మునుపటి లాగా కాలక్షేపం కోసమో లేదా నాలుగు కథలు చదివి అలవోగ్గా ఒక కథ రాసుకోవడమో వంటి పరిస్థితుల్లో ఇవ్వాళ కథా రచయితలు లేరు ….
దేశీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన, వస్తోన్న మార్పులన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ఆ సామాజికాంశాల నన్నింటినీ కథల్లో ప్రతిబింబిస్తూ వస్తూన్నారు ….
ఒక బాధ్యతతో, నిబద్ధతతో కథలు రాస్తున్నారు ….
కనుక కాలక్షేపపు కథలకిక ఎంతమాత్రమూ చోటు లేదు.
పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి….
జీవితాల్లో సంక్లిష్టత, వైవిధ్యం పెరిగిన కద్దీ కథల్లో కూడా వైవిధ్యం పెరుగుతూ వచ్చింది….
సామ్రాజ్యవాద విధానాల అత్యున్నత తీవ్రదశ ప్రపంచీకరణ సమాజంలోని వివిధ రంగాలను ఎటువంటి ప్రకంపనలకు గురిచేసింది …. దాని మూలంగా మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నమైపోయాయి …. మార్కెట్టు మాయాజాలంలో మునిగి శ్లేష్మంలో పడ్డ ఈగల్లాగా కొట్టుకుంటూ మనుషులు ఎలా వాటికి దాసోహమయిపోయారో ఇలా అన్ని విషయాలనూ క్షుణ్ణంగా, చాలా లోతుగా పట్టుకోగలిగింది తెలుగు కథ ….
వివిధ రంగాలన్నప్పుడు వ్యవసాయ రంగం, స్త్రీలు, దళితులు, మైనారిటిలు ప్రాంతీయత …. ప్రైవేటైజీషన్ మూలంగా రోడ్డున పడ్డ కర్మాగారాలు …. కార్పొరేటీకరణ చెందిపోయిన విద్య, వైద్యం ఈ అన్ని ధోరణులనూ, ఉద్యమ రూపాలనూ వెంటతీసుకుని ముందుకు సాగడం ఒకటిన్నర దశాబ్ద తెలుగు కథ సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు….
ఈ శతాబ్దపు ప్రారంభంలో సాహిత్యంలో ఒక స్తబ్దత ఏర్పడిందనీ చాలా వేగవంతంగా ఉండబోయే ఈ శతాబ్దపు మార్పుల్ని అంత వేగంగానూ మన రచయితలు పట్టుకోగలరా అని మేధావులు చూపించిన సంకోచం …. పటాపంచలయి పోయింది…. సామాజిక పరిణామాలంత వేగంగానూ, అర్థవంతంగానూ కథకులివాళ స్పందిస్తున్నారు….
1
ఎనభయి శాతం ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తోన్న భారత దేశంలో, దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగంలో, …. దేశానికి వెన్నెముకగా చెప్పబడిన రైతు జీవితంలో ఎదురయిన దుర్భర పరిస్థితులు …. జూదమయిపోయిన వ్యవసాయం చేయలేక, ఒదులుకోలేక సంక్షోభంలో కూరుకు పోయిన వేల మంది రైతుల ఆత్మహత్యల పరంపర …. తమ జీవితాలను తాకట్టు పెట్టిన వాళ్ళు పెట్టగా …. ఎంతోమంది వ్యవసాయం గిట్టుబాటుకాక పొట్ట చేతపట్టుకుని వలసలు పోవలసి వచ్చింది. ఈ కొత్త శతాబ్దంలో అది మరింతగా పెరిగిన క్రమం ….
వీటన్నింటికీ మనం మూలకారణాలు వెతుక్కున్నప్పుడు …. హరిత విప్లవం తెచ్చిన అభివృద్ధి ఎరువుల్ని కొని వ్యవసాయం చేయాల్సి రావడం …. సాగునీరు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఏవీకూడా రైతుకి అందుబాటులో లేకపోగా అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలయి పోవడం …. ఫలితంగా పెరిగిపోయిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని పంటలు, దళారీల దోపిడీ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతుని విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయి …. ఇటువంటి అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే తప్ప మరి ఏ ఇతర కారణాలు ఎంతమాత్రమూ కాదు ….
వ్యాపార పంటల విస్తీర్ణం పెరిగి కొన్ని మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది …. పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం మూలంగా వాతావరణ సమతుల్యం దెబ్బతినడమే కాకుండా వ్యవసాయపు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది …. భూమి మీద నమ్మకం కోల్పోని రైతు అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది …. రెండు మూడు పంటలు వరుసగా దెబ్బతిని వటుడింతయి అన్న రీతిలో వడ్డీలతో కలసిన అసళ్ళు విశ్వరూపం ధరించి కట్టెదుట నిలిస్తే అనివార్య పరిస్థితుల్లో దిక్కుతోచక అదే మట్టిలో నిమ్మళంగా నిద్రపోతున్నాడు రైతు ….
ఈ మొత్తం రైతు జీవితంలోని రాజకీయార్థిక పరిణామాలను లోతుగా పట్టుకోగలిగారు తెలుగు కథకులు ….
రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కథకులు ఎక్కువగా రైతు జీవన విధ్వంసాన్ని ప్రతిబింబిస్తూ కథలు రాసినప్పటికీ దక్షిణాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి కూడా కొందరు రచయితలు మారుతున్న గ్రామీణ జీవన విధానాలనూ, వ్యవసాయ సంక్షోభాన్నీ, …. నేల తిమ్మిరినీ కథలుగా మలిచారు ….
అంటే అభివృద్ది చెందని ప్రాంతాల నుంచేకాక అభివృద్ది చెందిన ప్రాంతాల నుంచి కూడా కథా రచయితలు గ్రామీణ జీవన విధ్వంసం మీద …. మాయమైపోతోన్న గ్రామాల పట్ల స్పందించారు ….
పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో తెలీని ఒక ఆటలాగా వ్యవసాయ జూదమయిపోయిన విషయాన్ని విశ్లేషిస్తూ సింగమనేని నారాయణ ‘జూదం’ అన్న కథ రాశారు….
శాంతి నారాయణ రాసిన ‘కల్లమయిపాయ’ …. వ్యవసాయం ముళ్ళయి గుచ్చుకుంటోన్న తీరునూ, సమ జీవిత పరిణామాలనూ చాలా విపులంగా చర్చకు పెడుతూ రాసిన ‘పల్లేరు ముళ్ళు’ వంటి కథలు రైతు జీవితంలోని సంక్షోభాన్ని విశ్లేషించినవే ….
శాంతినారాయణ రాసిందే ‘‘రతనాల సీమలో’ అన్న కథలో ఏళ్ళ తరబడి వేరుసెనగ పంట వేసి వేసీ నష్టపోయిన రైతు మల్లన్న …. అప్పుల బాధ పడలేక …. ప్రభుత్వమే సరఫరా చేసినటువంటి ‘మోనోక్రోటో ఫాస్’ మందును తాగి ఆత్మహత్య చేసుకుంటాడు ….
ఇలాగే బుర్రారాములు రాసిన ‘గీబతుకెందుకు’ అన్న కథలో పత్తి రైతు మీనయ్య ‘సాగునీరు లేకుండా పంట చేతికెట్ల వస్తుంది …. పంట రాకపోతే అప్పులెట్లా తీర్వాలి అని డీలాపడిపోయి కరెంటు వైరుని శరీరానికి చుట్టుకుని షాక్ తగిలించుకొని మరణిస్తాడు ….
ఈదేశంలో రైతుకీ, భూమికీ ఉన్న సంబంధం సామాన్యమైనదేమీ కాదు …. సజీవమైనది …. భూమితో జీవితాలను పెనవేసుకున్న పాత తరానికీ, స్వీయాభివృద్ది కోసం గిట్టుబాటు కాని నేలను తెగనమ్ముకోవాలనుకుంటోన్న కొత్తతరానికీ మధ్య జరిగే, జరుగుతోన్న ఘర్షణని చర్చకు పెడుతూ చాలామంది కథకులు స్పందించారు.
తను కాదంటున్నప్పటికీ కొడుకు భూమిని అమ్ముకుపోవాలన్న గట్టి పట్టుదలతో ఉండడంతో దిక్కుతోచక చీకటి పడ్డాక చెన్నప్ప పొలం వద్దకి వెళ్ళిపోతాడు …. తెల్లారేసరికి ‘‘వాడిపోయిన వేరుసెనగ పొలంలో తల్లి గుండెల మీద నిద్రిస్తోన్న పసివాడిలా నిర్మలంగా, నిర్వికారంగా ఉంది చెన్నప్ప శవం’ అంటూ ముగుస్తుంది ‘మన్నుతిన్న మనిషి’ చిలుకూరి దేవపుత్ర కథ ….
ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంనుంచి కాలువ మల్లయ్య రాసిన ‘నేలతల్లి’ భూమితో పెనవేసుకు పోయిన తండ్రి జీవితాన్ని చూసి చింతపడ్తూ ‘‘భూమి మనల్ని మోసం చేస్తోంది నాన్నా’’ అంటాడు కొడుకు పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కావడం లేదు కాబట్టి భూమిని అమ్మేయాలన్నది కొడుకు బాధయితే …. ఆ గిట్టుబాటు కాకపోవడం వెనుక కుట్ర చేస్తున్నది భూమికాదు …. వీటి మూలాలు మరెక్కడో ఉన్నాయి …. వాటిని పట్టుకోలేకపోవడం రైతు అశక్తత అన్నది తండ్రి బాధ ….
ఇదే నేపథ్యంలో రైతు జీవిత విధ్వంసాన్నీ, గ్రామీణ జీవిత సంక్షోభాన్నీ మధ్యతరగతి కోణం నుంచి చాలా లోతుగా పట్టుకున్న కథ అట్టా అప్పల్నాయుడు రాసిన ‘క్షతగాత్రగానం’
ఇంతకు ముందు చెప్పుకున్నట్టు భూమిని ఆస్థిగా కాకుండా ఆహారాన్నందించే ఒక ఉత్పత్తి సాధనంగా, తమ జీవితాలలో ఒక భాగంగా పెనవేసుకున్న పాతతరం నుంచీ …. భూమిని తమ అవసరానికి ఉపయోగపడే ఒక ఆస్థిగా మాత్రమే చూసే ఇవ్వాల్టితరం వరకూ అనేకానేక జీవిత పరిణామాలనూ, గ్రామ ప్రాంతాల దుస్థితినీ, రైతు జీవితంలోని వివిధ కోణాలనూ చర్చకు పెడుతూ అటు పాత తరానికీ, ఇటు కొత్త తరానికీ నడుమ సంఘర్షణలో పడి నలుగుతోన్న కోటేశ్వరావు వంటి మధ్య తరం వాళ్ళకి సజీవ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముగుస్తుందీ కథ ….
రైతులు తమ పంటకి గిట్టుబాటు ధరలేక అత్యంత చౌకగా పంటని తెగనమ్ముకుంటూండగా …. అదే పంటని కేవలం మూడు నాలుగు నెలలు నిలవచేసి మూడింతలు ధరతో అమ్ముకోవడం …. ఈ విధంగా పంటనీ, వ్యవసాయాన్నీ వ్యాపారమయం చేసి దళారీలు బాగుపడుతూండగా రైతులు రోజురోజుకీ అప్పుల్లో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యల అంచుకు నెట్టబడడం లేదా కసితో పంటపొలాలను నరికేసుకోవడం. నడుస్తోన్న చరిత్ర ….
ఈ దళారీల దోపిడీని ఎంతోమంది కథకులు తమ కథల్లో చర్చించారు సింగమనేని నారాయణ రాసిన ‘అడుసు’ కథలో చీనీ కాయల దోపిడీ ఎన్ని అంచెలుగా సాగుతుందో వివరిస్తూ చివరికి రైతు, అసహాయ పరిస్థితుల్లో ఒక కసితో తన పొలంలోకి వెళ్ళి చీనీ చెట్లను నరికి వేయడంతో కథ ముగుస్తుంది ….
అలాగే పాపినేని శివశంకర్ రాసిన ‘చింతలతోపు’ కథ పొగాగు రైతుల దోపిడీని విశ్లేషిస్తే మధురాంతకం నరేంద్ర రాసిన ‘అత్యాచారం’ కథ రైతుల మీద దళారీల అత్యాచారాన్ని చర్చకు పెడుతుంది ….
మిగిలిన అన్ని ఉత్పత్తి రంగాలలోనూ తాము తయారుచేసిన వస్తువుకి ధర నిర్ణయించగలిగే శక్తి ఉత్పత్తిదారులకు ఉండగా …. ఒక్క వ్యవసాయ రంగంలో మాత్రమే పంట యొక్క రేటు నిర్ణయించడం రైతు చేతుల్లో లేదు …. అది మార్కెట్ శక్తుల చేతుల్లో ఉంది …. ఎవరో ధరని నిర్ణయిస్తే దాని ప్రకారం మాత్రమే రైతు అమ్ముకోవాల …. ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతు చేతుల్లో ఏమీ లేకపోవడమనే విషయాన్ని ‘అడుసు’ కథలో సింగమనేని నారాయణ …. ‘గతుకులు’ కథలో బమ్మిడి జగదీశ్వరావు బలంగా ప్రస్తావిస్తారు ….
ఇదే కోవలో వల్లూరు శివప్రసాద్ రాసిన ‘గిట్టుబాటు’ కథలో దుర్భర దారిద్య్రంతో మరోమార్గం లేక ఒక పత్తిరైతు తన మూత్రపిండాన్ని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుని భార్యకు చూపిస్తూ
‘‘ఏళ్ళ తరబడి వ్యవసాయం చేస్తోన్నా మనం పండించిన పంటకు మనం ధర కట్టుకునే దారిల్యా …. ఎవడో ధర కట్టాడు …. కానీ ఇయ్యాల నాకు నేను లచ్చ రూపాయల ధరకట్టా …. నిలబెట్టా …. అమ్ముకోగలిగినా ….’’ అంటాడు ….
‘‘ఈ పత్తుల ధరలు ఎక్కిచ్చేటోరు, దించేటోరు …. ఎవరో …. దాని కథేంటో రైతుకి తెల్వది …. వాళ్ళకి తెల్సింది ఒక్కటే …. పంట వస్తే ధర పలకదు …. పంట రానప్పుడు ధర పల్కుతది …. ఆఖరి కచ్చేటాల్లకు బాకీ తేల్తరు ….’’ అంటాడొక రైతు ‘మరోకిసాన్’ అన్న కథలో ….
వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులను జాగ్రత్త చేసుకోవడం కంటే కూడా అధిక పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే క్రమంలో చెరువులు లేకుండా చేయడం అన్న పరిస్థితిని చర్చకు పెడుతూ మధురాంతకం మహేంద్ర ‘ముసలమ్మ మరణం’ అన్న కథ రాశారు ….
నీరు వారి జీవనాధారం …. అవి లేనట్టయితే పంటలు పండక కడుపు నిండక కరువు పాలవుతారు …. అందుకే జలవనరులను కాపాడుకోవడం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు తాపత్రయ పడతారు …. అయితే భూమిని అమ్మకపు సరుకుగా మాత్రమే చూసే వాళ్ళకు ఇవన్నీ కాబట్టవు …. ఆ చెరువును కాపాడుకోవడానికి ఆమె జీవిత పర్యంతం చేసిన పోరాటం, సంఘర్షణ …. చివరికి ఆమె మరణం తర్వాత ఆ స్థలం పారిశ్రామిక వాడగా మారిపోవడం …. వీటన్నింటి వెనుకనున్న రాజకీయ ఆర్థిక సూత్రాలను లోతుగా పట్టుకున్న కథ ‘ముసలమ్మ మరణం.’
ఇదే కోవలో గంథం నాగరాజు రాసిన ‘చెరువు’ అన్న కథలో చెరువును తెగ్గొట్టడాన్ని చివరి క్షణందాకా వ్యతిరేకించి పోరాటం చేసిన నర్సిరెడ్డి చివరికి ఊళ్ళో వాళ్ళు చెరువు నరుకుతుంటే అడ్డంపడి తలరగిలి చచ్చిపోతాడు ….
