ఆకులందున అణిగి మణిగీ

(శ్రీ సురేంద్ర రాజు చేసిన ఇంటర్వ్యూ 5-5-1992 న సుప్రభాతం లో ప్రచురితం)

( కవిగా ఇస్మాయిల్ “సదాబాలకుడు”. తత్వం, తర్కం, ఛందస్సు, అలంకారం ఇత్యాది బుద్ధిజనితమైన జాడ్యాలు సోకని “తేట”గీతి ఇస్మాయిల్ కవిత. నిరలంకార సౌందర్యం ఆయన కవిత్వం సొత్తు. శుష్క పాండిత్యానికి ఆయన బద్ధ శతృవు. భాషను శుభ్రపరచడానికి ఆయన కవిత్వం రాసారు. “చెట్టు నా ఆదర్శం” , “మృత్యు వృక్షం” , ” చిలకలు వాలిన చెట్టు” ఆయన కవితా సంకలనాలు. విమర్శకుడిగా కూడా ఆయన అద్వితీయుడు. తెలుగు కవిత్వం గురించి పాతుకుపోయి ఉన్న అనేకానేక భ్రమలను కట్టు కథలను ఇస్మాయిల్ సుప్రభాతం ఇంటర్వ్యూలో ఎక్స్ పోజ్ చేసారు.)

ప్ర: గత పదేళ్ళగా వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం? విప్లవ కవిత్వం స్థానంలో వచ్చిన ఈ కవిత్వంలో అభివ్యక్తికి మళ్ళీ ప్రాధాన్యత పెరిగిందంటున్నారు. నిజమేనంటారా! ఒక వైపు అఫ్సర్ ఇత్యాదులు మరో వైపు త్రిపురనేని శ్రీనివాస్ ఆయన మిత్రులు కొత్త కవిత్వానికి ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. వీరి కవిత్వాన్ని మీరు చదివారు కదా.

జ: మీరు వేసిన ఈ ప్రశ్న వెనక ఎన్ని అపోహలూ, అర్ధ సత్యాలూ ఉన్నాయంటే నేనే పూనుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ పూర్వ భావనలకు (presuppositions) పురుడు వేయవలసివచ్చేటట్లుంది. కొన్ని యథార్ధాలు గమనించడం ముఖ్యం. ఒకటి గత పదేళ్ళుగా వస్తున్న కవిత్వం విప్లవ కవిత్వం స్థానంలో వచ్చింది కాదు.తెలుగు కవిత్వ ప్రవాహాలలో విప్లవ కవిత్వం ఒక పాయ మాత్రమే. అదీ, ఎండి తడారిపోయిన పాయ. విప్లవ కవులు అంతకుముందు రెండు మూడు దశాబ్దాల మేర అభ్యుదయ కవులు మేం పొడిచేస్తాం అంటూ కవిత్వ జలని “పొడి” చేస్తున్నప్పుడు కవిత్వాభిమానుల హృదయాల్లో ఆర్ధ్రతని ఆరిపోకుండా నింపిన కవులు వేరే ఉన్నారు. నారాయణ బాబు, బైరాగి, రామ దాసు, తిలక్ అజంతా, మోహన ప్రసాద్ , నగ్న ముని, శ్రీకాంత శర్మ, శేషేంద్ర, హనుమయ్య మొదలైన వాళ్ళు, వీళ్ళే యేభై అరవై డెబ్బై పదుల్లో తెలుగు కవిత్వానికి మాతృ ప్రవాహం అభ్యుదయ విప్లవ ఉద్యమాలు శుష్కించిన ఎండు పాయలు.

