“నందిని మన రాహుల్ కి చక్కటి జోడీగా ఉంటుంది. జాతకాలు కూడా బాగా కలిశాయి. అమ్మాయి కూడా మంచిరంగు, కుందనపు బొమ్మలా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ చదివి, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తోడ బుట్టిన తమ్ముడు ఒక్కడు అమెరికాలో ఉన్నాడు. తల్లి తండ్రులు ఇద్దరికీ మంచి స్టేటస్. ఇంకా ఏం కావాలి? ఒకే కూతురు. కట్న కానుకలు ఘనంగా ఇచ్చి, పెళ్ళి పెద్ద ఎత్తున జరిపిస్తారు.”
“సరేనండీ.”
“రేపు ఆదివారం. వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం. పెళ్ళిచూపులకి వస్తున్నట్లు వాళ్ళకి కబురు చేసేశాను.” గురుమూర్తి అన్నాడు.
సరోజ మౌనంగా విని ఊరుకుంది. రాహుల్‌ని ఒకసారి అడిగి వాళ్ళకి కబురు చేస్తే బాగా ఉండేది. ఈయన దగ్గర నచ్చని విషయం ఇదొక్కటే. ఎదిగిన కుర్రాడు. అతనికంటూ కొన్ని అబిప్రాయాలు ఉండొచ్చు. అడిగి తెలుసుకుంటే తప్పేముంది. రాహుల్ రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వచ్చాడు. రాగానే స్నానం చేసి వచ్చి అమ్మ పెట్టిన వేడి చపాతీలు తింటూ అమ్మ చెప్పే కబుర్లు వింటున్న రాహుల్ ముఖంలో రంగులు మారాయి, సరోజ మాటల్లో పెళ్ళి సంబంధం వివరాలు చెప్పగానే.
“ఎవరిని అడిగి రేపు వస్తున్నట్లు కబురు పంపారు?”
“ఎవరిని అడగాలిరా?” అక్కడే వున్న గురుమూర్తికి పుటుక్కున కోపం వచ్చింది.
“నాన్నా! మీరు అమ్మాయిని చూసేది నాకోసం. నన్ను అడగాలి.”
“రేపు వెళ్ళి చూడడంలో ఏమిటట తమకు ఇబ్బంది?”
సరోజ మధ్యలో కలగ చేసుకుంది. “అలాగైతే మరుసటి ఆదివారం నీకు వీలు పడుతుందా?”
“లేదమ్మా? రేపు నేను ఫ్రీగానే ఉన్నాను. కాని పెళ్ళిచూపులకి వెళ్ళనక్కర లేదు.”
“అదే, ఎందుకట?” గురుమూర్తి అడిగాడు.
“నాన్నా! చేసుకోబోయేది నేను. ఇది నా జీవితం కదా. నా పెళ్ళి విషయంలో మీరు నా అభిప్రాయాన్ని అడిగి ఉండాల్సింది.”
“నీ కోరికలు ఏమిటో? ఒక లిస్టు రాసి ఇవ్వరాదూ.”
“ఇది వెచ్చాల లిస్టు కాదు నాన్నా.”
“సరే. అయితే నువ్వు చెప్పేదేమిటి?”
“నాన్నా! నేను కొన్ని రోజుల తర్వాత చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడే చెప్పేట్టుగా మీరే నన్ను బలవంతం చేశారు. మా ఆఫీసులో నాతో పని చేస్తున్న జ్యోత్స్న అనే అమ్మాయిని ఒక ఏడాదిగా ప్రేమిస్తున్నాను.”
“మన కులానికి చెందిన అమ్మాయేనా?”
“లేదు నాన్నా. వాళ్ళు నార్త్ ఇండియన్స్. బెంగాల్ ప్రాంతం. కలకత్తాలో చదువుకుంది. అక్కడే ఉద్యోగం దొరికింది. ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చింది. నాతో సమానంగా చదువు, అదే జీతం. చూడ్డానికి బాగా ఉంటుంది. వాళ్ళ నాన్న గారు హోమ్ డిపార్ట్మెంట్. తల్లి నర్స్. మంచి కుటుంబం.”