అట్లాగే ఏటి ఇసుకంతా కట్టడాల కోసం డబ్బుగా మారి పట్టణాలకూ, నగరాలకూ తరలిపోతూంటే గ్రామాల్లోని నీటి జల అంతరించిపోతుందని సంఘర్షణపడి పోరాటం చేసిన ఊరిపెద్ద కథ సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన ‘‘ఇసుక.’’
పైమూడు కథలూ కూడా గ్రామాలలోని సహజ వనరులను కాపాడుకోవాలనే పాతతరం తపననీ, వేదననీ, త్యాగాన్నీ తెలుపుతాయి …. వ్యవసాయ రంగానికి భూమితో ఉండే అనుబంధం ఎంతటిదో, వ్యవసాయంలో భాగమైన పశువులతో పెనవేసుకుని ఉండే ఆత్మీయత కూడా అటువంటిదే …. ఇవ్వాల్టికీ మనం గ్రామాలకు వెళ్ళినట్టయితే మన పెద్దవాళ్ళు ఎద్దు దవడలు నిమురుతూనో, మనుషులు ఒకేచోట కలిసి ఉండడం పశువుతో మనిషి అనుబంధాన్ని తెలుపుతూ పి.రామకృష్ణ రాసిన ‘మనిషి పశువు’ ఒక వైపైతే ….
ఈ పశువుల్ని మేత లేకపోవడం వల్లనో, దారిద్య్రం వల్లనో కబేళాలకు అమ్ముకోవలసిన పరిస్థితిని హృదయం ద్రవించేలా చెప్పిన కథలు చిలుకూరి దేవపుత్ర రాసిన ‘నెర్లు’ …. కాట్రగడ్డ దయానంద్ రాసిన ‘కర్రావు’
ఇటీవల మన పాలకులు అభివృద్ది. ఆధునికం అన్న పదాలను పదే పదే ఉబ్బరిస్తున్నారు …. వ్యవసాయం విషయంలో ఈ అభివృద్ధి ఆధునికం అంటే యాంత్రీకరణ …. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకే వ్యక్తి ఒక్క యంత్రం సాయంతో మరే కూలి మనుషుల అవసరమూ లేకుండా వందలాది ఎకరాలకు సంబంధించిన అన్ని పనులూ నిర్వహించి ఎనలేని లాభార్జన చేయగలడు …. అటువంటి అభివృద్ది సాధించిన దేశాలు ఇప్పుడు మనకి ఆదర్శం ….
ఆ పరిస్థితి ఇక్కడ మనకి రావాలంటే, ఒక్క యంత్రం కొనాలంటే మామూలు రైతుకు సాధ్యం కాని పని …. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగల బహుళజాతి ధనికవర్గ రైతులకు మాత్రమే అది సాధ్యం …. అంటే చిన్న చిన్న రైతులంతా వ్యవసాయం చేయడానికి వీలులేని పరిస్థితి ….
ఉత్తరాంధ్ర నుంచి గంటేడ గౌరునాయుడు రాసిన ‘తిరుగుడు గుమ్మి’ ‘నరాలు తెగుతున్న నేల’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి ….
కోస్తా నుంచి తమ ప్రాంతానికి వలస వచ్చిన కమ్మదొరలు చిన్న చిన్న కవుతాలనన్నింటినీ చౌకగా కొని ఒకే పెద్ద కవతంగా మార్చి పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయడం …. లాభాలు ఆర్జించడం …. మరోవంక సన్నకారు రైతులంతా భూమిని పోగొట్టుకుని తమ పొలాల్లో తామే కూలీలుగా మారిపోవలసి రావడం …. లేదా పైన చెప్పిన యంత్రాలు నడిపే చోదకులుగా మారడం జరుగుతుంది …. లేదా ఆ దొరల వద్దే మేనేజరుగా పని చేయవలసి వస్తుంది ….
ఈ నూతన వ్యవసాయం మూలంగా గ్రామంలో కలిసికట్టుగా ఉండే తత్త్వం దెబ్బతింటుంది …. మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి …. రైతుల ఆస్థులకు, ఆత్మగౌరవాలకే కాకుండా చివరకు పశువుల కాపర్లకు కూడా జీవనం లేకుండా పోవడాన్ని చర్చకు పెడతాయి ఈ కథలు ….
అయితే ఈ జరుగుతున్న పరిణామాలన్నింటి పట్లా ఆ ఊరి రైతులకు గుర్తింపు చైతన్యం ఉండడం …. అవి క్రమంగా వ్యవసాయదారులను సంఘటితం చేసి కొత్త వ్యవసాయ ధనిక వర్గాన్ని ప్రతిఘటించే పరిణామంతో (తిరుగుడు గుమ్మి) ఈ కథ ముగియడం ఆశాజనకం.
వ్యవసాయం గిట్టుబాటు కాక సన్నకారు రైతులంతా రైతు కూలీలుగా మారిపోవడం లేదా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలసపోవడం అత్యంత సాధారణమై పోయిన నేపధ్యంలోంచి భూమితల్లిని ఒదిలి వెళ్ళలేని దుర్భర పరిస్థితినీ, రైతు గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణకి అద్దంపడుతూ.
జి.ఎస్.చలం రాసిన ‘అంకురం’ …. గౌరునాయుడు ‘‘ ఒక దృశ్యం – రెండు స్వప్నాలూ’’ వచ్చాయి …. ఇనాయతుల్లా రాసిన ‘వలస పక్షి’ కూడా ఈ కోవలోదే.
సింగమనేని నారాయణ రాసిన ‘ఒక పయనం’ కథ వలసల మరో కోణాన్ని చిత్రిస్తూ ఆశాజనకంగా ముగుస్తుంది.
పూలమ్మిన చోట కట్టెలమ్మ లేనట్టు …. వ్యవసాయం జూదమయిపోయి కడుపు నింపుకోవడం కూడా చేతకాని క్రమంలో ఒకానొక రైతు గంగన్న కుటుంబంతో సహా ఊరు విడిచి అనంతపురం జిల్లా నుంచి బళ్ళారి ప్రాంతానికి వలస పోతాడు ….
గంగన్న ముందు నడుస్తున్నాడు …. అతని నెత్తిమీద ఒక పాత ట్రంకు పెట్టి ఉంది …. ఆ పెట్టిలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకి అర్థంకాదు అంటూ ప్రారంభమవుతుందీ కథ …. గంగన్న దృష్టి కోణం నుంచి, గంగన్న ఆలోచనల్లో నుంచి మొత్తం సంక్షోభంలో కూరుకు పోయిన అనంత రైతు జీవితాన్నంతా కళ్ళముందు పరుస్తాడు రచయిత ….
ఎంతో మంది బీదా బిక్కీ తమ ఇంటివద్ద బతికిపోయిన క్రమంలో నుంచి గంగన్న కుటుంబం రామప్ప నాయుడి వద్దకెళ్ళి చేతులు జోడించి బతుకుదారి చూపించమని అడుక్కుంటుంది….
రామప్పనాయుడు బళ్ళారి ప్రాంతంలోని మోతుబరి ….
‘‘అట్లాగేప్పా మీ ప్రాంతంలో పరిస్తితులు చక్కబడేంతవరకూ ఇక్కడే ఉండండి ….’’ అంటూ బస, పని చూపిస్తాడు ….
అందుకు గంగన్న
‘మా ప్రాంతంలో ఏ పరిస్థితులూ చక్కబడవు నాయినా నలభయి యేండ్ల నుంచీ సేద్యం చేస్తున్నాను …. రాను రాను కాలం మరీ ఘోరమయి పోయింది …. సేద్యం అంటేనే విరక్తి పుడుతోంది …. మా జిల్లా రైతులు చేతుల్లో ఇప్పుడు ఉత్త భూమి మాత్రమే ఉంది …. విత్తనాలు మా చేతుల్లో లేవు …. ఎరువులు మా చేతుల్లో లేవు …. మందులు మా చేతుల్లో లేవు …. నీళ్ళు మా చేతుల్లో లేవు కరెంటు మా చేతుల్లో లేదు …. వీటన్నింటినీ ఎవరో కట్టకట్టి మా చేతుల్లో నుంచి లాక్కుపోయారు …. అవన్నీ మా చేతుల్లోకి వస్తేనే తప్ప బతికి బట్టకట్టలేము’’ అంటాడు నిర్వేదంతో ….
రామప్ప నాయుడు సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయి చాలా సేపటి తర్వాత …. ‘మరీ అంత నిరాశ పడొద్దు గంగన్నా …. ఇవాళ కాకపోతే రేపయినా రైతు అన్నీ తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు’ అంటూ ధైర్యం చెప్తాడు ….
వలసల మీదొచ్చిన అనేక కథల్లో ‘ఒక పయనం’ విలక్షణమైన కథ ….
గతంలో ‘వానరాలె’ అంటూ ఆకాశంకేసి మోరెత్తి చూసే అనంత రైతు దీనస్థితి మీద …. కరువుమీద మంచి కథ రాసిన స్వామి ఈ కొత్త శతాబ్దం రైతు పాతన్నను పరిచయం చేస్తూ మన సమజాతాలనీ, మన పనిముట్లనీ చివరికి మన ఆహార పదార్థాలనీ కూడా ఏ దెయ్యం మాయం చేసిపోతోందో తెలుసుకోమంటూ ‘తెల్లదెయ్యం’ అన్న గ్రామ వివక్ష కథ రాశారు ….
సామ్రాజ్యవాద సంస్కృతి పల్లెల మీద, వ్యవసాయం మీద దాడిచేసి మార్కెట్లను పెంచుకోవడంకోసం …. వాణిజ్య అవసరాల కనుగుణంగా ఇక్కడి పంటల పద్ధతినే మార్చిపారేసింది …. పంటల ఉత్పత్తి వినియోగం కోసం కాకుండా కేవలం లాభాలకోసమే అన్న పద్దతి క్రమంగా స్థిరపడిపోయింది ….
ఇలా వ్యాపార పంటలు రైతుల జీవితాల్లోకి చొచ్చుకు వచ్చి రైతుని అప్పులపాలు చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించిన వైనాన్ని తెలుపుతూ నల్లూరి రుక్మిణి ‘బీటలెత్తిన బీళ్ళశోకం’ అన్న కథ రాశారు …. ఆ కథలోని ప్రధాన పాత్ర సుబ్బయ్య తమ కాలానికీ, ఇప్పటికీ వ్యవసాయం మారిపోయిన తీరుని గురించి మధనపడతాడు …. చిన్ననాడు డబ్బంటే ఏమిటో తెలిని స్థితిలో నుంచి ఈనాడు డబ్బులొచ్చే పంటలదాకా అనేక పరిణామాలు అతని మెదడులో సుళ్ళు తిరుగుతాయి. మరి ఆ డబ్బు చేతిలో నిలిచిందా? …. ఏమయిపోతోంది? …. డబ్బు మాయావిలా ఎలా మనిషిని ఆడించి విధ్వంసానికి దారితీస్తూంది …. అన్నీ చర్చలోకి వస్తాయి ఈ కథలో ….
ఇదే ఇతివృత్తంతో కాట్రగడ్డ దయానంద్ రాసిన తలపాగా స్వగతం రైతు జీవిత దుర్భర స్థితిని ప్రతీకాత్మకంగా ఆత్మకథాత్మక విధానంలో చెప్పబడిన కథ ….
కృష్ణాజిల్లా మాగాణి ప్రాంత గ్రామాలు …. అక్కడ్నుండి ఉద్యోగాల పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో దూర ప్రాంతాలకు వెళ్ళి పట్టణ సంస్కృతిని జీర్ణించుకున్న వాళ్ళు, పల్లెల్ని కన్నతల్లిని ఒదిలిపెట్టలేక గ్రామాల్లోకి కొత్తగా పాకుతోన్న పట్టణ సంస్కృతిని జీర్ణించుకోలేక కట్టుమిట్టాడుతూనే …. పెళ్ళి, పేరంటాలు పేరుతోనే అయినా బంధుమిత్రులందరినీ కలిపి ముడేయాలనుకుంటున్న వాళ్ళూ …. మారిపోయిన భూమి సంబంధాలూ వీటినన్నింటినీ చాలా చక్కగా పట్టుకుంది పి.సత్యవతి రాసిన ‘పెళ్ళి ప్రయాణం’ కథ మారుతున్న భూమి సంబంధాలనీ, గ్రామాలలో విచ్ఛిన్నమైపోతూన్న మానవ సంబంధాలను లోతుగా చర్చకు పెడుతుందీ కథ ….
షేర్ల వ్యాపారాలు అయాచిత డబ్బు ప్రలోభాన్ని చూపించి గ్రామీణ ప్రాంత రైతు జీవితాలను ఎలా నాశనం చేశాయో చెప్తూ వల్లూరు శివప్రసాద్ ‘నాగేటి చాలు’ అన్న కథ రాశారు ….
అలాగే అల్లం రాజయ్య కథలు గ్రామీణ జీవన నేపథ్యాన్ని విప్లవోద్యమ దృష్టితో చిత్రించిన కథలు …. ‘మహదేవుని కల’ చాలా విలక్షణమైన కథ …. భూమిని నమ్ముకున్న వాళ్ళ కలలన్నింటినీ వ్యవస్థ ఎలా విధ్వంసం చేస్తుందో ఈ కథ లోతుగా వివరిస్తుంది ….
‘‘మహాద్భుతమైన మనిషి, ఆరోగ్యవంతమైన మనిషి …. మట్టి నుంచి పచ్చటి మొక్కలు, సర్వసంపదలూ సృష్టించదలుచుకున్న మనిషి …. మహదేవుని సకల కలలను, సర్వశక్తులనూ హరించిందెవరు?’’ అంటూ వ్యవస్థ మీదికి ప్రశ్నలు సంధిస్తాడు కథకుడు ….
ఛిద్రమైన గ్రామీణ జీవితాన్ని అంతర్లీనంగా చెప్తూ డా॥ వి.చంద్రశేఖరరావు ‘‘ఆవు పులి మరి కొన్ని కథలు’’, ‘‘నీటి పిట్టల కథలు’’ అని రెండు కథలు రాశారు.
‘వ్యవసాయ శ్రామికుల మీద ప్రపంచీకరణ ప్రభావం’ అన్న అంశం మీద ఏర్పాటుచేయబడిన సెమినార్ హాలులోకి రైతు కూలీలకు ప్రవేశం లేకపోవడం విదేశీ డెలిగేట్లతో కలిసి స్వదేశీ మేధావులు చేస్తోన్న ఆ చర్చలోని భాష ఈ వ్యవసాయ శ్రామికులకు అర్థం కాకపోవడం ఈ కథలోని వైరుధ్యం ….
కొండకింద తెల్లపులి ‘‘నేను ఆవులను చంపి తినేదాన్ని కాదు. ఒక్కక్క ఆవునీ లేక గేదెనీ …. మేకనీ అదీ కాకపోతే మనిషినీ అయినా అయిదు వేలకు కనుక్కుంటానని నోట్లకట్టలు చూపించడంలో’’ …. గ్రామీణ జీవితం మీద ప్రపంచీకరణ ప్రభావం ఎంత క్రూరంగా, హింసాత్మకంగా పడుతోందో తెలియజేప్తుందీ కథ.
గ్రామీణ వ్యవసాయ జీవితాల్లోకి డబ్బు ప్రవేశించిన కోణం …. పెరుగుతున్న పెట్టుబడుల కనుగుణంగా ఎక్కడికక్కడ అధిక వడ్డీలతో పిలిచి పిలిచి అప్పులిస్తోన్న ధనిక వర్గం …. మొత్తం ఈ క్రమాన్ని రిమోట్ కంట్రోలుతో నడిపిస్తూన్న బహుళజాతి సంస్థలూ …. వ్యవసాయం రైతు చేతుల్లో లేకుండా వ్యాపారంగా మారిపోయిన వైనాన్ని ఎండగడ్తుంది ‘నీటి పిట్టలు’ కథ ….
