అర్జున

నారాయణ పక్షులు గూళ్ళలోకి చేరి పిల్లల గొంతులోకి ఆహారాన్ని జారవిడుస్తున్నాయి. విశాలంగా రెక్కలు చాచి నదీ తీరానికి ఎగురుతూ మళ్ళీ నా దగ్గిరికి వెనక్కి వస్తూ. ఈ శరత్కాలమంతా వాటి సందడే! ఎక్కడెక్కడి నించి వస్తాయో? నా కొమ్మల్లో గూళ్ళు కట్టుకుని కాపురముండి, గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి పెంచి, వాటి రెక్కలు బలపడి అవి ఎగరటం నేర్చేకా, వాటితో కలిసి తిరిగి ఎటో వెళ్ళిపోతాయి. నేను కొమ్మరెమ్మలుగా విస్తరించి చేవ దేరిన నాటి నుంచి వాటి రాకని భరిస్తూనే ఉన్నాను.

ఎన్నేళ్ళుగా నేనిక్కడ ఉన్నానో, ఈ సౌపర్ణిక వొడ్డున. నా కాండం నా వయసుకి ప్రతీక అయితే ఇక్కడ వందల యేళ్ళుగా నిలబడి ఉన్న ఎర్రమద్దిని. నేనెంత అనాది వృక్షాన్నో! అర్జున నా పేరు! ఇదిగో ఈ సౌపర్ణికా నదీ తీరమే నాకు పుట్టినిల్లు. ఈ నదీ నేనూ ఎన్ని కాలాలు చూసేమో చెప్పలేను.

అదిగో అక్కడ పచ్చగా నిలబడి ఉన్న ఆ పనస, విశాలంగా విస్తరించిన ఆ చింత నా కళ్ళ ముందే కాదూ పెరిగి పెద్దవైనాయి. ఆ మోదుగ, కానుగ, ఇంకాస్త దూరంగా ఉన్న పున్నాగ, ఇవన్నీ నాకు నా పిల్లల మాదిరి గానే అనిపిస్తాయి. అక్కడ ఊడలు దిగిన ఆ రావిచెట్టు సంగతి అయితే చెప్పనే అఖ్ఖరలేదు. ఆమె నా ప్రియసఖి! ఆకుల తళతళలతో నవ్వుతుంది. ఎంత అందమో ఆమెది. నాతోపాటు ఆ రావిచెట్టు కూడా ఇన్నేళ్ళుగా కాలగమనంలో అన్ని దృశ్యాలనీ చూసింది. పెను విపత్తులెన్నో మోసింది!

సౌపర్ణికలో తుళ్ళింతలాడే చేపల గుంపులు పక్షులనెలా పరిహసిస్తాయో నాకు తెలుసు. కృష్ణజింకలు కొమ్ములని ఎగరేసుకుంటూ మందలుగా విహరిస్తూ, మునిమాపు దాకా పొదల్లో పడుకుని గడిపే పులుల మూర్ఖత్వాన్ని గురించి ముచ్చటించుకున్నవన్నీ నేను ఎరుగుదును. ఆ మధ్య నొకసారి ఒక అడివిదున్న పులికి ఎర అయ్యింది. సాధారణంగా అయితే అడివిలో బలిసిన దున్నని పులి ఎదుర్కొనే సాహసం చెయ్యదు. కానీ ఆ వేళ తన దూడని వెతుక్కుంటూ వచ్చి దున్న పులికి చిక్కి చచ్చిపోయింది. పులి తినేయగా మిగిలిన కళేబరాన్ని ఆరగించేటందుకని మూకలుగా వచ్చిన రాబందులు ఆవేళ నా కొమ్మల మీదనే కూచుని దున్నని తలుచుకుని దుఃఖించాయి. అది చాలా వింతగా విశేషంగా అనిపించింది నాకు.

