జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి

దాటాలా వద్దా, ఇదీ గంట నుంచీ ఆయన మనసుని తొలిచేస్తున్న ప్రశ్న. ఆయనకి కంగారుగానూ, భయంగానూ ఉంది. వేగంగా వెడుతున్న వాహనాలను నిస్సహాయంగా చూస్తూండిపోయాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగి లేదా కనీసం నెమ్మదిగా నడిపి పాదచారులను రోడ్డు దాటనివ్వాలనేది డ్రైవర్లు పాటించాల్సిన కనీస మర్యాద! కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. లెఖ్ఖ లేకుండా దూసుకు పోతున్నారు. వారికి ఆ అవసరం ఏముంది? అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులూ లేరు. క్రమశిక్షణ అనేది మనవాళ్ళకి తెలియనే తెలీదు. ప్రతీవాడూ ఇంకోకడిని దాటిపోవాలని చూసేవాడే.

ఢిల్లీలో సాధారణంగా ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు నిబంధనలను ఏ మాత్రం పాటించరు. వాళ్ళు ఓ చోట నిలబడి, వస్తూ పోతున్న వాహనాలను గమనిస్తూంటారు, దొరికిన మొదటి అవకాశంలోనే, పరిగెత్తి రోడ్డు దాటేస్తారు. అయితే ఈయన విషయం వేరు. లారీలు, కార్లు, జీపులు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, ఆటోలు వేగంగా ప్రయాణిస్తున్న ఈ రోడ్డుని దాటడానికి ఆయనకి ధైర్యం సరిపోటం లేదు. ఈ మధ్యనే తన కొడుకు చనిపోయినట్లే తాను కూడా రోడ్డు దాటుతూ ఏ లారీ కిందో పడి చనిపోతానని ఆయన భయం. తనకున్న బరువు బాధ్యతల గురించి ఆయనకి బాగా తెలుసు, ఇలా అర్థాంతరంగా చచ్చిపోవాలని కోరుకోవడం లేదు.

తన సొంత ఊరులో… తను ఉండొచ్చిన ప్రాంతంలో… ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే… తప్పని సరై వదిలిపెట్టి వచ్చిన ప్రాంతంలో ఇలా రోడ్ల మీద నలుపు తెలుపు చారల జాడే ఉండేది కాదు. ఆ జిల్లా మొత్తంలో కొన్ని చోట్లలోనే జీబ్రా క్రాసింగ్‌లు ఉండేవి. వాటి వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ ఉండేది కాదు, కేవలం అవి సంపన్నుల ప్రాంతాలు అని మాత్రం తెలియజేసేవి. ఏ రోడ్డునైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా హాయిగా దాటగలిగేవారు. పాదచారులెవరైనా రోడ్డు దాటుతుంటే డ్రైవర్లు ఒకళ్ళు చెప్పక్కర లేకుండానే బండ్లను నెమ్మదిగా నడిపేవారు లేదా వాళ్ళు రోడ్డు దాటేదాకా ఆగిపోయేవారు. అయితే పెద్ద పెద్ద నగరాలలో ఈ నలుపు తెలుపు చారలు — ఎంత రద్దీగా ఉన్న రోడ్డునైనా దాటేందుకు — పాదచారులకు ఆహ్వానం లాంటివి, తాము సురక్షితంగా అవతలి వైపుకి చేరగలం అనే భరోసా కల్పిస్తాయవి. ఈ చారల మీద నడుస్తూ ఎవరైనా పాదచారులు కనిపిస్తే, తమ బండిని ఆపడం ప్రతీ వాహనచాలకుడి విధి, బాధ్యత కూడా.

“విధి! బాధ్యత! అయ్యో దేవుడా!” అనుకున్నాడు. ఆయన ఆలోచనల్లో విసుగుదల, తీక్షణత ఉన్నాయి. “విధి గురించి బాధ్యత గురించి ఎవడికి పట్టింది? ప్రతీవాడు తోటివాళ్ళని ఎలాగైనా దాటిపోవాలని చూసేవాడే. ఒకరిద్దరు పోయినా, పోయేదేం లేదు… ఎందుకంటే ఇంతమందున్న ఈ దేశంలో మనిషి ప్రాణానికి విలువ అంతగా లేదు.”