పత్రికా విలేకరుల దృష్టికోణంలో నుంచి గ్రామీణ జీవిత విధ్వంసాన్ని చిత్రించిన రెండు కథలు ఈ దశాబ్ద కాలంలో వచ్చాయి …. కేతు విశ్వనాధరెడ్డి రాసిన ‘విరూపం’, పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘కీలుబొమ్మలు.’
ఒక చేతిలో గరుడ స్తంభం, మరో చేతిలో మోగుతూన్న జేగంటతో ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా తిరునామధారీ సర్వజగద్రక్షకా’ అంటూ తిరుమంత్రం వల్లిస్తూ ఇల్లిల్లూ తిరిగి బిక్షం ఎత్తుకునే తండ్రిని ‘‘మనం సేద్యం చేద్దాం నాయినా ఈ అడుక్కునే పని వద్దు’’ అంటూ గట్టిగా వారించిన నారాయణ ఆ వృత్తి వదిలి రైతు అవతారమెత్తి వ్యవసాయం చేసి నిలదొక్కుకోవాలని ఎంతగానో ప్రయత్నించి చివరికి అప్పుల పాలయి …. దుర్భర పరిస్థితినీ, దు:ఖాన్నీ భరించలేక …. అనివార్యంగా తిరిగి గరుడ స్థంభాన్నందుకుని చీకటి వీధుల వెంట నడక అందుకుంటాడు …. అతడు మోగిస్తున్న జేగంటతో ఊరు మేలుకుంటుంది …. కానీ వికలమయిన మనసుతో పాఠకుడు తేరుకోవడానికి మాత్రం చాలా రోజులే పడుతుంది…. జి.వెంకటకృష్ణ రాసిన ‘గరుడ స్తంభం’ కథ ఇది.
వ్యవసాయంతో పాటుగా వ్యవసాయాధారిత చేతివృత్తులన్నీ కూడా అణగారిపోయాయి …. ఆయా వృత్తిపని వానలకు మనుగడే లేకుండా పోయింది.
కుల వృత్తుల విషయం మాట్లాడుకోవలసి వస్తే మన గ్రామాలలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత వంటి ఉత్పత్తిపరమైన కులవృత్తులే కాకుండా మంగలి, చాకలి, కాటికాపర్లు, పారిశుధ్యం వంటి సేవాపరమైన కులవృత్తుల వారు కూడా ఉంటారు ….
అభివృద్ధి పేరిట యంత్రాలు, ఆధునిక పరికరాలు ఒకే ఒక్క గంటలో బోలెడన్ని చీరలు నేయగల మగ్గాలు …. మట్టి పాత్రలని అధిగమిస్తూ ప్లాస్టిక్ పరిశ్రమ …. చీప్‌లిక్కర్ ప్రవేశంతో గీత కార్మికుల ఉపాధి …. ఇలా రకరకాల యంత్రాలు కులవృత్తులను పొట్టన పెట్టుకున్నాయి …. ఈ యంత్రాలద్వారా నాణ్యమైన చౌక ఉత్పత్తులు లభించడంతో అవి ప్రజాదరణ పొంది క్రమంగా కుల, చేతి వృత్తులన్నీ మూలపడి పోయాయి….
పైవిషయాలన్నింటినీ కూడా రచయితలు చర్చకు పెడుతూ కథాసాహిత్యాన్ని వెలువరించారు …. పెద్దింటి అశోకకుమార్ రాసిన ‘కాగుబొత్త’ …. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్రిజ్జులు వచ్చి ఎలా మనుషులకు కుండల అవసరాన్ని లేకుండా చేశాయో మనిషి మరణించినప్పుడు తప్ప ‘కుండ’ అవసరం లేని స్థితికి ఎలా నెట్టబడ్డాయో వివరంగా చర్చిస్తుందీ కథ …. ‘తెగిన బంధాలు’, ‘గోస’ వంటి కథలు యంత్రాలు వివిధ రకాల కులవృత్తులని మింగేసిన వైనాన్నీ …. పెళ్ళిళ్ళ సమయంలో కూడా మంగలి, చాకలి వంటి వారి అవసరాలు లేకుండా పోవడాన్ని …. చేనేత పని వారి గోప్పనీ వివరంగా అర్థం చేయిస్తాయి ….
అలాగే క్రమంగా వృత్తిని కోల్పోతోన్న వడ్రంగి పని వారల మీద సుంకోజి దేవేంద్రాచారి రాసిన ‘అన్నంగుడ్డ’ …. జాతశ్రీ రాసిన ‘కుట్ర’ వంటి కథ లచ్చాయి…. చేనేత పని వారలు ఎలా తెగిన పోగులయి విలవిల్లాడి పోతున్నారో తెలుపుతూ ధూళిపాళ అన్నపూర్ణ రాసిన ‘సాలెగూ(గో)డు. అన్న కథ వచ్చింది ….
గ్రామాల మీద …. గ్రామాలు ఎలా మాయమై పోతున్నాయో చెప్తూ బమ్మిడి జగదీశ్వరరావు రాసిన ‘ ఊరు’ చెప్పుకోదగిన కథ …. ఇవన్నీ చెప్పుకుని రైతు జీవిత విధ్వంసం మీద వారాల కృష్ణమూర్తి రాసిన ‘యాది’ అన్న కథను చెప్పుకోనట్టయితే ఈ విషయం సమగ్రం కానట్టే ….
జీవితంలోని దుర్భర పరిస్తితులను భారంగా ఎదుర్కొంటూ చివరికి తిండిలేక ఆకలికి మెత్తటి పుట్ట మట్టిని తీసుకొచ్చి వడలుగా చేసి ఎండబెట్టి పిల్లల కడుపు నింపాలని ప్రయత్నించిన యాదమ్మ …. అటువంటి స్థితిలో కూడా ధైర్యంగా నిలబడి యాదమ్మ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడ్డ భర్తతో ‘పిరికి వాడితో నేనెంత కాలము కాపురం చేయ్యను? …. నీ ఇష్టం …. నీ కోసం మీ అమ్మ బతికినట్టు నా పిల్లల కోసం నేను బతుకుతాను’ అంటూ అత్త రెక్క పట్టుకొని పైకి లేపుతుంది ….
యాదమ్మ అత్త కూడా కోడల్ని కౌగిలించుకుని ‘‘నా కడుపున నువ్వెందుకు పుట్టలేదే యాదు …. ఈ పిరికోడు పుట్టాడు అంటుంది …. ఈ ఇద్దరు ఆడవాళ్ళ నిబ్బరం చూసి లచ్చుము తనని ఆదుకోమంటూ చేయి చాపుతాడు …. అంతా కలిసి ఒకర్నొకరు కౌగలించుకుని ఏడ్చుకుంటారు.
ఆ ఏడుపు బాధపడి కాదు …. బాధల నుంచి విముక్తి కలిగినందుకు తనివితీరా ఏడ్చి మనసుల్ని దిటవు పరుచుకున్నారు …. కన్నీటితో పాత జీవితాన్ని కడిగి ముందుకు సాగుతోన్న మనుషులు వాళ్ళు …. రేపటిని పండిస్తారు అంటాడు రచయిత ….
చాలా రోజులుగా రైతులు ఆత్మహత్యల గురించి పేపర్లలోనూ, కథల్లోనూ చదివి చదివీ బండ బారిపోయిన గుండెమీద తొలకరి జల్లు చిలకరించినట్టయింది …. గొప్పకథ ‘యాది.’
అయితే ఈ రైతుల ఆత్మహత్యల తరువాత ఈ మొత్తం సంక్షోభాన్నీ, భర్తలేని దు:ఖాన్నీ అదనంగా మోయాల్సి వస్తోన్న స్త్రీల సంగతేమిటి?
పురుషుల్లాగా పలాయనవాదులు కాదు స్త్రీలు …. పిల్లల కోసమైనా వాళ్ళు బతికే తీరాలి …. మరి ఇటువంటి స్త్రీల దుర్భర స్థితినీ, జీవికకోసం వాళ్ళుపడే సంఘర్షణను వస్తువుగా మంచికంటి ‘మిత్తవ’ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘జవాబులేని ప్రశ్నలు’ గీతాంజలి రాసిన ‘సంటిది’వంటి కథలు వచ్చినప్పటికీ ఈ వస్తువు మీద మరిన్ని కథలు రావాల్సిన అవసరముందని నా కన్పించింది ….
ఇంకా ఇవేకాక రైతు జీవితం మీద ఎందరో కథకులు కథాసాహిత్యాన్ని వెలువరించారు …. అవేవీ కూడా కల్పితాలు కావు ….
ఊహించని మలుపులూ, అనుకోని అద్భుతమైన కొసమెరుపులూ, శైలీ విన్యాసాలూ ఈ కథల్లో కన్పించవు …. ఉన్నదంతా తమ చుట్టూ ఉన్న సహజ జీవితం …. దాన్ని చెప్పగలిగినంత సహజంగా చెప్పడం …. భాష కూడా గ్రామీణ జీవన సంస్కృతిని మేళవిస్తూ మట్టివాసన వేస్తూండడం విశేషం ….
2
స్త్రీ, పురుషులిరువురూ సమాజంలో భాగమైనప్పుడు ఈ అధీన, అధీకృత సంబంధాలెందుకు, కౌటుంబిక, సామాజిక అధికార రాజకీయాలెందుకు? అన్న చిన్న ప్రశ్నతో ప్రారంభమై పితృస్వామ్య అధికారిక చట్రాన్నీ, నమూనా కుటుంబంలోని డొల్లతనాన్ని చర్చకు పెట్టింది స్త్రీవాద కథ ….
గత శతాబ్దపు ఎనిమిదో దశకం నాటికి స్త్రీ సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకునే విప్లవాత్మక సిద్ధాంతం స్త్రీలకు అందివచ్చింది. అదే స్త్రీవాదం అయితే ఈ వాదం ఒక ఉద్యమంగా సాహిత్యంలో బలపడింది మాత్రం తొంభయిల నాటికి అని చెప్పుకోవచ్చు ….
స్త్రీ తనను తాను మానవిగా ఆవిష్కరించుకునే క్రమంలో …. తనని మనిషిగా గుర్తించని వ్యవస్థ మీద ఒక అస్త్రంలా కవిత్వ రూపంలో దూసుకొచ్చినప్పటికీ క్రమంగా తన సమస్యలను చర్చించటానికి ఒక విస్తృతమయిన ప్రాతిపదికగా స్త్రీ వాదులు కథా సాహిత్యాన్ని ఎంచుకున్నారు ….
పురుష సమాజ ప్రయోజనాల కనుగుణంగా తమ కివ్వబడిన నమూనా, మూసపాత్రలు స్వీయాభివృద్ధికి ఎంత అవరోధంగా ఉన్నాయో తెలుసుకుని ఆ జ్ఞానంతో కథా సాహిత్యం వెలువరించడం మొదలుపెట్టిన స్త్రీ రచయితలు పురుషుడి దృష్టికోణానికి అందని ఎన్నో సూక్ష్మ విషయాలను కూడా తమ కథల్లో చర్చకు పెట్టారు …. మనం వ్యక్తిగత విషయాలుగా భావిస్తోన్న వాటి మూలాలు అధికార, ఆధిపత్య రాజకీయాలతో ముడిపడి ఉన్నాయని గుర్తించి కథలు రాయడం మొదలు పెట్టారు ….
పితృస్వామ్య కుటుంబ సంబంధాలలో స్త్రీల శరీరాల మీద, వారి కదలికల మీద ఎంత అదుపు ఉంటుందో స్త్రీలు తమకే తెలీని క్రమంలో ఎలా తమ శరీరాలలో తామే బందీలయి పోతున్నారో …. స్త్రీల శరీరాలలోని ప్రతీ అవయవం మీద జుట్టు, కళ్ళు, నోరు, గర్భసంచి ఇలా …. అన్నింటి మీదా ఎంత పోలీసింగ్ ఉంటుందో లోతుగా చర్చించిన కథలు ఓల్గా ‘‘రాజకీయ కథలు.’’
తన జుట్టులో తానే బందీ అయిపోయి బయటికి రాలేక ఊపిరాడని విధంగా జీవితకాలం గడిపేయడం …. కనురెప్పల కింద తానే కదలిక లేకుండా నిశ్చలమై పోయిన కనుగుడ్డవడాన్ని …. అంటే కదిలి లోకంవైపు చూసే శక్తిని హరించి వేయడాన్ని …. ఇంకా నోరు తెరిచి స్వతంత్రంగా మాట్లాడ లేనివిధంగా ఆమె నోరు మీద …. ఇలా సమస్త అవయవాల మీద ఎంత నియంత్రణ ఉంటుందో మనకు సూక్ష్మంగా అర్థం చేయిస్తాయి ఈ కథలు ….
‘స్త్రీలు స్త్రీలుగా పుట్టరు తయారుచేయబడతారు’ అంటుంది సిమోనే డి బోవర్ …. అంటే పుట్టినప్పటి నుంచీ ఈ కుటుంబ, సమాజ సంబంధాలు స్త్రీల శరీరాన్నీ, స్త్రీల ప్రవర్తననూ ఎలా అధికారికంగా కట్టడి చేస్తూ వస్తాయో …. ఇంకా ఇవ్వాళ అమలులో ఉన్న నమూనా కుటుంబం అసలు స్వభావమేమిటో కూడా ‘రాజకీయ కథలు’ విప్పి చెప్పాయి ….
ఒక వేళ కుటుంబం లోపల తల్లిదండ్రులుగా మనం కూతుళ్ళ మీద ఆంక్షలను సడలించినప్పటికీ బయటి ప్రపంచంలో అమ్మాయి కట్టు బొట్టు తీరును నిర్దేశించే పని టీచర్లే చేస్తారు …. ఈ విషయాన్ని ప్రతిబింబిస్తూ ఎస్.జయ ‘‘మా అమ్మాయి’’ అన్న కథ రాస్తారు …. అమ్మాయి నడతను, నవ్వును, ఆహార్యాన్నీ నిర్దేశించి చివరికి ఆ పిల్లను ఒక నమూనా మూసపాత్రలోకి ఒదిగించేస్తేనే తప్ప సమాజానికి మనశ్శాంతి దొరకదు …. కొండొకచో అమ్మాయి స్నేహం మీద కూడా ఎంతటి నియంత్రణ ఉంటుందో కుప్పిలి పద్మ ‘తలుపులు’ అన్న కథలో చెప్పారు ….
పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్ళి చేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది …. అంటుంది సావిత్రి ….
పెళ్ళి అనేది ఇరువురు స్త్రీ పురుషుల నడుమ స్నేహం, ప్రేమ, గౌరవం పరస్పరావగాహన వంటి సంబంధాల మీదగాక పురుషుడి అధీకృత, స్త్రీ యొక్క అధీన సంబంధ పునాదుల మీద నిలబడ్డం ఒక అంగీకృత విధానమైపోయిన నేపథ్యంలో స్త్రీ జీవితకాలం పురుషుడి అధికారంలోకి వెళ్ళిపోతుంది పెళ్ళి పేరుతో ….
ఆ చట్రంలో ఒదిగిపోయి అదే జీవితంగా భావించి ఆనందంగా ఎందరో స్త్రీలు బతికీడుస్తూంటే …. మరికొందరు ఆ చట్రంలో ఊపిరాడక బయటికి రాలేక కొట్టుకు లాడుతూ ఒక మహా మౌనంలోకి, ఏకాంత వాసంలోకి వెళ్ళిపోతారు …. ఎవరయినా తమ సహజశక్తులన్నీ హరించిపోతున్నాయన్న విషయాన్ని గుర్తెరిగి ఒక చైతన్యంతో బయటికి రావాలనుకుంటే వారిని పొడిచి పొడిచి మళ్ళీ ఆ చట్రంలోపలికి నెడుతుంది సమాజం ….