రెండవ వాస్తవం. ఈ తెలుగు గంగ తాలూకు ఉత్తర ప్రవాహమే ఎనభయ్యో దశకంలో రాస్తున్న యువకవులు అఫ్సర్ , దేవీ ప్రియ, గోదావరి శర్మ, రవూఫ్ , శిఖామణి, పతంజలి శాస్త్రి, చినవీరభద్రుడు, యాకూబ్ , నాసర రెడ్డి, సుధాకర్ , రఘునాథం, కాదర్ , స్మైల్ , కొండేపూడి నిరమల, ఘంటశాల నిర్మల, జయప్రభ, పెన్నా, కందాళై, చందన రావ్ మొదలైనవాళ్ళు. వీళ్ళు కాక విప్లవ పాయలో జలకోసం తవ్వుతున్న ప్రతిభావంతులైన కవులు కొంతమంది మిగిలారు. శివారెడ్డి, త్రిపురనేని శ్రీనివాస్ , నసీరా, శివ సాగర్ , వర వర రావు, సతీష్ చందర్ మొదలైన వాళ్ళు.

మూడో యథార్ధం. ఎవరూ ఎవరికి ప్రతినిధులు కారు. ఎవరూ ఎవరికీ నాయకులు కారు. ప్రతి కవీ స్వయం నాయకుడే .కాకపోతే కవి వాచ్యుడే కాదు. కవి అనే వాడికి ఈ అనన్యమైన వ్యక్తిత్వం ముఖ్యం. అటువంటప్పుడు పత్రికల్లో సబ్ ఎడిటర్లు గా ఉండి సాహిత్య విభాగాలు నిర్వహించే వాళ్ళనీ, యూనివర్సిటీ ఉన్నతాధికారుల్నీ కవి నాయకులనో , ప్రతినిధులనో మనం అపోహ పడకూడదు.

ప్ర: “కవి కన్ను తెరవకముందే కీర్తి స్తన్యం కోసం తడుముకోవడం దీన్ని సమృద్ధిగా చవగ్గా సప్లయ్ చేసే ఆస్థానంలో చేరిపోవడం ఇటీవల కనిపిస్తున్న వైపరీత్యం” అని మీరు ” కొత్త ఆస్థానాల్లో కవి పోషణ” అనే వ్యాసంలో రాసారు. ప్రస్తుత కవిత్వం రాస్తున్న యువ కవుల్లో చాలా మంది జరూరుగా ఆస్థానాల్లో చేరుతున్నారు. ఎవరినో ఒకరిని పట్టుకుని పైకి ఎగబాకేవాళ్ళు వీళ్ళలో కనిపిస్తున్నారు. ఈ ధోరణిపై మీ కామెంట్ ఏమిటి? కెరీరిష్టులు అసలు కవిత్వం రాయడమేమిటి? ఇదెలా సాధ్యం అవుతున్నది?

జ: మా పైతరం కవులు అంటే కృష్ణ శాస్త్రి గారు మొదలైన భావ కవులు కవిత్వం కోసం బ్రతికారు. కవిత్వం కోసం ఉద్యోగాలు మానుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేనికీ ఎగబాకే వారు కాదు. మా కింది తరం వచ్చేటప్పటికి ప్రపంచం మారిపోయింది. అన్ని విలువలూ పతనమైపోయాయి. ధనం కోసం, పదవుల కోసం ఎగబాకడం సామాన్యమైంది. కవులు కూడా ఇటువంటి ప్రలోభాలకు దాసులవడం శోచనీయం. కవి కూడా మనిషే కదా అంటారేమో. కాదు, మామూలు మనిషి కాదు. మామూలు మనిషితనానికి ఉన్నతంగా ఉంటేనేగానీ అతనికి కవిత్వ దర్శనం కలగదు.జీవితమూ, కవిత్వమూ వేరు వేరు కాదు. జీవితంలోని మచ్చలు కవిత్వంలో కనిపించి తీరుతాయి. అందుకనే కవికి నిజాయితీ ముఖ్యమని మొదటినుంచీ అంటున్నాను.

ప్ర: గత దశాబ్దంలో స్త్రీలు కవిత్వం రాశారు.ఆడవాళ్ళు తాము మాత్రమే చెప్పగలిగిన విషయాలను (అనుభవం తాలూకు) చెబుతున్నారు.మీరొకప్పుడు స్త్రీలకు కవిత్వానికీ దూరం అన్నారు. మీ అభిప్రాయం మారినట్టేనా?

