నన్ను గురించి కథ రాయవూ – కథ నచ్చిన కారణం

కథ: నన్ను గురించి కథ వ్రాయవూ?
రచయిత: బుచ్చిబాబు
రచనా కాలం: 1946

కొన్ని కథలు ఒకటికి రెండుసార్లు చదివిస్తాయి. అదే కథని కొన్నేళ్ళ తరువాత మరోసారి చదివితే ఇదివరలో ఆ కథపైన ఏర్పడ్డ అబిప్రాయాలు మారుతాయి. అందుకు కారణం, మనపై కాలం తెచ్చిన మార్పుకావచ్చు; లేదా కథని, కథలో పాత్రలనీ, మరొక దృక్పథంతో చూడగలగడం కావచ్చు.

బుచ్చిబాబు రాసిన కథ నన్ను గురించి కథ వ్రాయవూ?, నేను మొట్టమొదటిసారి యాభై యేళ్ళ క్రితం చదివాను. అప్పుడు కథానాయకి(?) కుముదం ఒక సాధారణ తెలుగు స్త్రీ. అప్పట్లో అందరు తెలుగు అమ్మాయిల్లాగానే, పెళ్ళిచేసుకొని పిల్లలని కని, జీవితంలో మరేదో విధమయిన ఆశ, గాఢమైన కోరిక ఉన్న వ్యక్తిలా కనపడలేదు. కథలో ‘నేను’ అన్న వ్యక్తి, కుముదం గురించి ఏ రకమయిన అభిప్రాయం వెలిబుచ్చాడో ఆ అభిప్రాయానికి వ్యతిరేకత చూపించడం సాధ్యం కాలేదు.

మరొక విషయం. ఒక కథ గాని, ఒక నవలగాని చదువుతున్నప్పుడు, పాఠకుడికి కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతాయి. అంటే, dispassionateగా ఏ కథా, ఏ నవలా చదవలేమని నేను అనుకుంటున్నాను. ఈ కథ నేను మొదటిసారి చదవటానికి ముందుగా బుచ్చిబాబు నవల చివరకు మిగిలేది చదివాను. అప్పుడు అందులో నాయకుడు దయానిధికి, ఈ కథలో ‘నేను’కీ చాలా దగ్గిర బాంధవ్యం ఉన్నట్టు కనిపించింది. ఇది నా జ్ఞాపకం. తరువాత తెలిసింది; ఈ కథ, చివరకు మిగిలేది నవల, సుమారుగా ఒకే కాలంలో ఆయన రాశారు. పోలికలు ఉండటానికి ఆస్కారం ఎక్కువే. ఆరోజుల్లో చివరకు మిగిలేది నవలలో అమృతం పాత్ర ఎంతో నచ్చింది; కుముదం పాత్రతో పోల్చి చూసినప్పుడు! ఈ కథ ఇప్పుడు చదినప్పుడు అందుకు పూర్తిగా వ్యతిరేకమయిన అభిప్రాయం వచ్చింది.

కుముదం మామూలు తెలుగు ఆడపడుచు అన్నానుకదా! ఆది ఇప్పటికీ నిజమే! అయితే ఇప్పుడు చదివితే, కుముదం, ఎంత తెలివైనదో, ఎంత అనుభవం ఉన్న తెలుగు ఆడపడుచో బాగా తెలిసి వచ్చింది.

నన్ను గురించి కథ వ్రాయవూ?” అని కుముదం మొట్టమొదటిసారి అడిగినప్పుడు, ఆ తరువాత అదే ప్రశ్న మరిన్ని సార్లు, బహుశా పదేపదే అడగటం, నేను పాత్ర కుముదం గురించి కథ రాయకపోవటానికి చెప్పిన సాకులు ఇప్పుడు చదివితే, నేను పాత్ర ఎంత హీనమయిన పాత్రో తెలుస్తుంది. కథ రాయడానికి కుముదంలో ఏ ప్రత్యేకతా లేదని ‘నేను’ చాలాసార్లు చెప్పుతాడు. అయితే, కుముదం ఆ సాకుని మెత్తమెత్తగా ఖండిస్తూ చెప్పిన సమాధానానికి ‘నేను’ దగ్గిరనుంచి సరైన జవాబు లేదు.