ఆ క్షణంలోనే ఓ మెర్సిడెస్ బెంజ్ ఆయనకి అతి దగ్గరగా దూసుకుపోయింది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినందుకు, గబుక్కున తన కాళ్ళను వెనక్కి లాక్కున్నాడు. మొన్నమొన్ననే చనిపోయిన తన కొడుకు గుర్తొచ్చాడతనికి. వాళ్ళ కొడుకు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా, వేగంగా వస్తున్న ట్రక్ గుద్దుకొని చనిపోయాడు. రాత్రంతా శవం నడిరోడ్డు మీద రక్తం మడుగులో పడి వుంది. తెల్లారాక గానీ దాన్ని ఎవరూ గమనించలేదు. గుర్తు తెలియని డ్రైవరుపై పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారు. చివరికి ఈ కేసుని అన్‌ట్రేసబుల్ కేసుగా మార్చి మూసేశారు. గట్టిగా నిజాయితీగా ప్రయత్నిస్తే ఈ కేసుని పరిష్కరించడం వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు, కానీ అదనపు బాధ్యతని మోయడానికి వాళ్ళిష్టపడలేదు. తాము ఇప్పటికే వి.ఐ.పి ముద్రలున్న కేసుల పనితో సతమత మవుతున్నామనీ, ఇదొక అనామకపు బరువనీ పోలీసుల భావన. చనిపోయిన కుర్రాడి చొక్కా జేబులో అతడి వివరాలున్న ఓ చిన్న డైరీ దొరికింది. దాని సాయంతో అతని ఇంటి జాడ తెలుసుకుని శవాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. లేకపోతే, అది ఒక అనాథ శవంగా పారేసి చేతులు దులుపుకొనేవారే.

ఇల్లు! అతుకుల బొంత కాన్వాసు టెంటు, అయిదుగురు మనుషులు ముడుచుకుని రోజులు గడిపే ఆ టెంటుని ఇల్లు అని పిలవచ్చా? ఇల్లంటే… తాము అనంత్‌నాగ్‌లో వదిలి వచ్చినది. అది మూడంతస్తుల భవనం… దాని పునాదులు మంచి పేరున్న గని నుంచి తెచ్చిన పచ్చని రాళ్ళతో వేసినవి; గోడలు అత్యంత నాణ్యమైన ఇటుకలతో కట్టినవి; ఇంటి పైకప్పు దూలాలు, తలుపులు, కిటికీలు దేవదారు కలపతో చేసినవి. కురిసిన మంచు జారిపోయేలా పై అంతస్తు పై కప్పుగా ఇనుప ఏటవాలు రేకులుండేవి. భవనం చుట్టూ ఆకుపచ్చని పచ్చిక బీళ్ళు, కనుచూపు మేర ఎగువన ఉన్న కొండచరియల వరకు వరిపొలాలు ఉండేవి. ఇంటి గుమ్మానికి దగ్గరలో, ఓ అందమైన అక్రోటు చెట్టు కింద ఓ పెద్ద రాతి రోలు ఉండేది. వేసవి కాలంలో ఇంటి ఆడవాళ్ళు కావల్సినప్పుడు ధాన్యం, ఎండు మిరపకాయలు, ఇంకా ఇతర మసాలాలు దంచుకునేందుకు వీలుగా దగ్గర్లో ఉన్న పశువుల చావడి వద్ద నాలుగు అడుగుల చెక్క రోకళ్ళు ఉండేవి. ఇలా ఏవైనా దంచుతున్నప్పుడు వాళ్ళు పాడే కాశ్మీరీ పాటలు వినపడుతుండేవి. ఇంటి వెనుక బాదం, రేగు, శప్తాల పండ్ల చెట్లు ఆ దారిన పోయే వారిని ఎంతగానో ఆకట్టుకునేవి. తమకు కావల్సిన ధాన్యం, అలచందలు, కూరగాయలు, పళ్ళు, బంతిపూలు వంటివాటిని బయట కొనాల్సిన అవసరమే రాలేదెన్నడూ తమకు. తాను చనిపోయేలోపు చార్‌ధామ్ యాత్ర చేయాలని అతనికి కోరికగా ఉండేది, కానీ ఆ ప్రాంతం పట్ల పెంచుకున్న మమకారం అతనికి ఎక్కడికీ కదలనీయలేదు. ఏవో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో శ్రీనగర్‌కి వెళ్ళి రావడం తప్ప, తన అందమైన చిన్న ఊరు దాటి అతనెన్నడూ వెళ్ళలేదు. అప్పటికింకా శ్రీనగర్‌లో టాంగాలు పోయి మినీబస్‌లు, టెంపోలు, టాక్సీలు రాలేదు. అతను జీవితంలో మొదటిసారిగా రైలుని చూసింది కూడా లోయ నుంచి వలస వచ్చిన తర్వాతే.

