మునుపటి లాగా కాలక్షేపం కోసమో లేదా నాలుగు కథలు చదివి అలవోగ్గా ఒక కథ రాసుకోవడమో వంటి పరిస్థితుల్లో ఇవ్వాళ కథా రచయితలు లేరు ….
దేశీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన, వస్తోన్న మార్పులన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ఆ సామాజికాంశాల నన్నింటినీ కథల్లో ప్రతిబింబిస్తూ వస్తూన్నారు ….
ఒక బాధ్యతతో, నిబద్ధతతో కథలు రాస్తున్నారు ….
కనుక కాలక్షేపపు కథలకిక ఎంతమాత్రమూ చోటు లేదు.
పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి….
జీవితాల్లో సంక్లిష్టత, వైవిధ్యం పెరిగిన కద్దీ కథల్లో కూడా వైవిధ్యం పెరుగుతూ వచ్చింది….
సామ్రాజ్యవాద విధానాల అత్యున్నత తీవ్రదశ ప్రపంచీకరణ సమాజంలోని వివిధ రంగాలను ఎటువంటి ప్రకంపనలకు గురిచేసింది …. దాని మూలంగా మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నమైపోయాయి …. మార్కెట్టు మాయాజాలంలో మునిగి శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా కొట్టుకుంటూ మనుషులు ఎలా వాటికి దాసోహమయిపోయారో ఇలా అన్ని విషయాలనూ క్షుణ్ణంగా, చాలా లోతుగా పట్టుకోగలిగింది తెలుగు కథ ….
వివిధ రంగాలన్నప్పుడు వ్యవసాయ రంగం, స్త్రీలు, దళితులు, మైనారిటిలు ప్రాంతీయత …. ప్రైవేటైజీషన్ మూలంగా రోడ్డున పడ్డ కర్మాగారాలు …. కార్పొరేటీకరణ చెందిపోయిన విద్య, వైద్యం ఈ అన్ని ధోరణులనూ, ఉద్యమ రూపాలనూ వెంటతీసుకుని ముందుకు సాగడం ఒకటిన్నర దశాబ్ద తెలుగు కథ సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు….
ఈ శతాబ్దపు ప్రారంభంలో సాహిత్యంలో ఒక స్తబ్దత ఏర్పడిందనీ చాలా వేగవంతంగా ఉండబోయే ఈ శతాబ్దపు మార్పుల్ని అంత వేగంగానూ మన రచయితలు పట్టుకోగలరా అని మేధావులు చూపించిన సంకోచం …. పటాపంచలయి పోయింది…. సామాజిక పరిణామాలంత వేగంగానూ, అర్థవంతంగానూ కథకులివాళ స్పందిస్తున్నారు….
1
ఎనభయి శాతం ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తోన్న భారత దేశంలో, దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగంలో, …. దేశానికి వెన్నెముకగా చెప్పబడిన రైతు జీవితంలో ఎదురయిన దుర్భర పరిస్థితులు …. జూదమయిపోయిన వ్యవసాయం చేయలేక, ఒదులుకోలేక సంక్షోభంలో కూరుకు పోయిన వేల మంది రైతుల ఆత్మహత్యల పరంపర …. తమ జీవితాలను తాకట్టు పెట్టిన వాళ్ళు పెట్టగా …. ఎంతోమంది వ్యవసాయం గిట్టుబాటుకాక పొట్ట చేతపట్టుకుని వలసలు పోవలసి వచ్చింది. ఈ కొత్త శతాబ్దంలో అది మరింతగా పెరిగిన క్రమం ….
వీటన్నింటికీ మనం మూలకారణాలు వెతుక్కున్నప్పుడు …. హరిత విప్లవం తెచ్చిన అభివృద్ధి ఎరువుల్ని కొని వ్యవసాయం చేయాల్సి రావడం …. సాగునీరు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఏవీకూడా రైతుకి అందుబాటులో లేకపోగా అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలయి పోవడం …. ఫలితంగా పెరిగిపోయిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని పంటలు, దళారీల దోపిడీ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతుని విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయి …. ఇటువంటి అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే తప్ప మరి ఏ ఇతర కారణాలు ఎంతమాత్రమూ కాదు ….
