“భార్యా, పిల్లలు లేరా ఆయనకి?”
“ఎందుకు లేరూ? భేషుగ్గా ఉన్నారు. కానీ ఎవరైనా సరే పని ఉంటేనే ఆయన గదిలోకి వెళ్ళాలి. ఊరికే వెళ్ళి ఆయన్ని విసిగించ కూడదు.”
“మీ అన్నయ్య కూడా అలా మారిపోతారేమో?”
“ఛ. ఛ. శశిధర్ తలక్రిందులుగా నిలబడినా సరే ఆయన లాగ సంపాదించడం జరిగే పని కాదు. సంపాదనలో ఆయనకీ అన్నయ్యకీ సామ్యం ఎక్కడ? ఆయన సంపాదన నిలువు దోపిడీ. కుడి చేతిలో ఉన్న నూరు రూపాయి ఎడమ చేతికి మారేటప్పుడు రెండువందలుగా మారే మాయాజాలం. శశి మహాఅయితే ఒక ఇల్లు కడతాడేమో. ఇంటి ముందు చెట్లు, చేమా పెంచుతాడేమో. పెరట్లో రెండు గేదెల్ని కట్టి మేపోచ్చు. అంతే అవుతుంది వాడి వల్ల. సంపాదించడం మాట అటు ఉంచితే, యాభై ఏళ్ళు వచ్చినతర్వాత రోజుకి ఎనిమిది గంటలు తాగగలడా?”
“అనుభవించడం అంటే అదేనా?”
“అలాంటి మనుషులు అలాగే అనుభవిస్తారు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్థి ఉంటే, చిన్నప్పటి నుంచే మనసు దానికి అలవాటు పడి పోతుంది. వింతగా అనిపించదు. నిదానంగా, కొంచం కొంచంగా అనుభవించడం అలవాటు పడుతుంది. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్థిని తండ్రి తనకి ఇచ్చినట్లు తన కొడుక్కీ, మనవడికి అప్పగించాలన్న భయం మనసులో ఉంటుంది. సొంతంగా సంపాదిస్తే, సంపాదించడం ఏమిటీ, పగటి దోపిడీ! ఈ వ్యవహారంలో తానేమిటీ అన్నది గుర్తు ఉండదు. వారసత్వమా పాడా? వచ్చిన వేగంలో అనుభవించేయడమేగా?”
“ఆహా బాచ్చా! ఇరవై ఏళ్ళు గట్టిగా నిండలేదు. చదువు పూర్తి కాలేదు. సంపాదించడం ఇంకా మొదలు పెట్టనే లేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఎంత తత్వ విచారం! ఎంత వేదాంతం! ఆహా!” అన్నది వదిన.
“వదినా! ఇప్పుడంతా నవ్వులాటగానే ఉంటుంది. కానీ చూస్తూనే ఉండు. నేను పెదనాన్న లాగానే అవుతాను. శశిధర్ టైప్ కాదు. పది సంవత్సరాలు! చేతి నిండా డబ్బు. ఆ తర్వాత జీవితాన్ని అనుభవించాలి. నీవు ఎలాగూ చూస్తావుగా?”
“ఆహా! బాగా అనుభవించు. అప్పుడు మీ పెదనాన్న గారిలాగే మమ్మల్నందరినీ వద్దనుకుంటావో ఏమో.”
“పెదనాన్న గారు వద్దనుకోలేదు. వీళ్ళే ఆయన దగ్గరి నుంచి తప్పుకున్నారు. నేనూ అలాగే ఉండ దలచుకున్నాను. ఇంటికి వస్తే, లోపలికి రమ్మని పిలుస్తాను. రాలేదనుకో. సరే వెళ్ళు అంటాను. అంతే.”
వదినా మరిది మధ్య సంబంధ బాంధవ్యాల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదైనా చెప్పాడేమో నాకు తెలియదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యులను మన దేశంలో వేళ్ళమీద లెక్కించవచ్చు అన్న నమ్మకంతో ఆయన గురించిన నా అభిప్రాయాన్ని మీకు తెలియ చేస్తున్నాను. నా అంచనా ప్రకారం సిగ్మండ్ ఫ్రాయిడ్, శీకాయ పౌడర్ రెండూ ఒకటే. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక్క అరగంట మాత్రం మా అమ్మని కలిసి మాట్లాడి ఉంటే, ఇరవయ్యో శతాబ్దంలో ఎంతో మంది సైక్రియాటిస్టులకి పని లేకుండా పోయేది.
