ఇతనికి కవిత్వం తెలుసు

వేలూరి వెంకటేశ్వరరావు నాకన్నా ఆరేళ్ళు చిన్నవాడు. ఏలూరు పవర్‌పేటలో మా ఇంటికి దగ్గర్లోనే వెంకటేశ్వరరావు ఇల్లు. మనిషి చూడ్డానికి దబ్బపండులా వుండేవాడు. నేను అతనితో తరచుగా మాట్లాడేవాణ్ణి. చురుగ్గా వుండేవాడు కాబట్టి అతనితో మాట్లాడ్డం సరదాగా వుండేది. అతను కాలేజీలో చేరక మునుపే నేను కాలేజీలో లెక్చరర్ అయాను. అతను కాలేజీలో చేరేనాటికి నేను పాఠాలు చెప్తున్నాను. అయితే వెంకటేశ్వరరావు వున్న సెక్షన్‌కి నేనెప్పుడూ పాఠాలు చెప్పలేదు. అంచేత అతను నాకు ఎప్పుడూ ప్రత్యక్షంగా శిష్యుడు కాడు. అయినా నేను లెక్చరర్‌ని. అతను స్టూడెంట్. అంచేత వెంకటేశ్వరరావు నన్నెప్పుడూ మీరు అనడం నేను అతన్ని ఎప్పుడూ నువ్వు అనడం కాలేజీలో అలవాటయి పోయింది. ఆ అలవాటు ఇప్పటికీ అలాగే వుంది.

వెంకటేశ్వరరావూ నేనూ రాత్రుళ్ళు దాదాపు ఒంటిగంటదాకా కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాళ్ళం. మాతో పాటు మా రాజు (పెన్మెత్స సూర్యనారాయణరాజు), పోణంగి రామకృష్ణరావు ఉండేవాళ్ళు. మేం నలుగురం టీ తాగుతూ ప్రపంచ సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. మా రాజు ఇంట్లో చాలా యూరోపియన్ పుస్తకాలు వుండేవి. ఉనామునో, కాఫ్కా, కాము, సార్త్ర – వీళ్ళ రచనలన్నీ నేను అప్పుడే చదివాను.

ఆ తరవాత వెంకటేశ్వరరావు కటక్ వెళ్ళాడు. ఉద్యోగరీత్యా. అక్కడ అతనికి ఒరియా సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా సౌభాగ్యకుమార్ మిశ్రా రచనలతో. అవి వెంకటేశ్వరరావుకి బాగా నచ్చాయి. వెనిగళ్ళ బాలకృష్ణరావుతో కలిసి సౌభాగ్యకుమార్ మిశ్రా పుస్తకాలు రెండు తెలుగులోకి వెంకటేశ్వరరావు అనువాదం చేశాడు. ఈ అనువాదాలలో కవిత్వ భాగం వెంకటేశ్వరరావుది. ఒరియా మాటలకి తెలుగు అర్థాలు చెప్పే పని వెనిగళ్ళ బాలకృష్ణరావుది. వాటిని గురించి కొంత వివరంగా చెప్పడం ఈ వ్యాసంలో ముఖ్యభాగం.

అనువాదం అనే మాట తెలుగులో పెద్ద కవులు ఎప్పుడూ ఎవరూ వాడకపోయినా ఆ మాటకి తెలుగులో ఇప్పుడు వచ్చిన అర్థం ఇంతకు ముందు ఎప్పుడూ లేదని వెంకటేశ్వరరావుకి తెలుసు. అందుకని వాళ్ళిద్దరూ ఒరియా నుంచి సౌభాగ్యకుమార్ మిశ్రా కవిత్వపు పుస్తకాలు తెలుగులోకి తెచ్చినప్పుడు వాటిని అనువాదం అనకుండా అనుసృజనలు అన్నారు.

ఈ మాట చాలా ఆలోచనతో అన్న మాట. తెలుగులో మనం ఎప్పుడూ దేన్నీ అనువాదం చెయ్యలేదు. మహాభారతాలని, రామాయణాలని, ఇంకా అనేక పురాణాలని తెలుగులోకి తెచ్చిన వేటినీ మనం అనువాదాలు అనలేదు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనం సంస్కృతంలోంచి ఒక రకమైన పుస్తకాలనే తెలుగులోకి తెచ్చుకున్నాం. కొంచెం వివరంగా చెప్పాలంటే పుస్తకాలని మన అలంకారశాస్త్రం మూడు రకాలుగా విభజించింది. శబ్ద ప్రధానం, అర్థ ప్రధానం, శబ్దార్థ ప్రధానం అని. ఈ మాటని నేను అనువాదాలు అపవాదాలు అనే వ్యాసంలో వివరించాను. శబ్ద ప్రధానమైన గ్రంథం అనువాద సాధ్యం కాదు. వేదం శబ్ద ప్రధానం. వేదాన్ని మనం ఎప్పుడూ అనువాదం చెయ్యలేదు, ఈమధ్య 20వ శతాబ్దంలో జరిగిన ప్రయత్నాలని వదిలేస్తే. కవిత్వం శబ్దం, అర్థం కలిసిన ఉభయ ప్రధాన గ్రంథం. కవిత్వాన్ని కూడా మనం ఎప్పుడూ అనువాదం చెయ్యలేదు. కాళిదాసు, భవభూతి, మురారి, ఇలాంటి వాళ్ళ పుస్తకాలు మనం సంస్కృతంలోనే చదివాం. వాటిని తెలుగులోకి తేవాలని ఎవరూ ప్రయత్నించలేదు, ఈమధ్య కాలం వరకు.

శ్రీనాథుడు దీనికొక అపవాదం. హర్ష నైషధాన్ని అతను తెలుగులో చెప్పాడు. దాని గురించి చెప్పడం మొదలు పెడితే ఈ వ్యాసం అనావశ్యక విషయాలతో నిండిపోతుంది. అందుకని ఇక్కడ మనం చెప్పుకోవలసింది పై మూడు రకాల పుస్తకాల్లో అర్థ ప్రధానమైన పుస్తకాలనే తెలుగులో చెప్పాం అని గుర్తించడం మాత్రమే. మహాభారత రామాయణాలు, ఇతర పురాణాలు అర్థప్రధానమైన గ్రంథాలు. అంటే అవి సంస్కృతంలో ఏ మాటలతో వున్నాయో ఆ మాటల్ని మనం పట్టించుకోవక్కరలేదు. అందులో వుండే అర్థాన్ని తిరిగి తెలుగులో చెప్తే చాలు. అంటే తెలుగులో వున్న మహాభారత, రామాయణాలలాంటివన్నీ సంస్కృతంలో వున్న పుస్తకాలకి అర్థానువాదాలే. వెంకటేశ్వరరావు ఒరియా నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలని అనుసృజనలు అనడానికి కారణం ఇదే.

