భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్

[ఈ వ్యాసం వెల్చేరు నారాయణరావు గారి సిద్ధాంత గ్రంథమైన “కవితా విప్లవాల స్వరూపం” నుండి తీసుకోబడినది.]

భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది.

కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న పఠాభికి 1938 లో ఇలా అనిపించిందట:

“As I lay on my bed and looked through the window, I saw the full moon surreptitiously peering through the smoke filled sky. All the thousand metaphors I had read in Bhava Kavitwam, in Prabandhams and in Tagore’s songs, suddenly lost all their meaning”

అనుసరిస్తాను నవీన పంథా; కానీ
భావకవిన్మాత్రము కాన్నే; నే
నహంభావకవిని.

అని ప్రకటించుకుని ప్రకటించిన ఫిడేలు రాగాల డజన్, వెల డజన్ అర్ధణాలు. ఇత్యాది ముఖపత్ర చమత్కారల వల్లనే కాకుండా, కవిత్వంగా ఆనాటి కవిత్వానికి విద్యుత్ చికిత్స అయింది. భావకవిత్వంలో ఏవి సున్నితంగా చెప్పుకుంటారో వాటి నన్నిటినీ హేళన చేసిన “anti-poem” పఠాభి రచన. తెలుగు కవిత్వంలో చిరకాలంగా కవితావస్తువులుగా అలవాటయిన ప్రతి వస్తువునూ, భావాన్నీ, శైలినీ అకవిత్వాంశాలుగా ప్రదర్శించడం కనిపిస్తుంది ఇందులో.

“తగిలింపబడియున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోను; పయిన
అనవసరంగా అఘోరంగా!”

అని కవిత్వంలో సుప్రతిష్ఠితుడయిన చంద్రుణ్ణి ఎలక్ట్రిక్ దీపంతో సమానంగా చూసి, వెండి రూపాయి కన్న, రంగుల ఎలెక్ట్రిక్ దీపాల కన్న, ‘నాగరీక కన్యల పవుడర్ పూయబడిన ముఖాల’ కన్న చంద్రుడు తక్కువ వాడుగా చెప్పడం – పాతబడిపోయిన కవిసమయాన్ని బయట పెట్టడం కోసం. ప్రబంధ కవిత్వంలో విసుగు లేకుండా వర్ణితమైన స్తన సౌందర్యాన్ని నిర్మొహమాటంగా –

“అహో జాతికన్నియ చిక్కని నిక్కబొడుచుకొని
వచ్చునట్టి గట్టిరొమ్ము”

అని కల్తీ లేని అకవితా రీతిలో చెప్పేస్తాడు కవి. కార్లనీ, సిగరెట్లనీ, మసాలా దోసెనీ కవితా వస్తువులు చెయ్యడంతో మలయానిలమూ, మల్లెపువ్వులూ మట్టికొట్టుకు పోయాయని చెప్పకుండా చెప్తాడు కూడా. వెతికినా సున్నితమైన భావం, సున్నితమైన పలుకుబడి లేనితనానికి ఈ కవి పనిగట్టుకుని ప్రయత్నిస్తాడు. గ్రాంథికభాషని మాత్రమే కాదు, ఆ భాషలో అలవాటుగా కవిత్వపు భాష వేసుకుని తిరిగే పలుకుబడిని బట్టబయలు చేశాడీయన.

కవిత్వపు వేషం వేసుకుని అకవిత్వం తిరుగుతున్నప్పుడు, కవిత్వం అకవిత్వపు వేషంలో రావలిసి ఉంటుంది. సరిగ్గా ఈ పనే చేసింది పఠాభి కవిత్వం. సారం నశించిన ఆకారాలు, కాలం చెల్లిపోయినా, రాజ్యం చెయ్యకుండా వాటి వికృతిని బయటపెట్టిన విధ్వంసకుడు, iconoclast, పఠాభి.

భావకవులది అమలిన శృంగారం కాగా, పఠాభిది నూటికి నూరుపాళ్ళు మలిన శృంగారం. భావకవులది సుకుమార శృంగారం కాగా, పఠాభిది సుతారమూ సుకుమారత లేని మోటు శృంగారం.

