నిష్కృతి

“రాజీ! రెడీగా ఉన్నావా? బయలుదేరుదామా? ఎలాగో ఉన్నావెందుకు? అరెరె… కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఏమైయ్యింది? చెప్పు రాజీ.”

“నా ఉంగరం కనపడటం లేదండీ.”

“ఉంగరం కనిపించలేదా? ఏ ఉంగరం? ఎలా పోయింది?”

“కాస్త వదులుగా ఉంటేనూ, దారం చుడదామని కూర్చున్నాను. ఏదో పని మీద హడావిడిగా వంటింట్లోకి వెళ్ళినదాన్ని అది ఎక్కడ పెట్టానో మర్చి పోయాను.”

“ఇక్కడే కదా పెట్టావు?”

“అవును.”

“బైటికి ఎక్కడికీ వెళ్ళలేదుగా?”

“లేదు.”

“అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కంగారు పడకు. వెతికి చూద్దాం.”

“అన్ని చోట్లా వెతికి చూశాను.”

“ఎక్కడ కూర్చుని దారం చుట్టావు? “

“ఇక్కడే. హాల్లోనే.”

“ఉంగరానికి దారం చుడుతూ అర్జంటుగా లేచి వెళ్ళావంటే, బల్ల మీద చేతి వాటంగా ఇక్కడే ఎక్కడో పెట్టి లోపలికి వెళ్ళి ఉంటావు.”

“అవును. బల్ల మీద పెట్టినట్టే జ్ఞాపకం ఉంది.”

“మరి ఎక్కడికి పోతుంది?”

“అదేనండీ తెలియడం లేదు.”

“అప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారా?”

“లేదే?”

“అయితే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. కంగారు పడకు. రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ముందు లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మనం అనుకున్న ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి. కమాన్, బయలు దేరు మరి.”


“ఖర్మ! కసాయి దుకాణం పెట్టాల్సిన వాళ్ళంతా సినిమాలు తీయడానికి వచ్చేస్తున్నారు. ఒకటే బోర్.”

“కాస్త మెల్లిగా మాట్లాడండి.”

“వెళ్ళి పోదామా?”

“పోదాం, కాస్త ఉండండి”

“నిజంగానే మీ ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువే. ఎలాంటి సినిమా అయినా శుభం కార్డు పడేదాకా చూస్తారు. దేనినైనా తట్టుకునే హృదయం మీది.”

“అబ్బ ఊరుకోండి. మీరు చెప్పినట్టే ఒక విషయం గుర్తుకు వచ్చింది.”

“ఏమిటి?”

“ఉంగరం పెట్టి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరూ రాలేదని చెప్పాను. అది తప్పు. నేను వంటింట్లోకి వెళ్ళినప్పుడు ఎదురింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు.”

“ఎవరు?”

“గౌరి, బాబు. గౌరి వేసుకున్న గౌను కొత్తదా అని కూడా నేను అడిగాను.”

“వాళ్ళు తీసి ఉంటారని అనుకుంటున్నావా?”

“ఎందుకు తీసి ఉండకూడదు? ఆటల మధ్యలో తీసి ఉండొచ్చుగా?”

“పిల్లలు తీస్తే అక్కడే దానితో ఆడుకుంటారు. దాచి పెట్టాలన్నంతగా దాని ఖరీదు గురించి వాళ్ళకి తెలియదు రాజీ.”

“తెలియక పోయినా తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేసి ఉండొచ్చు కదా. మనం వాళ్ళని అడిగి చూస్తే?”

“ఐదేళ్ళ పాపని, మూడేళ్ళ బాబుని ఏమని అడుగుతాం? వాళ్ళింట్లో ఏమైన తప్పుగా అనుకోవచ్చు.”

“నేరుగా కాదు, లౌక్యంగా అడిగి చూడాలి.”


“పాపా! గౌరీ! ఇలా రామ్మా.”

“గుడ్ మార్నింగ్ ఆంటీ! గుడ్ మార్నింగ్ అంకుల్!”

“గుడ్ మార్నింగ్! బాబూ! గుడ్ మార్నింగ్ చెప్పవా మరి?”

“గుడ్ మార్నింగ్ అంకుల్!”

“గుడ్! ప్రొద్దున్న టిఫిన్ తిన్నారా?”

“ఊఁ.”

“ఏం తిన్నారు?”

“దోసెలు ఇడ్లీలు.”

“ఎన్ని దోసెలు? ఎన్ని ఇడ్లీలు?”

“పదిహేను దోసెలు పదిహేను ఇడ్లీలు.”

“అమ్మో! పెద్ద మనిషివే. బాబూ! నువ్వు?”

“తను కూడా పదిహేను ఇడ్లీలు, పదిహేను దోసెలు.”