పై గదిలో ప్రేమికుడు

నిజానికి శ్రీదేవికి కొంచెం అహంకారం ఎక్కువ. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఆమెకి తన బాధలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం వుండదు. అందుకే ఆమెకి ఊరికే తన సానుభూతి కోసం ఏడ్చే మగవాళ్ళంటే మంట. కానీ ఇవాళ మొదటిసారి ఆమె జీవితో తన కష్టాల గురించి కొంచెం చెప్పుకుంది. బహుశా ఆ వొత్తైన జుట్టు వల్లో ఏమో, అతను చాలా నమ్మ దగ్గ వ్యక్తిలా అనిపించాడు. తాను రాసి వరస కట్టే పాటలని ఎవరూ కొనకపోవడంతో నానాటికీ దిగజారుతున్న తన ఆర్ధిక పరిస్థితీ, డబ్బు కోసం ఇబ్బంది పెట్టే ఆమె విద్యార్థులూ, అన్నిటి గురించీ చెప్పుకుంది.

“నువ్వప్పుడే రెండు మూడు పాటలు రాసేవు కదా? ఇంకా నీ కొత్త పాటలకోసం ఎవరూ అడగటం లేదా?” అనునయంగా అడిగాడు జీవి. అంతలోనే, వాళ్ళు మీరులోంచి నువ్వులోకి మారిపోయారు.

“లేదు. ఆ మూడు పాటలే అమ్ముడయాయి, అంతే! కొత్త పాటల కోసం ఏ మ్యూజిక్ కంపెనీ కానీ, సినిమా వాళ్ళు కానీ అడగటమే లేదు.”

“ఎందుకని?”

“ఎందుకంటే నేను రాసిన మూడు పాటలూ ఒకాయన పాడతానని హక్కులు కొనుక్కున్నాడు, కానీ వాటిని ఎక్కడా పాడటం లేదు. అప్పుడు నా పాటల గురిచి జనాలకి ఎలా తెలుస్తుంది? ఎంత మంది మ్యూజిక్ కంపెనీ వాళ్ళు అలా ఆశ పెట్టి మోసం చేస్తారో తెలుసా? ”

“అలా నిన్ను మోసం చేసిన వాళ్ళందరి పేర్లూ ఇటు పారేయ్. రేప్పొద్దున్న అందర్నీ వరసబెట్టి కాల్చి పారేస్తాను.”

గలగలా నవ్విందామె. “అదేం వొద్దులే. ఇలాగే రాస్తూ పాడుతూ వుంటాను. ఎవరైనా ఒక మంచి గాయకుడో, మ్యూజిక కంపెనీనో నా పాటలొకటి రెండు కొనుక్కుని బయట ఎక్కడేనా పాడి వాటిని పాప్యులర్ చేస్తే చాలు. ఇహ నాకడ్డే వుండదు.”

“అలా అయితే చాలా సంతోషం. అంత వరకూ నీకెప్పుడు దిగులుగా అనిపించినా పైన నా గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళు, సరేనా? లేదా అదిగో ఆ మూలనుంది చూడు పెద్ద కర్ర, దానితో నీ సీలింగు మీద నాలుగు బాదు. వచ్చి నీ గోడు వింటా, సరేనా?” స్నేహపూర్వకంగా అన్నాడు.

“ఆ మాటనేముందు బాగా ఆలోచించుకో! మళ్ళీ బాధ పడతావేమో!” అల్లరిగా అంది శ్రీదేవి.

“అదెప్పటికీ కాదు. బూట్ల చప్పుడయ్యే గది తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే వుంటాయి.”

“బూట్ల చప్పుడా? ఎక్కడ? ఎప్పుడు? నేను వినలేదే!”

“ఆ చెయ్యి ఇటిస్తావా కొంచెం? ఒకసారి కళ్ళకద్దుకుంటాను.”


ఒక రోజు తన విద్యార్థులతో మరీ విసుగెత్తి జీవితో కబుర్లు చెప్పుకోవడానికి పైకెళ్ళింది శ్రీదేవి.

అక్కడ ఈసెల్ ముందు గంభీరంగా నిలబడి వున్నాడు మోహన్. చేతులు కట్టుకుని జీవి వేసిన బొమ్మ వైపు సుదీర్ఘంగా చూస్తున్నాడు. అతన్ని చూస్తేనే చిరాకు శ్రీదేవికి. అందరికంటే తనేదో మేధావిననుకునే అతని అహంభావం, మిగతా వాళ్ళందర్నీ చిన్న చూపు చూసే అతని అతి తెలివీ, ఏది చూసినా చిరాకే ఆమెకి.

“బాగున్నావా అమ్మాయ్?”

“ఎవర్రా నీకు అమ్మాయ్? శ్రీదేవీ, అని మర్యాదగా పిలవలేవూ? చవట!” మనసులో తిట్టుకుంటూ పైకి మర్యాదగా నవ్వింది.

“రా, రా శ్రీదేవీ! మోహన్ గారు నన్నూ, నా బొమ్మనీ చీల్చి చెండాడుతున్నారు. రాకపోయి వుంటే నా మర్డరు మిస్సయివుండేవారు.” జీవి ధోరణిలో మార్పేమీ లేదు.

“అలా ఉడుక్కోకోయ్ జీవీ! నేను కేవలం ఈ బొమ్మలో వున్న లోపాలు ఎత్తి చూపుతున్నానంతే. నా మాటలు నిన్ను నొప్పిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను,” దర్పంగా అన్నాడు మోహన్.

“అయ్యయ్యో! మీరు చెప్పేది నా మంచికేనని నాకు బాగా తెలుసండి. మీరు కానివ్వండి.”

