“రాజీ! రెడీగా ఉన్నావా? బయలుదేరుదామా? ఎలాగో ఉన్నావెందుకు? అరెరె… కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఏమైయ్యింది? చెప్పు రాజీ.”
“నా ఉంగరం కనపడటం లేదండీ.”
“ఉంగరం కనిపించలేదా? ఏ ఉంగరం? ఎలా పోయింది?”
“కాస్త వదులుగా ఉంటేనూ, దారం చుడదామని కూర్చున్నాను. ఏదో పని మీద హడావిడిగా వంటింట్లోకి వెళ్ళినదాన్ని అది ఎక్కడ పెట్టానో మర్చి పోయాను.”
“ఇక్కడే కదా పెట్టావు?”
“అవును.”
“బైటికి ఎక్కడికీ వెళ్ళలేదుగా?”
“లేదు.”
“అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కంగారు పడకు. వెతికి చూద్దాం.”
“అన్ని చోట్లా వెతికి చూశాను.”
“ఎక్కడ కూర్చుని దారం చుట్టావు? “
“ఇక్కడే. హాల్లోనే.”
“ఉంగరానికి దారం చుడుతూ అర్జంటుగా లేచి వెళ్ళావంటే, బల్ల మీద చేతి వాటంగా ఇక్కడే ఎక్కడో పెట్టి లోపలికి వెళ్ళి ఉంటావు.”
“అవును. బల్ల మీద పెట్టినట్టే జ్ఞాపకం ఉంది.”
“మరి ఎక్కడికి పోతుంది?”
“అదేనండీ తెలియడం లేదు.”
“అప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారా?”
“లేదే?”
“అయితే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. కంగారు పడకు. రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ముందు లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మనం అనుకున్న ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి. కమాన్, బయలు దేరు మరి.”
“ఖర్మ! కసాయి దుకాణం పెట్టాల్సిన వాళ్ళంతా సినిమాలు తీయడానికి వచ్చేస్తున్నారు. ఒకటే బోర్.”
“కాస్త మెల్లిగా మాట్లాడండి.”
“వెళ్ళి పోదామా?”
“పోదాం, కాస్త ఉండండి”
“నిజంగానే మీ ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువే. ఎలాంటి సినిమా అయినా శుభం కార్డు పడేదాకా చూస్తారు. దేనినైనా తట్టుకునే హృదయం మీది.”
“అబ్బ ఊరుకోండి. మీరు చెప్పినట్టే ఒక విషయం గుర్తుకు వచ్చింది.”
“ఏమిటి?”
“ఉంగరం పెట్టి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరూ రాలేదని చెప్పాను. అది తప్పు. నేను వంటింట్లోకి వెళ్ళినప్పుడు ఎదురింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు.”
“ఎవరు?”
“గౌరి, బాబు. గౌరి వేసుకున్న గౌను కొత్తదా అని కూడా నేను అడిగాను.”
“వాళ్ళు తీసి ఉంటారని అనుకుంటున్నావా?”
“ఎందుకు తీసి ఉండకూడదు? ఆటల మధ్యలో తీసి ఉండొచ్చుగా?”
“పిల్లలు తీస్తే అక్కడే దానితో ఆడుకుంటారు. దాచి పెట్టాలన్నంతగా దాని ఖరీదు గురించి వాళ్ళకి తెలియదు రాజీ.”
“తెలియక పోయినా తీసుకెళ్ళి వాళ్ళింట్లో పడేసి ఉండొచ్చు కదా. మనం వాళ్ళని అడిగి చూస్తే?”
“ఐదేళ్ళ పాపని, మూడేళ్ళ బాబుని ఏమని అడుగుతాం? వాళ్ళింట్లో ఏమైన తప్పుగా అనుకోవచ్చు.”
“నేరుగా కాదు, లౌక్యంగా అడిగి చూడాలి.”
“పాపా! గౌరీ! ఇలా రామ్మా.”
“గుడ్ మార్నింగ్ ఆంటీ! గుడ్ మార్నింగ్ అంకుల్!”
“గుడ్ మార్నింగ్! బాబూ! గుడ్ మార్నింగ్ చెప్పవా మరి?”
“గుడ్ మార్నింగ్ అంకుల్!”
“గుడ్! ప్రొద్దున్న టిఫిన్ తిన్నారా?”
“ఊఁ.”
“ఏం తిన్నారు?”