“నేనెంత మూర్ఖుడిని, ఎందుకీ జ్ఞాపకాలు నాకిప్పుడు? ఆ ఇల్లు ఇప్పుడొక కల! చెరిగిపోయిన జ్ఞాపకం! మళ్ళీ ఎన్నడూ చూడలేను…” అంటూ తనలో తాను నవ్వుకున్నాడు. “ఊపిరాడని ఈ గుడారాన్ని వాళ్ళు ఇల్లంటారు. అనంత్‌నాగ్‌లో మా బందిలిదొడ్డి ఇంతకంటే పెద్దగా ఉండేది…”

హఠాత్తుగా ఆయనకి చనిపోయిన తన కొడుకు ముఖం గుర్తొచ్చింది. తెల్లగా, పొడుగ్గా ఉన్న ఆ అందమైన కుర్రవాడి రూపం కళ్ళముందు కదలాడింది. దేవతలు సైతం అసూయ పడేటంతటి ఎరుపు రంగు చెక్కిళ్ళు, నీలి రంగు కళ్ళు ఆ కుర్రాడివి. వాడు తెలివైన వాడు, చదువులో ముందుండేవాడు. మిగతా పిల్లలలా కాదు, చాలా సున్నితంగా ఉండేవాడు, మనసులోనూ, ప్రవర్తన లోనూ. ఈమధ్యగా తమ గతం గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి, తమకు భవిష్యత్తు అనేది ఉందో లేదో అని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. బహుశా, ఆ రోజు రోడ్డు దాటుతున్నప్పుడు కూడా ఇలాగే ఏవో ఆలోచనల్లో లీనమై పోయుంటాడు, ఫలితంగా ప్రాణం పోగొట్టుకున్నాడు.

“బాధితులలో విచారమగ్నత ఓ శాశ్వత లక్షణంగా మారిపోయింది, దీనికి తోడు మధుమేహం, రక్తపోటు! వీటి బారి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. వీటినే తమ తర్వాతి తరాలకి వారసత్వంగా ఇస్తున్నారు. పూర్తిగా అంతరించిపోయి, చరిత్రలో భాగమయ్యేవరకూ ఇది తప్పదేమో…” కొద్దిగా తల విదిలించి, ఆలోచనల నుంచి బయటపడాలని చూశాడాయన. తన ముందున్న జీబ్రా క్రాసింగ్ పై దృష్టి నిలిపాడు. భగభగ మండుతున్న ఎండలో అది ఇదివరకు లానే మెరిసిపోతోంది. కాస్త ధైర్యం తెచ్చుకుని ముందుకి అడుగేశాడు. ఇలా అడుగేశాడో లేదో ఓ మోటార్ సైకిల్ వేగంగా, దాదాపుగా అతని పాదం మీద నుంచి దూసుకుపోయింది. ఉలిక్కిపడి కాలుని వెనక్కి లాక్కున్నాడు. చేసేదేం లేక వెనకకి తిరిగాడు. బైక్ మీద వెడుతున్న వ్యక్తి బండిని కాస్త నెమ్మది చేసి, తల తిప్పి – కళ్ళు కనపడవా అంటూ ఒక బూతు తిట్టి వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితులలో రోడ్డు ఎలా దాటాలో ఆయనకి అర్థం కాలేదు.