మద్రాసు యూనివర్సిటీలో పి.యు.సి. మూడో పార్టు పాసయ్యే యోగ్యత లేదు. నీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి ఏం తెలుసు అని అడుగుతున్నారు కదూ. ఈ మధ్యలో నేను బొంబాయిలో కాలం గడిపాను. అక్కడ నేర్చుకున్న అనేక విషయాలల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకటి. నేను ఇంకో ఆరు నెలల తర్వాత జరిగిన కథను మీకు చెప్పబోయే ముందు నేను బొంబాయి ఎందుకు వెళ్ళానో చెపుతాను.
అక్క భర్తకీ మరదలికీ మధ్య ఉన్న సంబంధంలో వెంట్రుక వాసి అయినా విరసమైన భావం ఏర్పడడానికి అవకాశం లేక పోలేదు. కానీ వదినా మరిదికి మధ్య ఈ అంశం కొంచం కూడా ఉండదు. నేను ఈ గడ్డ మీద మీద పుట్టిన వాడిని, అందులో ఛాందస భావాలు ఉన్న ఇంట్లో జన్మించిన వాడిని అవడం వల్ల ఇలా చెబుతున్నానో ఏమో. నాకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరని మీకు సవినయంగా తెలియ చేస్తున్నాను.
నాకు కాస్త వివరం తెలిసిన తరువాత, పదిహేనూ, పదహారేళ్ళ ప్రాయంలో కొన్ని బెంగాలి నవలల అనువాదం చదివి ఉన్నాను. అందులో ఈ వదినా మరిదికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని ఎంతో అపురూపంగా చిత్రీకరించి ఉంటారు. నాకూ వదినకీ మధ్య ఉన్న బంధం కూడా అలాంటిదే అని నేను అనుకుంటున్నాను. అందులో చనువు ఉంది, భక్తి ఉంది. ప్రేమ ఉంది.
శశిధర్ ఒక శనివారం ఆఫీసునుంచి ఆరు గంటలకే వచ్చేశాడు. నేనూ, వదిన సినిమా చూసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతను వరండాలో ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడూ ఇంటికి త్వరగా వచ్చే మనిషి కానందువల్ల అతను ఇంటి తాళాలు డూప్లికేట్ తన దగ్గర ఉంచుకున్నది లేదు.
గలగల పారే సెలయేరులా నవ్వుతూ మాట్లాడే వదిన కూడా చనువుగా ప్రవర్తించడానికి వీలు లేకుండా అతనిలో ఏదో వ్యతిరేకమైన శక్తి ఉంది. అందుకే ఎప్పుడూ అతను ఆఫీసుకు వెళ్ళే ముందు వదిన ‘ఈ రోజు నేను సినిమాకి వెళ్తున్నాను, బజారుకి వెళ్తున్నాను’ అతనితో చెప్పింది లేదు. అంతే గానీ, అతనికి చెప్పకుండా ఉండాలన్నంత రహస్యంగా ఆ విషయం మాకు అనిపించ లేదు.
ఎప్పుడూ మేము బైటికి వెళ్ళే ముందు, మేడ మీది పోర్షన్లో ఉంటున్న మీనాక్షి మామి దగ్గరే మధ్యాహ్నం పాలు తీసుకొని ఉంచమని చెప్పడం అలవాటు. ఆ రోజు పాలమ్మాయి మేం బయలు దేరే ముందే వచ్చేసింది. ఆ మామి కైంకర్యమే అయి ఉండాలి. ఆవిడ కొన్ని రోజులుగానీ మామీద గూఢచారి పని చేస్తున్నట్లు నాకు ఒక అనుమానం ఉండేది. ఆ రోజు అది రుజువయింది. ఆవిడే వరండాలో ఒక కుర్చీ వేసి శశిధర్ని కూర్చో బెట్టింది.
“అరెరే… ఆఫీసునుంచి ఎప్పుడు వచ్చారు? వచ్చినప్పటి నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నారా?” ఆశ్చర్యంగా అంటూ వాకిటి తాళం తీసింది వదిన.
శశిధర్ జవాబు ఏమీ చెప్పలేదు. మేడ మెట్ల దగ్గర మీనాక్షి మామి, ఆవిడ ఇద్దరు కూతుళ్ళు తలను వీధి వైపు, చెవులను మా ఇంటి వైపు రిక్కించుకున్నట్లుగా నిలబడి ఉన్నారు.
శశి అక్కడే జవాబు చెప్పకుండా ఉండటం కూడా మంచిదే అని అనుకున్నాను నేను. గాఢమైన అతని మౌనం జరగబోయే విపరీతాన్ని గురించిన భయాన్ని, దాన్ని ఎదుర్కోవలసిన ధృడత్వాన్ని ఒకేసారి నా మనసులో కలిగించింది.