“అరటి పండున్ పక్కు తీసి తినేలా
మ్రింగివేశాన్నేనా నగ్నాంగమును”

ఇత్యాది రీతిలో వుంటాయి పఠాభి ‘శృంగార’ వర్ణనలు. పురాణ స్త్రీల పాతివ్రత్యాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా భగ్నం చేస్తాడు పఠాభి. సీత రాముడి భార్యగా కన్న రావణుడి ప్రియురాలిగా ఉండాలనుకుంటుంది.

భావకవిత్వం ఆత్మాశ్రయం కాగా, పఠాభి కవిత్వం కపట ఆత్మాశ్రయ కవిత్వం. ఈ కవిత్వంలో ‘నేను’ కవితో తాదత్మ్యం గల ‘నేను’ కాదు. ఆ కారణంచేతనే పాఠకుడు తాదాత్మ్యం పొందగల ‘నేను’ కాదు కూడా. ఎదుటివాడిని హేళన చెయ్యడానికి వారి రూపం తన మీద ఆరోపణ చేసుకునే ఎత్తుగడ ఫలితమైన ఆత్మాశ్రయత్వం మాత్రమే ఇది. “ఈ పద్యాలలో వచ్చునట్టి ‘పఠాభి’ అను పేరుగల పాత్రకు గ్రంథకర్తకు ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు” అని ప్రకటించి – కృష్ణపక్షం లోని ‘కృష్ణ’ కును దాని గ్రంథకర్త నామంలోని ‘కృష్ణ’కును ఎలా సంబంధం లేదో అలాగే – అని పోలిక తేవడం వెక్కిరింపుకోసం. నిజానికి కృష్ణపక్షంలో కృష్ణకు కృష్ణశాస్త్రిలో కృష్ణకీ సంబంధం ఉంది. ఉన్న సంబంధం సున్నితంగా వ్యక్తం కావటానికి వదిలేసి దాన్ని స్పష్టంగా అవును – కాదు అని చెప్పకుండా ఉండడం భావ కవిత్వపు పద్ధతి. కొన్ని భావాలు అలాగా ఊహకి వదిలెయ్యాలి; మాటల్లోకి తెచ్చామంటే చాలు అవి దెబ్బతింటాయి అనేది భావకవిత్వపు తరహా. కావాలని బాహాటంగా పఠాభి అనే పేరు కవిత్వంలో వాడి, ఆ పఠాభి, కవి పఠాభి ఒకరు కారనటం – ఆ తరహాని వెక్కిరించడం కోసం.

ఆఖరికి ఫిడేలు రాగాల డజన్ అంకితం కూడా భావకవిత్వం మీద వెక్కిరింపు కోసం చేసినదే. ‘ మృణాళినికి – కాదు కళ్యాణికి, కాదు ఇరువురికి’ అని ఇద్దరికి అంకితం చెయ్యడం బాహాటంగా ఇద్దరిపట్ల ఇష్టం చూపించడంకోసం.
” నా యంతరంగ శాంతి దేవత

నా తపః కల్పవల్లి”
ఇలా ఆమెని గురించి ప్రతీకవీ పూజభావంతో చెప్పడం, ఆమెతో అనుబంధం ‘జన్మ జన్మల యాత్ర’ కావడం భావకవిత్వంలో సుప్రసిద్ధం. ఆ అలవాటుని వేళాకోళం చెయ్యడం ఈ అంకితంలో కనిపిస్తుంది.

