హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.

మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా గాంధీ సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు.

ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ ఉంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ, బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.

పాత కాలువలో దిగి మెయిన్ రోడ్డుకి ఎక్కి చెరుకు దుకాణం, బాల పాండియన్ మిఠాయి దుకాణం, వేల్ విలాస్ స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దాటి తెప్పోత్సవం జరిగే చోటుకి వెళ్ళి చేరేసరికి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ఎక్కడ చూసినా ఇనుప తొప్పిలు ధరించిన రిజర్వ్ పోలీసులు చేతిలో లాటీకర్రలతో. చూస్తేనే భయంగా అనిపించింది.

ఆమెని గుర్తు పట్టగానే అక్కడున్న మిగతా స్త్రీలందరూ నిర్ఘాంత పోయారు. మెల్లిగా వారిలో వారు గుస గుసలు పెట్టుకున్నారు. “సిగ్గులేని మొహం”, “తగుదునమ్మా అంటూ వీధిలోకొచ్చింది” పెద్దగానే మాటలు వినపడటంతో ఆమె తలెత్తి చూసింది.

ఓసారి పండక్కి అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వీళ్ళని కలవడానికి వెళ్ళాను. అబ్బులు రాలేదు. ఏవిటాని ఆరా తీస్తే అతని ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనీ, ఆ బాధ భరించలేక దేవదాసయ్యాడనీ విన్నాను. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్ళికుదిరిందనీ తెలిసింది. నేనూ, వకీలూ, కన్నబాబూ అబ్బులింటికి వెళ్ళాం.

అప్పల్నర్సిమ్మడికి తర్కం బోధపడలేదు. “సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.

వఱడు అంటే ముసిలి నక్కట. ఆ జంతువు ప్రతీకగా మానవ నైజాన్ని ఇంత సూటిగా చిత్రీకరించిన ఈ కథ మొదటి సారి చదివినప్పుడు నన్నెలా ప్రభావితం చేసిందో, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎప్పుడు చదివినా అలానే నన్ను పట్టి ఊపేస్తుంది.

యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తుంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?

పెళ్ళయి మూడు నెలలకి పైనే అయ్యింది. పొద్దునే లేచి, సానుపు జల్లి, ముగ్గు పెట్టి, వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలినదాన్ని కన్నెమ్మ తింటుంది. రోజూ ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు. ఎక్కడి వెడుతున్నానని గాని, ఎందుకు అని గాని ఏమీ చెప్పడు. ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు.

నువు నా చుట్టూ నా చూపు కోసం, నవ్వు కోసం తిరగడమే గుర్తుంది కానీ నేను నీ చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలయిందో గుర్తు రావడం లేదు. మనం రహస్యంగా కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకోవడమూ, ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూడటమూ గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు మనిద్దరమూ కూచుని చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటాను.

గత నాలుగు నెలలగా మన ఇంట్లో పొదుపు ఉద్యమం సవ్యంగా సాగిపోతోంది. రేపు మనం నవ్వుతూ బతకడానికి ఈ వేళ ఏడ్చినా ఫరవాలేదు అనే పొదుపు ధర్మ సూత్రం ఆధారంగా, రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఈ వేళ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉద్రేకంతో పొదుపు చేసేస్తున్నాం.

అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చు కుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది. వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను.

అదేమి వింతో, దాని గురించి నాకు ఇదేమి చింతో అర్థం కాదు. సరిగ్గా నేనిలా ఉన్నప్పుడే కరెంటు ఉండదు. బయట సూర్యుడు దాక్కుంటాడు. లోపలా, బయటా, చీకట్ల మధ్య నేను మిగిలి, ఏమిటీ చీకటి? అని ఆలోచిస్తూ ఉంటాను. ఏమన్నా సాయం వస్తావేమో అని పక్కకి తిరిగితే, అప్పుడు మాత్రం కనబడవు.

ఇందులో వ్యంగ్యం ఏ మాత్రం లేదు. తనవారిని కూడా వెదికించి ఖైదులో ఉంచమని ప్రాదేయపడటంలో తన భార్యాబిడ్డలకి కనీసావసరమైన పూటభోజనం సమకూర్చాలన్న తపన, ఆరాటం, సమకూర్చలేని తన అశక్తత, ఉరిశిక్ష వేసినా అన్నం పెట్టిన అధికారుల పట్ల అమాయకమైన కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి.

“కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాన్‌ చేసే వాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా! గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్‌ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు.

మడత మంచం మీద కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.

నవ్వాడు త్రిలోచన్. “నీక్కూడా అలాగే అనిపించింది అని వాదించను. కానీ నీ ఫ్రెండు తన కుక్కనీ, నీ కుంటికుక్కనీ పోల్చిచెబుతుంటే నీ కళ్ళల్లో నేను న్యూనత చూశాను. మేము మప్పిన విలువలకింద నువ్వు నలిగిపోవడం ఇష్టం లేక, నువ్వు ఏడుస్తున్నా దాన్నెక్కడో వదిలేసొచ్చాను.”

మహా ప్రజాపతి మంచం మీద పడుకుని ఉంది. రెండో కానుపు అయ్యి ఇంకా రెండో రోజే. ఒళ్ళు తెలియని జ్వరం, నీరసంతో ఉన్నా పరిచారిక వచ్చేసరికి కళ్ళు తెరిచి, “సిద్ధార్దుడు అన్నం తిన్నాడా? ఏమి చేస్తున్నాడు?” అనడిగింది. పరిచారిక కళ్ళు విప్పార్చి చూసింది ప్రజాపతి కేసి.