విపరీతం అంటే మేడ మీద ఉండే మీనాక్షి మామి మా గురించి తప్పుగా కల్పించి చెప్పిన విషయాలను మనసులో ఎక్కించుకొని, అన్నయ్య చూపించ బోయే కోపం. ఆ సమయంలో ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదని నాకు అన్పించింది. వదినకి కూడా అలాగే అనిపించి ఉండాలి. చీర కూడా మార్చుకోకుండా నేరుగా వంటింట్లోకి వెళ్ళినదల్లా, “మీరు డ్రస్ మార్చుకోండి. అంతలో నేను కాఫీ కలిపి తెస్తాను” అని అంది.
“కాఫీ ఉండనీ. నువ్వు ఇలా రా,” అంటూ అన్నయ్య ఆమెను పూజ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు వేశాడు. అలా వేసే ముందు ‘నీకు ఇక్కడ ఏం పని?’ అన్నట్లు నా వైపు తీవ్రంగా చూశాడు. నేను వీధి వైపు వచ్చి నిలబడ్డాను.
లోపలి నుంచి శశిధర్ మాటలు స్పష్టంగా వినబడక పోయినా వాడి గొంతులో ఉన్న క్రోధాన్ని బాగానే గుర్తించ గలిగాను. మొదట నిదానంగా, రాను రానూ తీవ్రంగా అతని గొంతు పెద్దదై బైటికి వినిపించడం మొదలయింది. వదిన తగ్గు స్వరంలోనే మాట్లాడి ఉంటుంది కాబోలు. ఒక్క మాట కూడా నా చెవులకి వినబడలేదు.
పావు గంట తరువాత బైటికి వచ్చింది వదిన. నేరుగా బెడ్ రూముకు వెళ్ళి తన సూట్కేసులో బట్టలను సర్దుకుంది. బైటికి వచ్చి ఆటోను పిలిచింది.
ఆ సమయంలో వదినను పిలవడమో, వెళ్ళవద్దని వారించడమో నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. తోబుట్టువు అన్న భావనతోనో, తనకన్నా పదేళ్ళు చిన్నవాడు, వివరం తెలియని చిన్న పిల్లవాడు అన్న కనికరమో , భార్యా భర్తల మధ్య ఉన్న వ్యవహారంలో నన్ను ఒక మనిషిగా కూడా లెక్క చేయని అన్నయ్యతో నేనూ ఏమీ మాట్లాడలేదు.
ఒక వారం తరువాత బొంబాయిలో ఉన్న పెద్దన్నయ్య దగ్గరికి నన్ను పంపించాడు శశిధర్. అక్కడ ఒక మందుల కంపెనీలో అమ్మకం విభాగంలో నాకు ఒక ఉద్యోగం చూసి పెట్టాడు పెద్దన్నయ్య. ఆరు నెలలు ట్రైనింగ్ కోసం అక్కడే ఉన్నాను. తరువాత ఉద్యోగ రీత్యా నన్ను మద్రాసుకు మార్చినప్పుడు, మొదట శశికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేసిన తరువాతే రైలు ఎక్కాను. సెంట్రల్ స్టేషన్‌కి అన్నయ్య వస్తాడని నేను అనుకోలేదు. వాడూ రాలేదు. వాల్టాక్స్ రోడ్డులో ఒక హోటల్లో రూము తీసుకున్నాను.
నాలుగు రోజులయింది మళ్ళీ మద్రాసుకు వచ్చి. వదినను చూడడానికి నుంగంబాక్కం ఇంటికి వెళ్ళాను. ఆమె వాళ్ళ ఇంటి మేడ మీద ఒక పాకలాగా ఏర్పాటు చేసి, నర్సరీ స్కూలు ప్రారంభించింది. నూరుగురు పిల్లల దాకా అక్కడ చదువుతున్నారు. తనకి సహాయంగా ఇద్దరు టీచర్లను, ఇద్దరు ఆయాలను పెట్టుకుంది.
“మీ అన్నయ్య సంపాదించే అంత కాకున్నా అందులో సగానికి పైగానే సంపాదిస్తున్నాను. ఈ విషయం మీ అన్నకి తెలియదనుకుంటాను. తెలిస్తే తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఉండేవారు కదూ?” అంటూ నవ్వింది వదిన.
నేను నవ్వలేక పోయాను. ఇప్పుడు వదిన కన్నా, శశిధర్ గురించే నాకు ఎక్కువ ఆందోళన.
ఐరావతం
ఐరావతం అన్న కలం పేరుతో కథలు, వ్యాసాలు ఎన్నో రచనలు చేసిన శ్రీ స్వామినాదన్ రిజర్వ్ బాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. సులభమైన శైలిలో, బరువైన మాటలతో కాకుండా, సున్నితమైన హాస్యాన్ని మేళవించి జీవితపు చీకటి కోణాలను ఆవిష్కరించడం ఆయనకి అలవాటు. ఆయన రాసిన కథలు, కవితలు, అనువాదాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడి పాఠకుల ఆదరాభిమానాలను పొంది ఉన్నాయి.