ఎగిరే గుర్రాలు

పొద్దున్నే ఎనిమిదయ్యింది. బల్లుల్లా రకరకాల సైజుల కారులు, పెద్దవీ, చిన్నవీ, బుల్లిబుల్లివీ! గోడమీద బల్లులు పురుగు కనిపించంగానే దబుక్కున దూకినట్టు ముందుకారు వెనకాతల కాస్త జాగా కనిపించంగానే వెనక కారులు బల్లుల్లా దూక్కుంటు పోతున్నాయి, స్టాప్‌ ఆండ్‌ గో, స్టాప్‌ ఆండ్‌ గో ట్రాఫిక్‌.

వరసగా, ఒకదాని వెనుక మరొకటి, బాంబుల్లాటి కారులు, అన్నీ రోల్స్‌ రయిస్‌ కార్లే! Jackson Towers ముందు “నో పార్కింగ్‌” అని రాసిపెట్టిన సర్కారువారి బోర్డ్‌ పక్కనే రాంగ్‌ సైడున హుందాగా ఆగుతాయి.

రోజూ సరిగ్గా ఇదే కథ. ఇదే వరస.

నల్ల టోపీ, నల్ల కోటు, తెల్ల చొక్కా, నల్ల బో టై వేసుకున్న ఆరడుల తెల్ల డ్రైవరు, తెచ్చిపెట్టుకున నవ్వుతో రోల్స్‌ తలుపు తీసి పట్టుకుంటాడు, ఆనందరావు దిగటానికి. ఆనందరావు హ్యూగో బాస్‌ సూట్‌ మీద నలిగిన ముడత ఒక్కటి కూడా కనిపించదు. అది పాత సూట్‌ అయితేగా! ఆనందరావు ఒకరోజు వేసిన సూట్‌ రెండోరోజు వేసుకోడు. కుడిచేత్తో ఎడమపక్క జుట్టు సుతారంగా సర్దుకుంటాడు. ఎడమ చేతిలో సెల్‌ ఫోన్‌ ఎడమ చెవి దగ్గిర పెడుతూ కారు దిగుతాడు. ” పదకొండున్నరకల్లా కారు పట్టుకోరా, క్లబ్‌ లో లంచ్‌ మీటింగ్‌ కి వెళ్ళాలి,” అని డ్రైవరుకి చెప్పుతాడు. వాడు, యెస్సర్‌ అంటూ పెట్టిన శాల్యూట్‌ అందుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏడుమెట్టులూ మూడు అంగల్లో దాటి, హాల్లో ఎలివేటర్‌ దగ్గరికొస్తాడు. ఒక అరడజను మందన్నా, “గుడ్‌ మార్నింగ్‌ ఏనాన్డ్‌ ” అంటూ తనకి అభివాదాలు చెప్పి, పక్కకి తప్పుకోవడం ఆనందరావుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇది రోజూ జరిగే భాగవతమే! అయితేనేం! ఆనందరావు ఆనందానికి అడ్డేలేదు. పెంట్‌ హౌస్‌ ఆఫీస్‌ కి నేరుగా పోయే ఎలివేటర్‌ బటన్‌ నొక్కి, రోలెక్స్‌ వాచ్‌ లో టైమ్‌ చూసుకుంటాడు. “డాం ఎలివేటర్స్‌,” అని చీదరించుకుంటాడు.

