ఓహో యాత్రికుడా..

ఈ సంచికలో శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి రెండు వ్యాసాలు — ‘షికారు పోయి చూదమా..’, ఓహో యాత్రికుడా..’– ప్రచురిస్తున్నాం. తియ్యటి బాణీల కమ్మటి పాటల మేటిగా ఆయన అందరికీ చిరపరిచితులు. ఐతే స్వయంగా గాయకుడిగా ఆయనకున్న విఖ్యాతి ఎక్కువమందికి తెలియకపోవచ్చు. గానరాజేశ్వరరావును “ఈమాట” పాఠకుల ముందుంచటానికి ఆయన పాడిన రెండు పాటలు వినిపిస్తున్నాం. వినదలుచుకున్న వారు ఈ కింద, పాట పేరు మీద నొక్కండి.

దీనావనుడనే (శ్రీకృష్ణలీలలు, 1935)

పాటపాడుమా కృష్ణ (1947?)

(కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతులు. సితార్‌ వాద్యకారులు. ఇరవై ఏళ్ళ పైగా బొంబాయి తెలుగు వారి సాంస్కృతిక కార్యకలాపాలలో ప్రముఖస్థానం వహిస్తున్నవారు. స్వయంగా గాయకులు, సంగీత సభా నిర్వాహకులు. ప్రఖ్యాత కథకులు కొడవటిగంటి కుటుంబరావు గారు వీరికి తండ్రి గారనే విషయం పాఠకులకు తెలిసే ఉండొచ్చును.)

( శ్రీ సాలూరు రాజేశ్వరరావు అక్టోబర్‌ 26న చెన్నై లో కాలం చేసారు. ఆయనతో ఒక యుగం అంతరించిందన్న శ్రీ ఎస్‌ . పి. బాలసుబ్రహ్మణ్యం గారి మాట అక్షరాలా నిజం. రాజేశ్వరరావుగారి మృతికి సంతాపం చెందే ప్రవాసాంధ్రుల్లో నావంటి అభిమానులు రాజేశ్వరరావుగారికి ప్రపంచం అంతటా ఎందరో ఉన్నారు. ఎమచూర్‌ ఆర్టిష్టుగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం రాజేశ్వర రావుగారిని కలుసుకొనే అవకాశం లభించింది. ఆ వివరాలను ఈ వ్యాసంలో రాస్తున్నాను.– రచయిత)

1937 ప్రాంతాల్లో పదిహేనేళ్ళ వయస్సులోనే సినీ దర్శకుడుగా పని ప్రారంభించి 250 చిత్రాలకు స్వర రచన చేసిన రాజేశ్వరరావు ఛైల్డ్‌ ప్రాడిజీగా పేరు పొందారు. “శ్రీకృష్ణ లీలలు” అనే సినిమాలో పదమూడేళ్ళ వయస్సులో కృష్ణుడుగా నటించి పాటలు పాడిన రాజేశ్వర రావును ఆనాటి ప్రసిద్ధ గాయకనటుడు జొన్నవిత్తుల శేషగిరి రావు ఎంతో మెచ్చుకోగా విన్నానని ప్రఖ్యాత సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు ఒక వ్యాసంలో రాసారు. చిన్నతనంలోనే రాజేశ్వర రావు గారు తన అన్న సాలూరు హనుమంత రావుతో కలిసి రకరకాల వాయిద్యాలను వాయిస్తూ ప్రోగ్రాములు ఇచ్చే వారట. ఒక సంగీత దర్శకుడు చలపతి రావుకు ఆయన గురుతుల్యుడు. మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు రాజేశ్వరరావును కళారాధకుడు, కళా స్రష్టగా అభివర్ణించారు. ఇలా సమకాలికుల మన్ననలను పొందిన రాజేశ్వరరావు తెలుగువారందరికీ అభిమాన పాత్రుడవటంలో అశ్చర్యం లేదు. తన చిన్నతనంలో విజయనగరంలో రాజేశ్వరరావు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యుడుగా చేరారనీ, ఆయన అనుమతి పొందకుండా ఏడేళ్ళ వయస్సులో కచేరీ చేసినందువల్ల నాయుడుగారికి కోపంవచ్చి సంగీతం నేర్పడం మానేసారనీ, మా నాన్నగారు చెప్పారు. అది ఒకవిధంగా తెలుగు ప్రజలకు మేలు చేసిందేమో ! తరవాత రాజేశ్వరరావుగారు ” కీచక వధ ” సినిమాకని కలకత్తా వెళ్ళి, కె . ఎల్‌ . సైగల్‌ వద్ద కొన్నాళ్ళు, ఆగ్రా ” ఘరానా ” కు చెందిన ఉస్తాద్‌ పంకజ్‌ ఖాన్‌ వద్ద కొన్నాళ్ళూ శిష్యరికం చేసారట. మొదట్లో రామబ్రహ్మం వంటి దర్శకులు తరవాత జెమినీ వంటి సంస్థలూ రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడం, ” మల్లీశ్వరి ” వంటి సినిమాల పాటలు విశేష ప్రజాదరణ పొందటం అందరికీ తెలిసిందే !