అలానే కానిచ్చేడు మోహన్. “ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బొమ్మలో అసలు జీవం లేదు. ఆ పిల్లిలో కానీ, ఈ పిల్లలో కానీ, ఎక్కడైనా జీవకళ వుందా చెప్పు?” మాట్లాడుతూనే ఒకడుగు వెనక్కి వేశాడు. చేతుల్ని ఫ్రేములా వుంచి దాన్లోంచి ఆ చిత్రాన్ని చూస్తూ,

“ఆ పిల్లి! ఊ… ఆ పిల్లీ – ఆ… ఏం చెప్పమంటావు ఆ పిల్లి గురించి? దాన్లో అసలు…”

“నాకా పిల్లి చాలా నచ్చింది! భలే ముద్దుగా వుందా బుజ్జి కూన.” వున్నట్టుండి అంది శ్రీదేవి.

ఎప్పుడూ ఆమె ముక్కు మీద వుండే కోపం మెల్లిగా కళ్ళల్లోకి ఎక్కుతోంది. మోహన్ చెత్త వ్యాఖ్యల్ని అంత సరదాగా నవ్వుతూ తీసుకుంటున్న జీవిని చూసినా ఆమెకి కోపంగా వుంది.

“ఏమైతే యేం? మీరిద్దరూ అది పిల్లి అని గుర్తుపట్టటమే నాకన్నిటికన్నా నచ్చింది,” ఎప్పట్లానే తనదైన చిరునవ్వుతో అన్నాడు జీవి.

“నాకు తెల్సు జీవీ! నా విమర్శతో నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నట్టున్నావు! నీ బొమ్మ మరీ అంత చెత్తగా ఏం లేదు లేవోయ్! ఇంకొంచెం కష్టపడితే ఎప్పటికైనా నువ్వూ మంచి బొమ్మలు వేయగలవు!”

శ్రీదేవి కళ్ళల్లోకి ఒక ప్రమాదకరమైన మెరుపు వచ్చింది. ఇహ వీడ్ని వదిలేది లేదనుకుంది. చాలా మెత్తగా నవ్వుతూ, “అవును జీవీ! మోహన్ గారు ఎంతో కష్టపడి ఇంత పైకొచ్చారు. ఆయన బొమ్మలు నువ్వు చూసే వుంటావు!”

“నేనా? మోహన్ గారి బొమ్మలా? చూడలేదే!”

“చూడకపోవటమేమిటి? పత్రికల్లో అన్నీ ఆయన వేసిన బొమ్మలే కదా!” శ్రీదేవి ఇంకా మెత్తగా నవ్వుతూనే వుంది.

మోహన్ వంక ఆరాధనగా చూశాడు జీవి. అయితే ఎందుకో మరి మోహన్ మొహం ఎర్రబడి వుంది, ఇబ్బందిగా. దాన్ని ఆయనకి సహజంగా వుండే వినయంగా అర్థం చేసుకున్నాడు జీవి.

“పత్రికల్లో ప్రకటనల పేజీలుంటాయి చూడు. ఆ బొమ్మలన్నీ ఆయనవే. ఆ బూట్ల కంపెనీ ప్రకటనలో బూట్లూ, ఫర్నీచర్ కొట్టు ప్రకటనలో సోఫా సెట్టూ ఎవరు వేశారనుకున్నావు? మోహన్ గారే! స్టిల్ లైఫ్ బొమ్మలు భలే వేస్తారులే!” చురకత్తిలాటి నవ్వుతో నిర్దాక్షిణ్యంగా చెప్తోంది శ్రీదేవి.

మోహన్ మొహం మాడి పోయింది. ఒకలాటి భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది గదిలో. జీవి ఉత్కంఠతతో చుస్తున్నాడు, ఈ వాగ్యుధ్ధంలో గెలుపెవరిదా, అని!

ఆఖరికి మోహన్ తేరుకున్నాడు. కోపం గొంతు నిండా పొంగి పొర్లుతూండగా, “అమ్మాయ్! నేను డబ్బు కోసం వేసే కొన్ని మామూలు చిత్రాలే చూసినట్టున్నావు. నేను అవే కాక కళాత్మకమైన బొమ్మలు బోలెడు వేశాను.”

“అవునా? అవెవరు కొన్నారబ్బా? ఆ… గుర్తొచ్చింది! ఎనిమిది నెలల కింద ఒక బొమ్మ వంద రూపాయలిచ్చి ఎవరో కొన్నట్టున్నారు, కదూ! అంతకు ముందర, దాదాపు సంవత్సరం క్రితం ఒక చిత్రం ఇంకెవరో…”

ఆమె మాట మధ్యలోనే మోహన్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు. జీవికి అతన్ని చూస్తే జాలేసింది.

“ఆ మనిషిని మరీ అంతగా చావగొట్టాలా! పెద్దాయన, ఏదో ఆన్నాడే అనుకో!”

ఉన్నట్టుండి ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి జేబులోంచి రుమాలు తీసి ఇచ్చాడు. “ఏమయింది? ఊరికే నవ్వులాటకన్నాను, అంతదానికే ఇంతలా ఏడవాలా..”

“ఛీ! నా అంత నీచురాలు ఎవరైనా వుంటారా?”

“అంతదానికేనా? చాల్లే!”

“మనందరవీ ఒక్క లాటి కష్టాలే కదా? నేను నా పాటలు ఎవరూ కొనక ఎలా బాధ పడుతున్నానో, అతనూ తన బొమ్మలు అమ్ముడవక అలాగే బాధ పడుతున్నాడు కదా? అతన్ని అవమానించే హక్కు నాకెక్కడిది?”

వెక్కిళ్ళు పెడుతూంది శ్రీదేవి. కొంచెం సేపటికి తేరుకుంది. మొహం తుడుచుకొని జీవి వైపు చూసి సన్నగా నవ్వింది.