శ్రీదేవి చిర్రెత్తిపోవడం మూడంచెల్లో జరిగింది. తను రాసుకుంటున్న పాటలో లీనమై వుండడం వల్ల ఆమెకి ఆ చప్పుడు ముందు లీలగా వినిపించింది. విని కొంచెం చిరాకు లాంటిది కలిగింది. కొంచెం సేపటి తర్వాత తన ఏకాగ్రతకి భంగం కలిగేసరికి కోపం మొదలైంది. ఇంకొంచెం సేపటి తర్వాత ఆ చప్పుడు తాను రాస్తూ పాడుకొంటున్న పాటని వెక్కిరిస్తున్నట్టనిపించి అవమానంలోకి దారి తీసింది.
పై గదిలో వుండే వెధవన్నర వెధవకి తాను వయోలీన్ మీద వాయిస్తున్న పాట నచ్చక అలా బూట్లతో తప్పుడు తాళం వేస్తూ గొడవ పెడుతున్నాడన్నమాట. కోపంతో పళ్ళు పట పటా కొరికి లేచింది శ్రీదేవి. వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేది లేదు. ఆవేశంతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి, కళ్ళు నిప్పులు కక్కాయి. తన గదిలోంచి బయటికి వచ్చి మెట్లెక్కింది. ఆ క్షణంలో ఆమెని చూసిన వారెవ్వరైనా, ఆ పై గదిలో వున్న అమాయకుడి మీద జాలి పడక మానరు. తన మీదికి రాబోతున్న సుడిగాలి గురించి తెలియదు పాపం, అని నిట్టూర్చక మానరు! శ్రీదేవి తలుపు గట్టిగా తట్టింది.
“యస్! కమిన్,” లోపల్నుండి కొంచెం ప్రసన్నంగా మగ గొంతు వినిపించింది. గొంతు ఎంత బాగుండీ ఏం లాభం, మనిషి సంగీతాన్ని అవమానించే మూర్ఖుడికి!
శ్రీదేవి లోపలికి అడుగేసింది. లోపల ఒక చిన్న గది, ఒక పెయింటరు తన కోసం తయారు చేసుకున్న స్టూడియోలా వుంది. గది శుభ్రంగానే వున్నా నిరాడంబరంగా వుంది. గది మధ్యలో బొమ్మలేసుకోవడానికి కాన్వాస్ బిగించిన ఈసెల్ వుంది. ఈసెల్ పైనుంచి సిగరెట్టు పొగ తేలుతోంది. ఈసెల్ కింది నించి జీన్స్ పేంట్ కాళ్ళు కనిపిస్తున్నాయి. బూట్లు తొడుక్కున్న ఆ కాళ్ళు నిరంతరంగా నేల మీద రకరకాలుగా తాళం వేస్తూనే వున్నాయి.
“ఒక్క క్షణం ఇటు చూస్తారా?” శ్రీదేవి మర్యాదగానే అడిగింది.
“వొద్దండీ! ఇప్పుడు నాకే మోడల్స్ తోనూ పని లేదు.” ఈసెల్ వెనకనించి ఆ మూర్ఖుడి గొంతు వినొచ్చింది. “మీ అడ్రసు అక్కడ ఆ కాగితం మీద రాసి పెట్టి వెళ్ళండి, అవసరం అయితే నేనే కబురు చేస్తాను.”
“నేను మోడల్‌ని కాను!” శ్రీదేవి కఠినంగా అంది.
ఆ మాటతో ఆ గొంతు తాలూకు మొహం ఈసెల్ వెనకనించి బయటికొచ్చింది. నోట్లో వున్న సిగరెట్టుని యాష్ ట్రేలో పెట్టి కుర్చీలోంచి లేచాడు.
“అలాగా? ముందిలా కూర్చొండి. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు?” మర్యాదగా అన్నాడు.
దేవుడు ఎంత అపాత్ర దానం చేస్తాడో కొన్నిసార్లు! ఆ దౌర్భాగ్యుడి గొంతే కాదు, మొహం కూడా బాగానే వుంది. అన్నిటికంటే అడ్డదిడ్డంగా వున్న ఆ వొత్తైన జుట్టు, అనుకుంది శ్రీదేవి. కోపంగా వున్నా నిజాలు ఒప్పుకుంటూంది మరి!
“మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. మీకు నా పాట నచ్చినట్టు లేదు.” కోపాన్నీ, మర్యాదనీ, వెటకారాన్ని సమపాళ్ళలో మేళవించి అంది. ఆమె వెటకారం అతనికేమీ అర్థమయినట్టు లేదు. అయోమయంగా చూశాడు. ఇహ ఇతనితో సూటిగా చెప్పాల్సిందే!
“నేను కింద పోర్షన్లో అద్దెకుంటాను. బహుశ నా పాటా, నా వయోలీన్ నచ్చక కాబోలు బూట్లతో తాళం వేస్తూ గొడవ చేస్తున్నారు!”
“అదేం లేదే! మీ పాట బాగానే వుంది.” ఇంకా అయోమయంగానే అన్నాడు.
“మరయితే ఆ బూట్లతో నేల మీద చప్పుడు చేస్తారెందుకు? చాలా చిరాగ్గా వుంది!”