ఈ మొత్తం విభిన్న కోణాలనీ చర్చకు పెడుతూ పి.సత్యవతి అనేక కథలు రాశారు …. తనలోని సృజనాత్మకతనంతా మరుగుపరుచుకుని భర్త ఆశించిన స్థాయిలో వివాహ చట్రంలోకి ఒదిగిపోయి తనను తాను కోల్పోతూ …. పరాయాకరించబడి బ్రతికేస్తోన్న స్త్రీల మీద మౌఖిక శైలిలో పి.సత్యవతి సంధించిన వ్యంగ్యాస్త్రం ‘‘ఇల్లలక గానే ….’’
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగల కంటే ఇంటి చాకిరీలో మునిగిపోయి తమను తాము మరిచిపోయిన స్త్రీలు ఏమంత గొప్పవాళ్ళు కాదు …. ఆ అస్థిత్వ వేదనతో పేరు తెలుసుకోడం కోసం విముక్తి మార్గంలో ప్రయాణం ప్రారంభించిన తొలి స్త్రీవాద కథగా మనం దీనిని చెప్పుకోవచ్చు ….
పెళ్ళి చూపుల వద్ద నుంచి ప్రారంభమై ఈ పెళ్ళి, దాంపత్యం, సంసారం అంతా కూడా ఒక హింసాపూరిత తతంగంగా ఎలా సాగుతుందో చెపుతూ కొండేపూడి నిర్మల ‘ఉష్ట్రపక్షి’ …. ‘శత్రుస్పర్శ’ వంటి కథలు రాశారు ….
భార్య ఇష్టాయిష్టాలతో, బాధతో ఎటువంటి సంబంధం లేనట్టుగా వారి నుంచి లైంగికానుభవాన్ని కోరే పురుషుల పట్ల అసహ్యాన్నీ, అసహనాన్నీ వ్యక్తంచేస్తూ ఆమె ‘ఎద్దుపుండు’ అన్న కథ రాస్తారు …. ఈ వివాహ వ్యవస్థ ‘ఎద్దు పుండు’ వంటిదనీ …. కాకుల అనుభవం కోసం తానెందుకు ఆ వ్యవస్థనీ అంగీకరిచాలనీ ఒక అవివాహిత స్త్రీ ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తుందీ కథలో ….
కుటుంబాల్లో స్త్రీలు చేస్తూన్న వెట్టిచాకిరీ అంతా ఎలా ఎందుకూ కొరగాకుండా నిష్పలమైపోతోందో …. తండ్రులు మాత్రమే తెలివయిన వాళ్ళుగా …. తమ అవసరాలూ, కష్టసుఖాలూ తీర్చగల వాళ్ళుగా పిల్లల చేత భ్రమింపచేస్తూ, నమ్మిస్తూ …. తల్లులు కేవలం వంటింట్లో మసిగుడ్డలుగా మాత్రమే మిగిలిపోయేటువంటి సమాజ వాస్తవాన్ని తెలుపుతూ కుప్పిలి పద్మ ‘మసిగుడ్డ’ అన్న కథ రాస్తే ….
ఈ చాకిరీ చేసే క్రమంలో …. భర్తల ఇష్టాల కనుగుణంగా తమ చైతన్యాన్ని మార్చుకుని …. తమ తెలివితేటలనూ, సృజనాత్మక శక్తుల నన్నింటినీ కుదించి వేసుకుని …. భర్తకు చూపు లేకపోవడం వల్ల తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా …. ప్రతీ కుటుంబంలోనూ గాంధారి రాగాలు పాడుతోన్న స్త్రీల దుస్థితి గురించి ‘గాంధారి రాగం’ కథలో విశ్లేషిస్తారు పి.సత్యవతి ….
పెంపుడు కుక్కలకయినా సరే ఒక్కొక్కసారి యజమాని చర్యలని భరించలేక తిరగబడతాయి …. ఉగ్గు పాలతో రంగరించి అలవాటు చేయబడిన ఈ సహన సంస్కృతి మూలంగా కుటుంబంలోని లోలోపలి హింసని చివరిదాకా భరిచుకుంటూ పోతారు స్త్రీలు …. భరించడం సాధ్యంకాని క్రమంలో కనీసం కుక్కకున్న చైతన్యమయినా స్త్రీలకు అవసరమన్న స్పృహని మృణాళిని ‘కుక్కబతుకు’ అన్న కథలో స్పష్టం చేస్తారు ….
ఇంతింత దోపిడీకి గురయ్యి కూడా స్త్రీలకు తమకంటూ ఖర్చుపెట్టుకోవడానికి, తమ అవసరాలను గురించి ఆలోచించడానికీ అవకాశం లేకపోవడం …. అన్న విషయాలని చర్చిస్తూ …. ఈనాటి పితృస్వామిక కుటుంబపు ఆర్థిక నిర్మాణంపై నిశ్శబ్దపు తిరుగుబాటు పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ …. స్త్రీల ఇంటి చాకిరీకి విలువ లేక పోవడాన్ని ప్రశ్నిస్తూ ఎస్.జయ ‘ఖరీదు’ అన్న కథ రాస్తారు ….
అలాగే పుట్టినప్పట్నుంచీ వివక్షకు, దోపిడీకి, హింసకు గురవుతూ వచ్చిన తాయమ్మ సహనం …. చివరికి ఎలా పోరాటమై పొంగి వెలుపలి మార్గం చూసుకుంటుందో ‘తాయమ్మ కథ’ (కరుణ రాసింది) చెప్తుంది ….
గృహిణులుగా భర్త సంపాదన మీద ఆధారపడి జీవిస్తోన్న స్త్రీల పరిస్థితి మాత్రమే ఇలా ఉందా? …. ఉద్యోగాలు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడి ఆర్థిక స్వేచ్ఛను సంపాదించగలిగిన స్త్రీల సాంసారిక జీవనాలు ఇందుకు భిన్నంగా ఏమయినా ఉన్నాయా అనుకుంటే …. ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన ఇంటి పని నుంచి ఆమెకి విముక్తి ఏమీలేదు …. ఇంటా, బయటా రెండు రకాల ఒత్తిడుల మధ్య నలిగిపోయేదిగా మాత్రమే అవుతోంది ఉద్యోగిని స్థితి ….
ఇలా రెండు రకాల బాధ్యతలనూ నిరంతరాయంగా నిర్వహిస్తూ తమ పిల్లలను అందరిలోనూ నెంబరువన్లుగా తీర్చిదిద్దాలనే ఆతృతలో పడి గొప్ప తల్లులమనిపించుకోవాలనే కోరికతో తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తూ …. ఎప్పటికప్పుడు ఎటువంటి వైద్య సలహాలూ లేకుండా మింగుతూ వస్తోన్న మరణాలు …. అంటే స్త్రీలు తాము పరాయాకరింపబడడమే కాకుండా కుటుంబం కోసం చివరికి శరీరాలను కూడా సమర్పిస్తోన్న వైనం …. ఆ క్రమంలో స్త్రీల సహజ శక్తులన్నింటికీ ఎలా పాచిపట్టి పోతుందో …. చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించిన కథ పి.సత్యవతి రాసిన ‘సూపర్ మాప్‌ు సిండ్రోప్‌ు’
అలాగే భార్యలు ఉద్యోగం చేసే క్రమంలో తమకంటూ ఒకకొత్త ప్రపంచం ఏర్పడితే …. ఎక్కడ తమ స్థానం తగ్గిపోతుందోనని కించపడి పెళ్ళికి స్త్రీలను ఉద్యోగం మాన్పించడమనే షరతు విధించే ఒక దశ కూడా మనకి ఉన్నది …. ఆ విషయాన్ని చెప్తూ కుప్పిలి పద్మ ‘మంచుదీపం’ అన్న కథ రాశారు.
మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాల మూలంగా భార్యలను ఉద్యోగాలు చేయనిచ్చినప్పటికీ …. ఆ ఆర్థిక స్వావలంబన వారికి జీవితంలో, ఉద్యోగాల్లోనయినా స్వీయనిర్ణయాలు తీసుకోగలిగే అధికారాన్ని ఈ సమాజం ఇవ్వలేదు …. అంటే కుటుంబంలోనే కాకుండా భర్తల అధికారం కొండొకచో ఉద్యోగాలు చేసే చోట్లకు …. వాళ్ళ విధి నిర్వహణల మీదికి, నిర్ణయాల మీదికి కూడా ఎలా విస్తరిస్తుందో ఓల్గా ‘వెలుతురులోకి’ అన్న కథలో తనను తాను అసహ్యించుకుంటూ ఆ ఉద్యోగిని ఎంత సంఘర్షణకు గురవుతుందో తెలుపుతుంది …. అంటే సంపాదించే క్రమంలో కూడా భర్తల అధికారం స్త్రీల మీద మామూలుగానే చలాయించబడుతుంది ….
స్త్రీల శరీరావయవాల మీద ఆంక్షలకు గర్భ సంచులు కూడా మినహాయింపు కాదు …. తమకు సంతానం అవసరమా కాదా అన్నది తన అభీష్టం మేరకు మాత్రమే ఉండాలిగానీ దాని మీదకూడా పురుషుడి అధికారం ఉండడం …. దాని మూలంగా స్త్రీలు పడుతోన్న హింస ఓల్గా రాసిన ‘భిన్న సందర్భాలు’ అన్న కథ ద్వారానూ …. గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ ద్వారానూ స్పష్టమవుతాయి ….
‘‘నిత్యం గర్భాలు మోస్తూ తన కోరిక తీరుస్తలేదని వేరే పెండ్లిచేస్కునుడు …. నాలుగు పెండ్లిండ్లు చేస్కునే వీలు చట్టంలో ఉండడం మూలంగా మొగుడు ఎక్కడ తలాక్ అనేసో …. అనకో రెండో పెళ్ళి చేసుకుంటాడేమోనని భయం ….తో ఐదుమంది పిల్లల్నికని ఇంకకరిని కడుపులో మోస్తూ పాడైన బచ్చేదానితోనే కాలం వెళ్ళదీస్తుంది సాదైకా .. తాను బతికుండగానే ఇద్దరాడపిల్లల్నీ, ఒక మగ పిల్లాడినీ ఒదిలిపెట్టి భర్త ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు …. అది తెలిసి తలాకయివ్వడానికి సిద్ధపడడమే కాకుండా బచ్చేదానిని సాఫ్ చేయించుకుంటుంది నసీం ….
స్త్రీలను అవమానించడానికి పురుషుడు ఉపయోగించే ఒక అసహ్యకరమైన ఆయుధం అత్యాచారం …. ఈ దుస్థితికి యువతులే కాదు బాలికలు సైతం ఎదుర్కొంటున్న తీరును విశదీకరిస్తూ తన శరీరంలోని ఏ అవయవం ఈ దుస్థితికి కారణమైందో ఆ అవయవం లేకుండా ఉండే స్థితిని కోరుకుంటుందా చిన్నారి బాధగా …. ‘అయోని’ ఓల్గా కథ ….
స్త్రీలను అధీన సంబంధాలలోకి నెడుతోన్న ఇప్పటి నమూనా కుటుంబాల పునర్నిర్మాణం జరగాలంటే ముందు వాటిని సమూలంగా కూలగొట్టవలసి ఉంది …. పెళ్ళి సంస్కృతి పురుషుడికి సర్వాధికారాలనూ కట్టబెడుతోంది కనక పురుషుడికి ఆ అవకాశం, అధికారం ఇవ్వకుండా అమానవీయబంధాల నుంచి మానవీయ సంబంధాలలోకి ప్రయాణించే ఒక ‘ప్రయోగం’ ఓల్గా స్త్రీ …. అనే నేపథ్యంలో ఇంకొంచెం మార్పుతో ఈ వివాహ చట్రంలోకి ఇమడకుండా ఒంటరిగా బతకగలిగే ఒక నిర్ణయాన్ని కుప్పిలి పద్మ ‘ముక్త’ కథల్లో చెప్తారు ….
కేవలం శారీరక, కౌటుంబిక స్త్రీ పురుష సంబంధాలను, వాటిలోని డొల్లతనాన్ని ప్రశ్నించడం …. చర్చకు పెట్టడం దగ్గర్నుండి తాము ఎంత కాలమయినా ఇలా ఇంటి పనులలోనే మునిగి ఉన్నట్టయితే స్వేచ్ఛను సాధించడం అసంభవం అన్న విషయాన్ని గుర్తెరిగి …. తాము కూడా సమాజంలో భాగమని నమ్మి సమాజ సంబంధిత అనేకానేక పరిణామాలను కూడా వస్తువులుగా తీసుకుని కథా సాహిత్యాన్ని వెలువరించడం ప్రారంభించారు స్త్రీ రచయితలు ….
సామ్రాజ్యవాద విధానాలు మన జీవితాలను ఎటువంటి ప్రకంపనాలకు గురిచేస్తున్నాయో …. అవి మన కుటుంబ, దాంపత్య జీవితాలను కూడా ఎలా ప్రభావితం చేస్తున్నాయో విమర్శకు పెడుతూ కుప్పిలి పద్మ ‘ప్రకంపనం’, ‘కుబుసం’ …. ‘ఇన్‌స్టెంట్ లైఫ్’ వంటి కథలు రాశారు ….
అలాగే మారుతోన్న సామాజిక పరిణామాల ప్రభావం భార్యాభర్తల నడుమ ఎటువంటి ఇనుప గోడలను దించుతుందో చాలా లోతుగా చర్చకు పెడుతూ రంగనాయకమ్మ ‘మురళీ వాళ్ళమ్మ’ అన్న కథను రాశారు ….
ఇందులో ప్రధాన పాత్ర అమ్మే …. రుక్మిణి …. తాను ఏ అన్యాయాన్ని అయితే ఎదిరించి కొడుకుని తీసుకుని బయటికొచ్చేసిందో అదే దుర్మార్గం తన కొడుకు చేయడాన్ని ఆమె ఎంతమాత్రమూ సహించదు …. కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు స్త్రీ, పురుష సంబంధాలలోని విలువలను ఎంత పలచన చేసేస్తున్నాయో ఆ క్రమంలో భార్యభర్తల నడుమ తెలీకుండానే దిగిపోతూన్న ఇనుపతెరలు వాటిని కోడలికి స్పష్టం చేయిస్తుంది రుక్మిణి …. భర్త తప్పుని సహించలేని దాన్ని కొడుకు చేస్తూంటే మాత్రం ఎలా సహిస్తానంటూ మురళిని నిలదీస్తుంది …. కోడలికి నిర్ణయాన్ని తీసుకోవలసిన అవసరాన్ని సూచిస్తుంది ….
టెక్నాలజీ ప్రదేశాల మధ్య దూరాలని తగ్గించి ఒకే చోట నున్న ఆప్తుల మధ్య దూరాలను పెంచుతోన్న తీరును చంద్రలత ‘కలిగ్స్’ అన్న కథలో చాలా సున్నితంగా హృదయాలకు హత్తుకునేలా చేప్తారు …. భార్యా భర్తలిరువురూ ఒకే చదువు చదివి ఒకే వృత్తిలో ఉన్నా వృత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో పురుషుడికి మాత్రమే ఉన్న అవకాశాన్ని విప్పిచెప్తుందీ కథ ….
స్త్రీవాద కథ బలపడక ముందు నుంచీ కూడా స్త్రీ చైతన్య కథలు రాస్తూ వచ్చిన అబ్బూరి ఛాయాదేవి ‘తన మార్గం’ వంటి కథలే కాకుండా కార్పొరేటీకరణ చెందిపోతూన్న వైద్యం మీద ఆఖరికి అయిదు నక్షత్రాలు అన్న కథ రాశారు …. సామ్రాజ్యవాద సంస్కృతి వైద్యం మీద కూడా చూపించిన ప్రభావాన్ని చర్చకు పెడుతుందీ కథ …. ఈమె ‘తన మార్గం’ కథా సంపుటికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్త్రీవాద కథకి అందిన పురస్కారంగా స్త్రీ వాదులంతా భావించారు.