“దోసెలు ఇడ్లీలు.”
“ఎన్ని దోసెలు? ఎన్ని ఇడ్లీలు?”
“పదిహేను దోసెలు పదిహేను ఇడ్లీలు.”
“అమ్మో! పెద్ద మనిషివే. బాబూ! నువ్వు?”
“తను కూడా పదిహేను ఇడ్లీలు, పదిహేను దోసెలు.”
“రాజీ! వీళ్ళనా నువ్వు విచారించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు?”
“మీరు కాస్త ఊరుకోండి. గౌరీ! నిన్న నువ్వు ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చావు కదూ?”
“అవునూ!”
“ఎప్పుడు వచ్చావు?”
“నాకు గుర్తు లేదే!?”
“మధ్యాహ్నమే కదూ.”
“అవునవును! మద్యాన్నమే!”
“అప్పుడు ఇక్కడ టేబుల్ మీద ఒక ఉంగరం పెట్టాను. చూశావు కదూ.”
“ఊఁ…”
“చూశావు కదూ. ఏమండోయ్! గౌరి ఎంత మంచి పాపో తెలుసా. ఉంగరాన్ని చూసింది. అవును కదూ గౌరీ?”
“ఊఁ…”
“గుడ్, గుడ్. దాన్ని చేతిలోకి తీసుకొని చూశావు కదూ.”
“ఊఁ…”
“మరి దాన్ని ఎక్కడ పెట్టావు?”
“ఎక్కడా పెట్టలేదు.”
“పెట్టలేదా? మరి తీసి పాకెట్లో వేసుకున్నావా? పాకెట్లోనే కదూ పెట్టుకున్నావు? నిన్న తొడుక్కున్న గౌనుకి పాకెట్ కూడా ఉందిగా.”
“అవును, ఉంది.”
“అందులోనే పెట్టుకున్నావా?”
“ఊఁ…”
“మరైతే ఇప్పుడది ఎక్కడుందో చెప్పు చూద్దాం?”
“తెలీదుగా!?”
“తెలియదా? ఎవరికైనా ఇచ్చేశావా?”
“ఊఁ.”
“ఎవరికి ఇచ్చావు?”
“ఊఁ.. అమ్మకి.”
“ఏమండోయ్, చూశారా! గౌరి చాలా మంచమ్మాయి కాబట్టి ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా అమ్మకే ఇచ్చింది. కదమ్మా?”
“ఊఁ… అవును.”
“మీ ఇద్దరికీ చాక్లెట్లు ఇస్తాను. రండి.”
“ఏమండీ… ఇప్పుడు ఏం చేద్దాం?”
“ఏం చేద్దాం?”
“వాళ్ళని అడగాల్సిందే. ఒక తులం బంగారం అంటే వట్టి మాటలు కాదు.”
“చిన్నపిల్ల మాటల్ని నమ్మి ఎలా అడగమంటావు రాజీ? రేపు వాళ్ళ ముందు అడిగినప్పుడు పాప లేదే అంటే ఏం చేస్తాం? తర్వాత అనవసరంగా అనుమానించినందుకు వాళ్ళకు కోపం వస్తుంది కూడా.”
“ఇందులో తప్పేముంది? మనం అడిగినప్పుడు అవును అని చెప్పింది. అందుకే అడిగామని చెబుదాం.”
“నాకేమో కలిసి మెలిసి ఉన్నచోట కొట్లాటలొస్తాయని అనిపిస్తొంది. వాళ్ళూ మనలాగే గౌరవమైన వాళ్ళే. ఆయన కూడా ఒక ఆఫీసర్. ఒక వేళ పాప తెలియకుండా తీసుకెళ్ళి ఇచ్చినా మనల్ని పిలిచి ఇవ్వకుండా ఉంటారా?”
“అవునవును. గౌరవమైన వాళ్ళే. మీకు తెల్లనివన్నీ పాలు. ఆయన కావాలంటే ఆఫీసరుగా ఉండవచ్చు. ఆయన భార్య ఎలాంటిదో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల్ని వింటేనే గాని తెలియదు.”
“సరేలే. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు.”
“సార్! గుడ్ మార్నింగ్.”
“అరెరే… రండి సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కమలా! ఎదురింటి సార్ వచ్చారు. కాఫీ పట్రా.”
“కాఫీ వద్దండీ. ఇప్పుడే టిఫిన్ తీసుకున్నాను.”