జ : స్త్రీలు కవిత్వానికి దూరం అని నేనెప్పుడూ అనలేదు. స్త్రీ ప్రకృతికి శారీరకంగా , మానసికంగా మగవాళ్ళకన్నా దగ్గరనీ , దానితో తాదాత్మ్యం సులువుగా సాధించగలరనీ , అందువల్ల ఈ లక్ష్య సాధనుకు కవిత్వాన్ని ఉపయోగించవలసిన అవసరం వీళ్ళకి లేదేమో ! అనీ అన్నాను. “పజిల్ ” అనే పద్యంలో ఈ విషయాన్ని తడిమాను. కవికి ప్రపంచంతో Tension ఏర్పడినప్పుడే కవిత్వం పుడుతుంది. ప్రకృతితో తాదాత్మ్యం సాధించగలిగిన స్త్రీలో ఈ tension తక్కువనీ , అంచేత ఆడవాళ్ళు కవిత్వం సృష్టించాల్సిన అగత్యాన్నుంచి తప్పించుకున్నారనీ , అదృష్టవంతులనీ అనుకున్నాను. ఐతే ఇటీవలి కాలంలో కొంతమంది ఆడవాళ్ళు మంచి కవిత్వమే రాస్తున్నారు. వీళ్ళలో కూడా tension పెరుగుతోందా !

ప్ర : భాషను శుభ్రం చేయడానికే మీరు కవిత్వం రాసానన్నారు. చలం కుడా అదే పని చేశారని అన్నారు. అరిగిపోయిన మాటలు, అర్ధం, సారం కోల్పోయిన మాటలు కవులు విసర్జించి కొత్త పదజాలాన్ని సృష్టించుకోవాలన్నారు. తెలుగులో మోహన ప్రసాద్ ఒక విధంగా అజంతా మరో విధంగా ఇదే పని చేస్తున్నారనుకుంటాను. దీనికి మీరేమంటారు?

జ : కవులు చేసే మంచి పనుల్లో ఒకటి, భాషని శుభ్రపరచడం. చలమూ నేనే కాదు మంచి కవులంతా ఈ పని చేసారు. చేస్తున్నారు.

ప్ర : అనుభవం కవిత్వానికి ప్రాతిపదిక. మరి ఈ రోజున కొందరు కవులు నగరంలో కూర్చుని అన్ని సుఖాలు అనుభవిస్తూ అజ్ఞాతవాసంలో ఉన్న విప్లవ కారుల గురించి కవిత్వం రాస్తున్నారు. అతనికి సందేశాలిస్తున్నారు. ధైర్యం చెబుతున్నారు. (కనీసం విరసంలో సభ్యత్వమైనా లేకుండా). ఇటువంటి ఫీట్ ఆ కవులకి ఎలా సాధ్యమౌతోందంటారు?

జ : స్వానుభవం నించే కవిత్వం ఉద్భవిస్తుందనీ, కవిత్వమూ జీవితమూ వేరు వేరు కావనీ, కనక కవికి నిజాయితీ ప్రాణాధారమనీ మొదట్నించీ మొత్తుకుంటున్నాను. నిజాయితీ లేని రాతలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. ఇవి కవిత్వమెలా అవుతాయి? కనక వీళ్ళు ఏ ఫీటూ చెయ్యడం లేదు.

ప్ర : వైయక్తిక అనుభవం నుంచి ఉద్భవించే “హృదయ స్పర్శి” అయిన కవిత్వం రాసే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఎటు చూసినా fake emotions, fake expression మాత్రమే కనిపిస్తున్నాయి. ముందు ముందు ఈ నకిలీ కవులదే రాజ్యమనిపిస్తున్నది. ఈ పరిస్థితి నిజమే అయితే దీనికి విరుగుడు ఏమైనా ఉందా?

జ : కోయిలలెప్పుడూ అరుదుగానే ఉంటాయి. కాకులు అన్ని ఋతువుల్లోనూ ప్రబలి ఉంటాయి. కాకుల గోలలో అప్పుడప్పుడు కోకిల రావాలు వినిపించకపోవచ్చు. అంతమాత్రాన మనం అధైర్యపడకూడదు. కాకులు చప్పుడు చేస్తున్నాయని కోయిలలు కూయడం మానవు. కోయిల గానాన్ని మెచ్చుకునే రసజ్ఞులెప్పుడూ ఉంటారు.

