శివయ్య ఎన్నికలలో నిలబడ్డ రోజుని తెలుగు ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కొందరంటే, మీడియా కాకిలా అరుస్తోందని ఇంకొందరన్నారు. శివయ్యని మహాత్మాగాంధీతో పోల్చి సత్యసంధుడన్నవారు కొందరయితే, అతనికి బకాసురుడనే నామధేయాన్నిచ్చింది వేరెవరోకాదు – అప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులు. శివయ్యని ముందు దూదిపింజకింద తీసేసిన మీడియా అతనికి ఇంటర్వ్యూలని ప్రసాదించడంతో అతని పేరు ప్రజల నోళ్ళల్లో నానడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతని పట్ల టీవీ యాంకర్లు ప్రదర్శించిన వ్యంగ్యధోరణి అతణ్ణి ప్రజలకి దగ్గరగా చేర్చిందనే చెప్పుకోవచ్చు. ఏ ఇంటర్వ్యూలోనయినా గానీ ఒకటీ రెండు పదాల తేడాతో అతణ్ణి అందరూ అడిగిన మొదటి ప్రశ్న — ‘నన్ను గెలిపించండి, నేను ఇన్నివేల కోట్ల రూపాయలని వెనకేసుకుంటాను,’ అని చెప్పడానికి సిగ్గులేదా? అని. అతను ఇచ్చిన సమాధానం (ఒకటీ రెండు పదాల తేడాతోనే):
“ఇప్పటిదాకా ఎన్నుకోబడ్డవాళ్ళెవరినీ ఎంత వెనకేసుకున్నారని మీరడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఎన్నికయిన తరువాత వెనకేసుకున్నారంటూ వాళ్ళ స్థిర, చరాస్తుల వివరాలని ఋజువులతో మీరు ప్రచురించినా వాళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. వాళ్ళు గనులని కొల్లగొట్టినా, చందనపు అడవులని స్వాహా చేసినా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత అలాంటి ఉద్దండులని విజయవంతంగా న్యాయస్థానంలో విచారణ జరిపి వాళ్ళని శిక్షించిన దాఖలాలేం లేవు. ఒకానొక కాలంలో రాజకీయ నాయకులు లంచాలు తింటూ పట్టుపడ్డారని ఆడియో రికార్డింగ్ వినిపించగానే పార్టీల అధిష్ఠానాలు వాళ్ళను పదవుల్లోంచి తొలగించేవి. ఈనాడు విడియోలు చూపించినా కూడా అణువంతయినా సిగ్గులేకుండా ఆ విడియోలు తీసినవాళ్ళ ఎజెండా ఏమిటోనన్న ప్రశ్నని లేవదీసి, ఇన్వెస్టిగేషన్ అంటూ ప్రభుత్వపు సంస్థలనన్నింటినీ వాళ్ళ మీదకి ఉసిగొల్పి, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పించడమే కాక, వాళ్ళ ఇళ్ళ మీద దుండగుల చేత దాడులు చేయించినా, మీ మీడియావాళ్ళే కాక ప్రజలు కూడా ‘కాలంతీరు’ అంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల తరువాత మీ మీడియావాళ్ళకి మరో హాట్ టాపిక్ దొరుకుతుంది – అది రాజకీయాల గూర్చే కానక్ఖర్లేదు, సినిమా తారల పెళ్ళి గూర్చో లేక విడాకులగూర్చో కూడా కావచ్చు. అందుకే, సిగ్గు ఉండకూడనిచోట అది దారికి అడ్డంరాకూడదని తెలుసుకున్నాను.”
