కథ: Cathedral (1983)
రచయిత: Raymond Carver
ఇదేవిటీ? పాత తెలుగు కథలని పరిచయం చేస్తున్న ఈ శీర్షికలో ఇంగ్లీషులో రాసిన అమెరికన్ కథ తీసుకున్నారేవిటి అన్న అనుమానం రాక మానదు. ఈమాట ప్రభృతులకి మంచి తెలుగు కథ దొరకలేదు కాబోలు, అని కామెంటర్లు హేళన కూడా చెయ్యచ్చు.
ఒక పాశ్చాత్య సంస్కృతిలో సహజమయిన ఒక అనుభవం కథగా మలిస్తే, సాధారణ తెలుగు పాఠకులకి ఏ విధమైన అనుభూతి ఇస్తుంది? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, ప్రస్తుతం కొంతమంది ప్రవాసాంధ్రులు (డయస్పోరా తెలుగు వాళ్ళు) రాస్తున్న కొన్ని కథలు చాలామంది తెలుగు పాఠకులకి ఎబ్బెట్టుగా/ వింతగా కనిపిస్తున్నాయి కాబట్టి.
అనుభవాలు వ్యక్తిగతం. లేదా, ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే చెందినవి అయి ఉంటాయి. అంటే, అనుభవాలకి ‘విశ్వజనీనత’ ఉండదన్న మాట. అదేగనక నిజమైతే, చాలా మంది ప్రఖ్యాత తెలుగు రచయితలు ఇదివరలో రాసిన ‘గొప్ప’ కథలు అందరి అనుభవ పరిధి లోనూ లేవు గదా? మరి ఆ కథలని కూడా సాధారణ తెలుగు పాఠకులు ఎబ్బెట్టుగానే పరిగణించాలి కదా? లేదూ, ఒక వ్యక్తి అనుభవం, ఒక ప్రత్యేక వర్గానికి ఉండే సామూహిక అనుభవం కథా వస్తువుగా పనికి రాదన్నమాట!
ఇది కథా? ఇది నాకు ఏ ‘సందేశం’ ఇస్తున్నది? రచయిత ఏమిటి చెప్పుదామనుకున్నాడు? ఇటువంటి ప్రశ్నలు పాఠకులు వేస్తున్నారు. అది సహజం. ఇటువంటి ప్రశ్నలకి నాకు తట్టిన కొన్ని కారణాలు చెపుతాను.
ఒక కారణం: కథా కథనంలో ఇంతకు ముందు చూడని కొత్తదనం, కొత్త పద్ధతి కనిపించబట్టి. అయితే, వస్తువు కొత్తదైనప్పుడు కథా కథనం, కథ చెప్పే పద్ధతి కూడా మార్పు చెందుతుంది అని గుర్తించక పోవటం. పాశ్చాత్య దేశాలలో ఈ మార్పు పాఠకులు, విమర్సకులూ ఏనాడో గమనించారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం మరిచిపోకూడదు. కథ అని అనిపించుకోటానికి ఒక రచనకి ఉండవలసిన సహజమైన లక్షణాలు ఏవీ మారలేదు — ఆ లక్షణాలు మనకి, పాశ్చాత్యులకీ ఒకటే! ఆ మాట కొస్తే, కథకి ఉండే సహజమైన లక్షణాలు, పాశ్చాత్యుల దగ్గిరనుంచే మనం నేర్చుకున్నాం. కాని, ఆ లక్షణాలని ఒక బిగువైన చట్రంలో బంధించి కథని చూడటం, విమర్శించడం మనం ఇంకా మానేయలేదు. ఇది రెండవ కారణం. ఆ చట్రం లోనుంచి బయటికి వచ్చి కథను చదవటం అవసరం. కథ ముగింపు కథకి ఒక సంపూర్ణతని ఇచ్చేట్టుగా ఉండాలనేది పాత ఊహ. ఇది బాగా మారిపోయింది. పాఠకుడు తెలివి తక్కువ వాడు కాదు. సంపూర్ణతకు అవసరమయిన ‘ముగింపు’ పాఠకుడికే వదిలి పెట్టడం చాలా మంది కథకులు చేస్తున్నారు. ఇది ఆఖరి కారణం కావచ్చు.
1980ల నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పాశ్చాత్య కథల్లో ‘మినిమలిస్ట్’ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ధోరణి కొంత మంది ప్రవాసాంధ్రుల కథల్లో కూడా కనిపిస్తున్నది. ఇటువంటి కథలు చదవడానికి కొద్దిగా ఓర్పు కావాలి. తరువాత, అలవాటు పడటం అవసరమని అనుకుంటాను. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించితే సంతోషం. అంతే కాకుండా, కథ లక్షణాలుగా మనం భావిస్తూ, ప్రచారం చేస్తున్నవి బాగా పాతపడిన పద్ధతులని మనం తెలుసుకోవడం అవసరంగా కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో Cathedral గురించి ముచ్చటించి, ప్రత్యేకంగా ఈ కథ నాకు ఎందుకు నచ్చిందో చెప్పటానికి ప్రయత్నిస్తాను.