ఇందాక వివరంగా చెప్పడం మానేసి ఆపిన శ్రీనాథుడి దగ్గరికి మళ్ళీ వద్దాం. శ్రీనాథుడొక్కడే హర్ష నైషధాన్ని కావ్యానువాదం చేశాడు. వెంకటేశ్వరరావు, బాలకృష్ణరావు సౌభాగ్యకుమార్ మిశ్రా ఒరియా కవిత్వాన్ని అనువదించేటప్పుడు చేసిన పని శ్రీనాథుడు చేసిన పనిలాంటిది. ఒరియాలో వుండే కవిత్వానుభవాన్ని వీళ్ళు తెలుగులోకి తెచ్చారు. అందుకే దాన్ని అనుసృజన అన్నారు. వీళ్ళు చేసింది పునఃసృష్టి. సృష్టి అని ఎందుకన్నానంటే తెలుగులో వీళ్ళు ఒరియా కవిత్వం లాంటి కవిత్వాన్ని రాస్తున్నారు కాబట్టి. కవిత్వం ఎప్పుడూ సృష్టించబడాలి. కవిత్వం ఎప్పుడూ కొత్తగానే వుండాలి.

సౌభాగ్యకుమార్ మిశ్రా లాంటి కవి తెలుగులో లేడని వేలూరి వెంకటేశ్వరరావు, వెనిగళ్ళ బాలకృష్ణరావు చేసిన ఈ రెండు పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఇంతకీ ఇందాకనే చెప్పుండాల్సింది, ఈ రెండు పుస్తకాలలో ఒకదాని పేరు అవ్యయ. రెండవదాని పేరు ద్వాసుపర్ణా. ఇందులో ద్వాసుపర్ణా గురించి ముందు రాస్తాను. ద్వాసుపర్ణా అనే మాటతో మొదలయే శ్లోకం ముండకోపనిషత్తులో వుంది. (శ్వేతాశ్వతరోపనిషత్తులో కూడా.)

ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయో రన్య: పిప్పలం స్వాద్వత్త్వనశ్య న్నన్యో అభిచాకశీతి
(ముండకోపనిషత్తు 3.1.1)

తెల్లపిట్ట నల్లపిట్ట అని ఈ పుస్తకంలో మొదటి పద్యానికి పేరు. ఒరియాకి తెలుగుకి చాలా దగ్గర సంబంధం వుంది. ఒక భాషలో వున్న కొన్ని మాటలు ఇంకో భాషలో వున్నవి వున్నట్టుగా వాడుకోవచ్చు. తెలుగులో ఈ పద్యం ఇలా వుంటుంది.

ఆనాటి ఆకాశంలా ఈ ఉపరితలం విశాలంగా లేకపోతే
తెల్లపిట్ట మాత్రమే ఎగరగలదు,
లేదా నల్లపిట్ట మాత్రమే ఎగరగలదు,
తెల్లపిట్టా నల్లపిట్టా రెండూ ఒకేసారి ఎగరలేవు.

ఇప్పుడైతే వట్టి తెల్లపిట్ట మాత్రమే ఎగురుతున్నది.
ఉపరితలం త్వరత్వరగా మారిపోతున్నది, `సా´ నుండి `రీ´ కి,
`రీ´ నుండి `గా´ కి, సూర్యకిరణాలకి తాళం వేస్తూ;
నల్లపిట్ట వచ్చి ఎగరటానికి ఇది తరుణం కావచ్చు.

దృష్టి సహజంగా ఎప్పుడూ పాత కంచె పైభాగాన్నే ఉండిపోతుంది,
తరుణం దాటితే తెల్లదింటెన తీగె మీద శంఖుపూల కోసం క్రిందికి దిగుతుంది,
లజ్జా లతకు ఏ వెదురుకణుపు దగ్గిరనో పెరిగిన పుట్టగొడుగు మీదకి,
ఈ అంతిమ సమయంలో
యావత్తూ మారిపోకుండా ఉంటేనో, కనిపించకుండా పోతేనో
తను తెల్లపిట్ట నల్లపిట్టల మధ్య భేదం గుర్తించలేడు.

ఇక్కడ ద్వాసుపర్ణా అని వినగానే పండితుల ఊహ ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోతుంది కాని ఉపనిషత్తుల్లోని వేదాంత అర్థాలేవి ఇక్కడ పట్టవు. మనస్సు అనే ఉపరితలం విశాలంగా లేదనుకోండి, అప్పుడు ఏదో ఒక దృష్టి మాత్రమే దానికి సాధ్యపడుతుంది. రెండు పక్షులు రెండు రకాల దృష్టులకి గుర్తు అనుకుంటే ఆ రెండు విశాలంగా లేని మనసులో ఒకచోట దొరకవు. సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయి. ఇంద్రధనస్సు అందులోంచే కనిపిస్తుంది మనకు. కాని సంగీతంలో వుండే సరిగమపదనిసలు కూడా సూర్యకాంతిలోనే వున్నాయి. ఈ క్షణం ఇంద్రధనస్సులో ఆ సంగీతం వినిపిస్తుంది అనుకోండి. మనసు ఎంత విశాలంగా ఏడు రంగుల్ని, సప్తస్వరాల్నీ ఒకేసారి చూడగలిగి/వినగలిగి ఉందనుకోండి. ఆ క్షణం రెండు పక్షులు కలిసి ఎగరడానికి తగిన క్షణం. మనఃప్రపంచం సంగీతాన్ని రంగులుగాను, రంగుల్ని సంగీతంగాను వినగలిగే/చూడగలిగే శక్తిని తెచ్చుకున్నదన్న మాట. కాని మనసెప్పుడు అలవాటయిన మార్గంలోనే వెళ్తుంది. అంటే పాత కంచె పై భాగాన్నే వుండిపోతుంది. మనోనేత్రం తన ప్రపంచాన్ని ఈ అలవాటు దాటి పైకి పోలేదు. ఈ స్థితిలో మనిషి సంగీతాన్ని వినడు, రంగుల్ని చూడడు. తెల్లపిట్టకి, నల్లపిట్టకి మధ్య వున్న భేదం గమనించలేడు.

ఈ పద్యం మళ్ళామళ్ళా చదవండి. ఈ ప్రపంచంలో మీకు అలవాటయిన పరిధుల్ని దాటి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళగలరేమో చూడండి. రకరకాల ఊహలకి విశృంఖలంగా అవకాశాన్ని ఇస్తుంది. అది పుచ్చుకుని మీ ఆకాశం విశాలం చేసుకుని మీ అలవాట్లని బద్దలు కొట్టుకొని ఈ పద్యం మిమ్మల్ని రకరకాల రంగుల బొమ్మల్లోకి తీసుకెళ్తుంది. అవన్నీ అర్థం అయ్యాయి అనుకోకుండా అర్థం అనే మాటకున్న సంకుచిత పరిధి దాటి వెళ్ళి చూడండి. ఎన్ని సార్లు చదివితే అన్ని రకాలుగా అర్థం అవుతుంది ఈ పద్యం.