ప్ర : సంఘ సంస్కరణోద్యమం, సంఘ సంస్కర్తలకన్నా మన రాజకీయ ఉద్యమం, తాము గొప్పవాళ్ళమని మార్క్సిస్టులు అనుకోవడం మనకు తెలిసిందే! మరి ఇటీవల రాజమండ్రిలో జరిగిన సి.పి.ఐ మహాసభల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వర రావు గారు మాట్లాడుతూ “కందుకూరి వీరేశలింగం పంతులు రాజమండ్రిలో వందేళ్ళకు పూర్వమే చేసిన దాంట్లో మేం వీసమెత్తు కూడా చేయలేకపోయాం” అని పబ్లిక్ గా ఆత్మవిమర్శ చేసుకున్నారు. కమ్యూనిస్టులు కానివారికి ఈ సంగతి ముందే తెలుసనుకుంటే , కమ్యూనిస్టులను ఆ పార్టీ, పార్టీ నాయకత్వం ఇంతకాలం మోసం చేసినట్లే కదా! సంఘ సంస్కర్తను తమకన్నా గొప్పవానిగా చిత్రించాల్సిన అవస్థ చండ్ర రాజేశ్వర రావుకి ఇప్పుడు ఎందుకు కలిగిందంటారు? గోర్బచెవ్ ఇచ్చిన ధైర్యంవల్లనా, లేక నిజంగానే జ్ఞానోదయమైందా!

జ : గోర్బచేవ్ దెబ్బ ఒకరిద్దరు భారత కమ్యూనిస్టుల్లోనైనా ఆత్మజ్ఞానం కలిగించిందన్నమాట. పోన్లెండి. సాంఘిక పరిస్థితుల్లోనూ, మానసిక వైఖరుల్లోనూ పరిణామం పైనుంచి రుద్దడం వల్ల సాధ్యం కాదని ఇప్పటికైనా గ్రహించారు.

వీరేశలింగం, రఘుపతి వెంకట రత్నం నాయుడు, గాంధీ , చలం మొదలైనవాళ్ళు ఈ విషయం బాగా అర్ధం చేసుకున్నవాళ్ళు.మనుష్యుల ఎడల ప్రేమా, కరుణా, గౌరవమూ వాళ్ళకి మనుష్య స్వభావాన్ని ఆవిష్కరించి చూపింది. ఏ మార్పైనా వ్యక్తితో ప్రారంభించాలని వాళ్ళు తెలుసుకున్నారు. వ్యక్తి తను మారి, తన పరిసరాలకు ఈ మార్పును విస్తరింపజేయాలి. ఈ విధంగా వ్యక్తితో మొదలై, చివరికి సంఘం మొత్తం మారాలి కానీ, పైనుంచి బలవంతంగా హిన్సా పద్ధతుల ద్వారా సంస్కరణలు రుద్దడం అసాధ్యం అని వాళ్ళకు తెలుసు. అధికార కేంద్రీకరణం వల్ల జరిగే అనర్ధాలు కూడా వాళ్ళకి తెలుసు. అధికార కేంద్రీకరణం మూలాన కుప్పకూలిపోతున్న మహా సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనం ఆశ్చర్యంతో పరికిస్తున్నాం.

ప్ర : వజీర్ రహమాన్‌లా జీవితంలో heterogeneous interests ఉన్నవాళ్ళు, భావుకులు, గట్టి అభిప్రాయాలున్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు?

జ : వజీర్ రహమాన్ లాంటి బహుముఖప్రజ్ఞావంతులు , బహు అరుదుగానైనా ఎప్పుడూ ఎక్కడో అక్కడ ఉంటునే ఉంటారు. ఐతే ఇప్పుడు మానవతా విలువలన్నీ ఊరతొక్కి , డబ్బుకీ Consumer goodsకీ , విషయలాలసతకీ మనుషులు భానిసలైన ఈ అసుర సంధ్యాకాలంలో ఇటువంటివాళ్ళని పోల్చుకోవడం కష్టమౌతుంది. అంతేకాని , ఇటువంటి వాళ్ళు లేరని కాదు.