మీడియాలో చర్చ మొదటగా శివయ్య మీదే జరిగింది. అతడు ఎక్కణ్ణించి వచ్చాడనీ, అతని వెనక రాజకీయ హస్తాలు హస్తినలో గానీ బస్తీలోనే గానీ ఉన్నాయేమోనని ఆరాలు తీశారు. అతని పూర్తిపేరు సాంబశివరావనీ, అతను 1947 ఆగస్టు 15న పుట్టాడనీ, డాక్టరుగా అమెరికా వెళ్ళిన తరువాత గొప్ప మందుని కనిపెట్టడంతో బోల్డంత డబ్బు చేసుకుని ముఫ్ఫయ్యేళ్ళు నిండకుండానే మిలియనీరయ్యాడనీ, ఆ తరువాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయి, వై2కె సమయంలో కొత్తగా మొదలవుతున్న టెక్నాలజీ కంపెనీలల్లో ఇన్వెస్ట్ చేసి బిలియనీర్ అయ్యాడనీ, అయితే, అప్పటిదాకా మీడియాకి దూరంగా వుండడం వల్ల అతని గూర్చి అంత పెద్దగా ఎవరికీ తెలియలేదనీ తెలిసింది. వాళ్ళకి అంతు పట్టని విషయమల్లా, అప్పటి దాకా రాజకీయాల్లో వేలు పెట్టినట్లు ఎక్కడా దాఖలాల్లేని మనిషి ఇంత హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎందుకు చేస్తున్నాడన్నది.
శివయ్యకి ఒక పార్టీని తయారు చెయ్యడానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. అతన్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో మీడియా ద్వారా తెలుసుకుని అతనికి డబ్బులు ఎదురిచ్చల్లా కొందరు అతని పార్టీలో చేరిపోయారు.
“ఇంతమంది మీ పార్టీ వైపుకు రావడానికి కారణం – మీరు వాళ్ళకి ఎంత కొల్లగొట్టుకోవచ్చో చెప్పివుంటారు. కాదా?” అని నిలదీశాడో యాంకరుడు.
“తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే కల్లు తాగడానికి అని చెప్పడానికి నేనేమీ భయపడను,” అన్నాడు శివయ్య.
నోట మాటరాని ఆ యాంకరుడు “బ్రేక్” అని అన్నాడు.
“ఎంతడబ్బు వెనకేసుకుందామనుకుంటున్నారో చెప్పడంలో నిజాయితీ వుంది గానీ ఆ డబ్బు తీసుకోవడం లోనే నీతి లేదు,” అన్నాడు యాంకరుడు.
“చట్టాలు చేసినది నీతిని నిలబెట్టడానికే అయితే ఈనాడు ఇంతగా అవినీతి సంఘంలో నాటుకొని పోయేదే గాదు. ఈనాటి ప్రజాప్రతినిధులని అడగడానికి భయపడే ప్రశ్నలని నాకు సంధించడంలోనే మీకు నీతి ఏ మాత్రం వున్నదో తెలుస్తూనే వున్నది గదా!” అన్నాడు శివయ్య.
మళ్ళీ “బ్రేక్” అన్నాడు యాంకరుడు.
శివయ్య పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గం లోనూ తమ తమ టార్గెట్లు ఎన్ని కోట్లో నిర్భయంగా చెప్పారు. అంతేకాక వాళ్ళ ప్రత్యర్థులకి సవాళ్ళు విసిరారు కూడా – వాళ్ళు ఎన్ని పదుల, వందల, లేక వేల కోట్ల పరిమితులకి కట్టుబడి వుంటారో చెప్పమని, అదే తామయితే అణాపైసలతో సహా లెఖ్ఖ చెబుతామనీను.
శివయ్య పార్టీ కొత్తది కాబట్టి అప్పటికే దశాబ్దాల చరిత్ర వున్న రాజకీయ పార్టీలన్నీ కుమ్మక్కై ఆ సవాళ్ళకి జవాబులు చెప్పకూడదని నిర్ణయించుకున్నాయి. వాళ్ళ నిర్ణయాలకి కారణం, అలాంటి సవాళ్ళు విసిరింది తామెంత అవినీతిపరులో నిర్ధారించడానికి శివయ్య వేసిన ఎత్తు కావచ్చనీ, సవాళ్ళని తాము స్వీకరించగానే శివయ్య తన పనయిందని పెద్దగా నవ్వేసి ఈల వేసి గోల చేస్తాడేమోననీను. అలాగని ఎన్నికలలో గెలవడానికి వాళ్ళు తమ ప్రయత్నాలనేమీ ఆపలేదు; హాజ్ కోసం ఉచితంగా మక్కాకి టిక్కెట్లిప్పిస్తామని ఒక పార్టీ అంటే, కేదార్‌నాథ్, బదరీనాథ్ యాత్రలకి టిక్కెట్లిప్పిస్తామని మరొకపార్టీ, జెరూసలానికి పంపిస్తామని వేరొక పార్టీ, నాస్తికులకి అంతరిక్ష యాత్రలకి టిక్కెట్లిప్పిస్తామని ఇంకొక పార్టీ వాగ్దానాలు చేశాయి.