నాకు కలిగిన ఈ సందేహాన్ని నేను నదితో ప్రస్తావించినప్పుడు ఒకదాని దుఃఖమైనా సుఖమైనా మరొకదానితో ముడిపడి ఉంటాయని నాకు సౌపర్ణిక సోదాహరణంగా వివరించింది. నిశ్శబ్దంగా నేను నది చెప్పేవన్నీ వింటాను. ఆమె నాలా ఒక చోటనే ఉండేది కాదు కదా! తన ఒడ్డున నాలాంటి ఎన్ని వటవృక్షాలని తాకుతూ సుదూరతీరాలని చుట్టి వస్తుందో! ఈ సౌపర్ణిక ద్వారానే నాకు నా గురించీ, నా పరివారం గురించీ, కొంత తెలిసింది. నా బెరడు, నా వేళ్ళు, నా ఆకులు, నా పువ్వులూ సమస్తమూ చాలా విలువైనవట!

సర్వరోగనివారిణివైన ఓ అర్జున వృక్షమా! నీ జాతి సీత అభిమానాన్ని చూరగొన్నది తెలుసా! అని ఏమేమో మాటలాడి నన్ను మెచ్చుకొనేది. ముచ్చటలు చెప్పే వేళ సౌపర్ణికని చూడటం నాకు ఎంతో ఇష్టం! నా దాహార్తిని తీర్చే తల్లి ఆమె! నా వేళ్ళకి బలాన్నిస్తూ భూమి లోలోతుల దాకా నన్ను విస్తరింపజేసి నన్ను మహోన్నతంగా తీర్చిదిద్దిన గురువు ఆమె! నా జీవన సంస్కారాలన్నీ ఆ ఏటి గట్టునే ఆశ్రయించాయి!

శరత్కాలం సాయంత్రాలలో చిరుచలితో గాలి నా మీదనించి సాగి నా పర్ణాలని రాల్చి సౌపర్ణికా తరంగాలలో డోలలాడిస్తుంది. నన్ను వీడినా నా ఆకులు దుఃఖపడవు. ఆ ఆలల మీది నించి సాగి నవ్వుతూ కనుమరుగౌతాయి. మలిసంధ్యలో చంద్రుడు ఉదయించగానే, ఆ తెలికిరణాలు నది నీళ్ళపై పడినప్పుడు ఆమె శరీరం మెరిసే మెరుపుని నేను ఏమని వర్ణించనూ? ధగధగమంటూ ఆమె జలాంగాలు ఏమేమి హొయలు పోతాయో నేను ఏ రంగుల్లో చూపించనూ?

నేను సౌపర్ణిక సౌందర్యం లోని సహస్ర ముఖాలనీ చూసిన దాన్ని! వివిధ రుతువులలో అది పరవళ్ళు తొక్కినప్పుడు సన్నమై చిక్కినప్పుడు ఆమెని సదా గమనించిన దాన్ని! నా ఆకుల నించి ఏకధాటిగా జారే వర్షధార నమస్కారం చేస్తున్నట్లుగా సౌపర్ణికలో కలిసినప్పుడు అక్కడ లేచే నీటిబుడగలని పైనించి పరవశంతో నేనే కదా చూసిందీ! కరిమబ్బులు ఏనుగులకీ మల్లే నదిపై ఘీంకరించి గర్జించి ఘోషించి వర్షించినప్పుడు మాత్రం సౌపర్ణిక గలగలమనేదే గాని బెదిరేదా?

శరత్కాలం దాటి మెల్లగా పూల సరాగాలు మొదలై, సౌరభాలతో వనమంతా పండగ చేసుకుంటున్నప్పుడు, కొమ్మకొమ్మ మీద వాలి పిట్టలు కుహూరాగాలు తీసేవి. వరగోగు, అశోకం, పనస, మామిడి, పునుగు, సంపెంగ చెట్ల మీద పురుగు లేరుకుందుకని వచ్చి వాటి చిరుతిండి పూర్తయ్యాక, రెట్టించిన ఉత్సాహంతో కూసే ఉల్లి పిచుకలు, మైనాలు, రామచిలుకలు, పావురాలు, వడ్రంగి పిట్టలు – ఇలా ఎన్నో! ఒక బుల్‌బుల్ తన రాగంతో సౌపర్ణికలో జలతరంగిణులని మ్రోయించేది. ఇదిగో నేను వీటన్నింటికీ ప్రత్యక్ష సాక్షిని! వీటి గీతాలకు నేను మొదటి శ్రోతని! నేను వీటన్నింటి సహజాతని! నేను అర్జునని!