బొంబాయిలో మేము 1979లో తెలుగు సాహితి సమితి ఆధ్వర్యంలో షణ్ముఖానంద హాలులో ” రాజేశ్వరరావు నైట్‌ ” ఏర్పాటు చేసాం. ఇందుకు ప్రముఖ వేణు విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావు మాకు సహాయం చేసారు. ఆ కార్యక్రమంలో శ్రీమతి పి . సుశీల, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను సితార వాయిస్తానని తెలియగానే రామకృష్ణ తాను ” మనసున మనసై ” పాట పాడతానని సరదా పడ్డారు. నేను నేర్చుకొన్నది హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం. అయినా మంచి మెలొడీ ఉన్న ఎటువంటి సినిమా పాట అన్నా నేను ఇష్ట పడతాను. స్థానిక కళాకారులతో బొంబాయిలో తరచు తెలుగు సినిమా పాటల ఆర్కెస్ట్రా ప్రోగ్రాములు నిర్వహించిన నాకు రిహార్సల్స్‌ కూడా లేకుండా తిన్నగా స్టేజిమీద మద్రాసునుంచి వచ్చిన కళాకారులతో కలసి వాయించడం కష్టం అనిపించలేదు. ఆ విధంగా ఒకటి రెండు రోజులు రాజేశ్వరరావు గారితో గడిపే అవకాశం లభించింది. రాజేశ్వరరావు గారు, నాకూ నా మిత్రులకూ తన పాటలన్నీ ఆర్కెస్ట్రా ఇంటర్లూడ్స్‌ తో సహా కంఠతా వచ్చునని విని చాలా సంతోషించారు. మేము ఆయనను పొగుడుతున్నప్పుడు, తన సహజ ధోరణిలో ఆయన తన శకం అయిపోయిందనీ, ఆర్‌ . డి . బర్మన్‌ బాణీ ప్రజాదరణ పొందుతోందనీ అంటే మేం ఎవరం ఒప్పుకోలేదు. ప్రొఫెషనల్‌ గా విజయం సాధించడమే అన్నిటికన్నా ముఖ్యమనే సినిమా రంగపు భావన మాత్రమే ఆ మాటల్లో మాకు ధ్వనించింది. ఆ నాటి ప్రోగ్రాములో ఆయన నిర్వాహకుడుగా మాత్రమే కాక గాయకుడుగా కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి నా అభిమాన సంగీత దర్శకుడు నౌషాద్‌ ముఖ్య అతిధిగా రావటంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మూడువేల సీట్లున్న షణ్ముఖానంద హాలులో బొంబాయి తెలుగు ప్రోగ్రాము హౌస్‌ ఫుల్‌ అవటమే కాకుండా, టిక్కెట్లు బ్లాక్‌ లో అమ్ముడు పోయాయి. ఇది ఎంత గొప్ప విషయమో బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు నిర్వహించే వారికి మాత్రమే అర్ధమవుతుంది.