మహిళా సాధికారత సాధికారత అని మనం చెప్పుకోవడమే గాని మహిళలకు ఆ సాధికారత లభించినట్టుగా మనకేమీ కనిపించడం లేదు …. రిజర్వేషన్ నియమాల మూలంగా మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయినప్పటికీ ఈ మొత్తం ప్రహసనమ్ వెనుక నుండి అధికారం చెలాయించేది మాత్రం పురుషుడే ….
ఈ నేపథ్యంలో ఒకానొక ఊరి సర్పంచిగా ఎన్నికయిన మహిళ తన భర్త నిర్ణయాలను అమలుపరిచే ఆటబొమ్మలా కాకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకోగల సబలగా ఎదగడం అన్న వస్తువుతో కొండవీటి సత్యవతి ‘ముందడుగు’ అన్న కథ రాశారు …. ఇదే నేపథ్యంతో ముదిగంటి సుజాతారెడ్డి ‘కబ్జా’, ‘ధర్మపత్ని’ అన్న రెండు కథలు రాశారు …. ఆ రెండు కథల్లోనూ పంచాయితీ సర్పంచులుగా ఎన్నికయిన మహిళలు ఆఫీసుకు వెళ్ళడాన్ని చిత్రిస్తారామె.
స్త్రీలలో చైతన్యం రానంతవరకూ ఇటువంటి రిజర్వేషన్లు దండుగ అని సూచిస్తుంది ధర్మపత్ని కథ ….
స్త్రీలంతా ఒక్కటిగా కలిసి ఉండడం …. అన్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతోంది స్త్రీ వాదం …. అంటే కుటుంబ సంబంధాలనూ, సమాజ సంబంధాలనూ ఉన్నతీకరించుకునే ఒక స్వభావాన్ని జీవలక్షణంగా తీసుకుని కథా సాహిత్యాన్ని పండిస్తున్నారివాళ స్త్రీ రచయితలు ….
ఎప్పటికప్పుడు స్త్రీవాద సాహిత్యానికి కథ, కవిత, నవలవంటి వాటన్నింటినీ విమర్శకు పెట్టి, ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ అందిస్తూ ముందుకు తీసుకెళ్తోన్న ప్రముఖ సాహితీ విమర్శకురాలు, ఉపన్యాసకురాలు అయిన కాత్యాయనీ విద్మహేని గురించి చెప్పుకోనట్టయితే స్త్రీవాద సాహిత్యం పూర్తి కానట్టే ….
అలాగే స్త్రీ పురుష అసమానతల పట్ల ద్వేషమూ, ఉన్నత మానవీయ విలువల ఆకాంక్షా ఉన్నటువంటి పురుష రచయితల గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవలసి ఉంది ….
కేతువిశ్వనాథరెడ్డి రాసిన ‘‘రెక్కలు’’, ‘‘సతి’’, కవనశర్మ రాసిన ‘ఆమె ఇల్లు’, ‘విడాకులు’ …. వివిన మూర్తి రాసిన ‘వాల్‌పేపర్’ వైప్లవ్య వంటి కథలు బమ్మిడి జగదీశ్వరావు ‘రెక్కల గూడు’ …. మధురాంతకం నరేంద్ర ‘నిత్యమూ – నిరంతరమూ’ వాడ్రేవు చినవీర భద్రుడి ‘సుజాత’, అల్లం రాజయ్య ‘కము’, ‘నీల’ రఘోత్తమరెడ్డి ‘జాడ’ అంపశయ్య నవీన్ కథలు చెప్పుకోదగినవి …. ఆర్.ఎప్‌ు.ఉమామహేశ్వరావు రాసిన ‘నోరుగల్ల ఆడది’ ‘ఒంటేపమాను’ వంటి కథలు కళావంతుల ఇళ్ళలోని పాతతరం స్త్రీల వ్యక్తిత్వాలనీ, ఆత్మగౌరవాలనీ …. పరోపకార హృదయాలనీ. కొన్నిసార్లు నోటిని ఆయుధంగా అడ్డుపెట్టుకోవడాన్నీ హృద్యంగా వివరిస్తాయి ….
3
వెనకబడిన కులాలను, వర్గాలను అభివృద్ధిలోకి తెస్తామంటూ చిరకాలంగా కల్పించబడిన భ్రమలు కేవలం భ్రమలుగానే తేలిపోయాయి తొంభయిల నాటికే ….
చుండూరు, కారంచేడు, పదిరికుప్పం సంఘటనలు తరతారాలుగా దళితుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆగ్రహంగా మార్చి ఒక కొత్త చైతన్యాన్ని, కొత్త దృక్పధాన్నీ పెంపొందించుకునేట్టు చేశాయి.
ఈ సామాజిక వివక్షకు అసలైన మూలం ఎక్కడుందో తెలుసుకోవాలనే వెదుకులాట దళితుల్లో ఎక్కువయింది. స్వేచ్ఛాయుత జీవనం …. ఆర్థిక, రాజకీయ రంగాలలో బలపడాలన్న ఆలోచన ప్రారంభమైంది ….
ఆ క్రమంలో దళితుల్లో పెరిగిన జ్ఞానచైతన్యాలు ఉద్యమ రూపాన్ని తీసుకోవడంలో వెనుకంజవేయలేదు …. మనందరికీ తెలుసు లక్ష్మీనరసయ్య, సి.వి., కత్తి పద్మారావు, మద్దూరి నగేష్‌బాబు, బి.ఎస్.రాములు వంటి వారెందరో దళిత ఉద్యమం కోసం కష్టపడి పనిచేశారు….
ఈ చైతన్యమంతా దళిత జీవిత నేపథ్యంలోని సామాజికార్థిక కోణాలతో సాహిత్యంలో ప్రతి ఫలిస్తూ వచ్చాయి …. దళిత కవులూ, రచయితలూ తమ జీవితాలలోని కథలూ, గాథలూ తామే అక్షరీకరించుకోవడం మొదలుపెట్టారు ….
మొదట కవిత్వ రూపంలో ఎక్కువగా బయటికొచ్చినప్పటికీ క్రమక్రమంగా కథాసాహిత్యంలో కూడా దళితవాదం ప్రతిఫలించసాగింది.
నాగప్పగారి సుందరాజు, మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్ బాబు నితీష్ చందర్, ఎండ్లూరి సుధాకర్, బి.ఎస్.రాములు, ఎస్.జయ వంటి వారెందరో దళిత జనజీవితాలను వివిధ కోణాల నుంచి కథలుగా మలిచారు.
అయితే ఈ కథలు శ్రీపాద కథల్లానో, కరుణకుమార, పులికంటి వంటి వారి కథల్లోలా కేవలం మానవతా దృక్పధంతో కాక ఒక ధిక్కార స్వరంతో, ప్రతిఘటనా రూపంతో వెలువడడం మొదలయింది …. కుల పరమైన అసహనాన్ని ఆర్థిక రాజకీయ నియంతృత్వాన్ని ఈ రచయితలు ప్రతిఘటించారు …. పీడన నుంచి విముక్తి …. సమానత్వం దిశగా ఈ కథాసాహిత్యం ముందుకు సాగింది ….
‘ఊరబావి’ …. దళిత కథాసాహిత్యంలో మైలురాయి వంటి కథ రాసిన కలకలూరి ఇనాక్ ఆకలి, దొంగగొడ్డు, ఎర్నీళ్ళ వంటి మరెన్నో కథలు రాసి దళితవాదం ముందుకు సాగడానికి తనవంతు శక్తిని సరఫరా చేశారు.
మునుపు ఎప్పుడయినా రాత్రి ఆకలయితే, తెల్లవారితే తీరుతుందన్న ఆశ ఉండడంతో …. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడ్డం చిన్నికి ఆనందమే. మొన్న తెల్లవారింది ఆకలి తీరలేదు …. నిన్న తెల్లవారింది ఆకలి ఆకలిగానే ఉంది. ఇవాళ తెల్లవారింది ఆకలి ఎక్కువయింది …, ఇంకొక ఉదయం వస్తుందంటే చిన్నికి సంతోషం కంటే దు:ఖమే కలుగుతుంది …. ఆకలికి ఎడతెగని విజయం చిన్ని భరించలేదు …. అంటాడు కథకుడు ….
ఈ కథ చదివిన చాలా రోజులదాకా పాఠకుడికి ఆకలి వేయదు …. నిద్రపట్టదు …. ఆకలికోసం …. వాళ్ళిచ్చే నాలుగు డబ్బుల కోసం లారీకింద పడి దెబ్బ తగిలించుకోవాలనుకున్న చిన్ని ప్రాణాలే అర్పిస్తుంది …. చిన్ని జీవితకాలం మన ఆలోచనలలో నిల్చిపోయే పాత్ర ….
దళిత స్త్రీలను బసివినులుగా మార్చే సాంప్రదాయం వెనుక ఎంత కుట్ర, హింస దాగి ఉందో …. దాని మూలంగా భూస్వాములు లబ్ధిపొందడం అగ్రవర్ణ అధికార రాజకీయాల పట్ల ఆగ్రహం ధ్వనించే కథలు నాగప్పగారి సుందరాజు రాస్తాడు ….
తమ శరీరాలకున్న ఈ నలుపువల్ల జీవిత పర్యంతం ఎన్నెన్ని అవమానాలను సహించాల్సి వచ్చిందో దృష్టాంతంగా చెప్తూ చివరికి చదువుకోడానికంటూ హాస్టలల్లో చేరితే దళిత స్త్రీలుగా …. కేవలం స్త్రీ అయినందువల్ల కాదు దళిత స్త్రీ అయినందువల్ల ఎంతటి తేలికభావం …. అత్యాచారం …. హృదయాలను ద్రవీభూతం చేస్తుంది ‘నలుపు’ డా॥ వి.చంద్రశేఖరావు రాసిన కథ ….
స్వామి రాసిన ‘ప్రశాంతం’, ‘ఒక హెచ్.సరస్వతి కథ’ వంటివి దళిత స్త్రీల జీవితాల్లోని వివక్షనూ, హింసనూ ప్రతిఘటనా తీరునూ కూడా విశ్లేషించిన కథలు …. చదువుకుని ఉద్యోగాలు చేస్తోన్న స్త్రీల విషయంలో కూడా ఈ తేలికభావం …. వివక్ష ఎంతగా ఉంటాయో ‘హెచ్.సరస్వతి కథ’ చదువుతుంటే మనకి అర్థమవుతుంది….
కందూరి సుధాకర్ రాసిన ‘మల్లెమొగ్గల గొడుగు’ ఒక అస్త్రంలా దూసుకొచ్చిన దళిత కథా సంపుటి …. కేవలం అగ్రకులాల అసహనాన్ని, పీడననీ మాత్రమే కాకుండా దళితుల్లో అంతర్లీనంగా ఉండే వైరుధ్యాలను కూడా చర్చిస్తాడు సుధాకర్ ….
దళిత స్త్రీ సమస్యల కథలు, దళిత రాజకీయార్థిక పరిణామ కథలు వంటి ఆరేడు సంకలనాలను కె.లక్ష్మీనారాయణ, కలకలూరి ఇనాక్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు …. ఈ సంకలనాలు దళిత జీవిత పరిణామాలనూ, సమస్యలనూ, చీకటి కోణాలనూ అర్థం చేసుకోవడానికి ఒక వాహికగా పని చేస్తాయి ….
ఇకపోతే దళిత స్త్రీ రచయితల విషయానికొస్తే చల్లపల్లి స్వరూపరాణి, జె.సుభద్ర, జి.విజయలక్ష్మి, గోగుశ్యాము, జాజులగౌరి, వినోదిని, శశినిర్మల, కె.దుర్గాదేవి …. గుజ్జర్లమూడి నిర్మలారాణి వంటి వారు మంచి కథాసాహిత్యాన్ని వెలువరిస్తున్నారు ….
సాహితీ రంగంలోని దళిత స్త్రీల సృజనాత్మకత మీద ‘నల్లపొద్దు’ అన్న సంకలనం ఈ శతాబ్దిలో(2002) వెలువడింది ….
పితృస్వామ్యంలోని లైంగిక రాజకీయాలు దళిత స్త్రీలను ఎంతగా అణిచివేస్తున్నాయో, కుల వర్గ రాజకీయాలు కూడా అంతే ప్రభావితం చేస్తున్నాయని హిందూ ఆధిపత్య కులాల పురుషులు దళితులను రాజకీయంగా అణిచివేసేందుకు దళిత స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించే విధానాన్ని గోగు శ్యామల నిరసిస్తారు …. వారు స్త్రీలైనందుకు కాదు కేవలం దళిత స్త్రీలయినందు వల్ల మాత్రమే వారిమీద ఈ అత్యాచారకాండ అంటారీమె. దళిత స్త్రీలలో ఇప్పుడిప్పుడే తిరుగుబాటు ధోరణి పదునెక్కుతోంది …. ఇది చాలా అవసరమైనదని భావించారామె ఒకచోట ….
అనంతపురం ప్రాంతం నుంచి కసాయి కరువును చిత్రిస్తూ ‘కాటేసిన కరువు’ అన్న కథ రాసిన గుజ్జర్లమూడి నిర్మలారాణి …. దళిత స్త్రీ సమస్యల మీద స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తున్నారు ….
అలాగే దళిత జీవన విధానాలనీ, బాధలనీ, గాథలనీ చిత్రిస్తూ జాజుల గౌరి ‘మన్నుబువ్వ’ కథా సంపుటి ఈ దశాబ్దంలో వెలుగు చూసింది ….
జె.సుభద్ర దళిత స్త్రీ మీద కులం, వర్గం, పురుషాధిపత్యాలతో పాటు ప్రాంతీయత కూడా పని చేస్తుందని అంటుంది…. సింగరేణి బాయి పనికి స్త్రీలను అడ్డుకోవడాన్ని గురించి ఆమె నిరసిస్తుంది …. అక్కడ మైసమ్మ ఉంటుంది కాబట్టి స్త్రీలకి ముట్టు ఉండడం మూలంగా పనికి వెళ్ళకూడదట …. పనిలో స్త్రీల భాగస్వామ్యానికి ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడాన్ని ప్రశ్నిస్తుంది సుభద్ర ….
మిగిలిన అన్ని రంగాలతో పాటుగా క్రీడారంగంలో కూడా దళితుల్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి …. మన దేశంలోని దళితుల, బహుజనుల క్రీడాస్ఫూర్తిని వినియోగించుకోకపోవడం వల్లనే మనకి బంగారు పతకాలు లభించడం లేదన్న అంశంతో చిలుకూరి దీవెన ‘ఆటకట్టు’ అన్న కథ రాసింది …. క్రీడారంగానికి సంబంధించిన వివక్షను ఈ కథ చర్చకు పెడుతుంది.
పుట్ల హేమలత అటు కవిత్వం రాస్తూనే ఇటు కథా సాహిత్యాన్ని కూడా పండిస్తున్నారు….కొలకలూరి స్వరూపరాణి పద్యాలు, కవితలు …. వ్యాసాలు వంటివి రాస్తూ దళిత వాదానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ….
ఈ విధంగా దళితులే కాకుండా దళితేతరులు కూడా దళిత జీవితాల్లోని విభిన్న కోణాలను కథలుగా మలిచిన వారిలో ముఖ్యంగా పులికంటి కృష్ణారెడ్డి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, సింగమనేని నారాయణ, దాదాహయాత్, ఓల్గా, సుంకోజి దేవేంద్రాచారి వంటి వారున్నారు …. దగ్గుమాటి పద్మాకర్ రాసిన ‘పరిధులూ – ప్రమేయాలూ’ దళిత స్త్రీ చైతన్యాన్ని లోతుగా చెప్పిన కథ …. స్త్రీవాద దృష్టికోణం నుంచి దళితవాద సిద్ధాంతాలనూ, సూత్రాలనూ విమర్శకు పెట్టే పని చేసిందీ కథ ….
4
‘శ్రమజీవుల శ్రమతోనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తున్నప్పుడు ఆ శ్రమజీవుల సమస్యలను పట్టించుకోకుండా ఉండే స్వేచ్ఛ రచయితకు లేదు’ అంటాడో రచయిత ….