వ్యాపార పంటల విస్తీర్ణం పెరిగి కొన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది …. పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం మూలంగా వాతావరణ సమతుల్యం దెబ్బతినడమే కాకుండా వ్యవసాయపు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది …. భూమి మీద నమ్మకం కోల్పోని రైతు అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది …. రెండు మూడు పంటలు వరుసగా దెబ్బతిని వటుడింతయి అన్న రీతిలో వడ్డీలతో కలసిన అసళ్ళు విశ్వరూపం ధరించి కట్టెదుట నిలిస్తే అనివార్య పరిస్థితుల్లో దిక్కుతోచక అదే మట్టిలో నిమ్మళంగా నిద్రపోతున్నాడు రైతు ….
ఈ మొత్తం రైతు జీవితంలోని రాజకీయార్థిక పరిణామాలను లోతుగా పట్టుకోగలిగారు తెలుగు కథకులు ….
రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కథకులు ఎక్కువగా రైతు జీవన విధ్వంసాన్ని ప్రతిబింబిస్తూ కథలు రాసినప్పటికీ దక్షిణాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి కూడా కొందరు రచయితలు మారుతున్న గ్రామీణ జీవన విధానాలనూ, వ్యవసాయ సంక్షోభాన్నీ, …. నేల తిమ్మిరినీ కథలుగా మలిచారు ….
అంటే అభివృద్ది చెందని ప్రాంతాల నుంచేకాక అభివృద్ది చెందిన ప్రాంతాల నుంచి కూడా కథా రచయితలు గ్రామీణ జీవన విధ్వంసం మీద …. మాయమైపోతోన్న గ్రామాల పట్ల స్పందించారు ….
పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో తెలీని ఒక ఆటలాగా వ్యవసాయ జూదమయిపోయిన విషయాన్ని విశ్లేషిస్తూ సింగమనేని నారాయణ ‘జూదం’ అన్న కథ రాశారు….
శాంతి నారాయణ రాసిన ‘కల్లమయిపాయ’ …. వ్యవసాయం ముళ్ళయి గుచ్చుకుంటోన్న తీరునూ, సమ జీవిత పరిణామాలనూ చాలా విపులంగా చర్చకు పెడుతూ రాసిన ‘పల్లేరు ముళ్ళు’ వంటి కథలు రైతు జీవితంలోని సంక్షోభాన్ని విశ్లేషించినవే ….
శాంతినారాయణ రాసిందే ‘‘రతనాల సీమలో’ అన్న కథలో ఏళ్ళ తరబడి వేరుసెనగ పంట వేసి వేసీ నష్టపోయిన రైతు మల్లన్న …. అప్పుల బాధ పడలేక …. ప్రభుత్వమే సరఫరా చేసినటువంటి ‘మోనోక్రోటో ఫాస్’ మందును తాగి ఆత్మహత్య చేసుకుంటాడు ….
ఇలాగే బుర్రారాములు రాసిన ‘గీబతుకెందుకు’ అన్న కథలో పత్తి రైతు మీనయ్య ‘సాగునీరు లేకుండా పంట చేతికెట్ల వస్తుంది …. పంట రాకపోతే అప్పులెట్లా తీర్వాలి అని డీలాపడిపోయి కరెంటు వైరుని శరీరానికి చుట్టుకుని షాక్ తగిలించుకొని మరణిస్తాడు ….
ఈదేశంలో రైతుకీ, భూమికీ ఉన్న సంబంధం సామాన్యమైనదేమీ కాదు …. సజీవమైనది …. భూమితో జీవితాలను పెనవేసుకున్న పాత తరానికీ, స్వీయాభివృద్ది కోసం గిట్టుబాటు కాని నేలను తెగనమ్ముకోవాలనుకుంటోన్న కొత్తతరానికీ మధ్య జరిగే, జరుగుతోన్న ఘర్షణని చర్చకు పెడుతూ చాలామంది కథకులు స్పందించారు.