ఆర్జవం, అనుభూతి, సెంటిమెంట్ – ఇవి పఠాభి కవిత్వంలో వెతికినా కనిపించని విషయాలు. కవిత్వపు వేషం వేసుకుని అకవిత్వం తిరుగుతున్నప్పుడు, కవిత్వం అకవిత్వపు వేషంలో రావలిసి ఉంటుంది. సరిగ్గా ఈ పనే చేసింది పఠాభి కవిత్వం. సారం నశించిన ఆకారాలు, కాలం చెల్లిపోయినా, రాజ్యం చెయ్యకుండా వాటి వికృతిని బయటపెట్టిన విధ్వంసకుడు, iconoclast, పఠాభి. ఫిడేల్ రాగాల డజన్ భావకవిత్వానికి ‘దహన సంస్కారం’ చేసింది. ఇంక ఆ తరువాత ప్రతిభావంతులెవ్వరూ భావకవిత్వం రాయలేదు. అలవాటుని ఆశ్రయించుకున్న రెండవ తరగతి కవులు ఎప్పుడూ ఉంటారు.

అయితే పఠాభి కవిత్వం మీద న్యాయమైన విమర్శ ఇంతవరకూ రాలేదు. దువ్వూరి రామిరెడ్డి ఫిడేల్ రాగాలని తీవ్రంగా ఖండించారు. “యవ్వన ప్రాదుర్భావ సమయమున కామోద్రిక్తుడు ‘కామర్తాహి ప్రకృతి కృపణా శ్చేతనా చేతనేషు’ అను కాళిదాసు సూక్తికి ఉదాహరణ ప్రాయుడయి వలపు వస్తువులతో నవసి మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపములు” గా స్ఫురించాయి పఠాభి పద్యాలాయనకు. దాదాపు అంత కోపమూ వచ్చింది సి. నారాయణ రెడ్డిగారికి. ” పాశవిక శృంగార క్రీడలకు, అసంపూర్ణ కామ వాంఛలకు పతాకలవంటి” వని ఈ గేయాలన్నిటినీ ఖండించి “ఈ ధోరణి పఠాభితోనే అస్తమించుట తెలుగు కవితలోని ఆరోగ్యవంతమైన లక్షణములలో నెన్నదగినది” అని రాశారాయన.

వీళ్ళకి ఎందుకింత కోపం వచ్చిందో తెలియదు కాని ఫిడేలు రాగాలలో కామపరతంత్రత లేదు. నిజానికి ఫిడేలు రాగాలు ఏ ఆవేశాన్ని కలిగించే రచన కాదు. ఈ రచనా ధోరణి ఆవేశవ్యతిరేకమైన ధోరణి, అపహాస్య ధోరణి. భావకవిత్వపు ‘అకామ’ తత్వాన్ని వెక్కిరించడానికి పఠాభి చేసిన ఈ ‘కామ వర్ణనలు’ ఏవీ నిజంగా కామాన్ని రెచ్చగొట్టేవి కావు. ఇందులో నాయికా నాయకుల పట్ల కవికి గూడా హాస్య దృష్టే ఉంటుంది. ఉదాహరణకి ‘ఆ రోజు’ అనే పద్యంలో నాయకుడైన ‘పఠాభి’ శర్కరస్వరం (కర్కశ స్వరాన్ని జ్ఞాపకం తెచ్చే పదం). నాయిక అతనితో ‘సమానమయిన లావుంగల్గి/ దిట్టంగా జంతువట్లుంటుంది’ . ‘ ఫ్లోరింగదిరేలా/ బాటా హయిహీలు బూట్సుల మీదన్ / సవారీ జేస్తూ’ వస్తుంది. వారిద్దరూ ‘ ఏనుంగున్నలా’ గుంటారు. వాళ్ళు ’20 అయిటమ్సు లంచి హిమాలయమంత’ భుజిస్తారు. ఈ పద్యంలో ‘ ప్రాచీ దిశ సూర్యచక్రం రక్త వర్ణంతో / కన్పట్టింది’. ఇందులో ‘బీడావర్ణిత అధరాలు’ ‘అపూర్వంబగు మజా’ ఇలాటివి, భావ కవిత్వంలోనూ సంప్రదాయ కవిత్వంలోనూ అలవాటుగా ఒక భావాన్ని చెప్పే సందర్భాలలో వాడే మాటలకి వికృతీకరణలు. ఒక కామభావాన్ని ప్రవర్తింప జెయ్యాలనే దృష్టి కవికి ఉంటే, ఆయా ఘట్టాలలో ఈ వికృతీకరణవల్ల కలిగే అపహాస్య భావానికి ఆస్కారం లేదు. పఠాభి పద్యాలలో కామోద్రిక్తతను చూడడం పద్య ప్రదేశాన్ని అతిక్రమించడం వల్ల జరిగిన పొరపాటు. కాగా భావకవితా మర్యాదల పట్ల అశేష అభిమానాదరాలు గమనించవలసి ఉంటుంది; అంతే.

