ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగిపొందే ఈ వేళ,
ఒక నవ నాగరికుడు
అలవికాని రంగుల్లో తలదాకా మునిగి
తనను తాను కోల్పోతాడు.
నగరంలో ఇప్పటిదాకా
తెల్లచొక్కాలా కాపాడు కొంటూ వస్తున్న
సకల భేషజాల్నీ కోల్పోతాడు.
నగరజీవితపు గజిబిజినంతా
నడివీధిలో సవాలుచేస్తూ
తనను తానొక అధివాస్తవిక చిత్రంగా
ఆవిష్కరించుకొంటాడు.
పువ్వులా,
పక్షిలా,
రంగుల్నాశ్రయించి,
రంగుల మంటల్లో ఆనందభస్మమై రూపుదాల్చి,
బహుశ మనిషికూడా ఈ రోజు కాస్సేపు
తనను తాను తిరిగి చేరుకొంటాడు.