సంతోషాలనే కాదు కటిక దుఃఖాలని సైతం నేను చూడక తప్పలేదు. చాలా బలమైన, చాలా ఎత్తైన నా రూపం ఆకర్షణీయమైనది. వెండి రజను పూసుకున్నట్టు ఉండే నా కాండం, తెల్లటి నా పూగుత్తులు, చిక్కటి నా ఆకులు, నదిలోకి వాలిన నా కొమ్మలు, ఇలా నా స్వరూపం ఆహ్లాదంగా కనిపించేది. నా వేళ్ళ మధ్య మొలిచిన పచ్చిక మీద పడుకుని కోయ యువతులు పాటలు పాడుకునేవాళ్ళు! వారి కలలన్నీ నాకు చెప్పుకునేవారు. సూర్యుని నీరెండలోని అరుణిమ కరిగే లోపుగా, తూర్పున పౌర్ణమి చంద్రుడు ఉదయించే దృశ్యాన్ని చూస్తూ వారు పరవశించి పోయేవారు. ఒక పడుచు, ఒక పడుచువాడు నా కాండాన్ని ఆనుకుని నిలబడి కౌగిలించుకుని నా చుట్టూ తిరిగి కేరింతలు కొడుతూ కలిసి ఉండేవారు. వారెంత సంతోషంగా ఉండేవారో! విధి పరిహసించినట్టు పాము కరిచి ఒకనాడు ఆ పడుచువాడు మట్టిలో కలిసిపోయాడు. ఆ దుఃఖాన్ని స్వీకరించలేని ఆ యువతి నా ముందే నింపాదిగా నడిచి సౌపర్ణికలో కలిసిపోయింది. ఆమెను ఎలా ఆపగలనో తెలియక, చాతకాక, ఆమెను రక్షించలేక కదలలేని నా స్థితికి తొలిసారిగా నన్ను నేను నిందించుకున్నాను. ఆనాటి నా బాధ వర్ణనాతీతమైనది! అటు తరవాత ఏ జంటను చూచినా, ఏ కిలకిలలని ఆలకించినా జీవితాన్నించి అంత హఠాత్తుగా మృత్యువు లోకి జారిపోయిన ఆ పడుచు జంటే నాకు గుర్తుకొస్తుంది! నన్ను చుట్టి దోబూచులాడిన వారి చేతుల స్పర్శ ఇంకా నా బెరడుని నిండి ఉంది.

ఏయే దారులంట మళ్ళాలో తెలియని ఎన్నో జీవులు గతి తప్పడం నన్ను అయోమయ పరిచేది. గతి ఏమిటని నేను నదిని అడిగాను. ప్రవహించడం మాత్రమే నాకు తెలిసిన విషయం అంది సౌపర్ణిక. గతి ఎవరని మేము శూన్యాన్ని అడిగాము. చుక్కల్ని అడిగాము. సూర్యచంద్రుల్ని అడిగాము. జననమేమిటీ? మరణమేమిటీ? జీవనమేమిటీ? అని మేము చరాచరాల్నీ అడిగాము. వాటికి కూడా భ్రమణం తప్ప మరింక ఏ గతీ తెలియవని అన్నాయి. ఉన్నచోటనే పుట్టినదాదిగా నిలిచిన నాకేం తెలుస్తుంది భ్రమణం ఎలా ఉంటుందో? భ్రమణాన్ని గురించిన ఊహ చేసినప్పుడు నాకు ఎక్కడినుంచో వచ్చి, ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళిపోయే నారాయణ పక్షులే ఎదురొచ్చేవి.