జీవితాల్లోని సంఘర్షణని, వైరుధ్యాలనీ అర్థం చేసుకుంటూ ఆ వైరుధ్యాలని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ …. ప్రతిఘటించాల్సిన చోట ప్రతిఘటిస్తూ సాహిత్యాన్ని వెలువరించడం రచయితల కనీసపు కర్తవ్యం …. దీనినే పోరాటం, ఉద్యమం …. విప్లవం అని మనం అనుకోవచ్చు ….
ఈ దశాబ్దిన్నర కాలంలో వచ్చిన విప్లవోద్యమ కథలు రాజ్యవ్యతిరేక స్వభావాలనూ, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, కార్మికవర్గం వంటి వారికి జీవనం లేకుండా చేసే విధానాలను ఎండగడుతూ …. ఆ శ్రమజీవులకు బ్రతికే ధైర్యాన్నిస్తూ ఉత్సాహన్నిస్తూ చిత్రితమైనాయి …. మనందరికీ తెలుసు శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణ వరకు వ్యాపించిన విప్లవోద్యమం …. రాజ్య అణిచివేతల వలన పైకి పూజ్యంగా కన్పించినప్పటికీ అది ఆ ప్రాంత జీవన రంగాలలో అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంది ….
విప్లవ కార్యకర్తలు తమ ఆచరణ ద్వారా, న్యాయ పోరాటాల ద్వారా … ప్రజా సమూహాలలో భాగమై తమ సమస్యల్ని ఎవరో వచ్చి పరిష్కరిస్తారని కాకుండా తామే పరిష్కరించుకోవలసిన అవసరాన్ని, చైతన్యాన్ని వారిలో కలిగిచడమే కాకుండా … వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని, వారి జీవితాలలో మమేకమై విడదీయ లేనటువంటి ప్రభావం తీరును … క్రమాన్ని గొప్పగా చిత్రిక పట్టిన కథ ‘అతడు’ ….
ఉద్యమ కెరటాల తాకిడి, వాటి అణచివేతల వికృత రూపాలుగా దుర్భర నిర్భంధాన్ని చవిచూసిన తెలంగాణ పల్లెలలోని వాతావరణం ‘అతడు’ కథలో అడుగడుగునా కనిపిస్తుంది… అంతటి నిర్భంధంలో కూడా అతడి కర్మకాండకు మరో మరణ యాత్రతో పాటు అంతర్లీనంగా ప్రజలు హాజరు కావడాన్ని … అతడి మీద ప్రేమనీ, అనుబంధాన్నీ చక్కగా చిత్రించిన కథ ఇది …
అలాగే రఘోత్తమరెడ్డి రాసిన చావువిందు, జాడ, పనిపిల్ల వంటి కథలు విప్లవోద్యమ నేపథ్యంలో ప్రజా సంబంధాలనూ, భూమి సంబంధాలనూ, భార్యాభర్తల సంబంధాలనూ విశ్లేషిస్తూ దొరల పెత్తనాలను ప్రతిఘటించే క్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసే దిక్కుగా సాగుతాయి … ‘చావువిందు’ కథ ఈ కోవలోనిదే …
‘పనిపిల్ల’ కథ మీద సుదీర్ఘమైన చర్చ జరిగి ఆ చర్చా వ్యాసాలతో ఒక ప్రత్యేకమైన పుస్తకం రావడం విశేషం…
ఉద్యమాన్ని అణిచివేయడం కోసం రాజ్యం అనుసరించే హింసా రాజకీయాల దారుణ స్థితిని వివరిస్తూ వచ్చిన కథ డా॥ వి.చంద్రశేఖరరావు రాసిన ‘మాయాలాంతరు’ … విప్లవోద్యమంలో స్త్రీలను ఎన్‌కౌంటర్లకు గురిచేసి అది హత్యకాదని నమ్మించడానికి ప్రేమ కథలల్లడాన్ని నిరసిస్తూ మార్మిక పద్ధతిలో సాగిన కథ ఇది…
పారిశ్రామిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ చీకట్లోకి నెట్టేస్తోన్న కార్మిక వర్గాల జీవితాల మీదికి వెలుగు ప్రసరిస్తూ పి.చంద్ ‘భూనిర్వాసితులు’ అదేవిధంగా సాగునీటి నిస్తామంటూ ప్రభుత్వం భ్రమింపచేస్తోన్న ప్రాజెక్టుల కింద ముంపుకి గురయి నిర్వాసితులవుతోన్న అనేక గ్రామాల ప్రజల జీవితాల మీద నల్లూరి రుక్మిణి ‘ముంపు’ వంటి కథలొచ్చాయి…
అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి పి.చిన్నయ్య ప్రజాజీవితం ఎదుర్కొంటోన్న సమస్యల విభిన్న కోణాలని … పాఠకుల, ప్రజల దృష్టిలోకి తీసుకు రావడమే ధ్యేయంగా విప్లవోద్యమ నేపథ్యంలోంచి కథలు రాయడం జరిగింది … ‘పయిలం’ అన్న కథా సంపుటం వెలువరించారు.
మిడ్కో రాసిన ‘మెట్ల మీద …’ అన్న కథ కూడా చెప్పుకోదగినది …
తమ ఊళ్ళో విప్లవ చైతన్యం లేనిరోజుల్లోనే ఉద్యమంలోకి వెళ్ళి కొన్నేళ్ళు గడిపి … జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తిరిగి వచ్చేప్పటికి కుటుంబంలో, ఊరిలో పూర్తి చైతన్యం కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది … ఈ కథని చాలా లోతయిన దృష్టితో, వివరంగా చర్చకు పెడ్తాడు రచయిత…
శ్రీకాకుళ గిరిజనోద్యమ నేపధ్యం నుండి సువర్ణముఖి రాసిన ‘అన్నలొస్తున్నారు’, ‘తగువులు’ వంటి కథలు అణిచివేతకు గురికాబడిన గిరిజనుల జీవితాలనూ … ఇప్పటి దోపిడీని సమీక్షిస్తూ శ్రీకాకుళం మళ్ళీ విప్లవోద్యమానికి సన్నద్ధమవుతోన్న తీరును చిత్రిస్తాయి…
అలాగే గిరిజన సంక్షేమ పథకాల పేరులో అవి గిరిజన స్త్రీల జీవితాలలో సృష్టించే కష్టాలు, కన్నీళ్ళు, లైంగిక పీడన వంటి అనేక కోణాలను చిత్రిస్తూ వారు ప్రతిఘటనకు, పోరాటానికీ సన్నద్ధం కావడాన్ని విశ్లేషిస్తూ గౌరు నాయుడు ‘బతుకాకు’, ‘రక్తాశ్రువు’ వంటి కథలు రాశారు … ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు విప్లవీకరింపబడ్తున్న క్రమాన్ని చెప్తాయి.
అలాగే అరవయ్యిల్లో వచ్చిన కారాగారి ‘యజ్ఞం’ కథకి కొనసాగింపుగా ఈ శతాబ్దంలో అప్పల్నాయుడు ‘యజ్ఞం తరువాత’ అన్న కథ రాశారు.
ఇది నిజంగా గొప్ప ప్రయత్నం … నాలుగు దశాబ్దాల కాలంలో వచ్చిన అనేకానేక పరిణామాలను వివిధ కోణాల నుంచి లోతుగా చర్చకు పెడుతుందీ కథ … ‘యజ్ఞం’. తర్వాతి కాలంలో ఉద్యమ ప్రభావం వలన వచ్చిన మార్పుల్ని, నూతన ఆర్థిక విధానాల ప్రభావాలనీ … ఆ నేపధ్యంలో యజ్ఞం కథలోని పాత్రల జీవిత పరిణామాలనీ పట్టుకుంటుంది ‘యజ్ఞం తర్వాత’.
తన కొడుకుని చంపి వెట్టిచాకిరీ నుంచి తప్పించాననుకున్న సీతారాముడు ఆ తర్వాతి కాలంలో ఉద్యమంలో చేరి లక్షుం నాయుడ్ని చంపుతాడు … అయినా పరిస్థితుల్లో కొత్త మార్పులేమీ ఉండవు … సీతారాముడ్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చంపేసిన తర్వాత అతని జ్ఞాపకార్ధం స్థూపం నిర్మించబడుతుంది. చివరికి అదికూడా మిగలదు … అతడి అన్నకొడుకు చిన అప్పల్రాయుడు ఉద్యమంలోకి వెళ్ళడం … ఒకానొక రాత్రి అతడు వచ్చినప్పుడు అతడికీ మేష్టారుకీ మధ్య జరిగే చర్చలో అనేకానేక విషయాలు పాఠకుల ముందు పరుస్తాడు రచయిత…
ఈ శతాబ్దపు గొప్ప ప్రయత్నం ఈ కథ …
ఈ పదిహేనేళ్ళ కాలంలో విప్లవ కథ ప్రజలను చైతన్యపరిచి ప్రజల పక్షాన బలంగా నిలబడింది … సామ్రాజ్య వాదాన్ని ఎదుర్కొన్నది … భూస్వామ్య విధానాన్ని, భూమి సంబంధాలనూ బయటపెట్టింది … పీడిత ప్రజల్ని సంఘటిత శక్తిగా మార్చే నిర్మాణ బాధ్యతని నెత్తికెత్తుకుంది…
ఈ క్రమంలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విప్లవోద్యమ రచయితలు నిరాఘాటంగా ముందుకు సాగుతున్న తీరును గమనించి ప్రభుత్వం నిషేధాన్ని విధించి … ప్రజల నుంచి, ప్రజాస్వామిక మేధావుల నుంచి, రచయితలు, కవులు కళాకారుల నుంచి వచ్చిన వ్యతిరేకతకు తలఒగ్గి నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది …
రచయిత సత్యాన్వేషి … రచయితల భావప్రకటనా స్వేచ్ఛ, మౌలికమైన ప్రశ్నించే హక్కుకి సంకెళ్ళు వేయడం అనే దుశ్చర్యని తెలుగు కథకులంతా కూడా తీవ్రంగా ఖండించారు…
5
ఖాదర్ ‘పుట్టుమచ్చ’తో ప్రారంభమైన ముస్లిం సాహిత్యం అయోధ్య సంఘటనతో అస్థిత్వ వేదనకు గురయి హక్కుల్ని కోరుకుంటూ జల్‌జలా, జహాద్ అన్న కవిత్వ సంకలనాలుగా ఏర్పడి … క్రమంగా ఒక ఉద్యమ రూపం తీసుకుంది …
తెలుగు సాహిత్యంలో స్వీయానుభూతులను, జీవిత విశేషాలనూ సార్వజనీనం చేస్తూ ఆత్మకథా మాలికలు రాసిన వారిలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పేరు మొదటగా మనం చెప్పుకున్నట్టయితే ఆ తరువాత ఈ పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించారు ముస్లిం రచయితలు … మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన ‘దర్గామిట్ట కథలు’, రహముల్లా రాసిన ‘బా’ ఈ కోవలోకి వస్తాయి.
‘మైనార్టీలు అనడం కంటే ముస్లిములు అనడమే బావుంది … మైనార్టీ అనడంలో మా ఆత్మ తప్పిపోతుంది అంటారు ఖదీర్‌బాబు ఒకచోట … అలాగే మైనారిటీ సాహిత్యం అనడం కన్నా ముస్లిం సాహిత్యం అనడమే సబబుగా భావిస్తారు స్కైబాబా మరొకచోట … కాబట్టి మనం ముస్లింల కథా సాహిత్యంగానే దీన్ని పరిగణించుకుంటే …
ఖాజా, రహమతుల్లా, ఇనాయతుల్లా, గౌస్ మొహియుద్దీన్, యాకూబ్, ఖాదర్, షరీఫ్ … స్కైబాబా, షాజహానా వంటి వారెందరో మంచి మంచి కథలు రాస్తున్నారు…
ఖదీర్‌బాబు రాసిన ‘దావత్’ ముస్లిం స్త్రీల కథ … ముస్లింల పెళ్ళి విందుల్లో మగవాళ్ళు పూర్తిగా విందుభోజనం చేసేవరకూ స్త్రీలు కాచుకుని ఉండడం … ఒక్కొక్కసారి మిగలకపోవడం … స్త్రీల ఆకలినీ, స్త్రీలమీద ఒత్తిడినీ కూడా చాలా విపులంగా చిత్రించిన కథ ఇది … అంతా దాన్ని ముస్లింల పెళ్ళి విందుని చిత్రించిన కథగా భావించినప్పటికీ నిజానికది ముస్లిం స్త్రీవాద కథ …
ముస్లింలతో ఎటువంటి కులబేధం లేకుండా, ఎంతో ప్రేమగా, స్నేహంగా సాంస్కృతికంగా వాళ్ళతో కలగలిసి పోయిన దళిత బహుజనులలో విద్వేష మతబీజాలు నాటడానికి చేస్తోన్న ప్రయత్నాన్ని అత్యంత ఒడుపుగా పట్టుకున్న కథ ‘జమీన్’ … ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వకపోవడం, స్థలాలు అమ్మకపోవడం, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చాలా దూరంగా ఉంచడానికి జరిగే ప్రయత్నాలు వీటన్నింటితో పాటుగా మతోన్మాద దాడిని కూడా విపులంగా చర్చకు పెడుతుంది కథ …
ముస్లిం జీవితాలలోని వివక్షతలనీ, అణచివేతలనీ … బురఖా సాంప్రదాయాలనీ తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన ముస్లిం కవులు కథా ప్రక్రియలో కూడా తమ జీవిత సమస్యలని చర్చకు పెట్టడం ఈ కొత్త శతాబ్దపు విశేషం…
దాదా హయాత్, అఫ్సర్, వేంపల్లి అబ్దుల్ ఖాదర్ వంటి వారెందరో కథా సాహిత్యాన్ని పండిస్తున్నారు…
గుజరాత్‌లో జరిగిన అమానవీయమైన, ఆటవికమైన మత మారణకాండ ఈ కథలకు మరింత ప్రేరణ నిచ్చింది …
మొత్తం దేశాన్నంతా భయభ్రాంతం చేసిన చారిత్రక సందర్భం అది … రెండున్నర నెలలు పాటు సాగిన ఆ సామూహిక హత్యాకాండలో … పిల్లలు, వృద్ధులు, స్త్రీలూ … గర్భస్థ పిండాలూ అన్న తేడా లేకుండా వేలాది మంది ముస్లింలను ఊచకోత కోశారు …
గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన శవాలను గెద్దలు పీక్కుతింటోన్న దృశ్యాలు మానవత్వమున్న వారి హృదయాలను ద్రవీభూతం చేశాయి…
వందలాది ముస్లిం స్త్రీలు కిరాతకంగా లైంగిక అత్యాచారానికి గురయిన సంఘటన దేశ వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించి అభద్రతా భావాన్ని నింపివేసింది … మొత్తంగా దేశ ప్రజలలో లౌకికతత్త్వం ప్రశ్నార్థకమై పోయింది …
ఈ విధ్వంసాన్ని నిరసిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ అనంతమైన కవిత్వం వచ్చినప్పటికీ అది కథారూపాన్ని కూడా తీసుకున్నది …
ఈ విధ్వంసానికి చలించి అభద్రతా భావంతో పిచ్చివాడుగా మారిపోయి ఆసుపత్రి పాలయిన ఇల్యాన్ కథ రహమతుల్లా రాసిన ‘బోర్డర్స్’ అభద్రతా భావం ఎంత తీవ్రమయిన దశలో ఉంటుందో విశ్లేషించిన కథ ఇది … అసలిది మన దేశమా కాదా? మన చోటు ఎక్కడున్నది అన్న సందిగ్ధం నుంచి రహమతుల్లాదే ‘కిరాయి మకాన్’ అన్న కథ వచ్చింది …
‘‘ముస్లిం కమ్యూనిటీ మీద జరుగుతోన్న హత్యాకాండ పూర్తిగా ఒక ఖామోషీనే నింపింది … స్వేచ్ఛతోని, ప్రేమతోని, స్నేహంతోని ఇన్ని దినాలు హిందూ ముస్లింలు ఒకర్నొకరు చూసుకున్న చూపులల్ల ఇప్పుడు ఒక ప్రశ్న, అపనమ్మకం, అభద్రత కన్పిస్తున్నాయి … గల్లీల ఉప్పొంగినట్లుందే ముస్లింల ప్రవర్తన చప్పున చల్లంగయినట్టయింది … ఒదిగి ఒదిగి నడుస్తున్నారు. ఈ బస్సులల్ల, రైళ్ళల్ల, స్టాపులల్ల, బజార్లసొంటి పోతున్న ముస్లింలల్ల ఒక బెదురు కన్పిస్తున్నది …’’ అంటూ ముస్లింలలో ఏర్పడిన ఒక అభద్రతా భావాన్ని గీతాంజలి రాసిన ‘బిచ్‌థీ చమన్’ అన్న కథ విశ్లేషిస్తుంది …
గుజరాత్‌లో జరిగిన హత్యాకాండలో భర్తనీ, పిల్లల్నీ అత్తమామల్ని పోగొట్టుకుని, ఆస్థులన్నీ పదులుకుని ఇక్కడికి తిరిగివచ్చిన నూర్జహాన్ అన్న మహిళ దీనహీన గాథనూ, ఆర్తినీ కూడా ఈ కథ విషాద భరితంగా చిత్రించింది.
