కుండీలో మర్రిచెట్టు

నిండైన దీని జీవితాన్ని

ఎవరో అపహరించారు.

దీని బలాన్ని, బాహువుల్ని,

వేళ్ళని, వైశాల్యాన్ని,

నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని,

ఎవరో

నిర్దయగా, నెమ్మదిగా,

అందంగా అపహరించారు.

గాలి సమ్మెటల్తో బాదినా

చెక్కుచెదరని దీని స్థైర్యాన్ని,

వేలికొసల తాకిడికి

తలవంచే వినయంగా మార్చారు.

ఇక్కడీ జీవితమే

అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని

అమాయకంగా దాన్ని నమ్మించారు.

పచ్చదనంతో,

రెపరెపలాడే జవసత్వాలతో,

వందయోజనాలు,

వేయి ప్రయోజనాలుగా

విస్తరించవలసిన దీని జీవిత సామ్రాజ్యాన్ని,

కుండీలో,

రెండు పిడికిళ్ళ మన్నులో,

నీటికై వెదుకాడే కళ్ళలోకి

కుదించారు.

నిండైన దీని జీవితాన్ని

ఎవరో అపహరించారు.