కోనసీమ కథలు: రెండో రుమాలు

శీనుగాడంటే నాకు ఇప్పటికీ పరమ చికాకు. మొదట్నుంచీ కూడా వాడి అతి వినయం, తెచ్చిపెట్టుకున్న నెమ్మదితనం చూస్తే పరమ రోతగా వుండేది. అందరిముందూ గొప్ప కోసం అలా ఉంటాడని నాకు గట్టి నమ్మిక. నాకే కాదు, నా స్నేహితులదీ అదే అభిప్రాయం. కానీ అమ్మా, నాన్నా, ఇంకా తెలుసున్నవాళ్ళూ వాణ్ణి ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. అది మాత్రం నేనస్సలు భరించలేక పోయేవాణ్ణి. ఎప్పుడైనా అమ్మా, నాన్నలకి ఎదురు చెప్పినా లేదా క్లాసులెగ్గొట్టి మార్నింగ్ షో సినిమాలకి వెళ్ళినట్లు తెలిసినా అమ్మ పెట్టే చివాట్ల కష్టోత్తరం ముందు శీనుగాడి స్తుతితోనే మొదలయ్యేది. “ఆ శీనుగాణ్ణి చూసి నేర్చుకో? ఎంత నెమ్మదిగా ఉంటాడో? ఏం చూసుకొని ఆ పొగరు?” నాన్న తిట్టే తిట్లకన్నా శీనుగాడి పేరున్న అక్షింతలు పడుతూండడం నాకు తల నొప్పిగా తయారయ్యేది. నేను ఎంత వద్దనుకుంటే అంతగా వాడి పేరు మా ఇంట్లో మారు మ్రోగేది.

పదో తరగతి వరకూ నాకు తిరుగు లేదు. మా చుట్టుపక్కల పిల్లలందరిలోకీ నేనే బాగా చదివే వాణ్ణి. ఫస్టు మార్కులన్నీ నాకే. తీరా ఇంటర్మీడియట్ కాలేజీలో చేరాక నా ప్రభ పూర్తిగా పడిపోయింది. దానిక్కారణం శీనుగాడు మా కాలేజీలో జేరడమే! ఫస్టియర్ అన్ని సబ్జెక్టుల్లోనూ నాకంటే వాడికే ఎక్కువ మార్కులు. లెక్చరర్లందరికీ వాడే ఫేవరెట్ స్టూడెంట్. నాన్నకి మా కాలేజీలో అందరూ తెలియడం వల్ల లెక్చర్లందరూ శీనుగాడి గురించి మోసేసేవారు. దానికి తగ్గట్టు నాకూ మార్కులు కాస్త తగ్గడంతో మా ఇంట్లో చివాట్ల మోత రోజు రోజుకీ పెరిగి పోయేది.

వాడికీ నాకూ ఏవిటి తేడా? ఏవీ లేదు. వాడు నల్లగా బక్కగా ఉండేవాడు. నేను పసిమిచాయ. వాడు పొట్టి. నేను మరీ పొడుగు కాకపోయినా పరవాలేదు. వాడికంటే చూడ్డానికి బావుంటాను. నా ఫ్రెండ్సందరూ శోభన్ బాబులా ఉంటావని అనేవారు. శీనుగాడికి నేను పెట్టిన పేరు రరేత. అంటే రవణారెడ్డి తమ్ముడని. శీనుగాడికంటే నేనేమీ తక్కువ తీసిపోలేదు. వాడు చదువులో మాత్రమే ఫస్టు. నాకూ వాడితో సమంగా కాకపోయినా ఇంచుమించుగా ఫస్టు మార్కులొస్తాయి. అయినా సరే అందరి దృష్టిలోనూ నేనొక అల్లరివాణ్ణి. పొగరబోతుని. క్లాసులెగ్గొట్టి సినిమా హాళ్ళ చుట్టూ తిరిగేవాణ్ణి. వాడు మాత్రం నాగేశ్వర్రావు సినిమా టైటిల్స్ లాగా బుద్ధిమంతుడు, మంచివాడు, బంగారు బాబు. నేను మాత్రం జులాయిని.

ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చదువులో బాగానే మార్కులు రావడంతో నాన్న ఎప్పుడైనా తిడితే నేనూ మొండిగా తిరగబడేవాణ్ణి. అమ్మకి నేనంటే కొంచెం గారాబం. ఎందుకు చిన్న పిల్లాణ్ణి తిడతారని నాన్నని అన్నా, నేను చేసిన పనులు నచ్చక పోయినప్పుడల్లా శీనుగాడితో పోల్చి మరీ కసురుకునేది.

శీనుగాడు వాళ్ళది సమనస. అమలాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండేదా వూరు. శీనుగాడు వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర గుమాస్తాగా మూడేళ్ళ క్రితం పనికి కుదిరినప్పటి నుండీ శీనుగాడి గురించి వింటూనే వున్నాను. కామేశ్వర్రావు మాస్టారు నాన్న స్నేహితుడు. ఆయనే శీనుగాడి నాన్న నాగుల్ని నాన్న దగ్గర పనికి కుదిర్చాడు. మొదట్లో మాస్టారే శీనుగాడి గురించి నాకు చెప్పారు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసులో ఉన్నాను. అడపాదడపా వాడి పేరు వినడమే తప్ప వాణ్ణి చూసిన పాపాన పోలేదు. పదో తరగతయ్యాక ఇంటర్మీడియట్లో జాయినయినప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాడు. చెప్పద్దూ, మొదట్లో నాకు అంత ఏవగింపు కలగలేదు. కానీ రాను రానూ వాడు నాకు తలనొప్పిలా తయారయ్యాడు. క్లాసులో వాడికే ఫస్టు మార్కులు రావడంతో, వాడినే అందరూ మెచ్చుకోవడంతో నాకు వాడంటే పడేది కాదు. వాడి పేరు చెబితేనే కోపం నషాళానికి అంటేది. దానికి తోడు వాడి అతి వినయం చూస్తే ఒళ్ళు మండిపోయేది.

రోజూ సమనస నుండి పది కిలోమీటర్లూ సైకిలు మీద వచ్చేవాడు. చొక్కా కాలరుకి చిన్న రుమాలు పెట్టుకొని సినిమా పాటలు పాడుకుంటూ ఆ డొక్కు సైకిల్ మీద హీరోలా పోజిచ్చేవాడు. నేనూ, నా ఫ్రెండ్సూ వాణ్ణి అవకాశం వచ్చినప్పుడల్లా తెగ ఏడిపించే వాళ్ళం.

“ఏరా! అక్కినేని నాగేశ్శర్రావులాగా కాలర్ మీద ఆ రుమాలేంటిరా? కారున్న క్లీనరూ – కాలరున్న శీనడూ!” అంటూ ఆట పట్టించే వాళ్ళం.

వాడు క్లాసుకెళుతూంటే వెనకాలనుండి వచ్చి కాలర్ కున్న రుమాలు లాగేసేవాళ్ళం. లేదంటే కావాలని వెళ్ళి భుజంతో గుద్దేవాళ్ళం. వాడెప్పుడూ ఏవీ అనకుండా ఉండడంతో మరింత రెచ్చిపోయేవాళ్ళం. ఒకసారి మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి చిన్న ప్యాకెట్ ఇచ్చారు. అందులో రుమాలు కూడా ఉంది. నేనూ నా స్నేహితులూ మరో రెండు పోగు చేసి మర్నాడు పదిమంది ముందూ శీనుగాడికిచ్చి వాణ్ణి ఆట ఏడిపించాం.

“ఒరేయ్! శీనుగాడి పెళ్ళికి కట్నం ఏవిట్రా?” అని ఒకడంటే, “లారీడు రుమాళ్ళు!” అని మరొకరు.