బొంబాయి ప్రోగ్రాము తరవాత నేను సెలవమీద మద్రాసు వెళ్ళినపుడు, రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనను కలుసుకొన్నాను. ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి, నేను అడగక పోయినా నేను అక్కడ ఉన్నకొద్ది రోజులలోనే తన సినీ రికార్డింగులో సితార్‌ వాయించమని అడిగారు. అంతకు ముందు మద్రాసు సినీరంగంలో పేరు పొందిన సితార్‌ కళాకారుడు మా మిత్రుడు శ్రీ జనార్ధన్‌ గారి వెంట చాలా రికార్డింగులకు వెళ్ళాను కాని వాయించడం అదే మొదటి సారి. ఆ విధంగా ” కన్యకా పరమేశ్వరి ” సినిమాలో రాజేశ్వర రావు గారి సంగీత దర్శకత్వంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి పాటకు నేను సితార్‌ వాయించడం జరిగింది. అప్పుడు రాజేశ్వర రావు గారు పాటకు హార్మోనియం మీద ట్యూన్‌ కంపోజ్‌ చేస్తుండగా చూసే అవకాశం కూడా లభించింది. కొన్ని గంటలపాటు పియానో వాయిస్తుండగా తాను విని ఆనందించిన సందర్భం గురించి ఆరుద్ర గారు ఎక్కడో రాసారు. నాకు కలిగిన అనుభవం అటువంటిదే !

కేవలం సంగీతం కాకుండా, ప్రతి స్వరాన్నీ, స్వరాల సముదాయాన్నీ ” దృశ్య ” పరంగా ఊహించగలిగే దృక్పధం ఆయనది. సినీ సంగీత దర్శకులకు ఇటువంటి వైఖరి ఉండటం సహజమేనేమో కానీ, సంగీతంలో మెలొడీలో ఆయనలాగా విజయం సాధించిన వారు చాలా తక్కువ. నేను మద్రాసులో ఉండగానే, ఆయన 1946లో సంగీతం సమకూర్చిన “చంద్రలేఖ ” సినిమా టీ వీ లో ప్రసారమైంది. ఆ మర్నాడు రిహార్సల్స్‌ కి వచ్చిన శ్రీమతి సుశీల గారూ తదితరులూ ” ఆ రోజుల్లోనే ఆర్‌ . డి . బర్మన్‌ ను తలదన్నేలా రిదిమ్స్‌ ఎలా కంపోజ్‌ చేశా ” రంటూ మెచ్చుకొన్నారు.అందులో సర్కస్‌ దృశ్యాలకు పాశ్చ్యాత్య సంగీతం వాయించేవారు ఎవరూ లేకపోవడంతో, మద్రాస్‌ గవర్నర్‌ బాండ్‌ ను పిలిపించ వలసివచ్చిందని రాజేశ్వరరావు గారు గుర్తుకు తెచ్చుకున్నారు.

తరవాత కాలంలో రకరకాల వాళ్ళు సంగీత దర్శకులైపోవడం, అసిస్టెంట్లు రాకపోతే పాట మధ్యలో ఆర్కెష్ట్రా ” బిట్స్‌ ” కంపోజ్‌ చెయ్యలేక వారి కోసం వేచి ఉండడం నేను చూసాను. రాజేశ్వర రావు గారు అలా కాదు. ” మాష్టారు మమ్మల్ని ఏదీ ముట్టుకోనివ్వరు. మొత్తం అంతా ఆయన కంపోజ్‌ చెయ్యవలసిందే !” అని ఆయన అసిస్టెంట్లు నాతో అన్నారు. ఈ రోజుల్లో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మ్యూజిక్‌ డైరక్టర్లు కూడ ” సిడి రామ్‌ ” ల నుంచి శబ్దాలను ” డౌన్‌ లోడ్‌ ” చెయ్యకుండా ట్యూన్‌ కట్టలేరు. రాజేశ్వరరావు వంటి వారి విషయంలో అది ఊహించడం కూడా అసాధ్యం.