“గెలిస్తే మీరేం చేద్దామనుకుంటున్నారు?” అనడిగిందో యాంకరి.
“ప్రజల కోసం – అని మీరనలేదు. నేను ఇప్పుడు ఏమయినా చెప్పినా, మీరు మీ వాగ్దానానికి కట్టుపడివుంటారని మేమెందుకు నమ్మాలి? అని ఎదురుప్రశ్న వేస్తారు. అందుకని, వాళ్ళు చేసేదానికీ, నేను చేసేదానికీ పెద్ద తేడా ఉండదనుకోండి. కాకపోతే, నేను చవగ్గా చేసి పెడతానంతే,” అన్నాడు శివయ్య.
“సవారీ కోసం పోటీపడే భోగందాన్లా మాట్లాడుతున్నారు,” అన్నదా యాంకరి నిరసనగా.
“పాపం రాజకీయాలతో పోల్చి పొట్టకూటి కోసం భోగంవాళ్ళు పడే తిప్పలని ఎందుకు తల్లీ కించపరుస్తావు?” తిరిగి ప్రశ్నించాడు శివయ్య.
“వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు కదా! ఉదాహరణకి మక్కాకీ, జెరూసలంకీ, అంతరిక్షయాత్రలకీ టిక్కెట్లిప్పిస్తామంటున్నారు!” అన్నదా యాంకరి మాటమారుస్తూ.
“అవి జరిగేవి కాదని మీకు తెలుసు. అయినా మీరు వాళ్ళని ప్రశ్నించరు. ఎన్నికల్లో వాగ్దానాలు నీటి మూటల వంటివని ఈ మధ్య జరిగిన ఏ ఎన్నికలు చూసినా తెలుస్తుంది.”
“అవే కాక, పరిశ్రమలు స్థాపిస్తామనీ, కాలువలు తవ్విస్తామనీ, డాముల్ని కట్టిస్తామనీ, వేతనాలు సవరిస్తామనీ, ప్రతికుటుంబానికీ జీవనోపాధిని చూపిస్తామనీ…”
“మీరు చెప్పినవాటిల్లో మొదటి మూడింటికీ కొంత ప్రయత్నం జరుగుతుంది ఎన్నికల్లో మా పార్టీ గెలిచినా, గెలవకపోయినా. గాలి వీస్తూనే వుంటుంది. నీరు పారుతూనే వుంటుంది. అయితే, గాలీ, నీరూ లాగా కాక, వాటివల్ల లాభాలు సామాన్య ప్రజలకంటే ఆ పరిశ్రమల కాంట్రాక్టుల లబ్ధిదార్లకే ఎక్కువ అన్న విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. వేతనాల సవరణ ముసలెద్దు నడకలాగా మెల్లగా అప్పుడప్పుడూ జరుగుతూంటుంది. ప్రతీ కుటుంబానికీ జీవనోపాధిని చూపించడమనేది ఇప్పటిదాకా జరగలేదు, ఇకముందు జరుగుతుందనడానికి దాఖాలూ లేవు,” అన్నాడు శివయ్య.
శివయ్య పార్టీతో పోటీ పడుతున్నవాళ్ళు శివయ్య గూర్చి మాట్లాడకూడదని ఎంత పట్టుదలతో వున్నా మీడియా వాళ్ళని వేధించి, వాళ్ళ దగ్గరినుంచి జవాబులని రాబట్టేదాకా వదల్లేదు.
“అమెరికా దుష్ప్రభావం ఆ శివయ్య మీద ఎంత వున్నదో తెలియట్లేదా? మన భారతదేశం ఎంత గొప్పది? నీతీ, నిజాయితీ, సత్యం, ధర్మం అన్నింటికీ మనదేశం పుట్టినిల్లు అని గుండెలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకోవాల్సింది పోయి – మన పరుచూరి బ్రదర్స్ రాసినట్టు ‘పొగడరా నీతల్లి భూమిభారతినీ’ అని అనవలసింది పోయి, నేను అవినీతిపరుణ్ణి అంటూ రొమ్ములు గుద్దుకునే పాశ్చాత్యుని గూర్చి అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి రావడం ఈనాడు తెలుగు ప్రజలు చేసుకున్న ఖర్మ వల్ల కాక మరెందువల్లో మాకు ఏమాత్రం తట్టడం లేదు,” అన్నారు వాళ్ళు.