కుముదం అంటే ‘నేను’కి చిన్నప్పటినుంచీ ‘ప్రేమ’ ఉన్నది. ప్రేమ అంటే ఏమిటో బోధపడని రోజులనుంచీ చివరిదాకా! ఆ విషయం కుముదానికి తెలుసు; కుముదానికి తెలుసునన్న విషయం, నేను పాత్రకి తెలియకపోవచ్చు. పెళ్ళి గురించి, పిల్లలని కనడం గురించీ కుముదంతో సంభాషణ ఇప్పుడు జాగ్రత్తగా చదివితే, అప్పట్లో చలంగారి సిద్ధాంతాలకి ఘట్టి జవాబు కుముదం అప్పుడే చెప్పగలిగిందని బోధపడుతుంది. కుముదం పెళ్ళి అయిన తరువాత ‘నేను’ కుముదాన్ని కలుసుకుంటాడు.

“నాలో ఏముండాలి?”
“ఒక ప్రత్యేకత, అందరిలోనూ లేని ఏ వొక్క విశేషం అయినా సరే–”
వేలునున్న ఉంగరాన్ని చూచి, దాన్ని వేళ్ళతో తిప్పుతుంది, కుముదం.

కుముదం subtle గా ఏదన్నా సందేశం ఇస్తున్నదా? తను అందరి లాంటి వ్యక్తినీ కానని? ఏమో!

“నీ పెళ్ళికి నన్ను పిలవలేదేం?”

“మా అమ్మ నీకు శుభలేఖ పంపానంది. వొస్తే నలుగుర్నీ చూచి, ఏమన్నావుంటే కథేనా వ్రాద్దువుగా” అంది కుముదం, కళ్ళల్లోంచి పెదవుల మీదకి దిగజారిన నవ్వుని ప్రదర్శిస్తూ.

“…. పదిమందీ చేసినదానికి వ్యతిరేకంగా చేస్తే అతన్ని గురించి చెప్పుకుంటారు. అట్లాంటి వ్యక్తులని గురించి వ్రాయొచ్చు.” అంటాడు ‘నేను.’

“అయితే అందరూ చేసిన దానికి విరుద్ధంగా చేసేవాళ్ళే మనుషులన్న మాట…” ఎంత హుందాగా కుముదం ఈ మాట అనగలిగింది?

మొట్టమొదటిసారి, చిన్నప్పుడు చదివినప్పుడు, చలం కథల మీద ఉన్న వ్యామోహంలో, ఆయన చెప్పిన ‘జీవిత’ ప్రవచనాలమీద అపారమైన భక్తితో, ‘నేను’ చేసిన వ్యాఖ్యానం నచ్చింది, నామటుకు నాకు. ఈ సంభాషణలు ఇప్పుడు చదివితే వచ్చిన అనుభూతి వేరు; సందేశం అప్పటికి విరుద్ధం. కుముదం, చెలంగారిని పల్టీ కొట్టించిందని అనిపించక మానదు.

“మీ ఆయన మంచి వాడేనా?” అన్న ప్రశ్నకి “మంచి అంటే ఏమిటో నాకేం తెలుసు? నీకు తెలియాలి. కథలు రాసేవాడవు.” అంటుంది కుముదం. పెండ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, కుముదం “పెండ్లి చేసుకున్న ప్రతి స్తీ భర్తను వదిలేస్తే నువ్వు కథలు వ్రాస్తానంటావ్. అంతేనా?”

ఈ వాక్యాలు, ఆ తరువాతి సంభాషణలూ, బుచ్చిబాబు చలాన్ని విమర్శిస్తూ కుముదం నోటి ద్వారా అనిపించాడని నా ఉద్దేశం.