తరవాత 1980లో మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన గోకులాష్టమికి కళాసాగర్‌ ఆధ్వర్యంలో శ్రీమతి సుశీల గారిచేత తాను స్వరపరచిన పాటల కార్యక్రమం నిర్వహించి నప్పుడు కూడా నేను స్టేజ్‌ మీద సితార్‌ వాయించాను. అప్పుడు ఆయన స్వయంగా ” పాట పాడుమా కృష్ణా ..” పాడినప్పుడు మేమందరం ఎంతో
సంతోషించాం.

హిందీలో ఎస్‌ . డి . బర్మన్‌, తెలుగులో రాజేశ్వరరావు వీరిద్దరి ట్యూన్లు ఎవరు పాడినా నాకు ఆ సంగీత దర్శకుడి గొంతు వినిపిస్తుంది. మరొక విషయం రాజేశ్వరరావు గారి పాటలు ఎవరు పాడినా బాగుంటాయి. ఒక్క ఘంటసాల గారే కాదు. ఏ . ఎం . రాజా ( మిస్సమ్మ, విప్రనారాయణ), పి . బి. శ్రీనివాస్‌ (భీష్మ), కె . వి . కె. మోహన్‌ రాజు ( పూలరంగడు), ఎస్‌ . పి . బాలసుబ్రహ్మణ్యం వీరిలో ఎవరు పాడినా ఆయన పాటలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు సినిమా టైటిల్‌ సంగీతం వినగానే అది రాజేశ్వరరావు గారిదైతే నేను వెంటనే చెప్పెయ్యగలను.

ఆయన ఎటువంటి పాటనైనా రక్తి కట్టించే వారు. భక్తి గీతాలు ఎలా ఉండాలో చెంచులక్ష్మి ( కనలేరా కమలా కాంతుని,పాలకడలిపై), భక్త ప్రహ్లాద ( నారాయణమంత్రం ) వంటి చిత్రాల్లో ఆయన పాటలు వింటే తెలుస్తుంది. జానపద గీతాలు, కామెడీ పాటలు, పాశ్చాత్య ధోరణి ఉన్న పాటలు అన్నీ ప్రజాదరణ పొందినవే ! ఎవరో చెప్పినట్లుగా, ” మనసున మల్లెల …” అనేది పల్లవి లేని పాటయితే, ” బృందావనమది…” చరణంలేని పాట. పిలచిన బిగువటరా, రారా నాసామి రారా, బాలనురా మదనా, మొదలైన జావళీలు ఆయనలా ఇంకెవ్వరూ చెయ్యలేరు. వాటిలో నాట్యానికి అనుగుణంగా వాయించిన మృదంగపు దరువులకు, అద్భుతమైన ఆర్కెష్ట్రేషన్‌ ఉంది. హిందుస్తానీ రాగాలైన జైజవంతి ( మనసున మనసై), పట్‌ దీప్‌ (కన్నుల దాగిన అనురాగం, నీ అడుగులోన అడుగువేసి), పహాడీ ( నీవు లేక వీణా, నిన్నలేని అందమేదో), యమన్‌ కల్యాణ్‌ (చిగురులు వేసిన ) ఆయన చేతిలో అందాలు సంతరించు కొన్నాయి. కల్యాణి ( జగమే మారినది, మనసులోని కోరిక), మోహన (తెలుసు కొనవె యువతి, పాడవేల రాధికా) వంటి రాగాలు ఆయనకు కొట్టిన పిండి. ఇతర రాగాల్లో పాట చేసినా, ఏ రెండో చరణంలోనో కేదార్‌ రాగ చాయ చూపించడం ఆయనకు సరదా ! నీవు రావు నిదుర రాదు ( మోహన), పాడమని నన్నడగ తగునా (ఖమాస్‌ ), మదిలో వీణలు మ్రోగె (మోహన) వంటి పాటల్లో ఇది కనిపిస్తుంది.