ఎక్కడి అనకాపల్లి, ఎక్కడి అమెరికా! తనకి తలమీద రెండు సుడులున్నాయి. తన మేనత్త మొగుడు వేళాకోళంగా అంటుండేవాడు, “ఒరేయ్‌ ఆనందం! నీకు తలమీద రెండు సుడులకీ ఇద్దరు పెళ్ళాలొస్తారురోయ్‌, అదృష్టవంతుడివి, ఫో!” అని. పెళ్ళాలసంగతి ఏమో కానీ, అదృష్టవంతుడన్నది మాత్రం నిజం. ఐదేళ్ళ క్రితం అమెరికా వస్తూనే అనుకున్నాడు, పాతికేళ్ళు నిండకముందే పది కోట్లు సంపాదించాలని. ఒక సుడి బాగా కలిసొచ్చిందన్నమాటే! తను పనిచేస్తున్న కంప్యూటర్‌ కంపెనీ షేర్లు ఇంతై, ఇంతింతై, వామనుడి మూడో పాదంలాగా, ఆకాశాన్నంటుకున్నాయి, పూర్తిగా ఒక్క సంవత్సరం కూడా కాకముందే. కుడీ యెడమా డబ్బు చేసింది, కంపెనీ. కోటీశ్వరుడయ్యాడు సంవత్సరం తిరక్కండా. అదృష్టం అల్లాగ కలిసి రావాలి, ఎవడికైనా! ఆవిడేమో బంగారంలాంటి కూతురు నిచ్చింది. ముప్ఫై యేళ్ళు రాకముందే, ఆ కంపెనీకి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు. పెంట్‌ హౌస్‌ ఆఫిసు. ఒక చిన్న కొండ. దానిమీద కట్టిన పెద్ద భవంతి ఆనందరావు ఇల్లు. ఆనందరావు ఇంటిముందు డ్రైవ్‌ వే సరిగ్గా అరమైలు పొడుగుంటుందని ఎవరన్నా పొగిడినప్పుడు, ఒక్కసారిగా ఇంకోఅడుగు పొడుగు పెరిగినట్టని పించేది. అప్పుడు ఆనందరావు పెదవుల మీద ముసిముసి నవ్వులు చూడాలేగాని ఏ భావకవీ వర్ణించలేడు. నిరుడు, వాళ్ళావిడ ఒక చక్కటి అబ్బాయిని కన్నది. అత్తగారు, మామగారూ వచ్చి ఆరు నెలలున్నారు. అల్లుడి భోగభాగ్యాలు చూసి మురిసిపోతూ అమ్మాయి అదృష్టం అని చెప్పుకోని మురిసిపోతూ, అత్తగారు తనకి, ఆవిడకీ రోజూ ఎండు మిరపకాయలతో దిష్టి తీయడం గుర్తుకు రాంగానే, ఆనందరావు పెదవులమీద చిరునవ్వు అసంకల్పిత ప్రతీకారచర్యలా వచ్చేస్తుంది.

ఊహల గుర్రాలకి కళ్ళేలు వెయ్యడం ఎవరితరం?

పొద్దున్నే తను ఆఫీసుకి వెళ్ళంగానే, ఆవిడ పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఉండే పోలిష్‌ ఆయా ని చూసుకోమని అప్పచెప్పి రెండో రోల్స్‌ లో శాక్స్‌ కి వెళ్ళి వుండాలి, ముసలి మెక్సికన్‌ డ్రైవర్‌ ని తీసుకోని. ఆ డ్రైవర్‌ మీద ఆనందరావుకి మంచి నమ్మకం. శాక్స్‌ లో షాపింగ్‌ పూర్తి చేసుకోని, ఇంటికెళ్ళి లంచ్‌ తింటుందో, లార్స్డ్‌ లో నాజూగ్గా మినిస్ట్రానీ సూప్‌ ఇటాలియన్‌ క్రాకర్లూ సేవిస్తుందో! మళ్ళీ ఆనందరావు పెదాలమీద మ్రోసారి ముసిముసి నవ్వులు ముసురుతాయి..

ఆఫీస్‌ లోకి రాగానే తన ప్రైవేట్‌ సెక్రటరీ ఏమ్జెలా, గుడ్‌ మార్నింగ్‌ ఏనాన్డ్‌ అంటుంది. ఇవ్వాళ అజెండా ఏకరువు పెట్టడం మొదలెట్టుతుంది.. జూనియర్‌ సెక్రటరీ క్రిష్టీ గుడ్‌ మార్నింగ్‌ మిష్టర్‌ ఏనాన్డ్‌ అని నవ్వుతూ కప్పులో కాపుచీనో తెచ్చి ఇస్తుంది. థంక్యూ అంటూ, ఏంజెలా చెప్పింది వింటూ, బల్ల మీద కాగితాలు సర్దుతూ, కంప్యూటర్‌ స్క్రీన్‌ కేసి చూస్తూ, ఆషభ ఐలఫల సల ధలరప బల అని రిసెప్షనిస్ట్‌ కి టెలిఫోన్‌ స్పీకర్లో ఆదేశం ఇస్తూ, కాపుచీనోలో రెండు పంచదార క్యూబులు వేసి స్పూన్‌ తో నాజూగ్గా కలిపి చప్పరిస్తూ, కుర్చీలో కూలబడతాడు, ఆనవాయితీగా! అర్జునుడు రెండు చేతులతో బాణం వేయగలడని, వాడిని సవ్య సాచి అన్నారు. అది గుర్తొచ్చి ఆనందరావు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. తనో! నాలుగు పనులు ఒక్కసారే చెయ్యగలడు. అందుకే కాబోలు, మళ్ళీ ముసిముసి నవ్వులు ముఖంమీద తాండవమాడతాయి. తనని తెలుగు కవులు ద్విసవ్యసాచి అంటారు కాబోలు. ఈ తన పాత జోక్‌ కి తనే మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు.