కార్చిచ్చు ఒకసారి నలుదిక్కులనించీ నన్ను కమ్మేసింది. ఆ దావానలంలో నా తరవాత పుట్టి పెరిగిన ఎన్నో వట వృక్షాలు బూడిదయ్యాయి. నేను వాటితో కలిసి కాలిపోకుండా ఇంకా ఇలా చల్లగా నిలబడి ఉన్నానంటే అందుకు ఈ నదే కారణం. సౌపర్ణిక అలల దాకా రాలేని మంటలు నన్ను తాకకుండానే చల్లారి పోయాయి. నా ముందు భస్మరాశులైన వనాలు. ఆ దృశ్యాలన్నింటికీ నేను మౌనసాక్షిని. ఆవేళ చిన్ని చిన్ని పిట్టలు తమ గూళ్ళతో సహా అగ్నిలో కరిగిపోయాయి. దుర్భరవేదనతో మిగిలిన కొన్ని చెట్లు, మ్రోడైన తమవారిని చూస్తూ బావురుమన్నాయి.

కానీ నేను చూస్తుండగానే ఆ బూడిద రాశులలోంచే మళ్ళీ నవపల్లవాలు తలలెత్తాయి. వనమంతా చిగురించింది. క్రమంగా కొమ్మలన్నీ పూలతో కళకళలాడాయి. పూదేనె కోసం తుమ్మెదలు ఎగిరెగిరి వచ్చాయి. వాటి ఝంకారాలతో నా ఆకులు గింగురుమన్నాయి. పురుగుల కోసం నెమ్మదిగా పిట్టలూ వచ్చాయి. మళ్ళీ చెట్ల మధ్య ప్రాణస్పందన పరుగులెత్తింది.

జీవితమంటే ఇదేనంది సౌపర్ణిక. ఆమె తరంగాలలో అనేకానేక చరిత్రలు కదలాడేవి. కాలాలు దాటి తాను చూసిన అనేక దృశ్యాలని ఆమె నాకు కథలుగా వివరించి చెప్పేది. యుద్ధాలలో తలలు నరికిన చక్రవర్తులు తమ కత్తులని కడిగి ఆమె జలాలని ఎరుపు చేసిన గాధలు విన్నప్పుడు, నరజాతిలోని క్రూరతని తలుచుకుని నా బెరడు పట్లు చిట్లేవి. భక్తితో నరమానవులు పూలు వదిలి, దీపాలు వదిలి, పుణ్య స్నానాలు చేసి, తర్పణాలు వదిలి తామెంతో పునీతమైనట్టు భావించినప్పుడు, ఆమె సలిలాలలో ఉన్న మార్మికత నన్ను అబ్బురపరిచేది. పులికీ లేడికీ సమానంగానే దాహార్తిని తీర్చే ఆమె, తాను ప్రవహించినంత మేరా పచ్చదనాలని పోషించే ఆమె, ఎందరి జీవితాలకి ఆలంబన అయ్యిందో తలుచుకుంటూ ఆమె ఒడిలోనే నేను జననమొందినందుకు సంతోషంతో నా పూలను ఆమెపై రాశి పోసేదాన్ని! అలా నదిలో నా నిత్య వారుణము కొనసాగేది.

సౌపర్ణికని ఆనుకుని ఉన్న మహేంద్రగిరి మీద నా సాటి వృక్షజాతులు ఎన్నో! అనవరతమైన వేగము కల్గినది సౌపర్ణిక. ఆమెలో ఆ మహేంద్రగిరి పైని సెలయేళ్ళు దూకుతూ వచ్చి కలిసే దృశ్యాలు అతి మనోజ్ఞమైనవి. మహేంద్రగిరి మెడలో నక్షత్రమాలలా అని వెన్నెల్లో మెరిసేవి.

