నీ గదిలోకి ఎవరూ రారు
టేబుల్‌సొరుగును తెరవరు
ఆకుపచ్చని ఏకాంతాన్ని
అనుభవించు.
పొద్దుతిరుగుడు పూలు
నిద్దురలో,కలలో
సద్దు చేయవు.
అరాచక ఆకాశాన్ని
విరిగిన చంద్రుని
ఎరిగినదీ సైప్రస్ !
క్రోసుల దూరం
పసుపు వన్నె పులుముకొన్న
గోధుమ పొలాలపై
ముసురుతాయి కాకులు.
నడివేసవి
నీడే తరుముతుంది.
చడీ చప్పుడు లేకుండా
నడిచిపోతావు.
వలయాలుగ..
చెలరేగే
తలపులు
నీలంగా,నీ
తలచుట్టూ
పటాటోపంలేని
పొటాటో రైతులు
మాటాడుతుంటారు
ఎటో చూస్తుంటారు.
అలసిన నీ ముఖాన్ని
నలిగిన నీ కోటును,
వెలసిన రంగులతో
నీలా
ఎవరు చిత్రించగలరు?