ముందుగా రేమండ్ కార్వర్ (Raymond Carver) గురించి మూడు మాటలు. ప్రముఖ అమెరికన్ కథకుల్లో కార్వర్ (1938 -1988) ఒకడని నిశ్చయంగా చెప్పవచ్చు. కార్వర్ కథలు గొప్ప కథలుగా పరిగణింపబడటానికి, సంపాదకుడు గోర్డన్ లిష్ (Gordon Lish) కారణం అన్నది కూడా నిర్వివాదాంశం. లిష్ గురించి, కార్వర్ కథలని అతను కత్తిరించిన వివరాల గురించీ నేను 2010 జులై ఈమాటలో ప్రస్తావించాను. కత్తిరించిన, కత్తిరించని ప్రతులతో సహా అన్నీ కలిపి, కార్వర్ కథలు లైబ్రరీ ఆఫ్ అమెరికా 2009లో వెయ్యిపేజీల పైచిలుకు పుస్తకం వేసింది (Collected stories by Raymond Carver, Edited with notes by William L. Stull and Maureen P. Carroll, Library of America, 2009.)
Cathedral కథ కార్వర్ రాసిన మంచి కథల్లో చెప్పుకోదగ్గ కథ అని చాలా మంది విమర్శకుల అభిప్రాయం. ఈ కథపై హైస్కూల్ విద్యార్థుల నుండి విశ్వవిద్యాలయాల్లో పండితుల వరకూ — అందరూ వ్యాఖ్యానాలు చేశారు. ఈ కథ పాఠ్యాంశంగా చాలా అమెరికన్ విద్యాలయాల్లో బోధించడం కూడా మామూలు. అందుచేత, ఈ కథపై రకరకాల వ్యాఖ్యానాలు కనపడతాయి.
కొన్ని కథలు ఒకసారికన్నా ఎక్కువ సార్లు చదవాలనిపిస్తుంది. రెండవసారి చదివినప్పుడు మొదటిసారిచదివిన తరువాతివచ్చిన అనుభూతి మారచ్చు; లేదా మరొక కొత్త అనుభూతి కలగవచ్చు. ఆ కథ గురించి మనకున్న అభిప్రాయమే మారవచ్చు. కాలానుగుణంగా వ్యక్తిగత అనుభవాలు మారితే, మరొకసారి వేరొక దృక్పథంతో చదవటం తటస్థిస్తే, అప్పుడుఆ కథలో ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్తదనం కనిపించవచ్చు. ఇది కథలకే పరిమితం కాదు. నవలలకి, నాటకాలకి, కవితలకీ కూడా వర్తిస్తుంది. అసలు విషయం: మంచి కథలు మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కెథెడ్రల్ కథని గత పాతిక సంవత్సరాలలో నేను కనీసం నాలుగైదు సార్లు చదివి వుంటాను. ఈ మధ్య ఒకకొత్త అనుభవం ఈకథని మరొక దృక్పథంతో చదవటానికి అవకాశం కల్పించింది. ఆ అనుభవం ఈ కథ మరీ మరీ నచ్చటానికి కారణం.
Cathedral గురించి:
కథ చెప్పుతున్నవ్యక్తి (Narrator) — ఇతన్ని మనం కథకుడు అందాం. భార్య తన పాత స్నేహితుడు, రాబర్ట్ మన ఇంటికి వస్తున్నాడని చెప్పటంతో కథకుడికి ఆందోళన మొదలవుతుంది. తన వివాహానికి పూర్వం ఆమె ఆ స్నేహితునితో పని చేసింది. ఆ స్నేహితుడు గుడ్డివాడు. పైగా, అతని భార్య ఈ మధ్యనే చనిపోయింది కూడాను. ఇటువంటి కథావస్తువు — తన భార్య పూర్వాశ్రమంలో స్నేహితుడు తన ఇంటికి అతిథిగా రావటం — మన సాంస్కృతిక పరిధిలో పట్టని వస్తువు.
కథకుడికి రకరకాల మనోవికారాలు ( hang-ups) ఉన్నాయి. ఏ రకమయిన అశక్తతలున్న వాళ్ళన్నా సరే అతనికి అసహ్యం. తన భార్య పూర్వాశ్రమంలో చేసిన పనులు తనకి నప్పవు. వాటి గురించి వినటం నచ్చదు అనడం సబబు. కథలో ఇతనికి ఈ రకమయిన హాన్గ్అప్ రచయిత ఎందుకు ఇచ్చాడు? బహుశా ఈ మనోవికారం నుంచి విముక్తి పొందటానికి అవకాశంగా, నాందిగా కావచ్చు. ఆ వ్యక్తికి విముక్తి కలగచ్చు; కలగకనూ పోవచ్చు. అవకాశం మాత్రం కల్పించబడింది. అది ఒప్పుకుంటే, కథాకథనంలో కొత్త పద్ధతి తేలికగా కనిపిస్తుంది.