నా చుట్టూ ఎంత చైతన్యాన్ని వీక్షించానో నేను ఈ వందల యేళ్ళుగా! పిట్టల కలకూజితాలనించి, తుమ్మెదల ఝంకారాలనించి. నక్కల ఊళలు, గోవుల అంబారవాలు, సింహాల గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు, ఆనందస్వరాలు, వేదనారవాలు ఎన్నెన్ని ధ్వనిప్రమాణ ప్రతిస్పందనలని విన్నానో! పుట్టి నశించిన వాటిని చూశాను. పునర్భవించడాన్ని చూశాను. పగటి వెలుగుల్ని సూర్యుని పాలన కింద పలు వర్ణాల ప్రసారాన్నీ చీకటి తళుకునీ చూశాను. ఎన్నెన్ని ఋతువులు నా నిండు జీవితంలో వేనవేలుగా వచ్చి పోయాయో. ఇన్నేళ్ళుగా నది ప్రయాణిస్తోంది. ఇన్నేళ్ళుగా నేనూ కొనసాగుతూనే ఉన్నాను.

ఈ సౌపర్ణిక మాత్రం! పరీవాహ ప్రాంతం అదే అయినా ఎక్కడెక్కడి జలరాశులనో తనలో కలుపుకుంటూ, ఎన్నెన్నో తీరాలని తాకుతూ అనాదిగా ప్రయాణించడం లేదూ?! అవును ప్రయాణమే! నిరంతర చలనమే! అవిరామ గమనమే! ప్రయాణమే జీవితం. నదికైనా నాకైనా పిట్టకైనా పులికైనా!

ప్రతిరోజూ నా కొమ్మనించి ఆకులని సౌపర్ణికలో రాల్చి సూర్యునికి అర్ఘ్యమిడటం నా నిత్యకృత్యం ఇన్ని వందల ఏళ్ళుగా! సౌపర్ణికకి ఆవలి దిక్కున పొలం దున్నుకునే రైతు దంపతులు కూడా ఆ పొడిచే తొలి పొద్దుకీ పంట నిచ్చే మట్టికీ రోజూ మొక్కడం నేను గమనించాను. పిట్టలన్నీ తెలవారక ముందే లేచి తూరుపు దిక్కుకి దూసుకు వెళ్ళేది సూర్యునికి అంజలి ఘటించడానికేనని నాతో చెప్పినప్పుడు నేనెంతో విస్తుపోయేను. తన ఒక్క తేజంతో ఒక్క కిరణ స్పర్శతో ఈ భువనాన్ని ప్రభావితం చేసే ఆ ఎండదొర ఎన్ని లక్షల జీవరాశులని పోషిస్తున్నాడు, జీవన ప్రయాణంలో వెన్ను తట్టి కొనసాగమని జఠరాగ్నిని మండించి ఎలా ప్రోత్సహిస్తున్నాడు అనుకుని సృష్టి విన్యాసానికి ప్రణామం చేశాను.

సాయం సంధ్యలో మహేంద్రగిరి మాటున కనుమరుగవుతూ, అడవిచెట్ల కొనకొమ్మలపై తన నీరెండ కాంతితో సూర్యుడు తన సందేశాన్ని రాసినప్పుడు, వాటిని అందుకుని వెలుగుతూ వనాలూ, మేఘాలూ, నదీ జలాలూ, నమ్మకంతో మరో ఉదయం కోసం ఎదురు చూసేవి. ఆకులన్నీ హేమంతంలో రంగులు మారుతున్నప్పుడు ఆకాశం లోని హరివిల్లు తన లోని రంగులని నలుదిక్కులా విరజిమ్మి ఆకులపై వాలి విశ్రమించేనా? అన్నట్లుండేది. దూరంగా పల్లెల లోంచి విరబూసిన పూలవాసనలు గాలి ద్వారా తేలి వచ్చి మమ్మల్ని ఆక్రమించేవి. సృష్టిలో ఎంత హాయి ఉందో అనిపించి సంతోషంతో మా చెట్టూ పుట్టా సంభాషించుకున్న రోజులు ఎన్నో!