అది జూన్ నెల. సూర్యుడు నెత్తి మీద కొచ్చాడు. ఆ రోడ్డు ఎలా దాటాలో ఆయనకి తోచడం లేదు. మండుతున్న ఎండల గురించి ఆయనని వాళ్ళ భార్యాబిడ్డలు ముందే హెచ్చరించారు, అయితే తన గ్రామీణ శరీర దారుఢ్యంపై ఆయనకి అపారమైన నమ్మకం. రేషన్ సరుకులు, తమకిచ్చే నెలభత్యం కోసం పది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాడాయన. ఇదివరకు వాళ్ళకి పదహారొందల రూపాయలొచ్చేవి. కుటుంబంలో ఇప్పుడొకడు తగ్గాడు కాబట్టి ప్రస్తుతం లభించేది పన్నెండు వందల రూపాయలే. కొడుకు ఆయనకి ఓ ఆస్తి! అతనే ఉండుంటే… రేషన్ సరుకులు, భత్యం తీసుకురావడం, కూరలు, రొట్టెలు కొనడం, తల్లిదండ్రులని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళడం, డాక్టరు రాసిన మందులు కొనుక్కురావడం లాంటి పనులన్నీ చేసేవాడు. ఇప్పుడీ భారమంతా ఆయన భుజాలపై పడింది.

ఆయన రైతు కాబట్టి, పనున్నా లేకపోయినా నెల నెలా జీతాలు పొందే ప్రభుత్వోద్యోగుల్లా కాకుండా ప్రభుత్వం ఇచ్చే పరిహారంపై ఆధారపడ్డాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అనంత్‌నాగ్‌లో ఉన్నప్పుడు ఆయన తన ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి ఉండేవాడు. వలస పోతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎటువెళ్ళారో ఆయనకి తెలియలేదు. తన కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తేగలగడం ఒక్కటే ఆయనకి ఊరట కలిగించే అంశం. తన భార్యని, కొడుకుని, ఇద్దరు టీనేజ్ కూతుర్లని తీసుకుని ఇక్కడికి వచ్చింది ఢిల్లీ రోడ్లకి కొడుకుని బలివ్వడానికని ఆయనకి తెలియదు.

“నెలకి పన్నెండొందల రూపాయలు, నెలవారీ సరుకులు, ఓ చిరుగుల గుడారం…”తనలో తాను గొణుక్కుంటూ పెదాల మీదకి ఓ బలవంతపు నవ్వు తెచ్చుకున్నాడు. “తలపైన కప్పు లేదు, నిలుచోడానికి జానెడు నేల లేదు. ఇది కాక పోషించాల్సిన మనుషులు ముగ్గురు. ఎంతటి వైపరీత్యం! ఒకప్పుడు అన్నీ సమృద్ధిగా ఉండేవి. డబ్బు, ఆహారం, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు… ఒకటేమిటి దేనికీ లోటుండేది కాదు. ఇంట్కెప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూ వుండేవారు. ప్రతిరోజూ, ఒకరిద్దరు మనుషుల కోసం ఎక్కువ అన్నం వండుతునే ఉండేవాళ్ళం. దురదృష్టం, నోటి కింత ముద్ద వెళ్ళడమే కష్టమవుతోంది. నెలభత్యం పన్నెండొందల్లోంచి రిలీఫ్ కమీషనర్ ఆఫీసులో గుమాస్తా వంద రూపాయలు నొక్కేస్తాడు. ఈ పదకొండు వందలతోనే నలుగురి కడుపులు నిండాలి, బట్టలు కొనుక్కోవాలి, పిల్లల చదువుల ఖర్చు భరించాలి. ఆవిడ చదువుకోలేదు, బయటి పనులలో దేన్లోనూ నైపుణ్యం లేదు. ఆమెకి ఏ ఉద్యోగం దొరకదు. ఇటువంటి దుఃస్థితి ఆమె అస్సలు ఊహించి ఉండదు. నాకుండిన ఒకే ఒక ఆశ నా కొడుకు – వాణ్ణేమో చదువు కూడా పూర్తికాకముందే చావు మాకు దూరం చేసింది. ఇక మిగిలింది తొమ్మిది, ఎనిమిది తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు…” ఆయన ఆలోచనలు సాగుతూనే వున్నాయి.

ఇంతలో హఠాత్తుగా, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయమని భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆయనకి. పొద్దున్న ఇంట్లోంచి బయల్దేరే ముందు ఓ తుండు గుడ్డని చల్లటి నీళ్ళలో తడిపి ఇచ్చిందామె. అదిప్పుడు ఎండిపోయి పొడిగా అయిపోయింది. కొద్దిగా తల తిప్పి కాస్త దూరంలో మంచి నీళ్ళు అమ్ముతున్న వ్యక్తిని సమయం ఎంతయిందని అడిగాడాయన.