తను కాదంటున్నప్పటికీ కొడుకు భూమిని అమ్ముకుపోవాలన్న గట్టి పట్టుదలతో ఉండడంతో దిక్కుతోచక చీకటి పడ్డాక చెన్నప్ప పొలం వద్దకి వెళ్ళిపోతాడు …. తెల్లారేసరికి ‘‘వాడిపోయిన వేరుసెనగ పొలంలో తల్లి గుండెల మీద నిద్రిస్తోన్న పసివాడిలా నిర్మలంగా, నిర్వికారంగా ఉంది చెన్నప్ప శవం’ అంటూ ముగుస్తుంది ‘మన్నుతిన్న మనిషి’ చిలుకూరి దేవపుత్ర కథ ….
ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంనుంచి కాలువ మల్లయ్య రాసిన ‘నేలతల్లి’ భూమితో పెనవేసుకు పోయిన తండ్రి జీవితాన్ని చూసి చింతపడ్తూ ‘‘భూమి మనల్ని మోసం చేస్తోంది నాన్నా’’ అంటాడు కొడుకు పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కావడం లేదు కాబట్టి భూమిని అమ్మేయాలన్నది కొడుకు బాధయితే …. ఆ గిట్టుబాటు కాకపోవడం వెనుక కుట్ర చేస్తున్నది భూమికాదు …. వీటి మూలాలు మరెక్కడో ఉన్నాయి …. వాటిని పట్టుకోలేకపోవడం రైతు అశక్తత అన్నది తండ్రి బాధ ….
ఇదే నేపథ్యంలో రైతు జీవిత విధ్వంసాన్నీ, గ్రామీణ జీవిత సంక్షోభాన్నీ మధ్యతరగతి కోణం నుంచి చాలా లోతుగా పట్టుకున్న కథ అట్టా అప్పల్నాయుడు రాసిన ‘క్షతగాత్రగానం’
ఇంతకు ముందు చెప్పుకున్నట్టు భూమిని ఆస్థిగా కాకుండా ఆహారాన్నందించే ఒక ఉత్పత్తి సాధనంగా, తమ జీవితాలలో ఒక భాగంగా పెనవేసుకున్న పాతతరం నుంచీ …. భూమిని తమ అవసరానికి ఉపయోగపడే ఒక ఆస్థిగా మాత్రమే చూసే ఇవ్వాల్టితరం వరకూ అనేకానేక జీవిత పరిణామాలనూ, గ్రామ ప్రాంతాల దుస్థితినీ, రైతు జీవితంలోని వివిధ కోణాలనూ చర్చకు పెడుతూ అటు పాత తరానికీ, ఇటు కొత్త తరానికీ నడుమ సంఘర్షణలో పడి నలుగుతోన్న కోటేశ్వరావు వంటి మధ్య తరం వాళ్ళకి సజీవ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముగుస్తుందీ కథ ….
రైతులు తమ పంటకి గిట్టుబాటు ధరలేక అత్యంత చౌకగా పంటని తెగనమ్ముకుంటూండగా …. అదే పంటని కేవలం మూడు నాలుగు నెలలు నిలవచేసి మూడింతలు ధరతో అమ్ముకోవడం …. ఈ విధంగా పంటనీ, వ్యవసాయాన్నీ వ్యాపారమయం చేసి దళారీలు బాగుపడుతూండగా రైతులు రోజురోజుకీ అప్పుల్లో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యల అంచుకు నెట్టబడడం లేదా కసితో పంటపొలాలను నరికేసుకోవడం. నడుస్తోన్న చరిత్ర ….
ఈ దళారీల దోపిడీని ఎంతోమంది కథకులు తమ కథల్లో చర్చించారు సింగమనేని నారాయణ రాసిన ‘అడుసు’ కథలో చీనీ కాయల దోపిడీ ఎన్ని అంచెలుగా సాగుతుందో వివరిస్తూ చివరికి రైతు, అసహాయ పరిస్థితుల్లో ఒక కసితో తన పొలంలోకి వెళ్ళి చీనీ చెట్లను నరికి వేయడంతో కథ ముగుస్తుంది ….
అలాగే పాపినేని శివశంకర్ రాసిన ‘చింతలతోపు’ కథ పొగాగు రైతుల దోపిడీని విశ్లేషిస్తే మధురాంతకం నరేంద్ర రాసిన ‘అత్యాచారం’ కథ రైతుల మీద దళారీల అత్యాచారాన్ని చర్చకు పెడుతుంది ….