“నార్త్ ఇండియాకి చెందిన అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావడం అసంభవం. నేను ఒప్పుకోను.” అంటూ గురుమూర్తి అక్కణ్ణుంచి విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
యుద్ధం ప్రారంభమయ్యింది. ప్రతి రోజూ ఇంట్లో గొడవ. వాదాలు, ప్రతి వాదాలు. గురుమూర్తి ఊరినుంచి తన తల్లిని, చెల్లెల్ని పిలిపించి, వాళ్ళతో ఆ సంగతి చెప్పగానే వాళ్ళు కట్టెలను ఎగదోసి నిప్పును ఇంకాస్త రాజుకునేటట్లు చేశారు. సరోజకి టెన్షన్ ఎక్కువైయ్యింది.
“ఏమిటండి? రాహుల్ మన కొడుకు. ఇది అతని పెళ్ళి విషయం. సమస్య వచ్చినా, సమాధానం ఏర్పడినా మనమధ్యనే ఉండాలి. మీ అమ్మగారిని, చెల్లెల్ని పిలిపించి ఎందుకండీ సమస్యను ఇంకా పెద్దగా చేస్తున్నారు?”
గురుమూర్తికి కోపం నసాళానికి అంటుకుంది. “వాళ్ళేమీ పరాయి మనుషులు కాదు. నాతో రక్త సంబంధం ఉన్న వాళ్ళు. వాళ్ళను చూస్తేనే నీకు పడదు. నీకన్నా, నీ కొడుకుకన్నా ముందుగా వాళ్ళు నా వాళ్ళు.”
“కాదని ఎవరు అన్నారు? మన కొడుకు విషయం అని వస్తే మీరు, నేను మాత్రమే కదా ఒక నిశ్చయానికి రావాలి.”
“ఆ జ్యోత్స్నతో రాహుల్ పెళ్ళి జరగదు గాక జరగదు. జరగనివ్వను.” గురుమూర్తి కోపం ఇంకా ఎక్కువయ్యింది.
“కన్నతండ్రే అయినా ఒక హద్దు ఉంటుందమ్మా. పిల్ల ఇష్టాయిష్టాలు తెలుసుకొని వాళ్ళను సంతోషంగా ఉంచుకునే వాళ్ళే అసలైన తల్లితండ్రులు. నువ్వొక సారి ఆ అమ్మాయిని చూడు. తరువాత నీకే తెలుస్తుంది. నీవైనా నా ప్రక్కన నిలబడమ్మా.” రాహుల్ తండ్రి మొండితనం చూసి విసిగిపోయాడు. అతను తన అభిమానాన్ని చంపుకోలేక పోతున్నాడు కూడా. సరోజ అంగీకరించింది. మరుసటి ఆదివారం రాహుల్ తల్లిని వెంటబెట్టుకొని ప్రక్కనే ఉన్న గుడికి వెళ్ళాడు. అక్కడికి జ్యోత్స్న, ఆమె తల్లితండ్రులు వచ్చారు. జ్యోత్స్న దేవతలా ఉంది. సరోజ కాళ్ళకి దండం పెట్టింది. వినయంగా మాట్లాడింది. ఆమె తల్లితండ్రులు కూడా చాలా సంస్కారంతో ప్రవర్తించారు.
“మాకు పూర్తిగా అంగీకారం. పిల్లలు ఇష్టపడ్డారు. మాకు తప్పుగా అనిపించ లేదు. మా పూర్వీకులు నార్త్ ఇండియాకి చెందిన వాళ్ళే అయినా, మేము ఇక్కడే చాలా సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇక్కడి ఆచార వ్యవహారాలు మాకు బాగా తెలుసు. పిల్లలు ఇష్టపడిన జీవితాన్ని ఇవ్వడమే కదా పెద్దవాళ్ళ కర్తవ్యం.” సరోజకు వాళ్ళు బాగా నచ్చారు. ఆమె కూడా ఒక టీచర్. ఇంకా సర్వీసులో ఉంది.
“నేను మావారితో మాట్లాడి మీకు తెలియచేస్తాను.”
“మీకు మా అమ్మాయి నచ్చిందా అమ్మా?”
“చాలా నచ్చింది. కానీ నేను మాత్రమే తీర్మానించే విషయం కాదుకదా. మాట్లాడి చూస్తాను.”