మనందరం ఎరిగున్న కథ శకుంతల కథ. ఇది మహాభారతంలో ఒకసారి, దానినే కాళిదాసు మార్చి నాటకంగా శాకుంతలం రాసినప్పుడు ఇంకొకసారి – ఈ రెండు కథల్లో ఏ కథ గుర్తొచ్చినా సరే సౌభాగ్యకుమార్ మిశ్రా రాసిన శకుంతల అన్న పద్యానికి నేపథ్యంగా పనికొస్తుంది. ఈ పద్యంలో శకుంతల దుష్యంతుణ్ణి గురించి గౌరవంగానే మాట్లాడుతుంది. ఈ దుష్యంతుడు శకుంతలని మొదట్లో హా హా హా అని గేలి చేస్తూ నవ్వుతాడు. తరవాత దుష్యంతుడికి సద్బుద్ధి కలుగుతుంది. చివరికి ఈ కథలో దుష్యంతుడు శకుంతలకి లోబడిపోతాడు. కాని శకుంతల ఆశ్చర్యంగా నాకు కావలసింది కేవలం ఉంగరం మాత్రమే అని ఆ వుంగరం తీసుకుని వెళ్ళిపోతుంది. ఇందులో వెంకటేశ్వరరావు అనువాదం, బహుశా సౌభాగ్యకుమార్ మిశ్రా రాసిన మూల పద్యం రెండూ కూడా మనని వాక్యం వాక్యం ఆశ్చరపరుస్తాయి. వెంకటేశ్వరరావు తన రచనని అనుసృజన అని ఎందుకన్నాడో మనకు ఈ పద్యంలో మరీమరీ బోధపడుతుంది. శకుంతలకి కావలిసింది ఉంగరం ఒక్కటే. ఆ ఉంగరమే వాళ్ళని కలిపింది, విడదీసింది కూడా. ఆ ఉంగరం వెనకాతల శకుంతల బలహీనత దుష్యంతుడి బలము రెండూ వున్నాయి. ఆ రెండిటినీ కాదని తనకి దుష్యంతుడు అక్కర్లేదని ఉంగరం మాత్రం తనకి కావాలని శకుంతల అనడంలో మనకి రకరకాల ఆశ్చర్యాలు కలుగుతాయి. కాని శకుంతల తనకి ఆ ఉంగరం కావాలని అడగటంలో కవి ఉద్దేశ్యం ఏమిటి? మనం రకరకాలుగా ఆలోచించొచ్చు. ఈ పద్యానికి యెన్ని రకాల అర్థాలు చెప్పినా చివరికి శకుంతల గెలుపుకి ఆ ఉంగరం తనకి కావాలని అడిగి తీసుకోవడంలో అంతరార్థం బోధపడుతుంది. కాని దీనిలో చివరికి గెలిచేది బలహీనంగా వున్న శకుంతల కాదు. ఆ ఉంగరం తన సొంతం చేసుకోడంలో మొత్తం పరిస్థితుల మీద గెలుపు సాధించింది శకుంతల. మిగతా అన్ని పద్యాల్లో లాగే ఈ పద్యం కూడా మనం ఒక్కసారి చదివితే అర్థం కాదు. మళ్ళా మళ్ళా చదవాలి. వెంకటేశ్వరరావు అనువాదంలో పద్యం ఇది.

ఆయన నన్ను గుర్తించలేదు, గుర్తుపట్టలేకపోయారు,
నిస్సహాయస్థితిలో అడిగారు, పేరూ ఊరూ
నా ఆత్మగౌరవం దృఢమౌతూన్నది,
ఎప్పుడైతే నేను తిరిగిపోనని పట్టుపట్టానో
నేను పిచ్చిదాన్నని అనుకున్నారో ఏమో
సభాసదులకేసి చూసి హా! హా! అని గేలిచేస్తూ నవ్వారు,
తరువాత వారికి సద్బుద్ధి కలిగిందనిపిస్తుంది,
భోజనం పెట్టి నన్ను మర్యాదగా తిరిగి పంపించమని చెప్పారు.

దూరాభారం గురించి ఏమనుకున్నానో, అది మరిచిపోయాను.
లేడిపిల్లలా తనే నాకేసి చూస్తూ ఉండిపోయారు.
ఆ సభాస్థలి నాన్నగారి ఆశ్రమంలా అగుపించింది,
మెట్లు దిగుతున్న నాకనిపించింది,
వారి కళ్ళు రెండూ, నా స్నేహితులు
అనసూయా ప్రియంవదా లాగా నా పక్కనే వస్తున్నట్టు.
తను పొదిలో బాణం ధనుస్సులో సంధించి,
లేడిపిల్ల మీదా, నెమలి మీదా,
దేనిపై గురిపెట్టాలో నిర్ధారణ చేసుకోలేకపోతున్నారు.

అందుచేత, నేను చాలారోజులపాటు అక్కడే ఉండిపోయాను,
రాణివాసమంతా నా అందెల గలగల ధ్వనితో నిండిపోయింది,
వేటకెళ్ళి అలసిపోయి తిరిగి వస్తుంటారు,
సెలయేట్లో ముఖం కడుక్కుంటారు,
వెలవెలబోయిన తన స్మృత్యంధకారంలో,
నేనొక సెలయేరులా ప్రవహిస్తుంటాను,
నేను వారికి నచ్చిన పాట పాడుతూ,
నీరెండవడిలో తళతళ మెరుస్తూ
గోప్యంగా కదులుతున్న నా కన్నీటిబొట్లు
చూపించటానికని ఎన్నడూ వారిని దగ్గిరకు లాగలేదు.

ఒకరోజు తెల్లవారుఝామున,
అప్పుడే ఆరిన దీపపువత్తి వాసనతో నిండిన పడకగది నుంచి,
దిగ్భ్రమతో నేను గాఢనిద్రలోనున్న వారి కౌగిలి
తప్పించుకుని, నేనెరిగిన నది వడ్డుకు వచ్చాను;
జాలరివాడిని నావ కట్టు విప్పమన్నాను, వల సరిచెయ్యమన్నాను
చేపలకి చెప్పాను, లేవండి పట్టుపడటానికిది సమయం, అని.
‘ఏడు తాళవృక్షాల’ లోతున నా గర్భపు నీటిలో
దాగి ఉన్న నక్షత్రానికి చెప్పాను:
రా! ఆడుకుందాం, సింహాన్ని పిలుచుకొని రా,
చాలా దూరం నుండి వినిపించింది నాన్నగారి మంత్రోఛ్ఛారణ
నా దుర్బల ఆత్మాభిమానపు ప్రతిధ్వనిలా.

మొట్టమొదటినుంచీ నాకు తెలుసు, తను ఇలా వస్తారని
మలమల మాడుతున్న ఎండలో ముఖం ఎర్రగా మాడి మాడి,
తల నుండి చెవుల అంచుల నుండి చెమటలు కారిపోతూ
మా ఇద్దరికీ మాత్రమే తెలిసిన అనిశ్చిత సత్యసముఖానికి,
ఆశ్చర్యంతో ఆగిపోయి, కిరీటం తీసి;
ధనుర్బాణాల సమేతంగా తను లోబడుతారు,
నేను చెపుతాను, నాకు కావలసింది కేవలం ఉంగరం మాత్రమేనని.