మిగిలిన అన్ని ఉత్పత్తి రంగాలలోనూ తాము తయారుచేసిన వస్తువుకి ధర నిర్ణయించగలిగే శక్తి ఉత్పత్తిదారులకు ఉండగా …. ఒక్క వ్యవసాయ రంగంలో మాత్రమే పంట యొక్క రేటు నిర్ణయించడం రైతు చేతుల్లో లేదు …. అది మార్కెట్ శక్తుల చేతుల్లో ఉంది …. ఎవరో ధరని నిర్ణయిస్తే దాని ప్రకారం మాత్రమే రైతు అమ్ముకోవాల …. ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతు చేతుల్లో ఏమీ లేకపోవడమనే విషయాన్ని ‘అడుసు’ కథలో సింగమనేని నారాయణ …. ‘గతుకులు’ కథలో బమ్మిడి జగదీశ్వరావు బలంగా ప్రస్తావిస్తారు ….
ఇదే కోవలో వల్లూరు శివప్రసాద్ రాసిన ‘గిట్టుబాటు’ కథలో దుర్భర దారిద్య్రంతో మరోమార్గం లేక ఒక పత్తిరైతు తన మూత్రపిండాన్ని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుని భార్యకు చూపిస్తూ
‘‘ఏళ్ళ తరబడి వ్యవసాయం చేస్తోన్నా మనం పండించిన పంటకు మనం ధర కట్టుకునే దారిల్యా …. ఎవడో ధర కట్టాడు …. కానీ ఇయ్యాల నాకు నేను లచ్చ రూపాయల ధరకట్టా …. నిలబెట్టా …. అమ్ముకోగలిగినా ….’’ అంటాడు ….
‘‘ఈ పత్తుల ధరలు ఎక్కిచ్చేటోరు, దించేటోరు …. ఎవరో …. దాని కథేంటో రైతుకి తెల్వది …. వాళ్ళకి తెల్సింది ఒక్కటే …. పంట వస్తే ధర పలకదు …. పంట రానప్పుడు ధర పల్కుతది …. ఆఖరి కచ్చేటాల్లకు బాకీ తేల్తరు ….’’ అంటాడొక రైతు ‘మరోకిసాన్’ అన్న కథలో ….
వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులను జాగ్రత్త చేసుకోవడం కంటే కూడా అధిక పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే క్రమంలో చెరువులు లేకుండా చేయడం అన్న పరిస్థితిని చర్చకు పెడుతూ మధురాంతకం మహేంద్ర ‘ముసలమ్మ మరణం’ అన్న కథ రాశారు ….
నీరు వారి జీవనాధారం …. అవి లేనట్టయితే పంటలు పండక కడుపు నిండక కరువు పాలవుతారు …. అందుకే జలవనరులను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు తాపత్రయ పడతారు …. అయితే భూమిని అమ్మకపు సరుకుగా మాత్రమే చూసే వాళ్ళకు ఇవన్నీ కాబట్టవు …. ఆ చెరువును కాపాడుకోవడానికి ఆమె జీవిత పర్యంతం చేసిన పోరాటం, సంఘర్షణ …. చివరికి ఆమె మరణం తర్వాత ఆ స్థలం పారిశ్రామిక వాడగా మారిపోవడం …. వీటన్నింటి వెనుకనున్న రాజకీయ ఆర్థిక సూత్రాలను లోతుగా పట్టుకున్న కథ ‘ముసలమ్మ మరణం.’
ఇదే కోవలో గంథం నాగరాజు రాసిన ‘చెరువు’ అన్న కథలో చెరువును తెగ్గొట్టడాన్ని చివరి క్షణందాకా వ్యతిరేకించి పోరాటం చేసిన నర్సిరెడ్డి చివరికి ఊళ్ళో వాళ్ళు చెరువు నరుకుతుంటే అడ్డంపడి తలరగిలి చచ్చిపోతాడు ….
అట్లాగే ఏటి ఇసుకంతా కట్టడాల కోసం డబ్బుగా మారి పట్టణాలకూ, నగరాలకూ తరలిపోతూంటే గ్రామాల్లోని నీటి జల అంతరించిపోతుందని సంఘర్షణపడి పోరాటం చేసిన ఊరిపెద్ద కథ సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన ‘‘ఇసుక.’’