కొంతకాలం అయ్యేసరికి శీనుగాడు నాతో మాట్లాడ్డం మానేశాడు. దాంతో నాకు వాడంటే మరింత కోపం పెరిగిపోయింది.

మాకు సిలబస్ కాలేదని లెక్చరర్లు అప్పుడప్పుడు ఎక్స్‌ట్రా క్లాసులు పెట్టేవారు. దాతో శీనుగాడు వాళ్ళ నాన్నని కలవాలన్న వంకతో మా నాన్న వద్దకి వచ్చేవాడు. మా నాన్న వాణ్ణి మా ఇంట్లో భోజనం చెయ్యమని పంపించేవాడు. అమ్మ మా ఇద్దరికీ పక్క పక్కనే పీటలేసి భోజనం పెట్టేది. వాడి పక్కన కూర్చుని తినాలంటే కంపరంగా ఉండేది.

“నాకిప్పుడు ఆకలిగా లేదు. తరువాత తింటాను,” అని చెప్పి వాడిదయ్యాక తినేవాణ్ణి. ఒక్కోసారి నాది అయ్యాక వాడికి పెట్టమని అమ్మని విసుక్కునేవాణ్ణి. అమ్మ ఏవీ అనలేక నన్ను తర్వాత తిట్టేది. శీనుగాడు మాత్రం ఎంతో వినయంగా – “పరవాలేదండీ, ముందు వాడికి పెట్టండి. నాకేం తొందర్లేదు,” అనేసరికి నాకు కోపం ఇంకా పెరిగిపోయేది. వాడి నక్క వినయాలు చుస్తే ఒళ్ళు కంపరం పుట్టేది. శీనుగాడి మీద ఎప్పుడూ నాదే పై చేయి ఉండాలనే కోరిక నాది. వాడు బాధపడడం నాకు ఎంతో ఆనందంగా ఉండేది. వాడు నష్టపోవడం నాకు కావాలి. ఇదే రోజురోజుకీ నాలో పెరిగిపోయింది.

ఆ యేడాది దీపావళి వచ్చింది. నేనూ, మా అన్నయ్యా సిసింద్రీలు, మతాబులూ, చిచ్చుబుడ్లూ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మాకు సాయంగా నాగులు గారు వచ్చేవారు. సూరేకారం, గంధకం, బొగ్గూ ఎన్ని పాళ్ళలో వెయ్యాలో అన్నీ ఆయనే చెప్పేవారు. నేనూ, మా అన్నయ్యా నూరడం, వస్త్రకాళితం చెయ్యడం లాంటి మిగతా పన్లు చేసేవాళ్ళం. సిసింద్రీలు కూరడం మాత్రం నా పని. జువ్వలూ, చిచ్చుబుడ్లూ అన్నయ్యా, ఆయనా కలిపి చేసేవారు. దీపావళి దగ్గరకొచ్చాక అమ్మ కొన్ని మతాబులూ, జువ్వలూ నాగులు గారికని కొన్ని పక్కన బెట్టింది. నేను మాత్రం ఒక్క సిసింద్రీ కూడా ఇవ్వలేదు. కావాలంటే మతాబులు ఇచ్చుకోమనీ, నా సిసింద్రీలూ, జువ్వలూ ఇవ్వడానికి వీల్లేదనీ నానా గొడవా చేశాను. ఎందుకంటే శీనుగాడు అవి కాలుస్తాడు. వాడికి ఇవ్వడం నాకస్సలు ఇష్టం లేదు. నా గొడవ భరించలేక అమ్మ మతాబులిచ్చింది. నాకు మళ్ళీ తిట్లు మామూలే. నేనవేమీ పట్టించుకో లేదు.

