద్దున్న కలిగిన అనుభూతికి, ఇప్పటి అనుభూతికి సామ్యం లేదు. ఇది ఇంకొక అందమైన అనుభూతి. ఇప్పుడు సూర్యుడు మరోలా ప్రకాశిస్తున్నాడు. పెద్ద పెద్ద భవనాల వెనక అస్తమిస్తున్న సూర్యుడి నీడలు, గంగ ఒక ఒడ్డు నుంచి, రెండో ఒడ్డుకి చేరుకుంటున్నాయి. సాయం సంధ్యలో పల్చబడుతూ విస్తరిస్తున్న సూర్య కాంతి, నిస్తేజమైన ప్రకృతిలో కరిగిపోతోంది. ఒక్కటే అనిపించింది. పొద్దుటి షూటింగ్ పొద్దున్నే తియ్యాలి. సాయంత్రం షూటింగ్, సంధ్యా సమయంలోనే తియ్యాలి.
మార్చ్ 4:
దుర్గ గుడికి వెళ్ళాను. ….అపుతో ఒక మంచి దృశ్యం తియ్యాటానికి అనువైన చోటు.
మార్చ్ 15:
ఘాట్‌ల వద్దకు పావురాలని చిత్రీకరిద్దామని ఐదు గంటలకు చేరుకున్నాం. ఒక గుంపుగా ఆకాశంలోకి ఎగిరి, వలయాకారంలో చక్కర్లు కొట్టే పావురాల దృశ్యాన్ని తియ్యాలని సంకల్పం. పావురాలని అదరగొట్టటానికి కొంచెం గట్టిగా శబ్దం వచ్చే బాంబులు మా వెంట తెచ్చుకున్నాం. కెమేరా సరైన దిశలో గురి పెట్టబడి ఉంది. సుబీర్ బాంబు వత్తికి నిప్పంటించాడు. ఒక ముప్ఫై సెకన్లు గడిచాయో లేదో! నిమాయ్ వళ్ళు తెలియని ఆవేశంతో ఏవో సంజ్ఞలు చేస్తున్నాడు. ఏదో జరక్కూడనిది జరుగుతోందనిపించింది. సుబీర్ బాంబు పేలకుండా ఉంటే బాగుండునన్నట్టు మూకాభినయం చేస్తున్నాడు. బాంబు చక్కగా పేలింది. హుందాగా పావురాలన్నీ ఆకాశంలోకి లేచాయి. కెమేరా మాత్రం పావురాలు ఎగురుతున్న దిశగా తిరగలేదు. అప్పుడు చూసుకున్నాం! కెమేరా మోటారుని, బాటరీకి కలపాల్సిన ఎలక్ట్రిక్ తీగ ఊడిపోయి ఉంది. అదృష్టవశాత్తు, పావురాలు నాలుగు చక్కెర్లు చుట్టి, మళ్ళీ నేలకు చేరాయి. మేం తెచ్చుకున్న నాలుగు బాంబుల్లో, రెండోది వాడి అతి చక్కని దృశ్యాన్ని షూట్ చేసాం.
మార్చ్ 20:
చౌశతి ఘాట్ మెట్ల దగ్గర హరిహరన్ స్పృహ తప్పి పడిపోయే దృశ్యం. చాలా సంతృప్తి కలిగే దృశ్యాలని చిత్రీకరించాం. బలంగా వీచిన గాలి వల్ల గంగ మీద అలలు ఎగసి పడటంతో, ఆ దృశ్యానికి ఒక చైతన్యం వచ్చింది. అతి సహజంగా కాను బాబు (హరిహరన్ పాత్రధారి) క్రింద పడ్డప్పుడు మాత్రం మోకాలి చిప్ప మీద ఒక అంగుళం లోతు గాయం అయ్యింది.