దూరాన ఉన్న మహేంద్రగిరి మీది కోవెలకి నరులు బారులు తీరి పోయేవారు. వారంతా సౌపర్ణికలో స్నానమాడేవారు. రథసప్తమి రోజున స్నానం చేస్తూ సూర్యునికి నమస్కారం చేస్తూ ఎందరెందరో స్త్రీలు నదిలో మునిగినప్పుడు, నది కెరటాలపై హొయలుగా కదిలే వారి నీలకుంతలాలు నన్ను ఆకర్శించేవి. నేను తదేకదీక్షతో వారినే గమనించేదానిని! అప్పుడప్పుడు వారంతా ప్రేమగా నన్ను తాకి, నాకింత పసుపు రాసి పూలుంచి నా ముందర, నా చుట్టూ తిరిగి నాకు మొక్కేవారు. వారి వారి కోరికలేమిటో నాకు తెలియకపోయినా వారి బ్రతుకు సంతోషంగా ఉండాలని నేను నా కొమ్మల మునివేళ్ళతో వారి శిరస్సులని తాకి ఆశీర్వదించేదానిని. వారంతా “స్వామీ! శ్రీమన్నారాయణా! రక్షించు తండ్రీ!” అంటూ ఎలుగెత్తి దేవుని కొలిచేవారు.

‘రక్షించమనే’ మాట నాకెంతో ప్రియంగా అన్పించేది. ఎన్ని సంఘర్షణల మధ్య సైతం భయవిహ్వలులు కాకుండా ఒక స్థిరచిత్తంతో గెలుపునీ ఓటమినీ స్వీకరించడానికి మన వెన్నంటి ఒక సృష్టికర్త ఉన్నాడన్న భావం నాకు ఎంతో బాగుండేది! ఎవరికో ఒకరికి నివేదించుకోవాలి కద అంతరంగాన్ని! బతుకులోని కష్టసుఖాల్ని! ఆకలిని! ఆగామి కాలంలోని ఆశలని, ఆలోచనల వలయాన్ని, విహ్వలాన్నీ!

ఆకలిని గురించి నాలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, దాని ఉనికి లోని మంచి చెడులని గురించిన ఊగిసలాటలు సదా మనసుని ముసురుకుని బాధించేవి. అలా జరగడానికి అనేకమైన కారణాలు! పాము నా కొమ్మల సందుల్లోంచి జరజరా పాకుతూ పైకి వెళుతుంది. నాకు తెలుసు అది అటుగా ఎందుకని వెళుతుందో! చిన్ని పక్షికూనలు ఇంకా కళ్ళూ తెరవనివి, రెక్క మొలవనివి గూటిలో ఉంటాయి. తల్లి పక్షి చేపల కోసం నది వైపు వెళ్ళే సమయాలు చూసుకుని ఆ చిన్ని కూనలని మింగడానికి దొంగచాటుగా వస్తుంది పాము. ఇలా ఒక గూటిలోంచి మరో గూటి వైపుగా అది సాగి అక్కడి పసి కూనలని కూడా తినిపోతుంది. వెనక్కివచ్చి ఖాళీగా మిగిలిన తమ గూళ్ళని చూసి వ్యధతో అరిచే తల్లిపక్షుల రోదన నన్ను భయపెట్టేది. ఎక్కడినుంచో వచ్చి నా కొమ్మల నాశ్రయించి నన్ను నమ్మి గూడు కట్టుకున్న ఆ పక్షి సంసారాన్ని రక్షించవలసిన బాధ్యత నాదేనని నేను అనుకునేదాన్ని! పాము మరో గూటివైపు వెళ్ళకముందే ఒక్క ఉదుటున కోపంలో కొమ్మల్ని విదిలిస్తాను. ఒక్కోసారి పాము కిందికి పడిపోతుంది. ఒక్కోసారి పడదు. ఇదొక నిత్యఘర్షణ మా మధ్య. నా కొమ్మలీ ఘర్షణలో విరిగి పోతుంటాయి. నా కొమ్మలెన్ని విరిగిపడినా సరే. నేను నారాయణ పక్షుల నమ్మకాన్ని మాత్రం విరగనివ్వను అని అనుకుంటాను.