దీపావళి సాయంత్రం నాన్న లక్ష్మీ పూజ చేసేవాడు. నాన్న స్నేహితులు కొంతమంది పూజ చూడ్డానికని వచ్చేవారు. ఆ ఏడాది పూజయ్యాక ఇంటికెళ్ళొస్తానని నాగులు గారు నాన్నతో చెప్పడం విన్నాను. నాకు జువ్వలు వేయడానికి నాగులు గారు పక్కనుండాలని నాన్నతో తెగ గొడవ చేశాను. “అన్నయ్య ఉన్నాడు కదురా?” అని నాన్న అన్నా నేను వినిపించుకోలేదు. ఆయనే ఉండాలని పట్టు బట్టాను. ఆ రకంగా ఆయన తన ఇంటికి వెళ్ళరు. ఆయన వెళ్ళకపోతే శీనుగాడి ఇంట్లో దీపావళి చేసుకోరు. ఇదీ నా ప్లాను.

కావాలనే రాత్రి పదకొండు వరకూ బాణాసంచా కాలుస్తూ ఆయన్ని ఉంచేశాను. నాన్న మాట కాదనలేక ఆయన ఉండిపోయారు. ఆలస్యంగా రాత్రి ఆయన ఇంటికి వెళ్ళడం చూశాక నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. శీనుగాడి దీపావళి మటాష్! ఆ మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు శీనుగాణ్ణి మా ఫ్రెండ్సందరం ఆట పట్టించాం.

“ఏరా, దీపావళికి ఏం కాల్చావురా?” అని ఒకడంటే, “వాడు ఉత్తినే కాల్చలేదురా, కాల్చుకుని తిన్నాడు, వాళ్ళ నాన్నని,” అని నేనూ హేళన చేశాను. శీనుగాడి మొహం దిగాలుగా అయిపోయింది.

ఆ రోజు క్లాసులో ఒక సంఘటన నాకు ఎందుకో కొంచెం ఇబ్బంది కలిగించింది.

ఇంగ్లీషు పొయిట్రీ క్లాసు చెప్పే ఎస్.వి.ఎల్.ఎన్ గారి క్లాసులో పాఠం కంటే హస్కే ఎక్కువ. దీపావళికి ఎవరెవరో ఏం కాల్చారూ అని అడుగుతూ ఆయన చిన్నప్పటి సొంత గోల చెప్పడం మొదలు పెట్టాడు. మిగతా స్టూడెంట్లూ ఎవరికి తోచినవి వాళ్ళు మధ్య మధ్యలో చెబుతున్నారు. శీనుగాడు మాత్రం మౌనంగా ఉన్నాడు.

“ఏవోయ్, శీను! ఏంటలా వున్నావ్? దీపావళికేం చేశావ్?” అని అడిగాడాయన.

ఏవీ చెయ్యలేదని సమాధానం చెప్పాడు. ఎందుకని మా మాస్టారు గుచ్చి గుచ్చి అడిగాడు.

“మా నాన్న లేకుండా మేం దీపావళి చేసుకోం? పని వల్ల ఆయన రాలేదు,” అని చెప్పాడు.

“పండగ పూట కూడా శలవివ్వని కర్కోటకులెవర్రా? కనీసం నీ పెళ్ళికయినా శలవు దొరుకుతుందా?” అన్నాడు. అందరూ గొల్లుమని నవ్వారు. ఆ క్షణం శీనుగాడి కళ్ళల్లో తడి చూసి కలుక్కుమంది నాకు. అనవసరంగా నాన్న మీద మాట పడిందే అనిపించింది. ప్రతీ సారీ శీనుగాణ్ణి ఆటపట్టించే నాకు అందరూ వాణ్ణి చూసి నవ్వడం అంతగా నచ్చలేదు. కానీ నేనేమీ పైకి అనలేదు.

ఆ తరువాత పరీక్షలు దగ్గర పడ్డాయి. ఎలా జరిగిందో తెలీదు, ఇంకో రెండ్రోజుల్లో పరీక్ష ఉందనగా నా కెమిస్ట్రీ నోట్స్ పోయింది. ఎంత వెదికినా దొరకలేదు. నాకు టెన్షన్ మొదలయ్యింది. మొత్తానికా విషయం నా ఫ్రెండ్స్ ద్వారా శీనుగాడికి తెలిసింది. వాడు వెంటనే సైకిల్ తొక్కుకుంటూ మా ఇంటికొచ్చాడు. అనవసరంగా కంగారు పడనవసరం లేదని తన నోట్స్ పట్టుకొచ్చి ఇచ్చాడు.