గ్రామీణ జీవితం
తండ్రి మరణంతో, తల్లితో కలిసి బెనారస్ నుంచి తల్లికి బంధువు, తనకి వరసకి మేనమామ ఉన్న పల్లెటూరు ఇంటికి వస్తాడు అపు. కొంత బాల్యం అపు ఇక్కడ గడిపినపుడు, రాయ్ పల్లెటూరు చిత్రణ అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం సినిమా చూస్తున్నామా లేక ఒక డాక్యుమెంటరీ (“భారత దేశంలో పల్లె జీవితం” అన్న టైటిల్ సరిపోతుందేమో) చూస్తున్నామా అన్న అనుమానం రావటం సహజం. పొలాలు, చేల గట్లు, చెట్లు, చేమలు, కాలవలు, అందులో పిల్లల ఈతలు, అప్పుడప్పుడు దూరంగా ఆకాశంలోకి నల్లని పొగలు చిమ్ముతున్న రైలు బండ్లు (అప్పటికి ఇంకా డీజిల్ ఇంజన్ రైలు బండ్ల వాడకం లేదు) – ఇవన్నీ సినిమాలో చూసేవారిని ఎక్కడకో పాత జ్ఞాపకాల్లోకి తెరలు తెరలుగా, పొరలు పొరలుగా తీసుకెడతాయి. ‘పథేర్ పంచాలి’ సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా పల్లెటూరి వాతావరణం అద్భుతంగా చిత్రీకరిస్తాడు రాయ్. యుక్తవయస్సు వచ్చాక అపు, కలకత్తాలో కాలేజీ చదువుకు వెడుతున్నప్పుడు ఆ చిన్న ఊరి రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూట్టం, కాలేజీ శలవల్లో ఇంటికి రాగానే తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ఇంటి ముందున్న చెరువులోకి దభీమని దూకటం – ఇవన్నీ పల్లెటూరు జీవితం అనుభవం ఉన్నవారికి భావోద్రేకంతో కూడుకున్న అనుభవాలే!
హెడ్‌మాష్టారు
అపు పాత్ర చిత్రణలో ప్రస్ఫుటంగా కనిపించి, నిలిచిపోయే సంగతి ఒకటుంది. ఏ విషయమైనా తెలుసుకొనేందుకు అపు చూపించే ఉత్సాహం, దాని ద్వారా సంపాదించే జ్ఞానం. అపు చూపించే ప్రవృత్తి, ‘పథేర్ పాంచాలి’లో కూడా కనపడుతుంది. ‘అపరాజితో’లో, తండ్రి లాగే పూజారి వృత్తి చేపడితే బాగుంటుందన్న తల్లి కోరికను మొదట ఒప్పుకున్నా, అపు తరవాత అందరి లాగే స్కూలుకు వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు. అపులోని చురుకుతనం మొదటగా గుర్తించినవాడు, అపు చదివే స్కూల్లోని హెడ్‌మాష్టారు. సుబోధ్ గంగూలీ ఈ పాత్రని పోషించాడు. ఇక్కడ, సినిమా జరుగుతున్న కథాకాలం 1920ల్లోదని మనం గుర్తుంచుకోవాలి. ఒక రోజు విద్యార్ధులను పరీక్షించటానికి స్కూల్లో పై అధికారి జరిపిన తనిఖీలో అపు తెలివితేటలు గమనించి, హెడ్‌మాష్టార్ అపుని ప్రోత్సహిస్తాడు. ఈ హెడ్‌మాష్టార్ పాత్రని స్వయంగా తాను వేసిన ఒక మంచి స్కెచ్‌లో చూపిస్తాడు రాయ్. మనలో చాలా మందిని ప్రభావితం చేసిన స్కూల్ టీచర్లు, మన జీవితాల్లో తప్పకుండా ఒక్కరైనా ఉంటారు. అటువంటి పాత్ర ఈ హెడ్‌మాష్టారు. సైన్సు, జాగ్రఫీ, హిష్టరీ వంటి విభాగాల్లో మంచి పుస్తకాలను అపుకి పరిచయం చేసి, స్కూల్ చదువు పూర్తి అయ్యేనాటికి, కలకత్తాలో కాలేజీ చదువుకి స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేస్తాడు. అపు జీవితాన్ని హెడ్‌మాష్టారు ఎంత ప్రభావితం చేసాడో చూపడానికి ఒక ఉదాహరణ – హెడ్‌మాష్టర్ బహుమతిగా ఇచ్చిన ఒక చిన్న గ్లోబ్ ఎప్పుడూ పట్టుకుని తిరుగుతుండే అపు.