ఆ తరువాత, నాలుగేళ్ళ తరువాత కలిసినప్పుడు, “ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు. నేను అనుభవిస్తాను ఏమో,” అంటుంది కుముదం. కుముదం పాత్రలో stability పాఠకుణ్ణి కట్టి పట్టి వేస్తుంది.

తరువాత వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు, ఆఖరి సారితో సహా ప్రతి సారీ కుముదం చెప్పిన మాటలు పరిశీలిస్తే, కుముదం మానసికంగా ఎంత ఎదిగిందో తెలుస్తుంది. కుముదం చదువుకోలేదు; సంగీతం నేర్చుకోలేదు, గొప్ప స్థితిపరురాలు కాదు, ప్రేమించి చేసుకున్న పెళ్ళి కాదు, చాలా బీదదీ కాదు, సానుభూతి చూపడానికయినా… అని నేను పాత్ర ద్వారా మనకి చెపుతూ, కుముదం గురించి గొప్ప కథ రాశారు, బుచ్చిబాబు. అది, ఈ కథలో ఉన్న ప్రత్యేకత.

కథలో, అడపా తడపా కుముదం, నేను పాత్ర, సుమారు ఇరవైఏళ్ళలో ఒక మూడు నాలుగు సార్లు కలుస్తారు. మాట్లాడుకుంటారు. కలిసిన ప్రతిసారీ, కుముదం జీవితంలో మనిషిగా ఎంత ఎత్తు ఎదిగిందో, ‘నేను’ ఎంత కిందకి దిగజారిందో అంచెలు అంచెలుగా కనపడుతుంది. కుముదం, వాళ్ళిద్దరూ కలుసుకున్న ప్రతి ఒక్కసారీ వేసిన ప్రతి ప్రశ్న, ‘నేను’ని కలవర పెట్టి ఉండాలి. కథా కథనంలో బుచ్చిబాబు అసమాన ప్రజ్ణ వాళ్ళిద్దరి సంభాషణలలో కొట్టవచ్చినట్టు కనపడుతుంది, ఇప్పుడు! అందుకనే ఈ కథ నాకు నచ్చిన కథల్లో ఒకటి. బహుశా మీకు నచ్చటానికి, నచ్చకపోవటానికీ (?) వేరే కారణాలు ఉండచ్చు. దయచేసి, ఆ కారణాలు రాయండి.

“నువు ఎందుకు పెళ్ళి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం” అంటుంది, ఆఖరిగా, కుముదం.

నేనే ఈ కథ ఇప్పుడు రాసిఉంటే, ఇక్కడితో ఆపి ఉండేవాడినేమో! పాఠకుడి మెదడుకి మరింత మేత!

“ఆరు గంటల పరిచయంతో, ఆరు వందల మాటలతో, నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసి, నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?” అనడంతో కథ ముగుస్తుంది.

ఇది చదివిన తరువాత, నేను పాత్ర యొక్క జీవిత పరమావధి ఒక జోక్‌లా కనిపించింది, నామటుకు నాకు!

కథలో బుచ్చిబాబు ఉపన్యాసాలు, ఒకరకమయిన ప్రవచనాలుగా కనపడతాయి. కథ నడకకి అడ్డు వస్తున్నట్టుగా కూడా కనిపిస్తాయి, ఇప్పుడు చదువుతూ వుంటే!. ఆ కాలంలో అందరు ప్రముఖ కథకులూ కథ మధ్యలో పాఠకుడికి ఉపదేశాలు ఇవ్వడం మామూలేనని అనిపిస్తుంది. ఇప్పటి పాఠకులకి బహుశా విసుగు కలిగించవచ్చు. ఎక్కడో, ఎవరో కొందరి కథల గురించి పరిచయ వాక్యాల్లో రాసింది చదివిన జ్ఞాపకం: యాభై ఏళ్ళు పైబడ్డవారికి ఈ కథలు నచ్చవచ్చు అని.

బుచ్చిబాబు కుముదం కథ అటువంటి కథ కాదని నా గాఢ నమ్మకం.