ఆరోజు రాత్రి మెల్లిగా మాటలు ప్రారంభించింది సరోజ. ఒక్కొక్క విషయంగా చెప్తూ ఉండగా, “నువ్వెందుకు నా కొడుక్కి నచ్చని పని చేయడం?” అత్తగారు సాగదీసింది.
“నా కొడుక్కి నచ్చిన పని నేను చేయాలనుకుంటున్నాను. అందులో తప్పేముంది?”
“చూశావురా? నిన్ను కించపరుస్తోంది. తన కొడుకు సంపాదిస్తున్నాడనీ దానికెంత గర్వమో చూడు. ఇక నిన్ను వదిలించుకోవాలని చూస్తోంది.”
“అత్తయ్యా! తొందరపడి లేని మాటలు కల్పించి, మీ కొడుకుని ఇంకా ఎగదోయకండి. మనవడికి ఒక మంచి జీవితం ఏర్పడుతుంటే ఏ నాన్నమ్మా కూడా అడ్డు పడినట్లు చరిత్రలో లేదు.”
“నువ్వు నోర్ముయ్! మా అమ్మ ఏమీ తప్పుగా మాట్లాడలేదు.”
“ఇదిగో చూడండి. ఆ అమ్మాయి కుటుంబం కూడా చాలా మంచిది. ఆ అమ్మాయికి అన్ని అర్హతలు ఉన్నాయి. మన పిల్లల సంతోషం మనకి ముఖ్యం. ఆ విషయం అర్థం చేసుకుని, పంతం వదిలి ఒప్పుకోండి. వాళ్ళని మన ఇంటికి రమ్మని చెబుతాను. ఒక సారి చూస్తే మీకే వాళ్ళు నచ్చుతారు.”
“మూర్తీ! తొందరపడి తల వూపెయ్యకు. ఈ సంబంధం మనకు వద్దు.”
“ఎందుకు నాన్నమ్మా? నాన్న మనస్సును ఇంకా పాడు చేస్తున్నావు?”
“నోర్మూసుకోరా! నాన్నమ్మతో మర్యాదగా మాట్లాడు.”
“నాన్నమ్మ మహాలక్ష్మిలా ఉంటే దండం పెట్టుకోవచ్చు. గూని మంధరలా నడుచుకుంటే?” గురుమూర్తి సరోజను సమీపించాడు. చెయ్యి సాచి చెంప మీద వేగంగా కొట్టాడు.
“ఎందుకు నాన్నా ఇప్పుడు అమ్మని కొట్టారు?”
“ఎదిగిన కొడుకును కొట్టలేను. అందుకే నా భార్యను కొట్టాను. ఇదిగో చూడవే! ఈ పెళ్ళి జరగదు. నా ఇష్టం లేకుండా జరిపించాలనుకుంటే నేను లేకుండా జరిపించుకో. భర్త ప్రక్కన నిలబడితేనే ఆ భార్యకి గౌరవం. అర్థం అయ్యిందా? కాదు కూడదు అని జరిపించావంటే, ఆ తర్వాత నీవు నాతో కాపురం చేయడం కుదరదు.” విసవిసా వెళ్ళి పోయాడు గురుమూర్తి.
గురుమూర్తి తల్లి ముఖం తిప్పుకొని కొడుకుని అనుసరించింది. సరోజ చెంపను పట్టుకొని అలాగే నిలబడి పోయింది. రాహుల్ తల్లి దగ్గరికి వచ్చాడు.
“నన్ను క్షమించమ్మా. ఇన్నేళ్ళ తరువాత కూడా నీవు నాన్నగారి చేతిలో దెబ్బలు తినడం నేను సహించలేను. నాకు పెళ్ళే వద్దమ్మా.”
“జ్యోత్న కన్నవాళ్ళతో రేపు ఇంకోసారి మాట్లాడి నీకు ఈవిషయంలో జవాబు చెప్తాను రాహుల్.”
మరుసటి రోజు రాహుల్, సరోజ ఇద్దరూ జ్యోత్స్న ఇంటికి వెళ్ళారు. వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. జరిగినదంతా సరోజ చెప్పింది.
“ఆయనకి పంతం ఎక్కువ. పెళ్ళికి రారు. పెద్దగా ఏర్పాట్లు చేసి పిల్లల మనస్సుని నొప్పించవద్దు. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి జరిపించితే ఏ సమస్యా ఉండదు. అలా కాకుంటే గుడిలో తాళి కట్టించి , పెళ్ళిని రిజిస్టర్ చేయించి, హోటల్ లో విందు ఇచ్చేస్తే అందరికీ హాయిగా ఉంటుంది. అమ్మ, నాన్నా అంటూ ఎవరూ రాకున్నా ఇది జరుగుతుంది కదా.”