పైమూడు కథలూ కూడా గ్రామాలలోని సహజ వనరులను కాపాడుకోవాలనే పాతతరం తపననీ, వేదననీ, త్యాగాన్నీ తెలుపుతాయి …. వ్యవసాయ రంగానికి భూమితో ఉండే అనుబంధం ఎంతటిదో, వ్యవసాయంలో భాగమైన పశువులతో పెనవేసుకుని ఉండే ఆత్మీయత కూడా అటువంటిదే …. ఇవ్వాల్టికీ మనం గ్రామాలకు వెళ్ళినట్టయితే మన పెద్దవాళ్ళు ఎద్దు దవడలు నిమురుతూనో, మనుషులు ఒకేచోట కలిసి ఉండడం పశువుతో మనిషి అనుబంధాన్ని తెలుపుతూ పి.రామకృష్ణ రాసిన ‘మనిషి పశువు’ ఒక వైపైతే ….
ఈ పశువుల్ని మేత లేకపోవడం వల్లనో, దారిద్య్రం వల్లనో కబేళాలకు అమ్ముకోవలసిన పరిస్థితిని హృదయం ద్రవించేలా చెప్పిన కథలు చిలుకూరి దేవపుత్ర రాసిన ‘నెర్లు’ …. కాట్రగడ్డ దయానంద్ రాసిన ‘కర్రావు’
ఇటీవల మన పాలకులు అభివృద్ది. ఆధునికం అన్న పదాలను పదే పదే ఉబ్బరిస్తున్నారు …. వ్యవసాయం విషయంలో ఈ అభివృద్ధి ఆధునికం అంటే యాంత్రీకరణ …. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకే వ్యక్తి ఒక్క యంత్రం సాయంతో మరే కూలి మనుషుల అవసరమూ లేకుండా వందలాది ఎకరాలకు సంబంధించిన అన్ని పనులూ నిర్వహించి ఎనలేని లాభార్జన చేయగలడు …. అటువంటి అభివృద్ది సాధించిన దేశాలు ఇప్పుడు మనకి ఆదర్శం ….
ఆ పరిస్థితి ఇక్కడ మనకి రావాలంటే, ఒక్క యంత్రం కొనాలంటే మామూలు రైతుకు సాధ్యం కాని పని …. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగల బహుళజాతి ధనికవర్గ రైతులకు మాత్రమే అది సాధ్యం …. అంటే చిన్న చిన్న రైతులంతా వ్యవసాయం చేయడానికి వీలులేని పరిస్థితి ….
ఉత్తరాంధ్ర నుంచి గంటేడ గౌరునాయుడు రాసిన ‘తిరుగుడు గుమ్మి’ ‘నరాలు తెగుతున్న నేల’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి ….
కోస్తా నుంచి తమ ప్రాంతానికి వలస వచ్చిన కమ్మదొరలు చిన్న చిన్న కవుతాలనన్నింటినీ చౌకగా కొని ఒకే పెద్ద కవతంగా మార్చి పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయడం …. లాభాలు ఆర్జించడం …. మరోవంక సన్నకారు రైతులంతా భూమిని పోగొట్టుకుని తమ పొలాల్లో తామే కూలీలుగా మారిపోవలసి రావడం …. లేదా పైన చెప్పిన యంత్రాలు నడిపే చోదకులుగా మారడం జరుగుతుంది …. లేదా ఆ దొరల వద్దే మేనేజరుగా పని చేయవలసి వస్తుంది ….
ఈ నూతన వ్యవసాయం మూలంగా గ్రామంలో కలిసికట్టుగా ఉండే తత్త్వం దెబ్బతింటుంది …. మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి …. రైతుల ఆస్థులకు, ఆత్మగౌరవాలకే కాకుండా చివరకు పశువుల కాపర్లకు కూడా జీవనం లేకుండా పోవడాన్ని చర్చకు పెడతాయి ఈ కథలు ….
అయితే ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి పట్లా ఆ ఊరి రైతులకు గుర్తింపు చైతన్యం ఉండడం …. అవి క్రమంగా వ్యవసాయదారులను సంఘటితం చేసి కొత్త వ్యవసాయ ధనిక వర్గాన్ని ప్రతిఘటించే పరిణామంతో (తిరుగుడు గుమ్మి) ఈ కథ ముగియడం ఆశాజనకం.