కథ: విలువలు
రచయిత: జ్యేష్ట (ఇవటూరి చిన వీర బసవరాజు)
రచనా కాలం : 1958
కథలు చదవడం మీద ఆసక్తి ఉన్న మా తరంవాళ్ళు ఎవరూ కూడా ఆ రోజుల్లో జ్యేష్ట కథలు చదవలేదని అనడం నేను వినలేదు. అప్పట్లో ఆంధ్రపత్రిక (సచిత్ర వారపత్రిక) చదవని తెలుగు వాడు ఉండేవాడు కాదు. ఆంధ్రపత్రికలో కథ అచ్చయ్యింది అంటే, ఆంధ్రదేశం అంతటా ఆ కథా రచయిత పేరు తెలియాలిసిందే. చాలా చిన్న వయసులోనే చక్కని కథలు రాసిన వాడుగా పేరు సంపాదించాడు, జ్యేష్ఠ.
విలువలు కథ రాసేటప్పటికి, జ్యేష్ట వయస్సు 19 ఏళ్ళు. జ్యేష్ట సుమారు 75 కథలు రాశాడు. ముప్పై ఒక్క కథలు కలిపి ” జ్యేష్ట కథలు” (1992) పేరిట ఒక సంకలనం అచ్చయ్యింది, జ్యేష్ట పోయిన మరు సంవత్సరం. జ్యేష్ట యాభయ్యోపడిలో పడీపడకముందే మరణించాడు. జ్యేష్ట కథలు అనంగానే, ‘ఎర్రతేలు’ కథ చదివారా అని అడగని వాళ్ళు అరుదు. ఎందుకో ఆ కథకి అంత పాప్యులారిటీ వచ్చింది; బహుశా అందులో హాస్యం పాలు ఎక్కువ కాబట్టో, లేకపోతే అది ఒక ప్రేమకథగా అందరికీ నచ్చబట్టో, తెలీదు. జ్యేష్ట కథలు – కొన్నిట్లో, అప్పుడప్పుడు ముళ్ళపూడి వెంకట రమణ తొంగిచూస్తాడు. విలువలు కథలో రమణ కనిపించడు. బహుశా నాకు నచ్చటానికి అది ఒక కారణం కావచ్చు. అయితే, ముఖ్య కారణం మాత్రం కాదు.
క్లుప్తంగా విలువలు కథ ఇది:
కన్నయ్య, కన్నయ్య భార్య బుల్లెమ్మ, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా పెద్ద బట్టల దుకాణంలో బుల్లెమ్మకి ఓ చీరె కొందామని వస్తారు. ఆ కొట్టు, ఆ లైట్ల హడావిడి చూడంగానే కన్నయ్యకి భయంవేస్తుంది, తనని బయటికి గెంటేస్తారేమోనని! భయపడుతూ భయపడుతూ ” మా ఆడోళ్ళకి చీరెలు కొనాలండి,” అంటాడు, కొట్లో గుమాస్తాతోటి, అదేదో తప్పుచేసిన వాడిలా!
“చీరెలండి. మామూలియి. ఒద్దే అక్కర్లేదండి. ఒకటి చాలు,” అని సంజాయిషీ ఇచ్చుకోవటం, బుల్లెమ్మ తల ఆడించడం. కన్నయ్య, బుల్లెమ్మ లాంటివాళ్ళ సాంఘిక ఆర్థిక స్థితి గురించి ఏమాత్రం తెలిసినవాళ్ళకైనా ఈ వాక్యాల్లో ఉన్న వాస్తవికత, సహజత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. గుమాస్తా బోలెడు చీరెలు పడెయ్యడం, వాటి ఖరీదులు చెప్పడం, చివరకి బుల్లెమ్మ ఒక ముదురు నీలంరంగు చీర తీసుకోవడం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు రచయిత. చీర ఖరీదు కాస్త కూస్త కాదు; పదిహేనున్నర!
బుల్లెమ్మ స్నేహితులెవ్వరూ ఐదు రూపాయలకి మించి చీరె కొనలేదు. కాలం కలిసొచ్చింది. పంటలు బాగానే ఉన్నాయి. కన్నయ్య ” నీకేం బహుమతి కావాలో కోరుకోయే,” అనడం, బుల్లెమ్మ తనకి ‘అలాంటి చీర’ కావాలని మనసులో ఉండడం, అన్నీ కలిసొచ్చాయి.
ఆ చీర గురించి బుల్లెమ్మ మనసులో ఊహలు చదవాలే కాని తిరిగి చెప్పకూడదు. మంచి సైకలాజికల్ స్టడీ. రోజంతా కష్టపడే మనిషి అలాటి చీరె కట్టుకొని పనేం చేస్తూంది గనక! చీరెని భద్రంగా మడతపెట్టి పెట్టిలో పెట్టుకుంటుంది, బుల్లెమ్మ. పండక్కి కట్టుకోదు; చీరె చూసి, దాన్ని ముఖంమీద అద్దుకొని, సంతోషపడిపోతుంది. ‘చీరెకి బిస్కెట్ట్ల వాసన,’ అని మురిసిపోయేది. భద్రంగా కొయ్యపెట్లో పీటేసి ఆనందించేది బుల్లెమ్మ. ఆచీరె కట్టుకోడానికి తను తగనేమో అన్న అనుమానం కూడ వస్తుంది, బుల్లెమ్మకి. చీరెని పెట్టెలో ఉంచి, అప్పుడప్పుడు కలరా ఉండలు వేసి జాగ్రత్త చేసుకుంటుంది, మడతలు నలక్కండా!
అక్కడనుంచీ కథ చదివి దాని ముగింపు పాఠకులు ఆనందించాలి; అనుభవించాలి. ఓ-హెన్రీ కథల్లో వుండే విచిత్రమైన మలుపు — ట్విస్ట్, ఒక్కొక్క సారి నవ్వు తెప్పిస్తుంది, విషాదంలో కూడా! ఆ రోజులో వచ్చిన కథల్లో (ఇప్పటికీ బహుమతులు పొందిన చాలా కథల్లో కూడా) మనం ఊహించని మలుపు(లు) ఉండటం మామూలే.
ఆ రకమైన ట్విస్ట్ అతి చాకచక్యంగా చెప్పటం, ఆ ట్విస్ట్ మనసుని కదల్చడం, ఆ భావం గుండెకి తగలడం — ఈ కథ నాకు నచ్చటానికి ముఖ్యకారణం.
జ్యేష్ట విలువలు అచ్చైన తరువాత (1958) ఎవరిదో పెళ్ళికని ఏలూరు వచ్చాడు. అతన్ని కలవడం అదే మొదటిసారి. అప్పుడే విలువలు కథ చదివి ఉన్నానేమో, నాకు మీ ‘విలువలు’ కథ బాగా నచ్చింది, అని చెప్పాను. ఆ తరువాత, ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్న రెండు సంవత్సరాలలో బోలెడుసార్లు కలిసాను. అప్పుటికి మరికొన్ని కథలు వచ్చాయి; అయినా, విలువలు కథకి మించిన కథ ఇంకా రాలేదు, అనేవాణ్ణి. విలువలు కథ నచ్చటానికి నాకున్న పెర్సనల్ బయాస్ మాత్రం కారణం కాదు. అల్లాగని మీరు కూడా ఒప్పుకుంటారు, నాకు వత్తాసు ఇస్తారనుకుంటాను, కథ చదివిన తరువాత!