(ఇంతకు మించి ‘ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సెక్స్ సిద్ధాంతము’ పఠాభి కవిత్వంలో ఉందని సి. నారాయణరెడ్డిగారు, వాల్ట్‌విట్‌మెన్ పద్యములకు పఠాభి వచన పద్యాలు ‘అనుకరణలు’ అని రామిరెడ్డి గారు అన్నారు, కాని ఆ మాటలు పరిశీలనకు నిలవవు. వ్యక్తిగా పఠాభికి ఫ్రాయిడ్, వాల్ట్‌విట్‌మెన్ అభిమాన రచయితలన్నమాట ఆయనే చెప్పుకున్నాడు. కాని ఆయన కవిత్వంమీద ఆ ప్రభావాలుండడానికి అంతమాత్రాన ఆస్కారం లేదు. ఇలాగే పఠాభి మీద ఇలియట్ ప్రభావం ఉందని ఆరుద్ర అన్నమాట కూడా పరిశీలనకు నిలవదు. నగర జీవిత చిత్రణ చేసిన మొదటి తెలుగుకవి పఠాభి అని ఆరుద్ర అన్నారు. అక్షరాలా ఇది సరి కాదు. పఠాభి చేసినది ఏ జీవిత చిత్రణా కాదు. కాని పఠాభి ఫిడేలు రాగాలలో నగర వాతావరణం ఉంది. నిజమే కాని అంత మాత్రాన ఇలియట్ కీ ఈయనకీ పోలిక చూపించడానికి పూనుకోవడం సరికాదు. తెలుగు కవుల మీద ఇంగ్లీష్ కవిత్వపు ప్రభావాలు చెప్పడంలో ఇంతకన్నా ఎక్కువ మెలకువ అవసరం).

భావ కవతా పక్షపాతంతో రామిరెడ్డి, నారాయణరెడ్డి గార్లు పఠాభిని చూడగా, రమణారెడ్డిగారు అభ్యుదయ కవితాదృష్టితో చూశారు. పఠాభి ‘అహంభావ’ కవిత్వాన్ని విపరీత వ్యక్తి వాదంగా పరిగణించి, అది బూర్జువా బోర్‌డమ్‌ నుండి పుట్టిన కళారూపంగా భావించారాయన.

” చలనమే గాని నిలుపు లేదు. గవేషణమే కాని ఇష్టఫల సిద్ధి లేదు. తృష్ణేకాని తృప్తిలేదు. ఉన్నది సరిపోదు. లేనిదే కావాలి. ఉన్న దానితోనే ఈసడింపు, లేనిదానితోనే తగని వలపు. అందుచేతనే భావంలోకాని భాషలో కాని ‘నిత్య నవీనత’ ‘అపూర్వత’ లక్ష్యమౌతుంది. ‘వైచిత్రి’ ఆరాధ్యమవుతుంది. భాష నాజూకుగా లేదు కాబట్టి, అవసరం కొద్ది కాకుండా నాజూకు కోసం ఇంగ్లీష్ పదాలను తెచ్చి తెలుగు పదాలకు తోకలు తగిలించు సాంప్రదాయిక భావం కిట్టదు కాబట్టి, అరువు తెచ్చుకుని సొంతపరుచుకున్న నవీన పాశ్చాత్య భావాలను దేశవాళీ జనబాణీ భావాలకు ఎరువుపెట్టు.”

