పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం

కథ: పడవ ప్రయాణం
రచన: పాలగుమ్మి పద్మరాజు
రచనా కాలం: 1945

గత యాభై ఏళ్ళలో ఈ కథ నేను చాలా సార్లు చదివాను. మొట్టమొదటగా చదివింది మథురాంతకం రాజారాం సంకలనం చేసిన తొలినాటి తెలుగు కథలు (1936-1945) అన్న పుస్తకంలో.

ఈ కథ నాకు ఇప్పడు చదివినా నచ్చటానికి చాలా కారణాలున్నాయి. అయితే కాలానుగుణ్యంగా కొన్ని కారణాలు మరుగున పడతాయి; అవి ముఖ్యం కావు. కొన్ని కొత్త కారణాలు పుట్టుకొవస్తాయి; అవి అప్పటికి ముఖ్యం అవుతాయి. అందరు పాఠకులకీ ఇది వర్తించకపోవచ్చు. మరీ ముఖ్యంగా ‘గొప్ప’ కథలకి విశ్వజనీనత అనే ఒక లక్షణం ఉన్నదని నమ్మే పాఠక విమర్శకులకి, కథ నచ్చిన కారణాలు వారి వయస్సుతో మారక పోవచ్చు. నా విషయంలో అది నిజం కాదు.


పాలగుమ్మి పద్మరాజు రచనలు (2008)

పడవ ప్రయాణం కథ నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు నా వయస్సు పధ్నాలుగో, పదిహేనో. ఆరోజుల్లో చలం కథల మైకంలో కూరుకొని పోయిన యువకుల్లో నేనూ ఒకణ్ణి. ఎప్పుడు ఎక్కడ ఎవరి కథ చదివినా, ఆ కథలో చలం ఎంతవరకూ కనిపిస్తున్నాడు, సాధారణంగా చలం వర్ణించే స్త్రీలు ఈ కథలో కూడా ఉన్నారా, అని వెతికే హృదయం. మరోరకంగా చెప్పాలంటే, చలం తప్ప ఇంకెవరూ స్త్రీ పాత్రల సౌందర్యం వర్ణించలేరనే గట్టి నమ్మకమే కారణం. ఆ వయసులో నన్ను ఆకర్షించినది కేవలం ఇటువంటి వర్ణన. ఈ కథలో ఆ రకమైన వర్ణనలున్నాయి. ఉదాహరణకి ఒక వర్ణన:

ఆమె (రంగి) గొంతుకలో మగ జీర ఉంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు చనువుగా ఒప్పిస్తున్నట్టున్నది… నల్లటి రవిక ఉన్నట్టు తెలియడం లేదు. చీకట్లో కూడా ఆమె కళ్ళు మేలుకున్నట్లు మెరుస్తున్నాయి…

కొంచెం పెద్దయిన తరువాత, కృష్ణశాస్త్రిని చదువుతున్న రోజుల్లో ఏదో సంకలనంలో ఈ కథ మళ్ళీ చదివాను. అప్పుడు మనసుకి పట్టి కదిలించింది, స్త్రీ బాహ్య సౌందర్య వర్ణన కాదు; పడవ ప్రయాణపు వాతావరణ వర్ణన. ఒక కొత్త భావన.

దూరంగా చెట్ట్లు అస్పష్టంగా, మాయగా పడవతోకూడా నిశ్చలంగా ముందుకు సాగుతాయి. దగ్గరగా ఉన్నచెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దయ్యాల్లాగా జీబురుమంటో వెనక్కి నడుస్తాయి. పడవ కదలదు. కాలవగట్టు కదులుతుంది… నక్షత్రాలు మెల్లగా కెరటాల మీద వివశంగా ఉయ్యాలలూగుతాయి. కన్ను తెరిచి నిద్రపోతాయి.

కథ రాయటానికి ముందు, కథకుడు ఒక నూతన వాతావరణం సృష్టించాలని, అది పాఠకుణ్ణి ఆకట్టుకోవాలనీ, అప్పుడే ఆ కథ నచ్చుతుందని, అది మంచికథ అవుతుందనీ నమ్మిన రోజులవి. ఆ కారణంగా పడవ ప్రయాణం కథ నచ్చింది.

ఇంకొంచెం పెద్దయిన తరువాత ఈ కథ మళ్ళీ చదివాను.

పద్దాలుగాడు తాగుబోతు. పచ్చి దొంగ. తాగినప్పుడు రంగిని చితక తంతాడు. రంగి ఒక్కత్తే కాదు; మరొక ఆడదానితో పోతాడు. అయినా రంగికి వాడంటే ఉన్న ఆకర్షణ ఏమిటో బోధపడలేదు. వాడు దొంగతనం చెయ్యడానికి సహాయం కూడా చేస్తుంది. వాడితో ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళీ వాడి పక్కకే చేరటం నాకు నచ్చలేదు. రంగి మానసికస్థితి ఒక పట్టాన బోధపడలేదు. నిజం చెప్పద్దూ! రంగి పాత్ర అదొక రకమయిన మానసిక అసంతృప్తినిచ్చింది; కాని, రంగి కున్న ధైర్యం, విశ్వాసం, ఆశ్చర్యాన్ని కలిగించాయి. బహుశా కథ నచ్చడానికి అది కారణం కావచ్చు.

రంగి తనలో తను అనుకుంటుంది, “ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నావోడు. నాదగ్గరకే వొత్తాడు,” అని. నాకు ఆ రంగి మీద కోపం వచ్చింది; జాలి పుట్టింది. అప్పుడు కథలో ఎంత వెతికినా చలం కనిపించలేదు.

అయితే, కథలో ‘నేను’ అన్న పాత్ర రంగి చేతిలో ఒక రూపాయ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ భాగం నాకు అప్పుడూ ఇప్పుడూ మరెప్పుడూ కూడా నచ్చలేదు; అయినా ఈ కథ నాకు ఇప్పటికీ నచ్చిన కథల్లో ఒకటి. (నా సాటి సంపాదకుడి ఉద్దేశంలో: గాలివాన కథలో కూడా ఇలాంటి మార్పే పద్మరాజు చూపిస్తాడు. కథకుడు ముందు ఒక మగవాడిలా ఆమెను చూసినా, తర్వాత్తర్వాత ఆమె వ్యక్తిత్వాన్ని చూసి పశ్చాత్తాపపడో, తన గిల్టు కడుక్కోడానికో పెట్టుంటాడు.)

మీకు కూడా ఈ పడవ ప్రయాణం నచ్చితే, మీ కారణాలు చెప్పండి; బహుశా మీరు చెప్పే కారణాలు నేను చెప్పలేనేమో!