“మరి నీకూ?” అనుకోని వాడి సహాయం చూసి అడిగాను.

“నాకు నాన్న నిన్న రాత్రి చెప్పారు. రాత్రంతా కూర్చుని నా నోట్స్ చూసి రాశాను. ఇంటర్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్ కదా?” అనేసరికి లోలోపల ఎబ్బెట్టుగా అనిపించి మొహం అదోలా పెట్టాను. ఏమనాలో తెలియలేదు. నేనెంత వాణ్ణి ఏడిపించినా వాడు మామూలుగా ఎలా వున్నాడో అర్థం కాలేదు. ఇది కూడా వాడు మంచి పేరు కొట్టేయడానికనే అనిపించినా పైకి మాత్రం కనబడనీయలేదు. అనుకున్నంతా జరిగింది. ఎప్పటిలాగే అమ్మ వాణ్ణి ఆకాశానికి ఎత్తేసింది. ఎందుకో తెలీదు. మొదటి సారి అమ్మ మాటలు వింటుంటే నాకంత కోపం రాలేదు.

భయం వల్లనో ఏమో కెమిస్ట్రీ పరీక్ష సరిగ్గా రాయలేదు. శీనుగాడంటే లోపల మంచి అభిప్రాయం కలిగినా స్నేహితుల ముందు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాను. ఆఖరి పరీక్ష అయ్యాక క్లాసంతా, అమావాస్య చంద్రుడు సినిమాకి వెళదామని అనుకున్నాం. నాన్నకి తెలుసున్న డీలక్స్ ధియేటర్ వాళ్ళకి చెప్పి ముందే సీట్లు రిజర్వు చేయించాను. శీనుగాడు ముందు రానని అన్నాడు. నేనే వాడికి టిక్కట్టు పెట్టి రమ్మనమని చెప్పాను.

సినిమా అయ్యాక – “ఇంతకు ముందెప్పుడూ సినిమా చూళ్ళేదు. ఇదే మొదటిసారి. నీకు చాలా ధాంక్స్!” అని శీనుగాడనేసరికి ఆశ్చర్యపోయాను. తరువాత కామేశ్శర్రావు మాస్టార్ని అడిగితే తెలిసింది అది నిజమేనని.

“వాళ్ళది చాలా బీద కుటుంబం. నీకు తెలీదు. మీ నాన్న సహాయం చెయ్యబట్టే ఇంటర్ లాగించాడు కాదూ,” అని చెబితే ఆశ్చర్యపోయాను.

“ఏం కాదు. శీనుగాడు కాలరుకి రుమాలు వేసుకొని మరీ మాకు పోజులిస్తాడండీ. మీకు తెలీదు,” కాస్త చికాగ్గానే అన్నాను.

“అది ఫోజు కాదురా, అవసరం! రోజూ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీదున్న మట్టికీ, చెవటకీ కాలర్ మాసిపోతుందని రుమాలు పెట్టుకుంటాడు. ఎక్కువసార్లు ఉతికితే బట్టలు తొందరగా చిరిగిపోవూ మరి. వాడి ఇంటర్ రెండేళ్ళూ జాగ్రత్తగా రెండే జతలతో నెట్టుకొచ్చాడు, తెలుసా?” కామేశ్శర్రావు మాస్టారు జాలిగా అన్నారు.