బలంగా ప్రతిపాదించిన తన విమర్శ్లలో రమణారెడ్డిగారు చేసే ముఖ్యమైన ఆరోపణ పఠాభిది వైచిత్రీ ప్రియత్వంకోసం వచ్చిన నవ్యత అని. రెండవ ఆరోపణ ఇందులో “శుష్క మనోవిలసనమేకాని హృదయ ప్రచాలనం దాదాపు లే” దని. మూడవ ఆరోపణ పఠాభి కవిత్వం ఏమీ బోధించదని. నాలుగవ ఆరోపణ అతను ‘పక్షాతీతు’ డనీ, ‘అలకా పురానికీ – అలగా జనానికీ జరిగే’ పోరాటంలో ఏ పక్షమూ వహించడనీ. ఈ కారణాలు చూపించి “ఈ మనస్తత్వం ఒక వ్యాధి లక్షణం అనీ, తనలో పేరుకుపోయిన జిడ్డు వంటి అసంయమిత క్షుద్రోద్రేకాలకు బానిస” అనీ నిర్ణయించారు రమణారెడ్డిగారు. తమ అభిప్రాయాలకు పాశ్చాత్య కవిత్వ విమర్శలో కూడా తోడ్పాటు ఉందని రోజర్ గరాడీ రాసిన లిటరేచర్ అఫ్ ది గ్రేవ్ యార్డ్ ని ఆధారంగా చూపించారు.

అసలు రోజర్ గరాడీ చేసిన విమర్శనీ, బూర్జువా బోర్‌డమ్ సిద్ధాంతాన్నీ పఠాభి కవిత్వానికి వర్తింపజెయ్య వచ్చునా అన్న సంగతి చూసే ముందు రమణా రెడ్డి గారు పరిగణించని అంశాలు రెండున్నాయి: 1. ఫిడేల్ రాగాలు ప్రచురితమైన సందర్భం; చారిత్రకంగా అప్పటి కవిత్వంలో ఈ పుస్తకం వల్ల నెరవేరిన ప్రయోజనం. 2) ఫిడేల్ రాగాలలో ‘కామా’ నికున్న పాత్ర. వీటిలో మొదటి అంశం ఈయన పూర్తిగా విస్మరించారు. రెండవ అంశంలో రామిరెడ్డి, నారాయణ రెడ్డి గార్ల లాగానే అతి నైతిక దృష్టి అవలంబించారు.

ఫిడేల్ రాగాల డజన్ భావకవిత్వానికి ‘దహన సంస్కారం’ చేసింది. ఇంక ఆ తరువాత ప్రతిభావంతులెవ్వరూ భావకవిత్వం రాయలేదు.

ఫిడేల్ రాగాలు ప్రధానంగా హేళన కావ్యమనీ, భావకవితా కాలంలో ప్రసిద్ధమైన శైలినీ, అభిప్రాయాల్నీ, దృష్టినీ, ధ్వంసం చేయడం దానివల్ల నెరవేరిన ప్రయోజనమనీ రమణారెడ్డి గారు గమనించలేదు. అందులో ఇంతగా కోపగించుకోవలసిన కామ విశృంఖలత నిజానికి లేదనీ, ప్రతి పద్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పరిశీలిస్తే కలిగేది అపహాస్య కామమే కాని కామోద్రేకం అందులో లేదని ఆయన చూడలేదు.

ఇక ఇందులో వైచిత్రీ ప్రియత్వస్వరూపం ఎలాంటిదో చూద్దాం. ఇందులో ఇంగ్లీష్ పదాల వాడిక, అసంప్రదాయక భావాల కూడిక, ఈ రెండింటికీ, విధ్వంసక తత్వమే ప్రధాన ప్రేరణలు. వీటికి కేవల వైచిత్రీ ప్రియత్వం కారణాలుగా ప్రతిపాదించడం సరికాదు. ఇందులోని ప్రతి కొత్త ప్రయోగమూ, ఊహ, అంతకు ముందు కవిత్వంలో ఒక నిస్సారమైన అంశానికి హేళన. ప్రయోజనరహితమూ, తదేక పరమార్థమూ అయిన కొత్తదనమే వైచిత్రీప్రియత్వం అవుతుంది. అలాంటిది బూర్జువా బోర్‌డమ్ ఫలితమని అనవచ్చును. కాని పఠాభి రచన ఆ నిందకి తగదు. ఏమన్నా అయితే ఇది ‘పాకీ సాహిత్యం’; literary scavenger పఠాభి .. సామాజిక ప్రయోజనం దీనివల్ల ప్రత్యక్షంగా లేదు. కాని జడతామయమైన సాహిత్య రూపాల్ని ధ్వంసం చేసిన రచన ఇది.