బల్ల మీద మెరిసిపోతున్న క్రిస్టల్‌ ఫ్రేముల్లో ఆవిడ బొమ్మ, పిల్లల బొమ్మలూనూ. ఫ్రేములని తడిమి బొమ్మలకేసి చూస్తాడు ఆనందరావు. పిల్లలిద్దరూ బంగారం బొమ్మలు. ఆవిడ జుట్టు లాగే మెత్తగా వుంటుంది వాళ్ళ జుట్టు. అమ్మాయి అంతా తన పోలికే అంటారు. అబ్బాయికి ఆవిడ పోలికలే ఎక్కువ. తండ్రిపోలికున్న అమ్మాయి అదృష్టవంతురాలంటారు. ఈ సంవత్సరం ఎండల్లో ఆవిడనీ పిల్లలనీ తీసుకొని, నిరిటినుంచీ అలా డాక్‌ లో పడి ఉన్న యాట్‌ లో St. Johns Island కి వెళ్ళాలి. ఏమయినా సరే, ఈ యేడు ఒక రెండు వారాలు యాట్‌ మీద గడపాలి. అది ఆ డాక్‌ లో వేష్ట్‌ గా పడి ఉన్నదాయిరి! I wish I had 40 hours a day! అనుకుంటాడు, ఆనందరావు. అలా అని రోజుకో వందసార్లన్నా అనుకోవడం అలవాటయ్యింది, ఆనందరావుకి. యాట్‌ కి జయంతి అని ఆవిడ పేరు నీలం రంగులో పెద్ద అక్షరాల్లో రాయించి ఆశ్చర్యపడేట్టు చెయ్యాలి. పిచ్చిది! అప్పుడు, దాని కళ్ళ నిండా నీళ్ళు నిండిపోతాయి. చీరె కొంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ వుంటే, “Don’t! Your eyes are beautiful with that soft wetness in!” అని తను అంటే ఏమంటూందో! యాట్‌ ముందు prow దగ్గిర తలంటి పోసుకున్న జుట్టు విరబోసుకొని ఆమె నిలబడివుండగా, ఆ మెత్తటి జుట్టు మీద సముద్రపునీళ్ళు జల్లుగా పడి, ఆ జల్లు నీరెండలో ముత్యాల్లా మిలమిల మెరిసి పోతూ వుంటే, “న ఝట్కో జుల్ఫ్‌ సే పానీ, ఏమోతీ టూట్‌ జాయేగీ” అని గొంతెత్తి మెత్తగా పాడితే, జయంతి సిగ్గుపడిపోతుంది. ప్రశాంతంగా రెండు వారాల పాటు ఈ బాదరబందీ వదిలించుకొని ఈ సారి తప్పకుండా హాయిగా యాట్‌ లో సెయిల్‌ చేయాలి. సముద్రపు అవతలిగట్టున సూర్యుడు అస్తమిస్తుంటే, యాట్‌ డెక్‌ మీద జయంతి నడుం చుట్టూ చెయ్యి వేసి, పిల్లలూ తనూ కూర్చొని రెప్ప వాల్చకండా ఆ సూర్యాస్తమయం చూస్తూ వుంటే, అబ్బా! పది కోట్ల ఎర్ర మందారాలు విసిరేసినట్టు ఆకాశమంతా ఎర్రగా ఎంత బాగుంటుందో!