“ఆఫీసులో హడావిడి అంతా ఎలా ఉంది?”
“దానికేం? ఎప్పటిలాగే చిరంజీవిగా ఉంది.”
“మీ పై ఆఫీసరుకి ప్రమోషన్ రాబోతున్నట్లు ఎవరో అన్నారే? నిజమేనా?”
“అనుకుంటున్నారు. ఇంకా తెలీదు. కాని ఆయన దాని కోసమే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది.”
“అలా తిరిగే మనిషే ఆయన. చెప్పండి సార్, ఏమిటి విశేషాలు?”
“ఏమీ లేదు… అంటే… ”
“విషయమేంటో చెప్పండి. ఎందుకో తటపటాయిస్తున్నట్టున్నారు?”
“అది… అది… నిన్న మా ఇంట్లో ఒక ఉంగరం పోయిందండీ.”
“ఉంగరం పోయిందా? ఏ ఉంగరం?”
“వంకీ ఉంగరం. ఒక తులం ఉంటుంది. కాస్త వదులుగా ఉందని నా మిసెస్ దారం చుట్టుతూ ఏదో అర్జంటు పని మీద టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళింది. తర్వాత కనిపించ లేదు.”
“మధ్యలో ఎవరైనా వచ్చారా?”
“పెద్ద వాళ్ళెవరూ రాలేదు. చిన్న పిల్లలు మట్టుకు ఆడుకోవడానికి వచ్చినట్లున్నారు.”
“ఎవరింటి పిల్లలు?”
“రెండు మూడు ఇళ్ళకి చెందిన పిల్లలున్నట్లున్నారు.”
“మా ఇంటి గౌరి, బాబు కూడా ఉన్నారా?”
“ఊఁ.”
“వాళ్ళని అడిగారా మరి?”
“అడిగాం.”
“ఏమన్నారు?”
“గౌరి తనే తీశానని చెప్పింది.”
“వ్వాట్! గౌరీ! గౌరీ, ఇలా రామ్మా!”
“ఏంటి డాడీ? గుడ్ మార్నింగ్ అంకుల్!”
“ఏమ్మా గౌరీ? నువ్వు నిన్న ఈ అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉంగరం తీశావా?”
“అవును డాడీ.”
“తీశావా? ఇప్పుడు అది ఎక్కడుంది? చెప్పు.”
“అమ్మకి ఇచ్చాను డాడీ.”
“ఏమిటీ? అమ్మకి ఇచ్చావా? కమలా! కమలా!”
“ఏమిటండీ? ఎందుకు పిలిచారు?”
“గౌరి చెప్పింది విన్నావా? నిన్న సార్ ఇంటికి వెళ్ళి ఆడుకుందట. అక్కడ ఉన్న ఉంగరం కనిపించకుండా పోయిందట. అడిగితే తనే తీశానని చెప్తోంది.”
“ఏమే? ఇది నిజమేనా?”
“దాన్ని నీకే ఇచ్చానని చెప్తోంది.”
“అయ్యో దేవుడా! అలా చెప్పావెందుకే?”
“అవును.”
“నా దగ్గర ఇచ్చావా?”
“అవును. నీకే ఇచ్చాను.”
“ముదనష్టపుదానా! నేరుగా నా ముఖం చూసి చెప్పు. నా కెప్పుడు ఇచ్చావే?”
“సరే, సరే. అలా అదిలించకు. అదిలిస్తే మనకి భయపడి మాట మారుస్తున్నట్లు అవుతుంది.”
“ఏమిటండీ ఈ అన్యాయం? గౌరీ! నిజమే చెప్తున్నావా? ఎవరైనా నిన్ను ఇలా చెప్పమన్నారా?”
“ఊహూఁ.”
“ఈ రోజు నీకేమయ్యిందే?”
“మిస్టర్ గణేశన్! మీరు వెళ్ళండి. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను.”
“సారీ సార్! మీ పాప అలా చెప్పి ఉండకపోతే నేను వచ్చి ఉండే వాడిని కాదు.”
“ఫరవాలేదు సార్.”
“వస్తానండీ.”
“రాజీ!”
“ఆఁ ఆఁ… వాళ్ళేమన్నారు?”
“వాళ్ళ పాప అక్కడ కూడా అదే చెప్పింది.”