“ఒకటింపావు…” సూటిగా వచ్చింది జవాబు. చాలా సేపట్నించి ఆయనక్కడే నిలబడి ఉండడం ఆ కొట్టతను చూస్తునే ఉన్నాడు.

“పెద్దాయనా, చాలా సేపటి నుంచి మండుటెండలో అక్కడే నిలబడ్డావ్. ఎక్కడికి వెళ్ళాలేంటి?” అని అడిగాడు.

“ఈ రోడ్డు దాటాలి, కానీ ఈ బండ్లు… నన్ను దాటనీయడం లేదు”

“నువ్విక్కడ నిలుచున్నప్పటి నుంచి ఎంతో మంది రోడ్డు దాటారు, నీకెందుకంత భయం?”

“లేదు బాబూ. రద్దీ విపరీతంగా ఉంది, బండ్లు ఎంతో వేగంగా పోతున్నాయి, నన్ను గుద్దేసినా గుద్దేస్తాయి. అప్పుడు మా కుటుంబం పరిస్థితి ఏంటి? నడిచే వాళ్ళంటే కాస్త కనికరం అయినా ఉంటే బాగుండేది. ఎవరికీ ఏమీ పట్టట్లేదు. మా ఊర్లో ఇలా ఉండదు తమ్ముడూ. ఇంతమంది జనాలు ఉండరు, బండ్లు ఇంత వేగంగానూ వెళ్ళవు. అస్సలే మాత్రం ఇలా జరగదు. మా ఊర్లో ఎవరైనా ముసలివాళ్ళు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంటే, ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళ చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తారు. నా చిన్నతనంలో నేను అలా ఎన్నో సార్లు చేశాను.”

కొట్టతని ముఖంలో ఏ భావమూ లేదు. ఈ ఊర్లో జనాలు ఎందుకింత ఉదాసీనంగా ఉన్నారు? తన ప్రశ్నకి తానే నవ్వుకున్నాడాయన. “నేనెంత మూర్ఖుడిని? ఏ ఊరిని నేను నాదనుకుంటున్నాను? ఇది నా ఊరయితే, మిట్టమధ్యాహ్నం పూట మండుటెండలో నేనిక్కడ ఏం చేస్తున్నట్లు…?”

“పెద్దాయనా, ఈ గ్లాసుడు నీళ్ళు తాగు. డబ్బులివ్వక్కరలేదులే…” అన్నాడు ఆ కొట్టతను సౌమ్యంగా చల్లని మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ.

“ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తున్నావు. నీది ఈ దేశం కాదా?”

“నేను వేరే దేశం వాడినా? ఎందుకలా అనిపించింది? కాదు తమ్ముడూ కాదు. మాదీ ఈ దేశమే. మేమూ భారతీయులమే…” అంటూ నీళ్ళు ఓ గుక్క తాగి, వీలైతే తన తుండుగుడ్డని కాస్త తడిపి ఇవ్వమన్నాడు.

ఉన్నట్లుండి హఠాత్తుగా అతని స్వరం మూగపోయింది. మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయాడు. “నాది ఈ దేశమా? దీన్ని నా దేశమని ఎలా చెప్పడం? ఈ దేశం నాకు రక్షణ కల్పించడం లేదు, ఓ ఆధారం కల్పించడం లేదు. తమ సొంత దేశంలోనే ఎవరైనా కాందిశీకులవుతారా?”

తడి తువ్వాలుని అందిస్తూ, “పెద్దాయనా, నువ్విందాక ఏదో చెప్పబోతూ ఆగిపోయావ్,” అన్నాడు కొట్టతను.

“ఏం చెప్పాలి తమ్ముడూ, చెప్పడానికి ఏమీ లేదు. నా దేశంలోనే నేను శరణార్థినయ్యాను…”

“రద్దీ తగ్గింది పెద్దాయనా, రోడ్డు దాటడానికిదే మంచి సమయం” అన్నాడు కొట్టతను.