అహల్య కథ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ కథని పూర్తిగా మార్చి కొత్త ఆలోచనలు కొత్త ఆశ్చర్యాలు పుట్టిస్తాడు సౌభాగ్యకుమార్ మిశ్రా. తెలుగులో మళ్ళామళ్ళా చదవాలనిపించే అనువాదం లేదా వెంకటేశ్వరరావు మాటల్లో అనుసృజన ఈ పద్యానికి మరీ విశేషంగా వర్తిస్తుంది. అహల్య కథ సంస్కృతంలోనూ తెలుగులోనూ తిన్నగా చెప్పడానికి వీలైన కథ కాదు. అందులో చాలా ప్రశ్నలకి ఆస్కారం వుంది. ఇంద్రుడు గౌతముడి వేషంలో ఒక తెల్లవారు ఝామున అహల్య దగ్గరకి వచ్చాడని స్థూలంగా చెప్పడానికి వీలైన అంశం. కాని ఆ వచ్చినవాడు ఇంద్రుడని అహల్యకు తెలుసా? అసలు ఇంద్రుణ్ణి ఆ సమయంలో రమ్మనమని అహల్యే పిలిచిందా? అహల్య చేసిన పని అహల్య కోరుకున్నదేనా? లేదా అహల్య అమాయకురాలు, ఇంద్రుడు ఆవిణ్ణి మోసగించాడు అని చెప్పొచ్చా? గౌతముడు అహల్యకి, ఇంద్రునికి ఇచ్చిన శాపాలు ఏమిటి? ఈ ప్రశ్నలకి వేటికీ ఒకే సమాధానం లేదు. కథ చెప్పేవాళ్ళని బట్టి ఆ సమాధానాలు మారతాయి. అంచేత అహల్య కథ చెప్పేవాళ్ళు ఎవరైనా సరే అసందిగ్ధంగా చెప్పడానికి వీల్లేదు, ఒక్క సౌభాగ్య మిశ్రాని తప్పిస్తే, అతని పద్యాన్ని తెలుగులోకి అనుసృజించిన వెంకటేశ్వరరావుని తప్పిస్తే.

ఆ అనుభవం
తను ఆశించినదీ కాదు
ఇతరుల బలాత్కారమూ కాదు.

పరిచితమైన వారి ముఖం
ఎల్లప్పుడూ ఎలా కనిపిస్తుందో
అలాగే గంభీరంగా, ఉజ్వలంగా,
కనిపిస్తోంది.

నాకు గుర్తుంది, నేను ఈ మాత్రమే అడిగాను,
ఇంత త్వరగా మీరు తిరిగి వచ్చేశారేమిటీ? అని.
తను ఏదో సమాధానం చెప్పేసి
కాళ్ళూ చేతులూ కడుక్కున్నారు,
నా చేతులు పట్టుకొని తీసుకెళ్ళారు రెల్లు మంచం దగ్గిరకు;
నేను హోమాగ్ని ఎలా సమకూర్చే దానినో
అలాగే ఆత్మ విశ్వాసంతో, పరిపూర్ణమైన శాంతితో,
సంతృప్తికరంగా.

కళ్ళు మూసుకుపోతున్నాయి,
సూర్యుణ్ణి కప్పేసి, సూర్యుడి స్మృతిలో పద్మాలు మూసుకుపోతున్నట్లు;

నేను ఒక మెరుపులాగా మెరుస్తుండి పోయాను.
గలగల అల్లరి చేసే నీళ్ళు నిశ్చలమయ్యే ముందు,
నేను నా ప్రతిబింబంలో కలిసి పోకముందే,
వారు నన్ను నా పేరు పెట్టి పిలిచారు,
ఆశ్రమం బయట
మాలతీ తీగ మొదలు ఎండిపోవటం చూసి
అలవాటుగా అధిక్షేపించారు.

నాకేమీ అర్థం కాలేదు
ఏ పాదాల శబ్దం నిజమో
ఏ కంఠధ్వని నిజమో
బొత్తిగా అర్థం కాలేదు.
నేను మాటలుడిగి నిలబడ్డాను.
నా గొంతు వణికి దర్భపోచలా కలిసిపోయింది
వారి ప్రజ్వల శాపాగ్నిలో.

ఏమిటి?
ఆ అగ్ని నా అవివేకతకి
పారంపర్య పారితోషికమా?
దక్షిణం దక్షిణమేనా, ఉత్తరం ఉత్తరమేనా,
ఏమిటి?
వర్షించబోయే మేఘానిదా,
ఎదురుచూసే రాతిదా?

ఎవరికి తెలుసు? ఏ పాదస్పర్శతో
తిరిగి నేను అశోకవృక్షంలా చిగురిస్తానో.
కాని, తను మాత్రం ఇక ఉండరు,
ఆశ్రమం ఖాళీగా పడి ఉంటుంది
వారి సహజ స్వభావంలాగా, వారి శాపంలాగా.

తెలుగులో ఈ కథ అహల్యాసంక్రందనము అనే పేరుతో మన సాహిత్య చారిత్రకులు ఇది క్షీణయుగం అని కొట్టి పారేసిన తంజావూరు యుగంలో సముఖము వెంకటకృష్ణప్పనాయకుడు రాశాడు. ఈ పుస్తకం అచ్చు వేసినవాళ్ళే దీన్ని ప్రత్యేకంగా ‘పండితులకి మాత్రమే’ అని రాసి మరీ అచ్చు వేశారు. తెలుగు సాహిత్య చరిత్రకారుల దృష్టిలో ఇది అశ్లీల గ్రంథం. కాని సముఖము వెంకటకృష్ణప్పనాయకుడు దీన్ని చాలా విశృంఖలంగా ఆనందంగా రాశాడు. పైగా దీన్ని శ్రీరంగంలో విష్ణువుకి అంకింతం ఇచ్చాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే శ్రీరంగంలో వుండే విష్ణువు సముఖము వెంకటకృష్ణప్పనాయకుడికి కలలో కనిపించి ఈ పుస్తకం రాయమని, తనకి అంకితం ఇవ్వమని కోరాడు కూడా. తెల్లవారు జామున వచ్చిన ఈ కల కవిని ఆశ్చర్య పరిస్తే అతను తన ఆస్థానంలో వుండే పండితుల్ని, ఇతర ముఖ్యుల్ని సమావేశపరిచి, వాళ్ళకి ఈ కల గురించి చెప్పిన తరవాత వాళ్ళు ఈ కలకి వివరంగా వ్యాఖ్యానాన్ని చెప్పి, చాలా శుభకరమైన కల ఇది, ఈ పుస్తకం నీవు రాయవలసిందే అని ప్రోత్సహిస్తారు. ఆ రకంగా సముఖము వెంకటకృష్ణప్పనాయకుడి అహల్యా సంక్రందనం చాలా నిరాపేక్షణీయమైన చట్రంలో ఇమిడి వుంటుంది.

కథ మొదలయిన తరవాత ఇంద్రసభలో ఇంద్రుడే ఒక ప్రశ్న వేస్తాడు. తన కొలువులో వున్న దేవవేశ్యల్లో ఎవరు ఎక్కువ అందమైన వాళ్ళు? అక్కడ వున్న మునులందరకీ ఎవరు తమకి ఇష్టమైన వేశ్యో ఆ అమ్మాయే అందరికన్నా అందమైనది. ఒకరి తరవాత ఒకరు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలా చెప్పుకుంటూ పోతారు. వాళ్ళలో వాళ్ళకి విపరీతమైన కోపాలు వస్తాయి. ఒకరిని ఒకరు దారుణంగా తిట్టుకుంటారు. ఇంద్రుడు వాళ్ళని ఆపి,‘ఉండండి వీళ్ళందరినీ సృష్టించినది బ్రహ్మ కదా అలా అయితే బ్రహ్మ దగ్గరకే వెళ్దాం’ అంటాడు. అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ‘ఇంతవరకు నేను సృష్టించిన వాళ్ళలో ఎవరూ కూడా నిజంగా నేను ఊహించినంతటి అందమైన వాళ్ళు కాదు. లోకోత్తర సౌందర్యవతి అయిన స్త్రీని నేను ఇంతవరకు సృష్టించలేదు. ఆ పని ఇప్పుడు చేస్తాను’ అని తన ఊహ అంతటిలోను పరమోత్కృష్టంగా భావించిన ఒక అమ్మాయిని సృష్టించి ఆమెకు అహల్య అని పేరు పెడతాడు. ఈ అహల్య ఇంతవరకు వున్న స్త్రీలందరికన్నా అందమైనది. ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై, అహల్య అందాన్ని చూసి తలమునకలుగా ఆవిణ్ణి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఆ అమ్మాయిని తనకే ఇవ్వాలని కోరుకుంటాడు. బ్రహ్మ అక్కడ వున్న ఋషుల్లో ‘గౌతముడు ఉత్కృష్టమైన ప్రాభవం కలవాడు. అందుకని ఈ అహల్యని గౌతమునికి భార్యగా ఇస్తున్నాను’ అని నిర్దేశిస్తాడు. ఇంద్రుడు పూర్తిగా నిరుత్సాహపడతాడు. అహల్యని మరిచిపోలేక అహల్యా విరహంలో రోజులు గడుపుతూ వుంటాడు. ఆ తరవాత అహల్య ఇంద్రుడు తనకి దొరకలేదే అని విషాదంగా, అయినా గౌతముడి సేవ తనకి విధ్యుక్త ధర్మమని గౌతమ సేవ చేస్తూ వుంటుంది. అయినా ఇంద్రుణ్ణి మరచిపోలేక బాధపడుతూ వుంటుంది.