“మరి? పిల్లలకి అబద్దం చెప్పడం తెలీదండీ. ఎదురింటావిడకి ఎంత దొంగ బుద్దో చూశారా? పాప తెలియకుండా తీసుకుని వచ్చినా పెద్దవాళ్ళు, ‘అయ్యో! ఇది మన వస్తువు కాదు’ అని వెంటనే తిరిగి ఇచ్చేయాలి కదా. తులం బంగారం కంట పడగానే అప్పనంగా మింగేయాలని ఆశ కలిగింది కాబోలు.”
“కాని ఆవిడ ముఖంలో కనబడిన షాక్ చూస్తే నాకు సంకటంగా అనిపించిది.”
“షాకా, పాడా! అంతా వట్టి నటన. అది సరే. ఆఖరికి ఏమని తీర్మానం చేశారు?”
“ఆయనే కబురు చేస్తానని అన్నారు.”
“మిస్టర్ గణేశన్! మీరు నమ్మినా నమ్మక పోయినా నేను ఒక నిజం చెప్తున్నాను. అలాంటి ఏ వస్తువూ నా కూతురు తీసుకొని రాలేదు. అలాగే తీసుకొని వచ్చినా, దాన్ని తీసుకుని దాచే గుణం నా భార్యకి లేదు. ఆమె గురించి నాకు బాగా తెలుసు. అదే సమయంలో మిమ్మల్ని కూడా నేను తప్పు పట్టలేను. పాపే నేనే తీశాను, అమ్మ దగ్గర ఇచ్చాను అని అన్నప్పుడు ఎవరు మాత్రం నమ్మకుండా ఉండగలరు? పిల్లల సాక్ష్యాన్ని కోర్టులో కూడా పరిగణనకి తీసుకుంటుందని అంటారు కదా. కాని ఈ విషయంలో నేను నా భార్యలాగా బెదిరి పోలేదు. దీన్లో మన ఎవరి తప్పూ లేదు. పేవ్‌మెంట్ మీద నడుస్తున్నప్పుడు కారులో వెళ్తున్న ఎవరో ఊసిన ఉమ్మి మన మీద పడితే అందులో మన తప్పెంత? ఇదంతా చెప్పటం మిమ్మల్ని వట్టి చేతులతో వెళ్ళి రండని చెప్పడానికి కాదు. ఏ విషయంలోనైనా త్వరగా ఒక తీర్మానానికి రాగలిగిన వాడిని నేను. మీకు ఆ తులం బంగారానికైన డబ్బును ఇచ్చేస్తాను.”
“సారీ సార్! నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అడిగి ఉండకూడదు.”
“నో. నో. కూర్చోండి. ఇది నేను మీ కోసం ఇవ్వడం లేదు. నా కోసమే ఇస్తున్నాను. బైబులులో ఒక వాక్యం ఉంది, ఏ కారణం లేకుండా గాయపడ్డ వాళ్ళ గురించి. ఆ స్థానంలో ఇప్పుడు మేము ఉన్నాము. ఈ డబ్బును మీరు స్వీకరిస్తే, ఆ గాయానికి కాస్త మందు వేసుకుంటున్న ఫీలింగ్ మాకు. దయ చేసి మాకు చేసే ఉపకారంగా భావించి స్వీకరించండి.”
“నో. నో. నో. నాకు మీ లాగా విషయాన్ని అనలైజ్ చేయడం తెలియదు. కాని అర్థం చేసుకోగలను. నేను మీ దగ్గరికి వచ్చి అడిగిన పాపానికే నాకు తల కొట్టేసినట్లుగా ఉంది. ఇంకా మీ దగ్గర డబ్బు తీసుకోవడమా? నో. వస్తానండీ.”
“గణేశన్! సార్! సార్!”
“రాజీ!”
“రండి. ఏ రైలుకి వచ్చారు?
“చార్మినార్లో.”
“ఊళ్ళొ అంతా కులాసాయే కదా?”
“అంతా కులాసానే. అది ఉండనీ. ఎదురింట్లో టు లెట్ బోర్డు ఉందేమిటీ?”
“అది… అది… వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.”
“ఖాళీ చేసి వెళ్ళిపోయారా?”
“అవునండీ. మొన్న చూస్తే ఉన్నట్లుండి లారీ తీసుకొని వచ్చి ఖాళీ చేసేశారు.”
“ఎందుకట?”
“తెలియదు.”