శ్రీదేవి కోపంగా అని వెళ్ళడానికి వెనుదిరిగింది. మళ్ళీ ఆగి, “పైగా మీరలా బూట్లతో తడుతూ వుంటే నా నెత్తిన కప్పు కూలుతుందేమోననే భయం కూడా! వస్తా!” అంటూ వెళ్ళబోయింది. అప్పటికి ఆ అందగాడు తేరుకున్నాడు.
“ఆగండాగండి! అప్పుడే వెళ్ళకండి.”
ఆగి అతని వైపు చూసింది. స్నేహంగా, అందంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. “మీరెందుకో కోపంగా వున్నారు. నిజానికి నాకు సంగీతమంటే చాలా ఇష్టం. కానీ, మీరు పాడే పాట ఏదో నాకు తెలియలేదు. ఊరికే వాయిస్తున్నారనుకొన్నాను. ఏదో ఆలోచనలో యధాలాపంగా బూట్లతో నేలను తడుతున్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు.”
“ఒక కొత్త పాటకి వరస కడుతున్నాను. ఇంకా సరిగ్గా రావటం లేదు,” ముక్తసరిగా అన్నా, ఆమె గొంతులో కోపం తగ్గింది.
“అమ్మో! మీరు పాటలకి వరసలు కడతారా?”
“ఒకటి రెండు పాటలు రాసి వరసలు కట్టాను!”
“యెంత అదృష్టవంతులో! నాకు అసలు అలా కళల్లో ప్రవేశం వున్నవాళ్ళంటే చాలా గౌరవం.”
“మీరు కూడా కళాకారుడిలానే వున్నారే. ఏదో పెయింట్ చేస్తున్నట్టున్నారు?”
చిరునవ్వుతోనే తల అడ్డంగా తిప్పాడతను. “నా బొంద! ఈ పెయింటింగు మానేసి గోడలకి సున్నం వేసుకోడానికి పనికొస్తానేమో నేను! ” అతని మాటల్లో నిరాశేమీ లేదు.
“ఏదీ, నన్ను చూడనీండి!” ఈసెల్ వైపు నడిచింది.
“నా మాట విని మీరటు వెళ్ళొద్దు. ఆ పెయింటింగు చూస్తే జడుసుకుంటారేమో!”
అతని మాటలు పట్టించుకోకుండా ఈసెల్ మీదున్న బొమ్మని చూసింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ బొమ్మ ఘోరంగా వుంది. ఒక చిన్న పాప ఇంకొక చిన్న పిల్లి కూనని పట్టుకుని వుందా చిత్రంలో. ఆమెకేమనాలో తోచలేదు.
“నేను చెప్పలే మీరు జడుసుకుంటారని? దాని పేరేమిటో తెలుసా? పిల్లి-పిల్ల! పేరు బాగుంది కదూ? వినగానే చూసే వాళ్ళకి బొమ్మలో సంగతేంటో తెలిసిపోతుంది. అన్నట్టు, ఆ కుడి వైపున వున్నది పిల్లి కూన! మళ్ళీ మీరు పొరపడతారేమో, వద్దని చెప్తున్నా, అంతే!”
శ్రీదేవికి బొమ్మల మీద వుండే అభిప్రాయాలు ఆ బొమ్మ గీసిన వాళ్ళపై తన అభిప్రాయాల మీద ఆధారపడి వుంటాయి. అందులో ఆ అందగాడు తన సంగీతాన్ని కూడా మెచ్చుకున్నాడాయె!
“చాలా అద్భుతంగా వుందీ బొమ్మ!”
సంతోషం కంటే ఆశ్చర్యం ఎక్కువ కనిపించిందతని మొహంలో. “నిజంగానా? హమ్మయ్య, ప్రపంచంలో ఒక్కరికైనా నా బొమ్మ నచ్చింది. ఇహ నేను హాయిగా చచ్చి పోతాను. అయితే ముందు కిందికొచ్చి మీ పాట మొత్తం విన్నాకనే అనుకోండి!”
“వొద్దులేండి! చిరాకుతో నేల మీద బూట్లతో తప్పు తాళం వేస్తారు.”
“అసలు నేనిక ఈ జన్మలో నేలమీద బూట్లతో తాళం వేయదల్చుకోలేదు,” అన్నాడు గంభీరంగా. అందంగా నవ్వింది శ్రీదేవి.
కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.
అదే అపార్ట్‌మెంట్లో ఇంకో పోర్షన్లో వుండే మోహన్‌కి ఎంత విభిన్నంగా వుందీతని ధోరణి, అనుకుందామె. మోహన్ ఒక్క చిత్రాన్ని కూడా అమ్ముకోలేని విఫల కళాకారుడు. అప్పుడప్పుడూ శ్రీదేవి గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి, తన నిరాశా, నిస్పృహలని గుమ్మరించి వెళ్తూంటాడు. అయితే మోహన్ అభిప్రాయం ప్రకారం, తానొక అద్భుతమైన కళాకారుడు. పాడు నికృష్ట ప్రపంచం అతన్నీ, అతని కళనీ అర్థం చేసుకోలేక వ్యర్థం చేస్తుంది. ప్రజలకసలు ఏ మాత్రం కళా హృదయం లేదని మోహన్ గాఢ నమ్మిక. అందుకు నేరుగా వ్యతిరేకంగా వుంది జీవి అభిప్రాయం. శ్రీదేవికి అతని స్పోర్టివ్ నెస్సూ, నిజాయితీ చాలా నచ్చేయి.