గౌతముడు తెల్లవారు ఝామున స్నానానికి వెళ్ళినవాడు అలా తొందరగా వెనక్కి రావడంతో ఈ పద్యం మొదలవుతుంది. అంటే అహల్యకి తిరిగి వచ్చినవాడు గౌతముడే అనే ఊహే వుంది. కాని వెంటనే ‘వారు నన్ను నా పేరు పెట్టి పిలిచారు’ అనే సరికి అహల్య ఈ గౌతముడు నిజం గౌతముడు కాదు అనుకుంది అనే సంగతి మన ఊహకి వస్తుంది. ఆ తరవాత నాకేమీ అర్థం కాలేదు. ఏ పాదాల శబ్దం నిజమో ఏ కంఠధ్వని నిజమో బొత్తిగా అర్థం కాలేదు… తరవాత తెలుస్తుంది ఆయన శపించిన సంగతి, ఎదురు చూసే రాతిదా? అనే మాటతో. ఎవరికి తెలుసు? ఏ పాదస్పర్శతో తిరిగి నేను అశోకవృక్షంలా చిగురిస్తానో అనేసరికి కథ పూర్తవుతుంది. అహల్య రాయి అయిపోవడం రాముడి పాదస్పర్శకి ఆమె తిరిగి మరల మనిషి అవడం మనకి తెలిసిన కథ. కాని ఈ పద్యంలో చివరికి గౌతముడు రాడు. ఆశ్రమం ఖాళీగా పడి వుంటుంది. వారి సహజ స్వభావంలాగా, వారి శాపంలాగా.

దాంతో మనకి బోధపడేదేమిటి? చివరికి గౌతముడు శపించింది ఎవరిని? తనని, తన ఆశ్రమాన్ని. ఈ పద్యంలో మనకి ఇంద్రుడు కనిపించడు. ఎక్కడో నేపథ్యంలో వుంటాడు. అహల్య అశోకవృక్షంలా పెరిగి పరిపూర్ణమవుతుంది. గౌతముడి శాపం గౌతముడికే తగుల్తుంది. ఈ కథకి ఇంతకుముందు మనం యెరిగి వున్న ఏ రూపంలోనూ ఈ అర్థం రాదు. ఈ కథలో చివరికి గెలిచింది అహల్య. మాడి మసి అయిపోయినవాడు గౌతముడు. ఇదే సౌభాగ్యకుమార్ మిశ్రా మనకి చెప్పదలచుకున్న విషయం. అయితే ఈ అనుభవం మనకి కొత్తది. ఇలా కాక ఈ పద్యాన్ని ఇతర రకాలుగాను చదవచ్చు. ఇంతగా మనకి రకరకాలుగా పరిచయమైన అహల్య కథ ఇది కాదు.

ఇంతవరకు నేను ద్వాసుపర్ణా లోని పద్యాల గురించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు వెంకటేశ్వరరావు, వెనిగళ్ళ బాలకృష్ణరావు అనుసృజన చేసిన ఇంకొక పుస్తకం సౌభాగ్యకుమార్ మిశ్రాదే, అవ్యయ గురించి రాస్తాను. నిజానికి ఈ పుస్తకం ద్వాసుపర్ణా కన్నా ముందు ప్రచురించిన పుస్తకం. ఇందులో సౌభాగ్యకుమార్ మిశ్రా My Two Cents అనే పేరుతో ఒక చిన్న వ్యాసం కూడా రాశాడు. అందులో మిశ్రా ‘ఈ పద్యాలు దాదాపు 50 ఏళ్ళ క్రితం రాసినవి’ అని చెప్తాడు. అతని మాటల్లో ‘Translating poetry is never too easy. One can not really – ‘translate’ one can at the best ‘trans-create’ that’s what I am trying to do.” ఈ పుస్తకంలో మొదటి పద్యం – అద్దం, ఒరియాలో దర్పణ.

సుమారు రాత్రి పన్నెండున్నరకి
అద్దంలో నేను నా నిజ ప్రతిబింబం చూస్తాను
ఒక వేళ నేను హఠాత్తుగా బీటలు వారి ముక్కలు ముక్కలై పడిపోతే
ఈ అద్దం కూడా బీటలు వారి ముక్కలు ముక్కలై నలుపక్కలా
చిందరవందరగా పడుతుందా?

ఒకసారి ఎక్కడో చూసిన గుర్తు, ఏదో చిన్న శబ్దానికి భయపడి
సీతాకోకచిలుకలన్నీ ఎగిరిపోయాయి,
నేను చూశాను, అణువణువునా ఆశ్చర్యం స్పందించిన స్థలం;
ఆ చోటు అలా మిగల్లేదు, మొత్తం
ముక్కలు ముక్కలై పడింది అటూఇటూ, ఎవరో విసిరేసినట్టు.

ఆశ్చర్యం ఎవరిది? నాదా? నేను డిగ్రీ తెచ్చుకున్నప్పటి ఫోటోది!

నేను ఒకవేళ తెలుసుకుని ఉంటే, నక్షత్రాలు కూడా
ముక్కలు ముక్కలై పడిన అద్దంపెంకుల్లా
నా రక్తాన్ని రుచి చూస్తూ ఉంటాయి,
వాటి మసకవెలుగులో నేను కనిపిస్తూనే ఉంటాను,
ఆశ్చర్యంగా, ఆరోగ్యంగా, మొండిగా, వాంఛారహితంగా,
అప్పుడు నాకు నిశ్చయంగా బోధపడి ఉండేది,
ఈ భూమిపై అంతా కపటనాటకం, అని.

ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. ఏది ప్రతిబింబం? ఏది నిజం? అద్దంలో చూసే నేను నిజమా, అద్దం బయట నేను నిజమా! ఈ పద్యం బింబానికి ప్రతిబింబానికి ఏది నిజం అని అనుమానం కలిగింప చేస్తుంది. ఈ పద్యం చివరికొచ్చేసరికి

అప్పుడు నాకు నిశ్చయంగా బోధపడి వుండేది
ఈ భూమిపై అంతా కపట నాటకం అని.