రాత్రిలో క్రూరమృగాలు వేటాడి నేలని రక్తపు చిత్తడి చేసేవి. సౌపర్ణికకి వచ్చిన వరదలు, అందులో కొట్టుకుపోయిన ఎన్నో కళేబరాలూ, ఇలా ఆనేకరకాలుగా విధ్వంసాన్ని నేను చూశాను. విధ్వంసం గురించిన ఆలోచన వచ్చినప్పుడు మాత్రం వీటన్నింటికన్నా నాకు ముందుగా నారాయణ పక్షుల కూనలని తినడానికి నామీదికి ఎగబాకే పామే నాకు స్ఫురణకు వస్తుంది. పాము పక్షిపిల్లల్నే ఎందుకు తినాలని నాకు అన్పించేది. ఆ దృశ్యం నన్ను సదా కలచివేసినది కావడం వల్లనే! కానీ ఆకలి చాలా ముఖ్యమైనది మరి! ఆకలి ముందు ఇతర స్పందనలన్నీ చిన్నవే అయిపోక తప్పదని నాకు అర్ధమయ్యింది. ఆకలే జీవ చైతన్యానికి ప్రతీక! ఆకలన్నదే లేకపోతే ఈ జగత్తు ఎలా ఉండేదో! అన్న ఊహకి స్పష్టమైన దృశ్యం నాకు కన్పించేది కాదు. కానీ ఆలోచనలన్నింటి తరవాత ఆకలి అన్నది సృష్టిలో తప్పక ఉండవలసిందేనని సారాంశంగా నేను స్వీకరించాను. ఆకలే లేకపోతే ఆ ఎగిరే చిన్నిపిట్ట నా చెంతకి రాదు. ఆ నారాయణ పక్షులూ నన్ను వెతుక్కుంటూ రావు. నన్ను ఆశ్రయించి నా కొమ్మల్లో గూళ్ళు కట్టి పిల్లల్ని పొదగవు. సౌపర్ణికలో చేపలని వేటాడి తమ సంతానానికి తిండిని అందించవు. ఇదే సృష్టి నియతి.

ఆకలే లేకపోతే ఆ రైతు దంపతులు మట్టిని పెళ్ళగించి విత్తులని నాటరే! మందలు మందలుగా లేళ్ళూ, గుంపులు గుంపులుగా చేపలూ, అడివినిండా, నదినిండా నిండిపోతాయా?! నిలబడిపోతాయా?! ప్రయాణం అలా ఆగిపోతుందా?! సృష్టి స్తంభించిపోతుందా?! అన్న ఊహకి అంత దిట్టమైన నా వెన్నులోనే వణుకు పుడుతుంది. ఋతు ఆవృతమూ, అలాగే సౌపర్ణికా ప్రవాహమూ కూడా ఆగిపోతాయని నాలో సందేహం మొలిచింది. ఆ ఊహని భరించలేక భయంతో ఆవేళ నాకు అవసరమైన దానికన్నా మించి మరింత మరింతగా నేను సూర్యరశ్మిని భోజనం చేశాను. నెమ్మదిగా నా భయాన్ని నేనే తొలగించుకున్నాను. తలదించి సౌపర్ణికని చూశాను. నిర్నిమిత్తంగా నది సాగిపోతూనే ఉంది. ఈ ‘నిమిత్తమనే’ దానిని ఎవరైనా విశదీకరిస్తే ఎంత బాగుండునూ?! సమస్త రోగ నివారిణిగా ఈ సృష్టి నన్ను ఎందుకని కల్పించిందో? నాకెందుకీ సౌపర్ణికా జలస్పర్శ లభించిందో?! ఆ ప్రచండభానుడు తన కిరణాల ద్వారా నాకు ఆహారాన్ని ఎందుకని అనుగ్రహిస్తున్నాడో? ఎందుకని నేను ఇంత ఉన్నతంగా, ఇంత విశాలంగా, ఇంత హరితమయంగా విస్తరించి ఈ సృష్టి సంఘటనలకి సాక్షీభూతమయ్యానో? వీటన్నింటికీ ఏ నిమిత్తమో ఎవరు చెప్పగలిగినవారు?