శీనుగాడి కాలర్ మీద రుమాలు లాగి వాణ్ణి ఆట పట్టించడం గుర్తొచ్చింది. లోలోపల కొంచెం జాలిపడ్డా పైకి మాత్రం మామూలుగానే ఉన్నాను. కాకపోతే మునపటి లాగా కాకుండా నా దూకుడు తగ్గించాను. పరీక్షలయ్యాక నాన్న నన్ను ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్‌కని వైజాగ్ పంపించాడు. నేను ఓ రెణ్ణెల్లు వైజాగులోనే ఉండిపోయాను. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. కాలేజీ ఫస్ట్ శీనుగాడికే వచ్చింది. నేను సెకండ్ ప్లేసు.

శీనుగాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయలేదు. నాకు కాకినాడలో సీటొచ్చింది. శీనుగాడు బి.ఎస్సీలో జాయిన్ అయ్యాడు. నాకు ఇంజనీరింగ్ వచ్చిందన్న దాని కన్నా, శీనుగాడు కూడా నా కాలేజీలో ఇంజనీరింగ్ చేరలేదని ఎక్కువ సంతోషం వేసింది. శీనుగాడి గోల తప్పింది నాకు, అంతే చాలు. ఆ తరువాత ఒకటి రెండు సార్లు శీనుగాడిని కలిశాను, అంతే.

ఇంజనీరింగ్ అయ్యాక నేను బాంబే ఐ.ఐ.టీలో చేరాను. శీనుగాడు బి.ఎస్సీ చేసి సెంట్రల్ యూనివర్శిటీలో ఎం.ఎస్సీలో చేరాడని అమ్మ చెబితే తెలిసింది. ఇంటికెళ్ళినప్పుడు నాగులు గారినే అప్పుడప్పుడూ అడిగేవాణ్ణి తప్ప నేను ప్రత్యేకించి సమనస వెళ్ళ లేదు. ఎందుకో శీనుగాడినిని కలవడానికి నాకు మనసొప్పలేదు. కొంతమందికి దూరంగా ఉంటేనే మనశ్శాంతి. ఆ తరువాత నేను అమెరికా వచ్చేశాను. దాదాపు పదేళ్ళు శీనుగాడి వివరాలు ఏవీ తెలియలేదు. కొంతకాలం క్రితం నాగులు గారు పోయారని మాత్రం విన్నాను. శీనుగాడు డి.ఆర్.డి.ఎల్‌లో జాయిన్ అయ్యాడని విన్నాను కానీ, ఎక్కడో తెలీదు. నేనూ పట్టించుకోలేదు కూడా.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వొస్తుంది. నేను జీవితంలో ఎంతో సాధించాను. చదువూ, డబ్బూ ఉన్నాయి. ఆఫీసులో కూడా మంచి పేరే వుంది. అప్పుడప్పుడు శీనుగాడు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. జీవితంలో పైకి రావడానికి చదువులో మాత్రం ఫస్ట్ వస్తే సరిపోదు. శీనుగాడు ఇంటర్లో కాలేజీ ఫస్ట్ తెచ్చుకొని ఏం సాధించాడు? ఎక్కడో గవర్నమెంటు ఉద్యోగం చేసుకుంటూ ఎదుగూ, బొదుగూ లేకుండా వున్నాడు. కానీ నేనలా కాదు. తక్కువ స్థాయినుండి పైకి ఎదగడం అంత సులభం కాదు. అమెరికా వచ్చాను. కావల్సినంత సంపాదించాను. జీవితంలో అన్నీ సాధించాను.

ఇప్పుడు నాకన్నీ వున్నాయి కానీ అప్పుడప్పుడూ ఇక్కడ నాకేదో వెలితిగా వుంటోంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే తట్టింది నాకు, మా వూరికి ఏదైనా చేస్తే నిండుగా వుంటుందని. అనామకంగా చేస్తే విలువుండదు. అందువల్ల ఒరిగేదేమిటో నాకెప్పుడూ అర్థం కాదు. చేసే మంచి పనులు పదిమందికీ మన పేరు తెలిసేలా చేస్తే మరో పదిమంది స్పూర్తి పొందుతారు. అందుకోసం చేసిన దానికి గుర్తింపు కోరుకోవడం నా దృష్టిలో తప్పేమీ కాదు. ఆర్థికస్థోమత ఉన్న నాలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేయగలిగేది.