ఆ రెండు పంక్తులు చదివేసరికి అద్దం మనకు నేర్పే అసలైన నిజం బోధపడుతుంది. మనం ఆడేది నాటకం. అబద్ధపు నాటకం. అద్దం చెప్పే నిజం అది. ఇది చాలా మంచి పద్యం. మళ్ళా మళ్ళా చదివితే రకరకాలుగా బోధపడే పద్యం.

నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి బయలుదేరావో
ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు,
నీకు తెలిసిందా నేను హఠాత్తుగా చనిపోతానని
నేను ఇక్కడ ఉండనని, నాతో పాటు నువ్వు రొట్టె తినటానికి.

మనం ఇద్దరం మౌనంగా కూచున్నాం
ఏతా వాతా కబుర్లు చెప్పుకుంటున్నాము
ప్రక్కనే అలలు నిర్విరామంగా గంటలు కొడుతున్నాయి
వెలిసిపోతున్న వెన్నెలలో నేను చూశాను
నా రక్తమాంసాలు పాము కుబుసంలా జారి
ఇసుకలోనో, సముద్రం నీళ్ళలోనో పడటం.

నువ్వు తరువాత వంటరిగా వెళ్ళిపోయావు
తలుపు తాళం తీశావు స్విచ్ వేసి చూశావు
కుర్చీలో కూచొని వున్నది నా ప్రేతాత్మ
నిన్ను ప్రక్కకు పిలిచి చెప్పింది, “మూసెయ్యి ఆ తలుపు నాది,
చూడు నా ఎముకల బాధ; చూడు నా మండే పుర్రె,” అని.

నేను ఎన్నిసార్లు రాశానో నీ పేరు సముద్రపొడ్డున ఇసుకలో
నేను చెప్పాను, నా మనసు పాటలమయం నీలిరంగు సరివితోట.
ఆఫీస్ కుర్చీలో కూచొని లెక్కపెట్టాను నా జీతపురాళ్ళు
మృత్యువుకి, స్వర్గలోక జన్మకీ నేను కారణాలు వెతికాను.

ఉదయం హఠాత్తుగా చూశావు నువ్వు
పళ్ళు తోముకుంటున్న నన్ను
న్యూస్‌పేపర్‌లో చదువుతున్నాను నా చావుకబురు
నేను అంటున్నాను,
“నువ్వు ఎంత అందంగా ఉన్నావు? ఇవాళ ఆదివారం, కదూ!” అని!
నా జేబులో మిగిలి ఉన్నాయి గుప్పెడు గవ్వలు
దూరంగా మిగిలిన నీలి సముద్ర జలస్మృతులు.

ఇంకొక పద్యం ‘అవ్యయ’. అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు. ఎవరో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇందులో నువ్వు ఇందులో నేను ఒకరికొకరు దగ్గరివాళ్ళు. చదివేవాళ్ళు మొగాళ్ళైతే అందులో ‘నువ్వు‘ ఆడదేమో ‘నేను’ మొగాడు అని అనుకోవచ్చు. కాదు చదివేవాళ్ళు ఆడవాళ్ళైతే ‘నేను’ ఆడది ‘నువ్వు’ మొగాడు అవుతారు. ఇద్దరూ రిక్షా ఎక్కి అకస్మాత్తుగా సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు, రిక్షాకి ఏడు అణాలిచ్చి. అప్పుడు అకస్మాత్తుగా ‘నేను’ మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది, నేను హఠాత్తుగా చనిపోతానని నువ్వు కనిపెట్టావా? నిజంగానే నేను శరీరమంతా ఎముకలు తప్ప పాముకుబుసంలా జారి నేను అనే వ్యక్తి చూస్తాడు/ చూస్తుంది. ఇంటికి వెళ్ళి తలుపు తీసి, దీపం వెలిగించి చూస్తే కుర్చీలో కూర్చున్నది నా ప్రేతాత్మ. ఇంక ఈ పద్యం చదివేవాళ్ళని రకరకాలుగా తీసుకెళ్తుంది. ఇందులో చచ్చిపోయిందెవరు? ఎముకల గూడెవరిది? న్యూస్ పేపర్లో చదువుతున్నాను నా చావు కబురు అని ఎవరంటున్నారు?

ఇందులో పద్యాలన్నీ ఇలాంటి పద్యాలే. ప్రతి పద్యంలోను ఒక ఆశ్చర్యకరమైన బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మకి, అంతకు ముందు బొమ్మకి సంబంధమేమిటో మనకు వెంటనే తెలియదు. పద్యమంతా ఆ సంబంధంలోనే వుందని, ఏ పద్యం ఒక కథ చెప్పదని, ఆ కథ ఒకటి కాదని, రకరకాల కథలని, కాదు కాదు అంతా ఒక కథే అని చదివేవాళ్ళు పద్యానికున్న అర్థాన్ని కల్పించుకోవచ్చు.

వీడుకోలు-1

నిన్ను స్టేషన్‌లో వదిలి వచ్చాను, సాయంత్రం;
నీవు కోరి ఎక్కిన ట్రైన్, దూరంగా పోయింది, నేలని నిందిస్తూ.
మూడురోజులూ మూడు నిషిద్ధఫలాలు తిన్నాను
గౌరిని వదిలిన శివుడిలా, నీ ఎర్రగులాబీ వంటిని కోరుకున్నాను.

సాయంత్రం గడచిపోయింది, ఇప్పుడు అర్ధరాత్రి;
తల క్రింద రెండు చేతులూ పెట్టుకొని
ఆసక్తిగా వింటున్నాను, తోటలో చెట్టుకొమ్మలు విరిగిపడ్డ చప్పుడు
స్వేఛ్ఛగా అచ్చంగా నీ పిలుపులా వుంది ఆ చప్పుడు.
నా కిటికీ నాలుగువేపులా ఆశ్చర్యంగా మెరిసిపోతూ
గిరగిర తిరిగిపోతున్నాయి, నక్షత్రాలు.

వీడుకోలు-2

నువ్వు వెళ్తావు కదా! సరే వెళ్ళు. అశక్తుణ్ణి నేను,
ప్లాట్‌ఫామ్ మీద లైన్‌లో నిలబడి నిన్ను బండిలో కెక్కిస్తాను,
సప్తర్షిమండలం వెలుగులో నీ ముఖం వెలిగిపోతూ వుంటుంది.
నా దేహారణ్యంలో విజిల్ వేసి నీ బండి వెళ్ళుతూ వుంటుంది.
రిక్షా పట్టుకొని నేను తిరిగి వెళ్ళిపోతాను, ఏ విధమైన బాధా ఉండదు.

నా చాతీపై చెమట ఆరటానికి ఇక నీ శ్వాస కోరను నేను,
గాజుకిటికీ మీద వర్షంలా పొరపాటున కూడా తునియలు కాను,
నీ స్టడీటేబుల్ మీద ఒంటరి మిడుతలా ఎగిరి తిరగటానికి,
తిరిగి తిరిగి ఎగరటానికి రాను, నువ్వు నమ్మకంగా ఆ గదిలోకి వెళ్ళి,
నీ చీర మార్చుకో. నీ పాతజ్ఞాపకాలు మరిచిపో, ఇష్టమైతే గుర్తుంచుకో.