ప్రతి జీవికీ ఒక నిత్యకర్మని ప్రసాదిస్తున్న సృష్టి తప్ప నిమిత్తమన్నది ఏదీ లేదు. దాని ఆజ్ఞని తలదాల్చటమే బ్రతకటం అంటే అనుకున్నాను అర్జునగా నేను. నా కారణాన్ని నేను ఇలా నిర్వచించుకున్నాను. ఆకులు రాలి ఎండినా, పచ్చగా నిండినా కూడా, నా గొంతులో మార్పు లేదు. నాలాగే నీళ్ళు లేక కృశించిన నాడూ, నీటితో నిండి పరవళ్ళు తొక్కిన నాడూ సౌపర్ణికా హృదయంలోనూ ఏ మార్పూ లేదు. ఆమెది అలజడి లేని వడి! ఆమె వేగంలో సాంద్రత ఉంటుంది! సంగీతం ఉంటుంది! మాపైనుండి ఎన్నో ఋతు ఆవృతాలు మళ్ళిపోతూనే ఉన్నాయి!

ఆకురాలు కాలం వచ్చి వెళ్ళింది! చైత్రం పలకరించింది! తాను మళ్ళిపోతూ గ్రీష్మాన్ని పిలిచింది! సౌపర్ణికలోని జలరాశి పలచనయ్యింది! దాహానికి ఓపలేక అడివంతా తల్లడిల్లింది. ఇంతలో నల్ల మబ్బులు పరుగుపరుగున వచ్చాయి! జడివానగా కురిశాయి! దాహార్తిలో తపించిన జీవాలన్నీ తెప్పరిల్లాయి! నా నిండా చినుకులు ఆకులతో కలిసి సందడి చేశాయి! ఇదుగో! మళ్ళీ ఇలా శరత్తు ఆవహించింది నన్నూ, సౌపర్ణికనీ! ఆమె తరంగాలలో ప్రతిఫలించే నీలిమబ్బులనీ, సూర్యుని పయనాన్నీ, వెన్నెల కిరణాలనీ, నక్షత్రాలనీ, నేను చూస్తూనే ఉన్నాను!

జీవనయానానికి గుర్తుగా సౌపర్ణిక సాగిపోతూనే ఉంది! నా కొమ్మల్లో నారాయణ పక్షులు ఆహారాన్ని పట్టి తెచ్చి తమ చిన్ని కూనల గొంతుల్లోకి జారవిడుస్తూనే ఉన్నాయి! కృష్ణజింకలు పులుల మూర్ఖత్వాన్ని గురించి ముచ్చటలాడుతూనే ఉన్నాయి! నేను అన్ని మార్పులని గురించి, అన్ని భయసందేహాలని గురించీ సౌపర్ణికతో సంభాషిస్తూనే ఉన్నాను. తాను చూస్తున్న దుస్సహమైన మార్పుల గురించి నాకు సౌపర్ణిక వివరిస్తూనే ఉన్నది! నేను నది ఒడ్డున నిలిచి అన్నింటీ కథలని గానం చేస్తాను! సౌపర్ణిక నాకు చలనాన్ని చూపిస్తుంది! నేను ఆమెకు స్థిరత్వాన్ని విశదీకరిస్తాను!