పరిగెత్తే కోరికలకి పగ్గాలేవీ?

ఇంకొక్క రెండేళ్ళు ఓపిక పట్టాలి, అంతే! తన కంపెనీ స్టాక్‌ ఇంకో పదిరెట్లు పెరిగిపోతుంది. ఆ తరువాత రిటైర్‌ అయి, బెజవాడ మార్తాండ శాస్త్రి గారిని ఇక్కడికి రప్పించి వీణ వాయించడం నేర్చుకోవాలి. కుదరకపోతే, హుస్సేన్‌ దగ్గిరో రామారావు దగ్గిరో పెయింటింగ్‌ చెయ్యడమన్నా నేర్చుకోవాలి. చిన్నప్పుడు అమ్మ తనకి సంగీతం చెప్పిస్తే బాగుండును, అని అనుకునేది. పోనీ, మార్తాండ శాస్త్రి దగ్గిర జయంతి ఫిడేలు నేర్చుకుంటేనో! అయినా తనకి ఏది నేర్చుకోవడం ఇష్టమో? పోనీ గొంతు బాగానే వుంటుందిగదా! లలిత సంగీతం నేర్చుకుంటే ఎంతో బాగుండును.

మన మాతృదేశానికి మనం ఏదన్నా సాయం చెయ్యాలి. కంపెనీలో తన స్టాకు విలువ కనీసం నూరు కోట్లన్నా అవంగానే, మొట్ట మొదటగా అనకాపల్లి చుట్టూరా ఉన్న ప్రతి ప్రాధమిక పాఠశాలకీ ఒక లైబ్రరీ భవంతీ కట్టించాలి. ఒక్కొక్క బడికీ రెండు కంప్యూటరులన్నా ఇవ్వాలి. ఒక Mackintosh ఒక PC, నూ. తెలుగు పేపర్ల నిండా మన బొమ్మలు గుప్పించేస్తారు! ఏది ఏమయ్యేను గనక! అయినా వెధవ డబ్బు దాచుకోని ఏంచేసుకుంటాం గనక!

వాంఛల తెల్ల గుర్రాలు ఊహల రెక్కలు కట్టుకొని పరిగెత్తుతున్నాయి, ఆకాశవీధిలో!


9123, 9123. Call to 9123. This is John, your dispatcher. Pick up your passenger at O’Hare. 30 minutes. United Flight 119 from Seattle. Pick up at vestibule number three అని డిస్పాచర్‌ జాన్‌ రాక్షసుడిలా ఉరిమిన అరుపు టాక్సీ రేడియో లో వినపడంగానే, ఆనందరావుకి ఫెళ్ళున లెంపమీద కొట్టి, ఎవడో విలన్‌ ఇంచక్కటి మంచి కలల నిద్రా మధ్యలో చెరిపి పారేసి లేపినట్టనిపించింది. దబ దబ టోపీ సర్దుకోని డిస్పాచర్‌కి Ten, Four అని సమాధానం చెప్పి, టాక్సీ బండి స్టార్ట్‌ చేశాడు, మాజీ Software Engineer ఆనంద రావు. “ఈ పాసింజెర్‌ ఎవరో? తెలుగు వాడు కాకండా ఉంటే బాగుండును. పాసింజెర్‌ ని దింపి, తిరిగి వచ్చేటప్పుడు, దోవలో వాల్‌ మార్ట్‌ లో ఆగి పిల్లలకి పాలూ డయపర్లూ కొని పట్టుకెళ్ళాలి. గయ్యిమని గొంతు చించుకోని ఏడుస్తూ ఉంటారు పిల్లలూ, వాళ్ళమీద, తనమీదా విసుక్కుంటూ గొంతు చించుకుంటూ అరుస్తూ వుంటుంది ఆవిడా,” అని అనుకుంటూ తనని తనే చీదరించుకున్నాడు ఆనందరావు.

టాక్సీ ఎయిర్‌ పోర్ట్‌ వైపుకి పట్టించాడు, ఆనందరావు. పాటల టేపు మరీ పాతదేమో, పాత పాట “కాదు సుమా కల కాదు సుమా” అరిగిపోయినట్టు కీచు కీచుగా గీపెడుతోంది, టేప్‌ ప్లేయర్లో!