ఎవరు ఏవేపుపోతారు? ఈ క్షణంలో శాంతంగా, ఎండవేళ
ఒంటరిగా ఉన్న నది ఒడ్డులా నిరుత్తరుడనై నేను.
తెలతెలవాతూ ఉండగా మూర్ఖసంతోషంతో
తొడలపై చేతులు కలియపట్టి తిప్పుతూ పరుంటాను;
మందకొడి బ్రతుకు నాది.
నీ ఆకాశం, నీ మంచి పేరు నీకు తిరిగి ఇచ్చేశాను,
తీసుకొని పో అరుంధతీ!
రోజులు, నెలలు గడిచినకొద్దీ, ఈ ప్లాట్‌ఫామ్ మాత్రం కుళ్ళిపోతుంది.

ఈ పుస్తకంలో, అంటే అవ్యయలో, వీడుకోలు అనే పేరుతో రెండు పద్యాలున్నాయి. రైల్వే స్టేషన్‌లో రైలెక్కించి వెళ్ళిపోయిన స్నేహితురాలిని గురించి ఆలోచించడం మనకి అలవాటయినటువంటి సందర్భం. ఈ పద్యం మొదలు అలాగే వుంటుంది. నిన్ను స్టేషన్‌లో వదిలి వచ్చాను సాయంత్రం. ఇది మనకు అర్థం అవుతుంది. కాని ఆ తరవాత మూడు రోజులు మూడు నిషిద్ధ ఫలాలు తిన్నాను అని ఒక లైను వుంటుంది. నిషిద్ధ ఫలాలు అంటే ఏమిటి చెప్మా! గౌరిని వదిలి శివుడిలా అనే మాటలు మనకు ఏమిటో అర్థమయినట్టే వుంటాయి. నీ ఎర్ర గులాబీ వంటిని కోరుకున్నాను. అదీ మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. క్రమక్రమంగా ఇంకా రెండు లైన్లు చదివితే అర్ధరాత్రి తోటలో చెట్టు కొమ్మలు విరిగిపడ్డ చప్పుడు అన్న లైను కూడా మనకు అర్థమవుతుంది. స్వఛ్ఛంగా స్వేఛ్ఛగా అచ్చంగా నీ పిలుపులా వుంది ఆ చప్పుడు అనే సరికి మనం గందరగోళంలో పడతాం. విరిగి పడ్డ చెట్టు కొమ్మలు చేసే చప్పుడు తన స్నేహితురాలు పిలిచిన పిలుపులా వుండడం ఏమిటి? ఆ తరవాత వచ్చిన రెండు లైన్లు అసలు అర్థం కావు.

నా కిటికీ నాలుగు వేపులా ఆశ్చర్యంగా మెరిసిపోతూ
గిరగిరా తిరిగిపోతున్నాయి నక్షత్రాలు

అలా ఆశ్చర్యంగా వదిలేసి రెండో పద్యం వీడుకోలు అనే పేరుతో వున్నది చదువుతాను. ఈ వీడుకోలు శాశ్వతం అనిపిస్తుంది. చివరి రెండు లైన్లు చదివేసరికి ఆ మాట నమ్మకంగా తెలుస్తుంది.

నీ ఆకాశం, నీ మంచి పేరు నీకు తిరిగి ఇచ్చేశాను,
తీసుకునిపో అరుంధతీ!

ఈ పద్యంలో ఆఖరి లైను రోజులు, నెలలు, గడిచినకొద్దీ, ఈ ప్లాట్‌ఫామ్ మాత్రం కుళ్ళిపోతుంది. ఈ పద్యం అర్థమయినట్టే వుంటుంది. కాని పద్యంలో చివరి పంక్తి చదివేసరికి ఈ ప్లాట్‌ఫామ్ అంటే ఎవరు, అది మనిషే, బహుశా కవేనేమో. ఈ శాశ్వతమైన వీడ్కోలు చాలా కష్టమైన యెడబాటు.

ఈ పద్యాల లాంటి పద్యాలు తెలుగులో మనకి లేవు. ఎందుకో తెలుగులో ప్రపంచానికీ పద్యానికీ మధ్య సంబంధం నిలువుగా పెట్టిన రూళ్ళకర్రలా తెలిసిపోతూ వుంటుంది. సౌభాగ్యకుమార్ మిశ్రా పద్యాలు, వెంకటేశ్వరరావు అనుసృజనలో మన ప్రపంచాన్ని మనకి నిజంగా బోధపరుస్తాయి.

వేలూరి వెంకటేశ్వరరావులో ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం ఒకటుంది. ఎవరు రాశారో అని ఆలోచించకుండా ఒక పద్యాన్ని చూసి ఇది మంచి పద్యం అని చెప్పగల శక్తి వెంకటేశ్వరరావుకి వుంది. పేరుని బట్టో, ఆ రాసిన వాళ్ళకున్న ప్రచారాన్ని బట్టో కాకుండా కేవలం మంచి పద్యాన్ని పట్టుకోగల శక్తి వెంకటేశ్వరరావుకి వుంది. గొప్ప పేరున్న వాళ్ళు రాసినదైనా సరే అది మంచి పద్యం కాకపోతే ఇది మంచి పద్యం కాదు అని నిర్దాక్షిణ్యంగా కొట్టి పారేయగలడు వెంకటేశ్వరరావు. తెలుగుదేశంలో ప్రచారం వల్ల, ప్రాపకం వల్ల, పెద్ద కవులయిన వాళ్ళు చాలామంది వున్నారు. వాళ్ళు కవులు కారని నిర్దాక్షిణ్యంగా, కొంత కటువుగా కూడా అనగల ధైర్యం వెంకటేశ్వరరావుకి వుంది. అందువల్ల అతని మాటలో నిజం వుందని లోపల అనిపించిన వాళ్ళు కూడా అతనంత కటువుగా ఆ కవుల్ని కవులు కాదని అనటం ఒప్పుకోలేకపోయారు. పైగా వెంకటేశ్వరరావు మాటలో చురుకుదనం చదివినవాళ్ళకి భయం వేసేలా వుంటుంది. ఇందుకు ఉదాహరణలు ఎన్నైనా చూపించొచ్చు. కాని ఒక అనామకుడి పద్యాన్ని తీసుకుని ఇది గొప్పపద్యం సుమా అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.

విరసం వాళ్ళు ప్రచురించిన ఒక సంకలనాన్ని చెండాడిపారేసిన వెంకటేశ్వరరావు సమీక్ష చదివి విరసం వాళ్ళు కూడా జడుసుకున్నారు. తనకి తోచిన నిజాన్ని చెప్పడం, అదీ అతి సున్నితమైన సాహిత్యాభిరుచి ఆధారంగా చెప్పడం తెలుగుదేశంలో అందరికీ నచ్చదు.