“గెలిచిన తరువాత వాళ్ళు ఒక్కొక్కళ్ళూ ఎంత వెనకేసుకుంటున్నారో లెక్క చూపిస్తామని చెబుతున్నారు గదా, వాళ్ళ వెబ్‌సైట్స్‌లో పెడతామంటున్నారు గదా, అది ఈనాడు జరుగుతున్న దానికంటే నయం కాదా?” అనడిగాడు వెన్నుపూస వున్న ఓ యాంకరుడు.
“అంటే, నేను ప్రజల డబ్బుని చెప్పకుండా వెనకేసుకుంటున్ననేగా దానర్థం?” అని ఆ నాయకుడు రెచ్చిపోయేసరికి యాంకరుడి వెన్నుపూస కాస్తా వెన్నపూసగా రూపాంతరం చెందింది. అయితే, టీవీలో ఎంతసేపు మొహాన్ని చూపిస్తే అంత మంచిదని గుర్తుకొచ్చిన ఆ నాయకుడు, “అంత ధైర్యంగా వాళ్ళే చూపిస్తున్నప్పుడు మన యాంటీ కరప్షన్ బ్యూరోలూ, సీబీఐలూ, ఇన్‌కం టాక్స్‌వాళ్ళూ చేతులకి గాజులేసుకుని కూర్చోరు,” అంటూ మాటమార్చాడు.
“వందల్లోనూ, వేలల్లోనూ తమది కాని డబ్బుని తీసుకునేవాళ్ళు చేసేది దొంగతనం. లక్షల్లో, కోట్లల్లో డబ్బులు చేతులు మారితే దాన్ని దొరతనమంటారు. దొరతనాన్ని విచారణ జరపడానికి పవిత్రభారతదేశంలో న్యాయస్థానాలు ఇంకా పుట్టలేదు,” అన్నాడు శివయ్య. కోటిరూపాయలకే అమ్ముడుపోయే న్యాయాధిపతుల గూర్చి ప్రజలు వినేవున్నారు గనుక వాళ్ళకా జవాబు సమంజసం గానే అనిపించింది.
“ఇన్ని వేల కోట్ల రూపాయలని వెనక వేసుకుంటాను అని బాహాటంగా చెప్పగలిగే ధైర్యం మీకెలా వచ్చింది?”
“ఇంతకు ముందు వున్న ప్రభుత్వపు నాయకులు ఎనిమిదేళ్ళల్లో వెనకేసినంత డబ్బుని ఇప్పుడున్న ప్రభుత్వపు నాయకులు నాలుగేళ్ళలోనే లాగేశారు. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఐదుశాతం తనదంటే, తరువాతి వారు పదిశాతం తమదన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఈ ప్రభుత్వాలకి ప్రజలు చూపిన ఆదరణే నాకీ ధైర్యాన్నిచ్చింది.”
“మీరు మీ పార్టీని స్థాపించి మీ ప్రతిపాదనలని వినిపించినప్పుడు నవ్వనివారు లేరు. ఇప్పుడు మీ పార్టీ పోటీ చెయ్యని నియోజకవర్గంలేదు. మీ పార్టీకి ఆశయం ఏమయినా వుంటే అది మీ స్వలాభం మాత్రమే. అలాంటిది, మీ పార్టీలో ఇంతమంది చేరడం దేశపురోగతికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు,” అన్నాడో యాంకరుడు నిరసిస్తూ.