“ఏమైనా చెప్పారా?”
“ఏమీ చెప్పలేదు. నాక్కూడా ఒక మాదిరిగా ఉన్నందువల్ల నేను బైటికి కూడా రాలేదు.”
“వెళ్ళే ముందు కూడా చెప్పలేదా?”
“లేదు.”
“ఈ ఉంగరం విషయంలో ఏర్పడిన మనస్థాపం కారణమై ఉంటుందేమో?”
“తెలీదు.”
“హుఁ… పాపం మంచి మనిషి.”
“ఏమండీ?”
“ఏమిటి?”
“ఇదిగో చూడండి.”
“ఏమిటి రాజీ?”
“ఉంగరం! కనబడకుండా పోయిన ఉంగరం.”
“ఓరి దేవుడా! ఎక్కడ దొరికింది?”
“ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. ఉంగరానికి దారం చుడుతూ అలాగే వంటింట్లో కుక్కర్ దింపటానికి వెళ్ళే ముందు టేబుల్ మీద పెట్టి వెళ్ళడం కన్నా, ఇక్కడ పెడితే భద్రంగా ఉంటుంది కదా అని ఫోటో వెనకాల పెట్టి వెళ్ళాను. ఆ విషయం ఎలాగో పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడేం చేయడం?”
“ఎంత పెద్ద తప్పు చేశావు రాజీ? అనవసరంగా వాళ్ళ మీద ఎంత పెద్ద అపవాదు వేశామో?”
“నేనేం చేయను చెప్పండి? పాప తను తీయలేదని చెప్పి ఉంటే ఫరవాలేదు. నేనే తీశాను, అమ్మకి ఇచ్చాను అని చెప్పినందుకే కదా ఇంత రభస జరిగింది. వాళ్ళు అడిగినప్పుడు కూడా అవును నీ దగ్గిరే ఇచ్చానని చెప్పలేదూ? బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని అందరూ అనుకున్నట్లే మనమూ అనుకున్నాం.”
“కాని ఆ పాప అలా ఎందుకు చెప్పిందో తెలుసా?”
“నాకేం తెలుసు?”
“మనకే పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియలేదు. ఆ పాప ఏమనుకొని అలా చెప్పిందో, దాన్ని మనకు తెలిసిన భాషలో అర్థం చేసుకున్నాము. నువ్వు ఆ పాప దగ్గర నవ్వుతూ మంచి పాప కదూ అని మెచ్చుకుంటూ ఉంగరాన్ని చూశావు కదూ, తీశావు కదూ అని అడగ్గానే, అలా చూడడం, తీయడం మెచ్చుకోదగ్గ విషయంగా భావించి, ఆ మెప్పు కోసం అవునని చెప్పి ఉండవచ్చు. ఎవరికి తెలుసు? అమ్మ కూడా తనని మెచ్చుకుంటుందని, అమ్మ దగ్గర కూడా అలాగే చెప్పి ఉండొచ్చు.”
“ఏమిటోనండీ… నాకైతే గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పోవడం మంచిదయ్యింది. లేకపోతే రేపు వాళ్ళ ముఖం ఎలా చూడగలను?”
“చూస్తేనేం, చూడకపోతేనేం. ఆయన చెప్పినట్లు కారణం లేకుండానే మనం వాళ్ళను గాయపరిచిన వాళ్ళమయ్యాం. మన పాపానికి నిజంగానే నిష్కృతి లేదు.”
జయంతన్ (1937- 2010)
ప్రఖ్యాత తమిళ రచయిత జయంతన్ మూడు నవలలు, ఎన్నో కథలు, నాటకాలు రచించి తమిళ సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు. మధ్య తరగతి వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషిగా సగటు మనుషుల ప్రవర్తనను విశ్లేషిస్తూ ఆయన రాసిన కథలు ఇప్పటికీ పాఠకులను అలరిస్తున్నాయి. అన్యాయాన్ని ఎదిరించలేని సగటు మనిషి పిరికి తనం, అట్టడుగు తరగతి మనుషుల ప్రవర్తన జయంతన్ గారి కథలలో ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. జయంతన్ గారి బోడి అన్న అనువాద కథ కౌముదిలో ఏప్రిల్ 2009లో వచ్చింది. ‘వానం ఉనదు’ అన్న నాటకానికి ఆల్ ఇండియా రేడియోలో మొదటి బహుమతి లభించింది.