రాబర్ట్‌ని ఇంటికి తీసుకొని రావటానికి ముందు, తీసుకొని వచ్చిన తరువాత, కథకుడిలో ఆందోళన పెరుగుతుందే కాని తగ్గదు. రాబర్ట్, కథకుడి భార్య, ఎన్నో పాత సంగతులు మాట్లాడుకుంటారు; కథకుడు అక్కడ ఉన్నా ఉండనట్టే! ఆ పైన తను, రాబర్ట్ స్కాచ్ తాగటం మొదలుపెడతారు. తను అప్పుడప్పుడు అక్కడే ఉన్నట్టు గుర్తుగా!
కథకుడి చీదర, అనిష్టత ఎప్పుడు పోవటం మొదలవుతుంది? ముగ్గురూ డిన్నర్‌కి కూర్చుంటారు. గుడ్డివాడైనా, రాబర్ట్ భోజనం దగ్గిర అందరి లాగానే ఉండటం ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జ్ఞాపకాలు వద్దన్నా రాకమానవు. కథలో ఈ భాగం చదివినప్పుడు నాకు భారతంలో అర్జునుడు చీకటిలో భోజనం చేసిన పద్యం గుర్తుకొచ్చింది. అన్నం తింటూ వుండంగా గట్టిగా గాలి వేసి, దీపం ఆరిపోయిందిట. విస్తరిలో వేసిన పదార్థాలు గుర్తే కదా! ఆ గుర్తుతో, అర్జునుడు భోజనం ముగించాడుట!
కలిసి కూచొని భోజనం చెయ్యటం అనేది ఒక గొప్ప అనుభవం. అన్యోన్యత, సహనం పెరుగుతాయి, సమిష్టి భోజనం చెయ్యటం మూలంగా! ఇదే కమ్యూనియన్, అంటే! దీనికి, మత సంబంధమైన వ్యాఖ్యానం ఆపాదించవలసిన అవసరం లేదు! ఆ తరువాత, ఇద్దరూ మారువానా సిగరెట్లు కాలుస్తారు; రాబర్ట్‌కి మొదటి సారి! కథకుడికి, అతని భార్యకీ కాదు. అన్యోన్యతకి ఇది అవసరం అని నేననటల్లేదు. ఇది ఈ కథలో ఒక కారణం అయ్యింది, అంతే!
ఆఖరిగా, టి.వి. లో కథెడ్రల్స్ గురించి కథనం మొదలవుతుంది. రాబర్ట్‌కి కథెడ్రల్ ఎలా వుంటుందో తెలియదు. కథకుడు చెప్పటానికి ప్రయత్నిస్తాడు; ఎంత కష్టపడి వివరించినా సంపూర్తిగా చెప్పలేడు. అప్పుడు, ఇద్దరూ కాగితం మీద గీయడానికి ప్రయత్నిస్తారు. కథకుడికి కథెడ్రల్ ఎల్లా వుంటుందో రాబర్ట్కికి చెప్పలేకపోయానే అన్న బాధ — ఓటమితో వచ్చిన బాధ –, రాబర్ట్‌కి కథెడ్రల్ ఎలావుంటుందో బోధపడినప్పుడు కలిగిన ఆనందం — కథలో ఆఖరి వాక్యాల్లో కనపడుతుంది!
ఇది కచ్చితంగా చెప్పాలంటే ఈ కథ పూర్తిగా మినిమలిస్ట్ కథ కాదు. మినిమలిస్ట్ కథ అయితే, కథెడ్రల్ ఎలా వుంటుందో పూర్తిగా వివరించలేక కథకుడు ఊరుకోవటంతో ఆగిపోవాలసి రావచ్చు. కానీ, మినిమలిస్ట్‌గా ప్రసిద్ధికెక్కిన కార్వర్ ఈ కథని అతి రమ్యంగా ముగించాడు; కథెడ్రల్ బొమ్మ గీయటం అనే సన్నివేశం కల్పించి!
కమ్యూనియన్ ద్వారా కథకుడి హాన్గ్అప్ తునాతునకలవటం నన్ను కదిలించి వేసింది. అందుకని ఈ కథ నాకు చాలా నచ్చిన కథల్లో ఒకటి.
మీకు కథ నచ్చితే, ఎందుకు నచ్చిందో చెప్పండి. నచ్చకపోతే, ఎందుకు నచ్చలేదో చెప్పండి.