సంగీత పరంగా రాజేశ్వరరావుగారు కొన్ని అద్భుత ప్రయోగాలు చేసారు. “పగలైతే దొరవేరా రాతిరి నా రాజువిరా …” అనే పాటలో యమన్‌ కల్యాణ్‌ , పీలూ, భీంపలాస్‌ రాగాలు మూడూ ఉన్నాయి. అయినా ఏమాత్రం వింతగా అనిపించదు. మాటల్లోని భావానికి ట్యూన్‌ అంత చక్కగా సరిపోయింది. అలాగే ” చిలిపి నవ్వుల నిను చూడగానే …” అనేపాటలో హిందోళం, పీలూ,తిలంగ్‌ అనే మూడు రాగాలు ఉన్నాయి. “భక్త ప్రహ్లాద” లో బాలమురళి మొదటి పాటలోనూ, “భక్త జయదేవ” లో దశావతారాల ” ప్రళయ పయోధి జలే” అనే అష్టపది లోనూ అద్భుతమైన రాగమాలికలున్నాయి. వీటన్నిటిలోనూ ఎంతో శక్తివంతమైన ఆర్కెస్ట్రేషన్‌ కూడా వినిపిస్తుంది.ఆయన చేసిన చాలా పాటల బాణీల్లో రాగం ముందుకు దూసుకుపోయే అగ్రెషన్‌ కనిపిస్తుంది.

పాడే వారు తమ కంఠంతో అందుకోలేని తారస్థాయిని, ఆర్కెస్ట్రాలో వినిపిస్తారు రాజేశ్వరరావు. ఇందుకు “చిగురులు వేసిన కలలన్ని ..” అనే పాట మంచి ఉదాహరణ. ఆయన పాత సినిమాలలో సంగీతం కన్నా, తరవాత వచ్చిన సినిమాల్లో మంచి ఆర్కెస్ట్రా వినిపిస్తుంది. ఘంటసాలగారు సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో మొదటనుంచీ కూడా మంచి ఆర్కెస్ట్రా వినిపిస్తుంది. ఉదాహరణకు, ఘంటసాల సంగీతం సమకూర్చిన ” షావుకారు”, ” పెళ్ళి చేసిచూడు ” మొదలైన సినిమాల పాటల వాద్యబృందంలో ఆరోజుల్లోనే ” మోడర్న్‌ ఇడియం ” వినిపిస్తుంది. ప్రతిభావంతులైన ఈ సంగీత దర్శకులందరూ, ఒకర్ని చూసి మరొకరు మంచి విషయాలు నేర్చుకొన్నారనడంలో సందేహంలేదు !

అన్నమాచార్య కీర్తనలకూ, ఇతర రచనలకూ రాజేశ్వరరావు గారు అద్భుతమైన స్వర కల్పన చేసారు. ” అదివో అల్లదివో శ్రీ హరివాసము ” అనే పాటకు మల్లిక్‌ గారు మధ్యమావతిలో చేసిన ట్యూన్‌ ఈనాడు అందరూ పాడుతున్నారు. కాని, అదే పాటకు షణ్ముఖప్రియలో రాజేశ్వరరావుగారి ట్యూన్‌ శ్రీ పి . బి. శ్రీనివాస్‌ చాలా బాగా పాడారు. అదే రికార్డ్‌ రెండవ వైపున శ్రీమతి ఎస్‌ . జానకి తిలంగ్‌ లో పాడిన ” పలుకు తేనెల తల్లి ..” ఎంతో చక్కని పాట. కృష్ణం వందే జగద్గురుం అనే రికార్డ్‌ లో శ్రీమతి సుశీలగారు శంకరాభరణం ( చిన్ని శిశువు), ఆనంద భైరవి (లాలనుచు), మధ్యమావతి (కొలని దోపరికి) రాగాల్లో పాడిన అన్నమాచార్య రచనలూ, అభోగి (ఎంత చక్కనివాడే) రాగంలో పాడిన క్షేత్రయ్య పదమూ వీనుల విందు చేస్తాయి.