“నరమాంస భక్షకుల్లో నీతీ నిజాయితీలుంటాయని మీకు తెలుసా? వాళ్ళు తమలోని వాళ్ళని తినరు – బయటివాళ్ళని మాత్రమే తింటారు. రావణుడి కాలంలో కూడా రాక్షసులు మానవులనీ, దేవతలనీ వేధించినట్లు చదువుకున్నాం తప్ప వాళ్ళల్లోనే ఒకడు ఇంకొకణ్ణి మోసగించినట్లు గానీ, ఒక రాక్షసుడు ఒక రాక్షసవనితను బాధించినట్లు గానీ వేధించినట్లు గానీ ఏ పురాణాల్లోనయినా చెప్పగా విన్నామా? మరి దేవతల్లోనో? ఇంద్రుడు ఒక మానవ వనిత కోసం మారువేషం వేశాడు. చంద్రుడు తన గురువయిన బృహస్పతి భార్యని లేవదీసుకుపోయాడు. అంతెందుకు? బ్రహ్మదేవుడు శివలింగపు ఆద్యంతాలని చూశానని అబధ్ధం చెప్పి శివుని చేత నరకబడడం వల్ల ఒక ముఖాన్ని కోల్పోయాడు. ఈ ఉదాహరణలని చెప్పి దేవతలకి గౌరవాన్నివ్వడంలో లోపం చూపడం లేదే!
మన మధ్య నిరంతరం జరుగుతోంది పిల్లీ ఎలుకల మధ్య ఆట వంటిది. పంట పెరుగుదలకి ఎరువులనీ, మంచి విత్తనాలనీ కనిపెడతాం. వాటిల్లో కల్తీ కలిపి పంట తగ్గడం వల్ల వ్యవసాయదారుడి పొట్ట కొట్టడమే కాక మనందరి కళ్ళూ మనమే పొడుచుకుంటున్నాం. కల్తీ సరుకు రైతుని చేరినా గానీ ఒక మంత్రమేసో లేక ఒక యంత్రంవల్లనో నాణ్యమయిన సరుకుని అతనికి అందేలా చెయ్యగలిగితే అందరికీ లాభమేకదా! ఇక్కడి నాయకుల్లోని కల్తీ మీకు కనిపిస్తోంది. బయట దేశాలవాళ్ళు భారతదేశం లోని సాంకేతిక అభివృధ్ధిని మాత్రం చూస్తున్నారు. అయితే, దేశం ప్రగతిబాటలో నడుస్తున్నట్లా లేక వెనకడుగేస్తున్నట్లా? దేశసేవ కోసమే నాయకులు ఎన్నికల్లో నిలబడేది అన్న భ్రమనించి ప్రజలు ఎంత తొందరగా బయటపడితే అంత త్వరగా దేశం పురోభివృధ్ధిని సాగిస్తుందని నా నమ్మకం. అప్పారావుగారు ‘స్వంత లాభం కొంతమానుకు పొరుగువానికి తోడుపడవోయ్’ అన్నారు గానీ ‘స్వంతలాభం ఎంత ఎంతను మంత్రి పదవుల ఆశ గదవోయ్’ అనేది రాజకీయ నాయకుల గూర్చి ఈనాటి ప్రజలెరిగిన సత్యం. ‘స్వంతలాభం ఇంతకెంతను మంత్రిపదవుల ఆశ తగదోయ్’ అని మీరు ఎవరికయినా నీతులు చెప్పబోతే మిమ్మల్ని పిచ్చాసుపత్రి లోంచి పారిపోయి వచ్చినట్లుగా భావిస్తారు! అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలన్నారు గదా పెద్దవాళ్ళు! రోగనిర్ధారణ అయినప్పుడే గదా సరయిన వైద్యం జరిగేది! నేను నిజాయితీగా నిజాలని చెబుతుంటే మీరెందుకు నిరసిస్తున్నారో నాకర్థం కావడంలేదు.