ఆయన తల తిప్పి రోడ్డు వైపు చూశాడు. నిజంగానే ఖాళీగా ఉందిప్పుడు. బహుశా ఆఫీసులకు లంచ్ టైము కాబట్టి వాహనాల రాకపోకలకు కాస్త విరామం దొరికినట్లుంది.
ధైర్యాన్ని కూడగట్టుకుని లేచి మెల్లిగా నలుపు తెలుపు చారలపై అడుగులు వేయసాగాడు. ఓ క్షణం ఆగి తల తిప్పి, కొట్టతనికి ధన్యవాదాలు చెపుతున్నట్లుగా తలాడించి ముందుకు నడిచాడు.

ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… అడుగులు సాగాయి. రోడ్డుకి అవతలి వైపుకి చేరాడు.

ఫుట్‌పాత్ మీద ఓ క్షణం ఆగి నిట్టూర్చి, తడి తుండు గుడ్డతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని శరీరం ఇప్పుడు నిప్పుల కొలిమిలా తయారైంది. తల తిరుగుతున్నట్లైంది, కళ్ళు మసకబారినాయి. ఏమీ కనపడడం లేదు. నోటి లోంచి నురగలొస్తుండగా, మొదలు నరికిన చెట్టులా ఫుట్‌పాత్ మీద కూలబడిపోయాడు. కొట్లోంచి ఆయననే చూస్తున్న కొట్టతను ఓ చల్లనీళ్ళ సీసా తీసుకుని గబగబా పరిగెత్తుకొచ్చాడు. మూత తీసి నీళ్ళు ముఖం పైన చిలకరించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. శరీరం ఫుట్‌పాత్ పైన నిశ్చలంగా పడి ఉంది, నోట్లో నురగలు, నాడి స్పందించడం లేదు.

ఇంతలో ఆ శవం చుట్టూ జనాలు పోగయ్యారు. పోలీసులు వచ్చి శవాన్ని వాన్‌లో తీసుకువెళ్ళారు.

ఓ మాములు మరణం. ఎండలని తట్టుకోలేక మరో ముసలివాడి చావు. వాళ్ళ దృష్టిలో అంతే. వడదెబ్బ తగిలి చనిపోయిన జనాల సంఖ్య ఒకటి పెరిగింది అంతే.


దీపక్ బుద్‌కీ (Dipak Budki) సుప్రసిద్ధ ఉర్దూ రచయిత. ఆయన 1971 నుంచి రచనలు చేస్తున్నారు. ఆయన మొదటి కథ ‘సల్మా’ శ్రీనగర్ నుంచి వెలువడే హమ్‌దర్ద్ అనే దినపత్రికలో అచ్చయింది. 1976లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కి ఎంపికై దాదాపు ఇరవై సంవత్సరాలు రచనలకి దూరమయ్యారు. 1996 నుంచి మళ్ళీ రచనా వ్యాసాంగాన్ని చేపట్టారు. అనంతర కాలంలో ఆయన దాదాపుగా 60 కథలు రాశారు, అవన్నీ భారత ఉపఖండం, బ్రిటన్ మరియు ఉర్దూని చదివి అర్ధం చేసుకునే ఇతర ప్రాంతాలలో ముద్రితమయ్యాయి. ఈయన కథలు హిందీ, తెలుగు, కశ్మీరీ భాషలలోకి అనువాదమయ్యాయి. 1999లో “అధూరే చెహెరే” అనే కథా సంకలనం, 2005లో “చినార్ కే పంజే” అనే కథా సంకలనం వెలువడ్డాయి. మూడో సంకలనం “జీబ్రా క్రాసింగ్ పర్ ఖడా ఆద్మీ”. ఉర్దూ సాహిత్యంలోని సుప్రసిద్ధ రచయితలు, విమర్శకులు – సుల్తానా మెహర్, వారిస్ అల్వీ, హర్‌చరణ్ చావ్లా, సయ్యద్ జాఫర్ హష్మీ, అన్వర్ సాదీద్ వంటి లబ్దప్రతిష్టులు ఈయన రచనలని ప్రస్తుతించారు. కథలను ఎంతో నైపుణ్యంతోను, కళాత్మకంగాను అల్లుతారు దీపక్ బుద్‌కీ. ఈయన కథలు మానవ జీవితాలలోని వ్యథలని చిత్రిస్తాయి, వాటిని చదివాక పాఠకులు సమాజంలో ఎక్కడ తప్పు దొర్లుతోంది అని ఆలోచించకుండా ఉండలేరు.

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...