ఉరి తీయబడ్డ పాటనుండి, చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
మేల్కొన్న ఇసుకరేణువు నుండి
తొలకరి వానచినుకు నుండి
నెత్తురొలికే పిల్లనగ్రోవి నుండి
అనంతాకాశం లోని అంతిమ నక్షత్రం నుండి
నుదుటిపై నవ్వే నాగేటి చాళ్ళ నుండి
గాలి ఈల నుండి, నీరెండ నుండి
మట్టివాసన నుండి, అట్టడుగు నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
గోధూళి వేళ
గోరింటాకు అరచేతిలో ఎరుపెక్కే వేళ
హోరెత్తే సముద్రం ఆకాశాన్ని తాకే వేళ
నక్షత్ర దీపాలు మౌనసంగీతాన్ని వినిపించే వేళ
నౌక తీరాన్ని విడిచే వేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
పక్షులు చెట్లకొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ
శిశిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాల్ని విప్పి చెప్పే వేళ
తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించే వేళ
ఎందరో నన్ను మరిచిపోయిన వేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
భూమీ ఆకాశం కలిసే చోట
పొన్నపూలు రాలిపడిన చోట
వీధిదీపాలు ఉరిపోసుకున్న చోట
నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
అసత్యాల అరణ్యాలను తెగనరికే చోట
గోదారి సముద్రంతో కరచాలనం చేసే చోట
చరమగీతం మరణశాసనం రాసుకొన్న చోట
మహాసంకల్పం ఎర్రజెండాగా ఎగిరే చోట
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
నేను మట్టికరిసేననే సర్కారీ కట్టుకథను తిరస్కరించు
కౌటిల్యం నాపేరిట జరిపే ‘సంస్మరణ దినోత్సవాల’ను బహిష్కరించు
వాడవాడలా నా సంగీతాన్ని వినిపించు
నేను చనిపోను
ఏ తాడూ నన్ను ఉరి తీయలేదు
సగర్వమైన నీ కన్నీళ్ళ నుండి తిరిగి లేస్తాను
సూర్యనేత్రం నుండి లేచి వస్తాను
ప్రాణవాయువు వూది పిల్లనగ్రోవిని పలకరిస్తాను
సంధ్యారాగంలో వాయులీనం వినిపిస్తాను
హొరెత్తే సముద్రంతో కరచాలనం చేస్తాను
‘భువనభవనపు బావుటా’నై పైకి లేస్తాను
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా పేరు మృత్యుంజయుడు
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
(ఆగస్ట్ 22, 1988)