రోజర్ గరాడీ విమర్శనకు తెలుగు సాహిత్యంలోని ఈ పరిస్థితికి పోలికలేదు. యూరప్ లోని తాత్త్విక పరమార్థాల, ఆచరణ మార్గాల ఘర్షణలో, గతి తార్కిక భౌతిక వాదాన్నీ, కమ్యూనిస్టు రాజకీయాలనూ విడనాడి, తెగనాడి, ఒక అరాజక అనిబద్ధ స్వేచ్ఛాజనిత క్షోభనీ, గత్యంతర రహిత అశక్తతనీ అవలంబించి, దానికి విశేష ప్రచారం, ప్రాముఖ్యం కలిగించిన ఒక వర్గం రచయితలు ఏర్పడ్డ పరిస్థితిలో రోజర్ గరాడీ ఈ పుస్తకం రాశాడు. ఆ పరిస్థితిలో వర్తించే వాదనలను పఠాభి పుస్తకానికి పట్టించడం సమర్థం కాదు.

అహంభావ కవిని అని పఠాభి చెప్పుకున్న పేరు రమణారెడ్డిగారు కూడా వాచ్యార్థంలోనే గ్రహించారు. ఈ అహంభావం నిజానికి ఈ కవిత్వపు లక్షణం కాదు, భావ కవిత్వపు లక్షణం; సంప్రదాయ కవిత్వ లక్షణం.

ఎవ్వరని ఎంతురో నన్ను ఏ ననంత
శోక భీకర తిమిర లోకైక పతిని

అని అతిలోకమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకుంటాడు భావకవి. ఇక సంప్రదాయ కవులైతే కవిత్వ వ్యక్తి చాటు కూడా లేకుండా నేరుగా తమను గురించి తామే గొప్పలు చెప్పుకోడం ప్రత్యేక కళగా సాధన చేశారు. భావకవిత్వం నుండి అప్పుడే విడిపోయి ఒక కొత్త ప్రాచీన సంప్రదాయ మార్గానికి ఆచార్యత్వం వహించబోతున్న విశ్వనాథ సత్యనారాయణ గారు తాము – “అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయ మూర్తి” నని చెప్పుకున్నారు. ఈ లక్షణం మీద సాముదాయికంగానూ, భావకవి అహంకార ప్రదర్శనం మీద ప్రత్యేకంగానూ ఈసడింపు ప్రకటించే పేరు – పఠాభి పెట్టుకున్న ‘అహంభావ కవి’ అనే పేరు. దీనికి వాచ్యార్థం పొసగదు. అంతే కాదు ఫిడేల్ రాగాలలో ఒక విలక్షణమైన ఆత్మనిరాకరణతత్వం ఉంది. ఇది భావకవిత్వం పట్లా, సంప్రదాయ కవిత్వం పట్లా పరిహాస దృష్టిని కల్పించడమే కాని, తన రచనా మార్గంపట్ల అనుయాయిత్వాన్ని ప్రోత్సహించదు.

పఠాభిని చూసి ఇంగ్లీష్ – తెలుగు కలగాయ భాషతో రచనలు చేసిన వారు పఠాభి కవితా మార్గాన్ని అనుసరించడం లేదు. అతనిలో ఉపరితలం మీద కనిపించే లక్షణాలను అనుకరిస్తున్నారంతే. నిజానికి పఠాభికి ఇతరులు అనుసరించదగిన కవితా మార్గం లేదు. ఎలా రాయకూడదో చెప్పడమే అతని పుస్తకం చేసే పని.

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...