జెమినీలో పనిచేస్తున్నపుడు వైణిక విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రి గారు రాజేశ్వర రావుకు అసిస్టెంటుగా ఉండేవారు. అప్పుడు రాజేశ్వరరావు గారి ద్వారా సంగీతం గురించి ముఖ్యంగా వెస్టర్న్‌ కార్డ్‌ సిస్టం గురించి ఎన్నో విషయాలు తెలిసాయని ఈమని శంకర శాస్త్రి గారు అన్నట్లు ఆయన శిష్యుడు చిట్టిబాబుగారు చెప్పారు. సినిమా పాటల్లో వాయిద్యకారులుగా గొప్పగొప్పవార్ని పరిచయం చెయ్యడంలో రాజేశ్వరరావుగారు దిట్ట. ఉదాహరణకు, పూజాఫలం చిత్రంలో రాజేశ్వరరావు దర్శకత్వంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎమ్‌ . ఎస్‌ . గోపాలకృష్ణన్‌ వయొలిన్‌ వాయించారు. రాజేశ్వరరావు గురించి మాట్లాడుతున్నపుడు “అబ్బో అతను మా అందరిలోకీ సీనియర్‌ చాలా గొప్పవాడు” అని ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాతో అన్నారు. అది రాజేశ్వరరావు గారి గొప్పతనానికీ, పెండ్యాల వారి సహృదయతకూ కూడా తార్కాణం.

రాజేశ్వరరావు గారు మాట్లాడే ధోరణి తమాషాగా, అతివినయం అనిపించేటట్టు ఉండేదని ఆయనతో పరిచయం ఉన్నవారందరికీ తెలుసు. అలా మాట్లాడుతూనే ఆయన ఎవర్ని ఎలా తిప్పలు పెట్టేవారో కధలుగా చెప్పుకుంటారు. డబ్బు ఆదా చేద్దామని ఒక నిర్మాత ఆయనను తన ఇంటికి టాక్సీలో కాక, ఆటో రిక్షాలో రమ్మన్నాట్ట. ఆటో దొరకలేదని ఊరంతా టాక్సీలో తిరిగి ఆటో పట్టుకొని ఆయనింటికి వెళ్ళాడట రాజేశ్వరరావు. ఆయనకు కోపం రావడం వల్లనో, ఇతర కారణాల వల్లనో మధ్యలో పని మానుకొన్న సందర్భాలున్నాయి. “మాయాబజార్‌ ” సినిమాలోని డ్యూయెట్లు నాలుగూ ఆయనే చేసారట. తరవాత వాటినీ తక్కిన పాటలనూ ఆర్కెస్ట్రాతో రికార్డ్‌ చేసింది ఘంటసాల. విప్రనారాయణకు పాటలన్నీ చేసాక రీరికార్డింగు పని రాజేశ్వరరావు గారు చెయ్యలేదుట. ఈ సంగతి ఆయనే నాకు చెప్పారు.

సంగీత దర్శకుడిగా రాజేశ్వరరావు రిటైరై చాలా సంవత్సరాలైంది. ఆయన తరువాత ఎందరో సంగీత దర్శకులు వచ్చారు. అయినా, శ్రోతలెవరూ ఆయనను మరచిపోలేదు. కొన్నాళ్ళ క్రిందట “పాడుతా తియ్యగా ” కార్యక్రమంలో వీల్‌ ఛైర్‌ మీద ఆయనను చూసిన కళాకారులకూ, టీ వి ప్రేక్షకులకూ, అందరికీ గుండె చెదిరిపోయింది. ఆయనకు ఉన్న ప్రజాదరణ అటువంటిది. మంచి సాహిత్యం, మంచి సంగీతం ఈనాటి సినిమాల్లో అరుదైపోయాయి. ఎంటర్‌ టైన్మెంట్‌ కు నిర్వచనాలు మారిపోయాయి. కాని, తన సమకాలికులకు కూడా ఆదర్శంగా నిలిచిన రాజేశ్వరరావు గారి సంగీతం మాత్రం ఎప్పటికీ నిలబడుతుంది.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...