మీ సేవ చెయ్యడానికే మీ ముందుకొస్తున్నాను అని నేను మిమ్మల్ని మభ్యపెట్టను, మీ తెలివితేటలని కించపరచను. ముఖ్యమంత్రి పదవికి దరఖాస్తు పెట్టుకుంటున్నాను. అందుకు నాకు గల క్వాలిఫికేషన్లేవో మీరు నా వెబ్‌సైట్లో చూశారు. అయితే, ఆ ఉద్యోగానికి జీతమేదో నిర్ణయించేశాం గదా, కనీసం మీరయినా ఆ జీతంతోనే సరిపెట్టుకోవచ్చు గదా, అని మీరు నన్నడగవచ్చు. ఏ ఉద్యోగానికయినా కొంత ఖర్చు ముందే పెట్టవలసి వుంటుందని మీకు తెలుసు. ఉదాహరణకి, నల్గొండలో వుండే అభ్యర్థి ప్రభుత్వ పాఠశాలలిచ్చిన డిగ్రీని చేత్తో పట్టుకుని గుంటూర్లో ఇంటర్వ్యూకొస్తే దానికి దారిఖర్చులు మాట్లాడకుండా ఆ వ్యక్తే పెట్టుకుంటాడు. ఆ ఉద్యోగంలో అతను ఎంపికయితే, జీవితకాలంలో ఆ ఉద్యోగంలో అతని సంపాదన అతని దారిఖర్చులకి ఎన్నిరెట్లో గమనించండి. ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే, డిగ్రీ సంపాదించుకొన్న తరువాత జీవితకాలంలో ఆ ఇంజనీర్ సంపాదన ఆ ఖర్చుకి తేలిగ్గా కనీసం అరవై రెట్లుంటుంది. మరి ముఖ్యమంత్రి అవాలంటే? వందలకోట్ల ఖర్చు. ఆ పదవిని చేపట్టిన తరువాత ప్రభుత్వం వారిచ్చే అన్ని అలవెన్సులూ కలిపితే అయిదేళ్ళల్లో అది ఒక కోటికన్నా తక్కువే వుంటుంది. నేను బిజినెస్ మాన్‌ని. నేను అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా వుండాలంటే ఆ పదవి నాకు దక్కడానికి అయ్యే ఖర్చులని పెట్టుబడిగా భావిస్తాను గనుక దానికి తగ్గ ప్రతిఫలం రావాలని ఆశిస్తాను – ఒక ఇంజనీర్లాగానే, ఒక తాలూకా ఆఫీస్ క్లర్క్ లాగానే. అందుకని వందలకోట్ల ఖర్చుకి వేలకోట్లలో లాభాన్ని ఆశించడం సమంజసమేనన్న నా వాదనతో మీరు ఏకీభవించక పోయినా అందులోని నిజాన్ని గ్రహిస్తారనే నమ్ముతున్నాను.
అమెరికా ఎన్నికలలో గూడా చాలానే ఖర్చవుతోందని మీరు వార్తలలో చదువుతూనే వున్నారు. ప్రెసిడెంట్ ఒబామా రెండవసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆయన, ఆయన ప్రత్యర్థీ చెరొక బిలియన్ డాలర్లూ – అంటే అయిదువేల కోట్ల రూపాయలు – ఖర్చు చేశారు. ఆ ఖర్చంతా వాళ్ళ ఆశయాలనూ, ప్రతిపాదనలనూ సమర్థించే సామాన్య ప్రజల వద్దనుంచీ బిజినెస్‌ల వద్దనుంచీ బిలియనీర్ల వద్దనుంచీ పోగుచేశారు. అయితే, గెలిచిన తరువాత వాళ్ళ రాబడిని ప్రజలేకాక ప్రత్యర్థులూ కూడా డేగకళ్ళతో చూస్తారు గనుక, లంచాలు తినే అవకాశాలు అమెరికాలో ప్రెసిడెంటుకి గానీ, ఎన్నికయిన ఇతర ప్రజాప్రతినిధులకి గానీ మనకున్నంతగా ఉండవు. లక్ష్మణరేఖ దాటిన వాళ్ళు పట్టుబడ్డప్పుడు రాజీనామాలు చెయ్యడం, అప్పుడప్పుడూ కటకటాల వెనక్కి వెళ్ళడం మీరు వినే వుంటారు. అమెరికాలోనే గాక ఇక్కడ కూడా పెద్ద కంపెనీల్లో చీఫ్ ఎగ్జెక్యూటివ్‌లకి సంవత్సరంలో జీతం కంటే బోనస్‌లు చాల ఎక్కువగా వుంటాయి గనుక, ఈ పదవిలో ప్రతిభని చూపెట్టడానికి నా మోడల్ ఇదీ. అంతేగాక, ప్రెసిడెంట్ ఒబామా ప్రత్యర్థి లాగానే, ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఒకళ్ళు ఓడిపోక తప్పదు – ఆ ఓడిపోయిన వాడికి అతని ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే గదా! ఆ దృష్టితో చూస్తే నేనడుగుతున్న బోనస్ సమంజసంగానే కనిపిస్తుంది. అక్కడ ఒబామా ప్రత్యర్థి మిట్ రామ్నీ తన స్వంతడబ్బు చాలా తక్కువ పెట్టాడు, ఇక్కడ నా ఖర్చంతా నాదే. అదీ ముఖ్యమయిన తేడా. ఇంకొక్క విషయం. నేను ఖర్చు పెడుతున్న ప్రతీ రూపాయా సక్రమ సంపాదనే, రిజర్వ్ బాంక్‌కు లెక్కలు చూపించినదే! అంతేకాక నేను తీసుకునే ప్రతీ రూపాయ మీదా టాక్సులు కడతాను. పారదర్శక ప్రభుత్వం వల్ల వచ్చే లాభాలని మీరు తప్పక మెచ్చుకుంటారని నా నమ్మకం.”
“ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా చాలా డబ్బు చేసుకున్న ఖ్యాతి మీకుండగా ఇంత డబ్బుని ఈ ఎన్నికలలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గెలుస్తానన్న హామీ లేదుగా? అదే మీరు స్టాక్‌మార్కెట్లోనో రియల్ ఎస్టేట్లోనో పెడితే అయిదేళ్ళల్లో తేలిగ్గా రెట్టింపు చేసుకునే వాళ్ళు. ఇక్కడ అసలుకే మోసం వచ్చే ప్రమాదముందిగా!”
“సింహానికి ఏనుగు కుంభస్థలం కొడితేనే గదా ఆనందం! ఓడిపోయినందు వల్ల డబ్బుపోయినా నా మనుగడకేమీ ఇబ్బంది రాదు. నేను గెలిస్తే నాకు మాత్రమే కాదు లాభం – ప్రజలందరికీ కూడా. పారదర్శకతకి ప్రజలు అలవాటు పడితే నా తరువాత వాళ్ళనించీ కూడా అదే కోరుకుంటారు. అది చవగ్గా దొరుకుతుంది కూడా,” అన్నాడు శివయ్య.
“లాభంచేసుకోవడానికే ఎన్నికలలో నిలబడుతున్నాను,” అని శివయ్య చెప్పిన సత్యం సుందరంగా అనిపించిందా, పారదర్శకతకీ, నిజాయితీకి ప్రాధాన్యతనిచ్చి తెలుగు ప్రజలు అతణ్ణి గెలిపించారా అనే ప్రశ్నలకి జవాబులు ఎన్నికలయిన తరువాత గానీ తెలియదు. అతను గెలిచేటట్లయితే, ఆ పై ఎన్నికలలో తప్పు పాఠం నేర్చుకుని, అతనికంటే ఎక్కువ డబ్బుని వెనకేసుకుంటామంటూ అతని ప్రత్యర్థులు పోటీ చేస్తారా, లేక అతనికన్నా తక్కువ ఖరీదుకే ప్రజాసేవ చేస్తామంటారా అన్నది ముఖ్యమయిన ప్రశ్న అవుతుంది. ఆ మొదటి పరిస్థితి గనుక వస్తే, తెలుగు ప్రజలు నవ్వేసి అలా అంటూ పోటీజేసే వాళ్ళకి ఎన్నికలలో డిపాజిట్ గూడా దక్కనీయరని నా నమ్మకం. రెండవ పరిస్థితి గానీ నిజంగా సంభవిస్తే, పదవుల్లో వున్నవాళ్ళ అక్రమార్జనలకి వారధి పడుతుంది. అంతేకాక, పారదర్శకతని పాటిస్తూ, శివయ్య కంటే తక్కువ డబ్బులు తీసుంటామంటూ వాళ్ళు రావడం వల్ల అతనికి సరయిన పోటీ ఏర్పడి, గర్వం అతని తలకెక్కకుండా వుండడానికి సహాయపడుతుంది. ఫ్రీ మార్కెట్ ఫర్ ఎలక్షన్స్! అప్పుడు చవగ్గా పాలకులని కొనుక్కోవడం వల్ల ప్రజలే గెలిచే అవకాశముంది! అది హర్షణీయమేగదా! రెండువిధాలుగా కూడా ప్రజలదే గెలుపు! కాపిటలిజాన్ని ప్రజాసేవకి గూడా వినియోగించవచ్చని ఎవరయినా కలలోనయినా ఊహించి వుంటారూ?