బాగా ఆలోచించి, అమలాపురంలో ఎవరికయినా చదువుకోడానికి సాయం చేద్దామని నిశ్చయించుకున్నాను. మా బంధువుల అబ్బాయి బాగా చదువుతాడనీ వాడికి సాయం చెయ్యమనీ అమ్మ అంది. నాన్న అమలాపురం కాలేజీలో మా ఇంటి పేరున ఒక స్కాలర్‌షిప్ పెట్టమని సలహా ఇచ్చాడు. నాకూ ఈ ఐడియా నచ్చింది. ఫలానా వారబ్బాయి అమెరికాలో వుండి ప్రతి ఏడూ ఈ స్కాలర్‌షిప్ ఇస్తున్నాడు అని పదిమందికీ తెలుస్తుంది, నేననుకున్నదీ జరుగుతుంది. పైగా నేను ఓల్డు స్టూడెంటుని కూడా.

కానీ అమ్మ వినిపించుకోలేదు. ముందు మా చుట్టాలావిడ కొడుక్కే సాయం చెయ్యమని బలవంతం పెట్టింది. మధ్యే మార్గంగా ఆ పిల్లాడికి కాస్త ఇస్తాననీ చెప్పాను. ఇండియాకు వెళ్ళినప్పుడు మా చుట్టాలావిడ ఇంటికొచ్చి కలిసింది. మొగుడు వదిలేశాడనీ, వంటలు చేసుకొని బ్రతుకుతున్నాననీ, పిల్లాడిని చదివించే స్థోమత లేదనీ, సాయం చెయ్యమనీ ప్రాధేయపడింది. సరేనన్నాను కానీ, నా దృష్టంతా కాలేజీ స్కాలర్షిప్ వైపే ఉంది.

ఎటూ తేల్చకుండా ఓ రెండు వారాలు నాన్చాను. అమ్మ మాత్రం ఆ అబ్బాయికి సహాయం చెయ్యమని ఒకటికి పదిసార్లు చెప్పింది. ఇహ తప్పక మా చుట్టాలావిణ్ణి పిలిపించాను. ఆవిడ వచ్చింది కానీ, ఆ పిల్లాడు రాలేదు. నా నిర్ణయం చెప్పాను. అది విని ఆవిడ సంబరపడి పిల్లాణ్ణి పిలుచుకొచ్చింది. వాడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాక వాడు అవసరం లేదన్నాడు.

“ఇందాక కాలేజీకి వెళితే ప్రిన్సిపాల్ గారు నా చదువుకి ఒకాయన సాయం చేస్తారని చెప్పారండీ. మీ డబ్బు అవసరం లేదండి సార్!” అని తటపటాయిస్తూ చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా కాలేజీలో చదువుకి స్పాన్సర్ చేసే వారెవరూ లేరనే కదా నాన్న ఈ సలహా చెప్పాడు.

“ఎవర్రా ఆయన, పేరేమిటి?” అడిగాడు నాన్న.

“ఏమో తెలీదండీ, ప్రిన్సిపాల్ గారు నీకెందుకోయ్ ఎవరైతే? అన్నారండీ” చెప్పాడు వాడు.

తనకు తెలియని వారెవరా అనుకుంటూ, నాన్న వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌కి ఫోన్ చేశాడు. ఈలోగా నేను ఆ పిల్లాడితో కబుర్లలో పడ్డాను. వాడు అమెరికా గురించి వివరాలు అడగడం మొదలు పెట్టాడు.

అంత వరకూ గమనించనే లేదు. ఆ పిల్లాడి కాలరుకి రుమాలు మడత వుంది. అప్రయత్నంగా చిన్నప్పటి శీనుగాడు గుర్తుకొచ్చాడు. దగ్గరకి రమ్మనమని పిలిచి పాత అలవాటుగా చప్పున ఒక్కసారి రుమాలు లాగాను. ఊహించని నా చర్యకి ఆ పిల్లాడు ఉలిక్కిపడ్డాడు.