ఇది పక్కన పెట్టి వెంకటేశ్వరరావు రచనల్లో ఇంకొక విశేషం యథాస్థితిని వివరంగా వర్ణించడం. ఏలూరులో కాస్మోపాలిటన్ క్లబ్ అతని మాటల్లోనే బతుకుతుంది. ఆ క్లబ్ ఇప్పుడు వుందో లేదో తెలియదు నాకు. కాని ఆ రోజుల్లో ఆ క్లబ్ ఎలా వుండేదో, ఎవరెవరు ఏం చేసేవాళ్ళో వర్ణించినవాడు వెంకటేశ్వరరావు. ఊళ్ళో పెద్దవాళ్ళు కొందరు ఆ క్లబ్‌లో చెట్టు కింద కూర్చునేవాళ్ళు. రెండు మెట్లెక్కి పైకొచ్చి రెండో మూడో టేబుళ్ళ దగ్గర పేకాట ఆడే జనాభా ఒకటి వుండేది. ఆ పేకాటాడే జనాభాలో ఎవరెవరి హావభావాలు ఎలా వుండేవో చాలా జాగర్తగా వర్ణించాడు వెంకటేశ్వరరావు. ఇది ఇలా వుండగా అక్కడ అందరికీ సాయం జేస్తూ వుండే అతను ఇంకొకరు వుండేవాడు. అతనికి టెన్నిస్ బ్యాట్లు అల్లటానికి అవసరమైన సామాగ్రి అమెరికానుంచి పట్టుకొచ్చి ఇచ్చి అతని జీవనోపాధికి అనాయాసంగా సహాయపడ్డాడు వెంకటేశ్వరరావు. మొత్తం మీద కాస్మోపాలిటన్ క్లబ్ వాతావరణం సూక్ష్మంగా వర్ణించి ఏలూరు చరిత్రలో ఎవరూ మరిచిపోకుండా రాసిపెట్టాడు వెంకటేశ్వరరావు. ఇంకొంచెం పైకి వెళ్తే ఏలూరులో ఇంకొక క్లబ్ వుండేది. దానికి ఏలూరు క్లబ్ అని పేరు. దానిలో వుండే వాళ్ళంతా పేకాట కోసమే చేరినవాళ్ళు. పైగా ఆ క్లబ్‌లో పేకాట డబ్బు పెట్టి ఆడేవాళ్ళు. అంచేత ఆ క్లబ్ అంతా డబ్బుమయం. అందులో చెప్పుకోదగ్గ ఆలోచనాపరులు కాని సాహిత్య విషయాలో రాజకీయ విషయాలో మాట్లాడేవాళ్ళు కాని వుండేవాళ్ళు కారు. దాన్ని గురించి వెంకటేశ్వరరావు రాసింది కూడా అలాగే చీకటిమయంగా వుండేది.

ఆ రోజుల్లో, సరిగ్గా సంవత్సరం గుర్తులేదు కాని పుస్తకాలు అంకితం ఇవ్వడం చాలా విశృంఖలంగా జరిగేది. ఇది కొంత వెర్రితలలలు వేసి – కావ్యం కన్య, దాన్ని అంకితం పుచ్చుకునేవాడు కావ్యానికి భర్త, కావ్య రచయిత కావ్యానికి తండ్రి, ఇలా రకరకాలుగా పెంచి సభలు జరిగేవి. ఆ సందర్భంలో నాకో ఆలోచన వచ్చింది. కావ్యం కన్య, దానికో తండ్రి అంటే కృతికర్త, కావ్యాన్ని అంకితం పుచ్చుకున్నవాడు కృతిభర్త ఇవన్నీ నిజమైతే కావ్యం చచ్చిపోవడం మాత్రం ఎందుకు నిజమని నమ్మకూడదు? అంచేత మనం మా కావ్యం చచ్చిపోయిందని ప్రకటించి, దానికి దహన సంస్కారాలు చేస్తున్నామని చెప్పి కావ్యదహనోత్సవం అనే పేరుతో సభ జరిపాం. దాన్లో వెంకటేశ్వరరావు కృతిభర్త. కృతికర్త ఎవరో గుర్తు లేదు. ఈ సభ చాలామందికి ఆశ్చర్యకరంగా జరిగింది. అప్పుడు రాసిన/చేసిన ఉపన్యాసాలేవీ ఎవరూ దాచలేదు. ఆ తరవాత కొంత కాలానికి వెంకటేశ్వరరావు ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతూ వుండగా అక్కడ పెద్ద యెత్తున కావ్యదహనోత్సవం జరిపించాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఎర్స్‌క్విన్ స్క్వేర్‌లో సభ. అక్కడ ఎవరెవరు ఏ ఉపన్యాసాలు చెప్పాలో వెంకటేశ్వరరావే రాశాడు. సభ దిగ్విజయంగా జరిగింది. ఆ తరవాత ఆ ఉపన్యాసాలన్నీ కలిపి ఒక పుస్తకంగా కావ్యదహనోత్సవం అనే పేరుతో ప్రకటించాడు కూడా. అది చాలా మందికి ఇంటర్నెట్‌లో అందింది.

మొత్తం మీద వెంకటేశ్వరరావు ఏం చేసినా దాని వెనకాతల ఒక ఉత్సాహం, చురుకుతనం, ఒక్కొక్కప్పుడు దూకుడుగా రాసే వాక్యాలు ఇవన్నీ వుంటాయి. తన సాహిత్యాభిరుచికి అందకపోతే ఎంత పెద్ద పేరున్న వాళ్ళనైనా సరే చెండేసే వాక్యాలు రాస్తాడు వెంకటేశ్వరరావు. సాహిత్యాభిరుచి విషయంలో ఎవరితోను రాజీ పడడు. ప్రచారం, వ్యక్తిగత ప్రాధాన్యం, అధికారం వీటిని వేటిని లక్ష్యపెట్టకుండా నిరాఘాటంగా రాశాడు. మాట్లాడాడు. అతని వల్ల ఒక కాలంలో సాహిత్యంలో ప్రమాణాలు, సాహిత్య అభిరుచులూ నిలబడ్డాయని చెప్పాలి. కవిగా, రచయితగా, అనువాదకుడిగా ప్రపంచ సాహిత్యంతో పాటు మన పక్క భాషల సాహిత్యం అంటే ఒరియా తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన సాహిత్య వ్యక్తిత్యం వెంకటేశ్వరరావుది. వెనక్కి తిరిగి చూసుకుంటే అతను చేసిన పని ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పుకోదగ్గ స్థానంలో వుంటుంది. ఎక్కడా తనని గురించి చెప్పుకోడు. కాని అతను చేసిన పనిని గురించి మనం చాలా మందిమి చెప్పుకోవాలి.

తెలుగు కవిత్వానికి అలవాటు కాని పద్ధతిలో ఈ ఒరియా కవిత్వాన్ని అనుసృజన పేరుతో రెండు తెలుగు పుస్తకాలు పనికట్టుకుని అచ్చు వేయించడంలో వెంకటేశ్వరరావుకి ప్రత్యేకమైన దృష్టి వుందని నా అనుమానం. నేలబారుగా ఏదో ఒక వస్తువునో ఒక వాదాన్నో ఒక నమ్మకాన్నో చెప్పడం కోసం రాసే తెలుగు పద్యాల పద్ధతి ఒరియా కవిత్వం ద్వారా మార్చాలని, తెలుగు అభిరుచి ఇంకా క్లిష్టమవ్వావలని వెంకటేశ్వరరావు ఆలోచన. ఆ ఆలోచన ఎంతవరకు తెలుగు పాఠకులు పట్టుకుంటారో ఈ పుస్తకాల మీద వచ్చిన ఆలోచనలు చర్చలు వీటివల్ల మనకి తెలియాలి. కవిత్వమంటే అభిమానమున్న పదిమంది వెంకటేశ్వరరావు రచనలు చదవాలి. అతని వచనం ఎందుకు చురుగ్గా వుంటుందో తెలియాలి. ఎందుకు అందంగా వుంటుందో కూడా తెలియాలి.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...