తల్లితో అపు
అపు తను స్కూల్లో నేర్చుకున్న విషయాలు తల్లికి చెప్పటం, ప్రపంచ పటంలో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నయో తల్లికి చెప్పటం – ఇలాంటి సంఘటనల ద్వారా తల్లి, కొడుకుల మధ్య అనుబంధం ఎలా గట్టిపడుతుందో చూపిస్తాడు రాయ్. ఇలాంటి సంఘటనల వల్ల, మనకు తెలియకుండానే మనం ఈ సినిమాలో ఒక పాత్ర అయిపోతాం.
కెమేరా పనితనం – కాంతిని ఉపయోగించిన పద్ధతి
ఈ సినిమాలో కూడా సుబ్రత మిత్ర కెమేరా పనితనం మనకు కనపడుతుంది. పథేర్ పాంచాలి సినిమా మొత్తం తిన్నగా వచ్చే లైట్ కాంతి, పగలైతే సహజంగా ఉండే సూర్య కాంతి – రాత్రి వేళ స్టూడియోలో ఉండే లైట్ కాంతి, ఉపయోగిస్తూ షూటింగ్ పూర్తి చేసారు. రాయ్ సినిమా ‘అపరాజితో’తోనే మిత్ర, పరావర్తనం చెందిన కాంతిలో షూటింగ్ చెయ్యటం మొదలు పెట్టాడు. రాయ్ తరవాత సినిమాలకి కూడా ఇదే పద్ధతిని (రాయ్ మొదటి రంగుల సినిమా ‘కాంచనజంగా’ తో సహా) ఉపయోగించాడు. రాయ్, మిత్రా ఇద్దరూ ఇలా పరావర్తనం చెందిన కాంతిని వాడటం ద్వారా, సినిమా చూసేవారికి ఒక అద్భుతమైన, మరచిపోలేని అనుభూతి ఇవ్వగలదని నమ్మారు. ముఖ్యమైన సన్నివేశాల్లోని పాత్రల్లో, మానసిక ప్రభావం తీసుకు రావటానికి ఈ పద్ధతి సరిగ్గా ఉంటుందని వీరి అభిప్రాయం. మిత్రా తరవాత చెప్పిన దాన్ని బట్టి, ఈ విషయాన్ని మొదట గమనించినవాడు ఈ సినిమాలకి పని చేసిన ఆర్టు డైరెక్టర్ బన్సి చంద్రగుప్త. బెనారస్‌లో జరిగిన షూటింగుల్లో చాలా భాగం సహజ దృశ్యాలను వాడుకున్నా, హరిహరన్ కుటుంబం ఉన్న ఇల్లు మాత్రం స్టూడియోలో వేసిన సెట్లపై తీసారు. అందులో, సన్నివేశాలు బాగా రావటం కోసం, సూర్య కాంతిని పరావర్తనం చేసి కొన్ని ఫిల్టర్లు వాడుతూ అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ప్రయోగం మొదట్లో అందరూ మిత్ర సూచనలను విని నవ్వుకున్నారట. ఇలా కాంతిని ఉపయోగించటం వల్ల, అనుకున్న ఫలితాలు ఉంటాయా అని వారి అనుమానం. నిజానికి, ఇలా పరావర్తనం చెందిన కాంతిని వాడటం వల్ల, సినిమా చూసిన వారికి, సినిమాలో చూపించిన ఇల్లు నిజమైన ఇల్లు లాగే కనపడింది. సెట్‌పై వేసిన ఇల్లు అని ఎవరూ ఊహించలా!