“బయట దుమ్ముకి కాలర్ త్వరగా మాయకుండా…” ఆ పిల్లాడు నాకేసి అదోలా చూస్తూ అన్నాడు.

ఇంతలో నాన్న వచ్చాడు. “ప్రిన్సిపాలుతో ఇప్పుడే మాట్లాడాను. నయానా భయానా ఎలా అడిగినా ఎవరో చెప్పమంటే చెప్పడే. పేరు చెప్పద్దని మాట తీసుకున్నాడండీ అంటాడు ఎంతసేపటికీ. చివరికి గట్టిగా బెదిరిస్తే కానీ ఎవరో చెప్పలేదురా ప్రిన్సిపాల్!” అంటూ నాన్న ప్రిన్సిపాలు మీద రుసరుసలాడాడు. “ఆయనెవరో కాదు, మన శీనుగాడే. పదేళ్ళనుంచీ ఇలానే ప్రతీ ఏడూ చేస్తున్నాడట.”

“శీనుగాడా?” అప్రయత్నంగా వచ్చింది నా నోట. ఇక్కడ కూడా దాపురించాడూ?

నాకు తెలీకుండానే పళ్ళు పటపటా కొరికి చేతిలో ఉన్న రుమాలు దూరంగా విసిరేశాను. అది చూసి పిల్లాడు భయంతో పారిపోయాడు.

వెంటనే ఫోన్ తీసుకొని ప్రిన్సిపాల్‌కి కాల్ చేశాను. మొన్న కలిసినప్పుడు ఆయన ఎవరూ లేనట్టే చెప్పాడు. ఫోను ఎత్తగానే విషయం దాచిపెట్టారని చెడామడా తిట్టేశాను. శీనుగాడి మీద కోపం ఆయన మీద చూపించాను. ఆయనేం మాట్లాడలేదు. ఆయన మౌనం మరింత చిర్రెత్తుకొచ్చింది.

“అసలు ఈ విషయం ముందే ఎందుకు మాకు చెప్పలేదండీ? నిజం దాచిపెట్టి మా పేరుతో స్కాలర్‌షిప్ వేయించుకుందామనేనా?” అంటూ గదమాయించాను.

“ఏంటయ్యా? ఇందాకటినుండీ నువ్వూ, మీ నాన్నా తెగ రెచ్చిపోతున్నారు. శ్రీను ఎవరికీ చెప్పద్దని చెప్పినా మీ నాన్నకి చెప్పాను. మీరిచ్చే బోడి పాతికవేలూ ఎవడి ముక్కులోకీ రావు. పైగా రోజూ నన్ను సతాయిస్తున్నారు గోడమీద ప్లేట్ పెట్టించండి. క్లాస్‌రూమ్మీద మా పేరు రాయించండి. అదీ, ఇదీ అంటూ. శ్రీనివాసు చేస్తున్నది అరకొరా సహాయం కాదు. రెండేళ్ళ చదువుకి పూర్తి స్కాలర్షిప్పు. ఇన్నేళ్ళ నుండీ ఇస్తున్నా అతను కాలేజీకి ఒక్కసారీ రాలేదు, నన్నొక్కమాట అడగలేదు, తెలుసా? నువ్వూ, మీ నాన్నా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. శ్రీను ఆ స్కాలర్షిప్పు మీ నాన్న పేరునే ఇస్తున్నాడు. ఈ సంగతి మీ నాన్నకి కూడా చెప్పు. కాస్త తండ్రీ కొడుకులిద్దరూ నోరు సంబాళించుకోండి,” అంటూ విసురుగా ఫోను పెట్టేశాడు.

నేలమీద విసిరిన రుమాలు ఆ క్షణం వికృతంగా కనిపించింది నాకు.