“మీరు వస్తారు కదా అమ్మా?”
“తప్పకుండా. నా కొడుకు పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటాను? పక్కనే ఉంటాను.”
“మాకూ సమ్మతం అమ్మా.”
“వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేసేద్దాం. మిగిలిన ఏర్పాట్లన్నీ నేను, నా కొడుకు చూసుకుంటాం.”
ఆ వారం చివరిలోనే గుడిలో ఉదయం పదిగంటలకి రాహుల్ జ్యోత్స్న పెళ్ళి జరిగింది. రిజిస్ట్రార్ కార్యాలయంలో సాక్షుల సంతకంతో రిజిస్టర్ చేయించారు. సరోజ, రాహుల్, జ్యోత్స్న ముగ్గురూ కారులో బయలుదేరారు. ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ముగ్గురూ దిగారు.
“నాకు అంతా తెలుసు. లోపలికి రానక్కర లేదు. వాళ్ళకి నా ఆశీస్సులు దొరకటం కల్ల.”
“ఏమిటండీ? ఇప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఎలా?” సరోజ లోపలికి వచ్చింది.
“మూర్తీ! దీన్ని మొదట బయటికి పంపు. మొగుడిని అవమానపరిచిన దీనితో ఇంకా కాపురం చేస్తావా?”
“కాస్త ఉండండి.” సరోజ లోపలికి వెళ్ళి తయారుగా ఉంచిన సూట్‌కేస్‌తో బైటికి వచ్చింది.
“మీరు అనుమతి ఇచ్చినా ఇకమీద నేను ఈ ఇంట్లో ఉండబోవడం లేదు. ఈ వయస్సులో కూడా కొడుకు దగ్గర్నుంచి కోడలిని వేరు చేయాలని కుత్సిత బుద్ది ఉన్న మీరు తల్లి కాదు.”
గురుమూర్తి చెయ్యి మళ్ళీ పైకి లేచింది.
“ఆగండి. ఇరవై ఎనిమిదేళ్ళుగా నేనూ ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి కుటుంబాన్ని చూసుకోవడం వల్లే ఇన్ని వసతులు, సొంత ఇల్లు అన్నీ వచ్చాయి. ఆ విషయం మరిచి పోకండి. జీవితంలో నేను అన్నీ అనుభవించాను. నా కొడుకు జీవితం ఇక పైనే మొదలవుతుంది. పిల్లల న్యాయమైన కోరికలకు మారుగా నడుచుకుని, వాళ్ళ మనసును విరిచేసే తల్లితండ్రులు కన్నవాళ్ళు కాలేరు.” వెనుకకు తిరిగింది.
“ఇన్ని రోజులు నేను ఒక భార్యగా జీవించిన జీవితం చాలు నాకు. ఇక మీదట నా కొడుకు కోసం జీవించాలని అనుకుంటున్నాను. రాహుల్! పద వెళదాం.”
గంభీరంగా కారులో ఎక్కుతున్న తల్లిని అనుసరించాడు రాహుల్.
దేవిబాల (1963- )
“సాహిత్యమంటే ఎలా ఉండాలి అనే చట్రంలో నేను బిగిసిపోలేదు. నేను ఏది రాసినా అది నా పాఠకులకు చేరడం కోసమే రాశాను. టీవీలో వస్తున్న నా సీరియల్స్ అలైగళ్, నంబిక్కై అందరు ఆడవాళ్ళూ ఇష్టపడుతున్నారు. నా అభిమానులకు కుటుంబంలో సమస్యల చుట్టూ తిరిగే కథలంటే ఇష్టం. నా కథానాయికలకు కష్టాలొస్తాయి. వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు పదిమందికీ నచ్చే దారిలోనే నడుస్తున్నాను.” తమిళ పల్ప్ ఫిక్షన్ రచయితలలో పేరెన్నిక గన్న దేవిబాల కథలు, సీరియల్స్ అన్ని తమిళ పత్రికలలో ప్రచురించబడ్డాయి.