ప్ర : ప్రాపంచిక సంఘటనలకి కవి స్పందించే విధం చాలా సున్నితంగా , మిస్టీరియస్‌గా ఉంటుందని మీరొకసారి అన్నారు. కాఫ్కా కూడా ఈ మాటే అన్నాడు. మరి ఆనాటి ప్రపంచం కాఫ్కాకు అర్ధమైనంతగా కమ్యూనిష్టులకు అర్ధం కాలేదు. ఈ Aesthetic dilemma ను వివరిస్తారా! వాస్తవజీవనానికీ , కవికీ మధ్య జరిగే సంఘర్షణ గురించి కూడా చెప్పండి?

జ : వాస్తవమనండి. జీవితమనండీ , చాలా విచిత్రమైనది. శాస్త్రీయ విశ్లేషణకు లొంగేది కాదు. దాన్ని ముక్కలు ముక్కలుగా తరిగితే ఏమీ మిగలదు. ఉన్నదున్నట్టు సామస్త్యాన్ని (Whole) అర్ధం చేసుకోవలసిందే. మార్క్సిస్టులు వాస్తవాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు. దీనికై హేతువు లేదా బుద్ధిని పరికరంగా వాడతారు.

ఇందుమూలాన వాళ్ళు విఫలులయ్యారు.జీవిత సామస్త్యాన్ని అర్ధం చేసుకోటానికి బుద్ధి మాత్రమే చాలదు. సమస్త మానసిక శక్తులతో అంటే కరుణా, ప్రేమా, భావనా మొదలైన వాటితోనూ, సమస్త అస్తిత్వంతోనూ అంటే మనస్సు, పంచేంద్రియాలూ కలిసిన ఒక చైతన్యంతోనూ దీన్ని అవగాహన చేసుకోవలసి ఉంది. ఒక్క కవి లేదా రచయితకు మాత్రమే ఇది సాధ్యమౌతుంది. ఎందుకంటే ఇది వారి ప్రత్యేక పద్ధతి; సృజనాత్మక పద్ధతి. ఇక్కడే హేతువాదులైన మార్క్సిస్టులకూ, దార్శనికులైన(visionary) కవులకూ భేదం. వాళ్ళ అవిటి పరికరాలతో మార్క్సిస్టులు వైఫల్యం చెందారంటే ఆశ్చర్యం లేదు.కనక కాఫ్కాకూ , చలానికీ అర్ధమైనంతగా ప్రపంచం కమ్యూనిస్టులకు అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు.

ప్ర : ఐడియాలజీ చనిపోయింది కదా, సమీప భవిష్యత్తులో ఈ పరిణామం కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనుకుంటున్నారు? మంచి కవిత్వం ఇకనైనా వస్తుందంటారా?

జ : మంచి కవిత్వానికి దేశ కాల పరిధులు లేవు. జార్ చక్రవర్తుల పద ఘట్టన కింద రష్యా మ్రగ్గుతున్న రోజుల్లోనూ మంచి కవిత్వం వచ్చింది. కవులు concentration campsలోనూ, ప్రవాసంలోనూ మగ్గుతూ రాశారు. మనం బ్రిటిష్ వాళ్ళ బానిసలు గా ఉండే రోజుల్లోనూ మంచి కవిత్వం వచ్చింది. స్వాతంత్ర్యానంతరమూ మంచి కవిత్వం వచ్చింది. నిజానికి బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నప్పుడే మంచి కవిత్వం వచ్చిందేమో !

అప్పారావు గారు చెప్పినట్టు “ఆకులందున అణిగి మణిగీ” కవిత కోకిల పలుకుతునే ఉంటుంది. కాకులెప్పుడూ గోల చేస్తునే ఉంటాయి. ఇక్కడ కాకులంటే ఐడియాలజీ. ఎడమైనా కుడైనా ఒకటే.