ఈ గుజరాత్ విధ్వంసం మీద ముస్లింలే కాకుండా ముస్లిమేతర కథా రచయితలు కూడా స్పందించడం విశేషం … నల్లూరి రుక్మిణి రాసిన ‘నెత్తురోడుతోన్న నేల’ బి.వి.ఎన్.ఎల్.స్వామి రాసిన ‘విషప్రయోగం’ ఈ కోవలోకి వస్తాయి …
అసలు ముస్లింవాద సాహిత్యమనుకున్నప్పుడు మనకు చప్పున గుర్తొచ్చే స్త్రీ రచయిత షాజహానా … చాలాకాలంగా ముస్లిం స్త్రీల ఆవేదనను, బురఖా పద్ధతులను ఒక ధిక్కార స్వరంతో కవిత్వంలో ప్రతిబింబిస్తూ వచ్చిన షాజహానా ఈ కత్త శతాబ్దంలో తన సాహిత్య ప్రక్రియకి ఒక విస్తృతి ఏర్పరుచుకుని కథాసాహిత్యం వెలువరించడం విశేషం …
ముస్లిం లోగిళ్ళలోని, చీకట్లలోని స్త్రీల కష్టాలు, కన్నీళ్ళు, తన్నులు, ఆకలి, తలాక్, సండాస్‌ల గురించి ఆమె కథల్లో లోతుగా చర్చించారు…
కొన్ని ప్రాంతాలలో ముస్లిం స్త్రీలకు కక్కసుదొడ్లు కూడా లేని ఒక స్థితి ఆ సండాస్ లోపలికి వెళ్ళినప్పుడు … లుకలుక లాడుతోన్న పురుగులూ, విపరీతమైన గత్తుకంపూ చదువుతున్న పాఠకుడికే కడుపులో తిప్పినట్టయితే మరి ఇక అక్కడ ఆ పరిస్థితిని అనుభవిస్తోన్న మనుషుల సంగతేమిటి? …. అన్న ఆలోచనలో పడ్తాం మనం …
ఇదేకాకుండా ‘దాదీమా చెప్పిన ఖిస్సాలు’ … ‘సిల్‌సిలా’ వంటి ఎన్నో స్త్రీవాద కథలు షాజహానా కలం నుంచి వెలువడ్డాయి …
ముస్లిం ప్రజలకు తమ జీవితాల పట్ల చైతన్యం కలిగించడంలోనూ, ముస్లిమేతరులకు ముస్లిం జీవితాల వివక్షను అర్థం చేయించడంలోనూ షాజహానా స్కైబాబాతో కలిసి విస్తృతమైన కృషి చేస్తున్నారు.
ఆ క్రమంలో భాగంగానే స్కైబాబా సంకలించిన ‘వతన్’ కథా సంపుటి ఇటీవలే వెలుగు చూసింది ….
ఈ సంపుటిలో నలభయి మంది రచయితలు రాసిన యాభయి రెండు కథలు ముస్లిం జీవితాలలోని అనేక చీకటికోణాలను విభిన్న రకాలుగా చర్చిస్తాయి …. ముస్లింలు ముసల్మానులుగా గొంతు విప్పిన కథలివి ….
ముస్లిమీయతను కాపాడుకునే నేపథ్యంలో నఖాబ్ నుంచి బయట పడడానికి జరిగిన ఒక గొప్ప ప్రయత్నమే ‘‘వతన్’’. వతన్ గురించి వివరంగా చెప్పుకుంటూ పోయినట్టయితే అది మళ్ళీ మరో వ్యాసమయ్యే ప్రమాదముంది. ఏదిఏమయినా వతన్ వంటి కథా సంకలనం రావడం ముస్లిం రచయితలు ఒక మేరకు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు ….
స్కైబాబా ఈ క్రమంలో ‘ముల్కి’ అన్న పత్రికను కూడా నడుపుతుండడం విశేషం …. సత్యాగ్ని రాసిన ‘పాచికలు’ కథా సంపుటిని కూడా స్కైబాబా పాఠకుల కందించారు …. ఈ సంపుటిలోని కథలు కూడా ముస్లిం స్త్రీల జీవితాల్లోని కష్టాలనూ, కన్నీళ్ళను, వివిధ చీకటికోణాలనూ చర్చకు పెడతాయి ….
ముస్లిమేతరులు రాసిన ముస్లిం కథల్లో ఆదెపు లక్ష్మీపతి రాసిన ‘‘ఇలా ఎందుకు జరగకూడదు?’ అన్న కథ చెప్పుకోదగినది …. హిందూ, ముస్లిం ఐక్యత మీద, సంఘటిత భావనమీద ఆశావహంగా వచ్చిన కథ ఇది ….
రెడ్డి కులస్తురాలైన సునీత దర్జీపని నేర్చుకోవడానికి వెళ్తూ వస్తూ పని క్రమంలో అన్వర్ అనే టెయిలర్ని ప్రేమిస్తుంది …. ఆ పెళ్ళికి ఎలాగూ పెద్దల ఆమోదం లభించదు గనుక వాళిద్దరూ లేచిపోతారు …. అగ్రకులానికి చెందిన పెద్దలంతా లేపుకు పోయిన అన్వర్ని నానాతిట్లూ తిడుతూ అఖిశంసిస్తూండగా …. సునీత తండ్రి మాత్రం …. ‘‘ఇందులో తప్పేమిటి? …. ఇలా ఎందుకు జరగకూడదూ?’’ అనుకుంటాడు ….
ఇటువంటి ఆశాజనకమైన కథలు మరిన్ని రావలసిన అవసరముంది.
ముస్లిం హక్కుల్ని ఎలుగెత్తడం ద్వారా సొంత అస్థిత్వాలను ప్రకటించుకోవడమే కాకుండా ముస్లింలపైన జరుగుతోన్న దాడులను, వివక్షను అణగదొక్కే ప్రయత్నాలనూ తీవ్రంగా పరిగణించి ప్రతిఘటించడం ముస్లిం స్త్రీల జీవితాలలోని సమస్యలని చర్చించి వారిని చైతన్యపరచడం …. ముస్లిం జీవితాల పట్ల ముస్లిమేతరులను చైతన్యపరచడం వంటి ఆశయాలతో ముందుకు సాగుతోంది ముస్లిం వాదం G ముస్లిం కథా సాహిత్యం
ఇది నిజంగా అభినందనీయం ….
6
సృష్టిలోని సమస్త జీవులు, జాతులు, దేశాలు ఒకటేనన్న సమభావనే నిజమయిన ప్రపంచీకరణ అయితే ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయినట్టయితే ఒకే నమూనాలో వస్తువుల్ని ఉత్పత్తి చేయడం తేలికవుతుంది కాబట్టి ప్రపంచమంతా ఒకే సరుకు వాడే గుత్తాధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడం ఇప్పటి ప్రపంచీకరణ ….
మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరాడంబరంగా జీవించే మనిషి ధోరణిని వెక్కిరిస్తూ …. సమస్త చర్యల్ని, భావాల్ని సైతం వ్యాపారమయం చేస్తోన్న ఈ మార్కెట్ …. మనిషిని ఎలా ప్రభావితం చేయగలదో రానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ చాలా ఏళ్ళక్రితమే సింగమనేని నారాయణ ‘ప్రమాదవీణ’ అన్న కథ రాశారు ….
ప్రపంచ వ్యాపార సంస్థ ఏర్పడి బహుళజాతి సంస్థలన్నీ మన దేశంలోకి యదేచ్ఛగా ప్రవహించడం మొదలయ్యాక …. ఈ వ్యాపారం కోసం, తమ వస్తువుల్ని అమ్ముకోవడం కోసం …. అప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించి ఉన్న టి.వి మనల్ని మనకి కాకుండా చేసి పారేసింది …. ఈ ప్రకటనల వ్యామోహంలో పడి ప్రతీ వస్తువూ మనింట్లో ఉండాలని ఆతృతపడ్డం …. ఈ విషయాన్ని ప్రతిబింబిస్తూ టి.వి ఇంట్లో ఉండడం మూలంగా మానవీయ బంధాలు ఎలా విచ్ఛిన్నమై పోతున్నాయో తెలుపుతూ బమ్మడి జగదీశ్వరావు ‘మహామాయగాడు’ అన్న కథ రాశారు.
మనుషుల్ని తమ వ్యాపార సంబంధాల కనుగుణంగా ముఖ్యంగా స్త్రీలను తమకు నచ్చిన రీతిలో తయారుచేసుకోగలిగే ఒక ప్రక్రియ జీవితాల్లోకి చొచ్చుకు వచ్చే ప్రమాదాన్ని చెప్తూ ‘తిమింగిల స్వర్గం’ అన్న కథ పి.సత్యవతి రాసిన కథ ….
అమెరికా అల్లుళ్ళకోసం ఆడపిల్లల్ని తయారుచేసే ఒక సంస్కృతి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది …. అయితే అమెరికా వెళ్ళిన ఈ కొత్త పెళ్ళికూతుళ్ళు ఏమవుతున్నారు? …. ఏం జరుగుతోందక్కడ …. ఏం జరగడానికి అవకాశముంది? అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ ఆరి సీతారామయ్య ‘‘గట్టు తెగిన చెరువు’’ అన్న కథ రాశారు….
తల్లిదండ్రుల కోరిక మేరకు అమెరికా కోడలుగా వెళ్ళిన మరో అంధ్రుల ఆడకూతురి మరో రకపు వేదన ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’లో మనకి కనిపిస్తుంది….
అయితే ఈ అమెరికా అల్లుళ్ళ వ్యామోహం ఇటీవలి కాలంలో కంత తగ్గినట్టుగా అన్పించినప్పటికీ అది గణనీయంగా అయితే మాత్రం కాదు …. నల్లూరి రుక్మిణి ‘దూరపుకొండలు’, ‘మిడిసి పాటు’ వంటి కథలు ఈ అమెరికా డాలర్ల వ్యామోహం మీద చెంపపెట్టులా సాగిన కథలు ….
పి.సత్యవతి రాసిన మరో కథ ‘మాతృనగరి’లో ఒక మహా మాయగాడు తన చేతి సంచిలో విభిన్న రకాల వస్తువులు వేసుకొచ్చి ఎలా యువతను భ్రమింపచేసి మాతృనగరి దారులు పట్టిస్తున్నాడో కళ్ళకు కట్టినట్టు తెలుపుతుందామె ….
మన ప్రమేయం లేకుండా టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చి మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోన్న వైనాన్ని జి.ఉమామహేశ్వరావు ‘నిశ్శబ్ద విప్లవం’ …. వివినమూర్తి రాసిన ‘కృష్ణ స్వప్నం’ వంటి ఎన్నో కథలు వివరిస్తాయి ….
ఒకరాత్రి అమెరికా అధ్యక్షుడికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి తన స్వప్నం నిజం చేసినందుకు అతడ్ని అభినందిస్తాడు …. ఏమిటన్నట్టుగా అశ్చర్యపోతాడు అమెరికా అధ్యక్షుడు …. అప్పుడు కృష్ణుడు తనది నాగరికతా స్వప్నమని చెబుతూ కన్ని దృశ్యాలను అమెరికా అధ్యక్షుడికి చూపుతాడు …. వాటిలో మొదటిది ఇంద్రప్రస్థాన్ని నిర్మించటం కోసం ఖాండవ దహనం చేయడం, నాగజాతిని నిర్మూలించడం …. అందులోని నాగరికతా సూత్రం ఏమిటంటే నాగరికతకు చిహ్నమైన ఆయుధాన్ని చేతిలో ధరించినంతవరకూ మనం ఎదుటివాళ్ళ నాగరికతను నియంత్రించగలం …. ఎంత దూరంనుంచి మనం శత్రువుమీదికి విసరగలిగితే మన నాగరికత అంత గొప్పది ….
పోతే ప్రపంచమంతా ఒకేజాతి, ఒకే నాగరికత ఏర్పడేంతవరకూ మనుషుల్ని చంపుతూ పోవడం అనివార్యమంటూ కురుక్షేత్ర సంగ్రామంలో పసిపిల్లల్ని, తమ వారిని చంపడానికి అర్జునుడికి చేతులాడని దృశ్యాన్ని రెండోదిగా చూపిస్తాడు …. శ్రీకృష్ణుడి ఈ సామ్రాజ్యవాద తత్త్వానికి తాను వారసుడయినందుకు చాలా సంతోషపడ్తాడు అమెరికా అధ్యక్షుడు ….
ఇంతలో ఉదయమయి అతడు టాయిలెట్‌లోకి వెళ్తాడు. మానవ హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద ఇతర దేశాలలో తానివ్వవలసిన ఉపన్యాసాలని తీసుకుని …. అతడికి నవ్వొస్తుంది …. ఆ నవ్వు క్రమక్రమంగా పెద్దదయి విశ్వాంతరాళంలోకి వ్యాపిస్తుంది. మనుషులంతా అందులోంచి పుట్టిన ఆకారం కింద నలిగిపోతూంటారు …. మేధావులంతా చుట్టూచేరి భజన చేస్తూంటారు …. ఆ ఆకారానికి హృదయం ఉండవలసిన చోట ఉన్న ఒక మహారంధ్రంలో నుంచి రకరకాల మారణాయుధాలూ, ప్రయాణ సౌకర్యాలూ, వినోద సమాచార సాధనాలు స్వేచ్ఛాయుతంగా ప్రవహిస్తూంటాయి …. జనమంతా ఎగబడతూంటారు ….
చివరికి ఆ రూపం ఒక చిన్న మాత్రగా మారి అధ్యక్షుడి కడుపులో ప్రవేశించి హాయిని కలిగిస్తుందతడికి …. సామ్రాజ్యవాద సంస్కృతిని భారతీయ పురాణ సంస్కృతితో పోలుస్తూ …. రాబోయే పరిణామాలను ఊహించి చెప్పిన ప్రతీకాత్మక కథ ఇది …. ఇమేజరీ క్రియేషన్….
సామ్రాజ్యవాద సంస్కృతి మన జీవితాల మీద చూపిస్తోన్న ప్రభావం మీద వచ్చిన కథల్లో ఈ కథ ఎన్నదగినది ….
ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను సృష్టిస్తూ, అవసరాల నేర్పరుస్తూ, అందీ అందకుండా ఊరిస్తూ …. ఈ మార్కెట్లు వ్యక్తుల మాన, ప్రాణాలతో సహా ప్రతీదాన్నీ సరుకుగా మారుస్తోన్న క్రమంలో స్త్రీ, పురుష సంబంధాలు …. మొదట తరానికి, రెండోతరానికీ మధ్యన అగాధం లాంటి వ్యత్యాసం …. ఇవ్వాల్టి జీవన వ్యాపారంలో అనివార్యమై పోతోన్న పలాయనం గురించి సూటిగా ప్రశ్నిస్తాడు కథకుడు …. వివినమూర్తి రాసిన కథే ‘‘పయనం – పలాయనం’’….
ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పడవల్లాటి కార్లు ప్రయాణించడానికి వీలుగా, ఉన్నట్టుండి ప్రభుత్వం రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాన్ని అమలుజరిపిన నేపథ్యంలోంచి మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘ఖాదర్‌లేడు’ అన్న కథ పాఠకుల హృదయాలను పిండుతుంది …. ఇదే నేపథ్యంలో కాట్రగడ్డ దయానంద్ ‘నీడ’ అన్న కథ రాశారు….
ప్రపంచీకరణ చిన్న పరిశ్రమల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో నిరసిస్తూ సోమరాజు సుశీల ఒక సిరీస్‌గా మంచి కథలని పాఠకులకు అందించారు …. ఇదే నేపథ్యంలో దేశీయ కంపెనీలన్నీ ఎలా మట్టికరిచిపోతాయో తెలుపుతూ తోలేటి జగన్మోహన్రావు ‘కప్పడాలు’ అన్న కథ రాశారు.
ఈ మార్కెట్ మాయాజాలం మానవ సంబంధాలలో తీసుకొచ్చిన పెనుమార్పు, ఖాయిలా పడ్డ పరిశ్రమలు క్రమంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్తూన్న వైనం …. ఈ రెండింటికీ ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా విప్పి చెప్పింది ‘జీవన్మృతుడు’ …. ఆడెపు లక్ష్మీపతి రాసిన ఈ కథ బహుశా ఈ నేపథ్యంలోంచి వచ్చిన కథల్లో తొలికథగా చెప్పుకోవచ్చు ….
వస్తు సంపదల సమీకరణా, పిల్లల చదువులకి పెట్టుబడుల సేకరణా ఇవ్వాళ మనిషికి ప్రాధమికావసరాలై పోయాయి .. ఇది మనిషిని దూర దేశాలకు పరుగులు తీయిస్తోన్న పరిస్థితినీ, ఆ క్రమంలో విచ్ఛిన్నమైపోతూన్న మానవ సంబంధాలనూ …. మనిషి తనకు తానే పరాయి వాడయిపోయి చివరికి జీవన్మృతుడుగా మిగిలిపోతూన్న దురవస్థనీ చాలా చక్కగా పట్టుకుందీ కథ ….
అయితే ఈ కథలోని లోపమేమిటంటే భార్యల ఒత్తిడి మీద మాత్రమే ఈ పురుషుడు సంపదల సమీకరణలోకి నెట్టబడుతున్నాడన్న ఆలోచన మీదే ఈ కథ నిర్మింపబడడం …. పురుషులు తమ ప్రవర్తనలకు సంజాయిషీ ఇచ్చుకోవడం కోసం నెపాన్ని స్త్రీల మీదకు నెట్టడంలా కనిపిస్తుంది.
వస్తు వ్యామోహమంతా స్త్రీలదేనని పురుషులు ఆరోపిస్తుంటారు కానీ నిజానికి పురుషుడికే ఈ వస్తు వ్యామోహం ఎక్కువగా ఉంటుంది ….
పెళ్ళి పేరుతో మొత్తం ఈ వస్తువులన్నీ ఉచితంగా మన ఇంటికి నడిచి వచ్చే ఒక దారిని పురుషుడు ఎన్నుకుంటున్నాడు …. కట్నంతో పాటుగా మార్కెట్లోని వస్తువులన్నీ మన ఇంట్లో నింపుకోవడానికి పెళ్ళిని ఒక మార్గంగా ఎన్నుకుంటున్నాడు పురుషుడు …. అంటే అంతిమంగా ఈ మార్కెట్ ప్రభావం స్త్రీలమీద ఎంత ఒత్తిడిని తెస్తుందో తెలుపుతూ పి.సత్యవతి ‘గణితం’ అన్న కథలో రాశారు….
ప్రైవేటైజేషన్ కారణంగా రోడ్డున పడ్డ ఆంధ్రా స్టీలు ఫ్యాక్టరీ దీనస్థితి మీద సురేష్ రాసిన టైటానిక్ అన్న కథ వస్తు శిల్పాలు రెండింటిలోనూ ఎన్నదగిన కథ ….
ఒక పెద్ద కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగా స్థాపింపబడినప్పుడు ఎన్నో వందల మందికి ఉపాధి లభిస్తుంది …. హఠాత్తుగా అది మూతపడిపోతేనే …. ఈ కార్మికులంతా రోడ్డున పడి అతలాకుతలమయిపోతారు ….
ఇలా ఒకప్పుడు వేల మందికి ఉపాధినిచ్చిన ‘ఆంధ్రా స్టీల్సు’ కర్మాగారం టైటానిక్ ఓడ మునిగి పోతున్నట్టుగా నష్టాల ఊబిలో కూరుకుపోయి కనపడకుండా అదృశ్యమై పోతున్న తీరును ఆ కంపెనీలో పనిచేసి తనకి ఆ ఉద్యోగాన్నీ, జీవనాన్నీ ఇచ్చిన కర్మాగారాన్ని గాఢంగా ప్రేమించిన ఒక యువకుడి అంతరంగ కథనం ఈ కథే ఇతివృత్తం ….
అట్లాగే గొరుసు జగదీశ్వరెడ్డి రాసిన ‘బతుకుగోస’, ‘చీడ’, ‘గజ ఈతరాలు’ వంటి కథలు కూడా ఇదే నేపథ్యంలోంచి వివిధ కోణాలను చర్చకు పెట్టిన కథలు …. ఈ రోడ్డున పడ్డ కర్మాగారాల మూలంగా అందులో పని చేస్తోండిన ఉద్యోగుల అభద్రతా భావంతో భార్యాభర్తల నడుమ ఎటువంటి విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడతాయో ‘చీడ’ కథ చెపితే, ‘గజ ఈతరాలు’లో ఊరంతటికీ ఈత నేర్పిన పూర్ణమ్మకి గుండెజబ్బు వస్తే నయం చెయ్యించలేక కొడుకు అప్పుల పాలవుతాడు …. కొడుకు కష్టాలపాలు గావడం ఇష్టంలేని పూర్ణమ్మ కాళ్ళకు తాళ్ళు కట్టుకుని బలవంతపు చావుని వరిస్తుంది …. దీని వెనుకనున్న పాతికేళ్ళ సామాజిక జీవిత చరిత్రనీ …. దాని వెనుకనున్న కుట్రనీ గత స్మృతుల ద్వారా పాఠకుడికి గొప్ప అవగాహన కలిగిస్తాడు రచయిత ….
ఇదంతా ఇలా ఉంటే సంపదల సమీకరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఆ ఒత్తిడిలో నిత్య జీవితంలోని అనేక విషయాలని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం …. మనుషులనే పట్టించుకోలేని క్రమంలో మూగజీవాలను, పక్షులను, పిచ్చుకలను పట్టించుకునే సమయం మనకెక్కడిది?
ఇదివరకంటే మనిళ్ళు చాలా సాధారణమైనవి …. ఆ ఇళ్ళల్లో క్రమం తప్పకుండా పిచ్చుకల కోసం ఒక గూడు, దాంట్లో ధాన్యం కంకులు వేలాడదీయడమూ …. అవి వచ్చి ధాన్యం నములుతూ తమ కిచకిచ శబ్దాలతో ఇల్లంతా నింపిపోవడమూ తప్పనిసరి పరిస్థితిగా ఉండేది ….
మరిప్పుడు మనిళ్ళు గ్రానైట్ ఫ్లోరింగ్‌లతో, కృత్రిమ ఆకాశాన్ని నింపుకున్న సీలింగులతో ఎటుచూసినా డబ్బుతో మిలమిలా మెరిసి పోతూండగా ఈపాడు పిచికలు ఇల్లంతా పాడుచేసి పోతూంటే శుభ్రం చేసుకునే తీరిక మన కెక్కడిది? …. ప్చ్‌ు….
పోనీ వాటిని పొలాల్లోనన్నా బతకనిచ్చామా అంటే అక్కడ కూడా రసాయన ఎరువులతో, పురుగుల మందులతో నింపి పిచ్చికలిని, పికిలి పిట్టలని, కాటుక పిట్టలనీ లేకుండా చేసుకుంటున్నాం …. ఆ క్రమంలో ఆఖరి పిచ్చుక పోతూ పోతూ ‘‘పిచ్చికలకి చోటులేని ఈ ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోవునుగాక …. దయలేని రెండు చేతుల జాతి సమస్తాన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి చివరికి తానే ధ్వంసమై పోవును గాక’ అంటూ శాపం పెట్టిపోతుంది …. ఇది పిచ్చిక విసిరిన చివరి బ్రహ్మాస్త్రం అంటూ ముగిస్తాడు రచయిత ….
పాపినేని శివశంకర్ రాసిన ‘ఆఖరి పిచ్చుక’ మనల్ని ఒక భయాందోళనకి గురిచేస్తుంది …. మనకి తెలీకుండానే మనం నిర్లక్ష్యంతో ఎన్నింటిని ధ్వంసం చేసుకుంటున్నామో కదాని పాఠకుడి మనసులో దిగులూ, అలజడీ రేగుతుంది.
అలాగే రమణజీవి ‘చివరి మనిషి’ ఈ కథకు కొనసాగింపేమో అన్నట్టుగా సాగుతుంది …. బాల్యం మీద ప్రేమ లేకుండా …. బాల్యాన్ని ఒక గుదిబండగా మార్చేసిన సమాజాన్ని తీవ్ర స్వరంతో శపించిన కథా రూపం మానవ సమాజం నాశనమై పోవాలి అన్న ఆలోచన కాదు …. అలా నాశనమై పోతూన్న క్రమంలో వాళ్ళల్లో కలిగిన అనూహ్య పరిణామం ఈ కథకు పునాది …. దయ, జాలి, ప్రేమ, పశ్చాత్తాపం, పరోపకారం కలిగినటువంటి కొత్త పరిణామంతో మానవజాతి మళ్ళీ ఉద్భవించాలన్న ఆశావహకోణం కూడా ఈ కథలో ఉంది….
అనేక ప్రాంతాలలోని వివిధ సంఘటనల సమాహారంగా అనిపించినప్పటికీ ఒక ఏకసూత్రతతో సాగడం ఈ కథలోని విశేషం ….
రాజ్యానికి ఉన్న అవినీతి, అహంభావ …. నేర స్వభావాలను ‘రాజ్యపురుషుడి తొడలమధ్య వేళ్ళాడే మేఢ్రం’ వంటి అస్వతంత్ర అధికారులు తాము క్రమంగా అవినీతిలోకి కూరుకుపోయే క్రమం వెనక ఈ అధికారం ఎలా పనిచేస్తుందో సున్నితంగా తెలియచెప్తూ, ఆక్రమంలో వారి ఆత్మలు రాజ్యస్వభావం మీద, రాజ్యవ్యవస్థ మీద అనేకానేక ప్రశ్నలు సంధించడమే చినవీరభద్రుడు రాసిన ‘ప్రశ్నభూమి’….
ఈ కథ ఈ కొత్త శతాబ్దంలో వచ్చిన ఒకానొక శక్తివంతమైన కథగా మనం చెప్పుకోవచ్చు….
ఇవేకాక ఓల్గా రాసిన ‘మార్పు’, ‘కోకాకోలా’ …. మధురాంతకం నరేంద్ర ‘చోటు’ …. ‘రుక్మిణి’ రాసిన ‘పట్టు’ చంద్రశేఖర అజాద్ రాసిన ‘స్వ’దేశ ‘భక్తులు’ వంటి కథలన్నీ కూడా వివిధ రంగాల మీద ప్రపంచీకరణ చూపుతున్న ప్రభావాలే ….
7
ప్రాంతీయ వివక్ష, అసమానతలు చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ అస్థిత్వ పోరాటాలకు పాదువేశాయి …. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి కథకులు ప్రాంతీయ స్పృహతో కథలు రాస్తున్నారు.
అసలు ఏ కథ అయినా ప్రాంతీయ వాసనలు లేకుండా ఉండదనిపిస్తుంది.
తెలంగాణ ప్రాంతం నుంచి కాలువ మల్లయ్య (యుద్ధభూమి, నేలతల్లి) బెజ్జారపు రవీందర్ (నిత్య గాయాల నది) ఇంకా బోయ జంగయ్య, పెద్దింటి అశోక కుమార్ వంటివారు ప్రాంతీయ స్పృహతో కథలు రాస్తున్నారు ….
ఇంకా చిత్తూరు ప్రాంతం నుంచి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, మధురాంతకం నరేంద్రవంటి వారు ప్రాంతీయతను ప్రతిబింబిస్తున్నారు ….
అట్లాగే కారా, రావిశాస్త్రి, భూషణం వంటి వారందించిన కథల కాగడాని ఒడుపుగా అందుకుని అప్పల్నాయుడు, గౌరునాయుడు వంటి వారు ప్రాంతీయతను కథల్లో పలికిస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి ….
ఈ నేపథ్యంలో
‘సీమ కథలు’, ‘ఇనప గజ్జెల తల్లి’, ‘ఫ్యాక్షన్ కథలు’, ‘హంద్రీ కథలు’, ‘కళింగాంధ్ర కథలు’, ‘నాగావళి కథలు’, ‘వంశధార కథలు’, ‘రుంరaావతి కథలు’ వంటి కథా సంకలనాలు ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ వెలువడ్డాయి….
నెల్లూరు నుంచి ‘కథాకేళి’ వంటి సంకలనాలు వచ్చినప్పటికీ అది ప్రాంతీయతను కాకుండా నెల్లూరి రచయితలకు సంబంధించిందిగా మిగిలిపోయింది….
ప్రస్తుత తెలుగు కథ పఠనం చేసినట్టయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న జీవిత కోణాలు …. వివిధ మాండలికాలు పాఠకుడికి అవగతమవుతాయి….
అభివృద్ది, వెనుకబాటుతనం …. ముందు వెనుకలు మంచిచెడులు వంటి సామాజిక మూలాలమీద నుంచే ప్రాంతీయ స్పృహ సాహిత్యంలోకి కూడా విస్తరిస్తుంది …. ఆ ఎక్కువ తక్కువలు మారనప్పుడు అనివార్యంగా సాహిత్యంలో ఆ ప్రాంత పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి….
సాహిత్యం పుట్టుకకు మూలం ‘అసంతృప్తి’ అంటారు కాత్యాయనీ విద్మహే ఒకచోట …. ప్రస్తుత తెలుగు కథను చూస్తూంటే ఈ మాటలు అక్షర సత్యాలుగా అనిపిస్తాయి …. మనసుల్లోని ఈ అసంతృప్తికి మూలకారణమైన సామాజిక పరిణామాలనూ, దానికి మూలకారణమైన రాజ్య స్వభావాన్నీ …. అందులో అంర్జాతీయ ద్రవ్య సంస్థల జోక్యాన్నీ ఇలా అన్ని కోణాలనూ కూడా ప్రస్తుత తెలుగు కథ ప్రతిబింబిస్తూంది ….
అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉన్న తెలుగు కథ, ఏ ప్రపంచ భాషల సరసన నిలబడ్డానికయినా వెనుదీయనంత శక్తివంతంగా ఉన్నటువంటి తెలుగు కథ ఇతర భాషల్లోకి అనువాదానికి నోచుకోకపోవడంతో తెలుగు కథ ఖ్యాతి ఇనుమడించాల్సినంతగా ఇనుమడించడం లేదని అనిపిస్తుంది ….
ఇవ్వాళ తెలుగు కథల్లో మనల్ని మనం పోల్చుకునే, నిమగ్నం చేసే హృదయ సంబంధి లక్షణముంది …. ఒక వైపు గ్రామీణ జీవన అమాయకత్వం నైర్మల్యం, దిగ్భ్రమ, సంతోషం, దిగులు …. పల్లెల పరిసరాలు, జీవద్భాషతో అత్యంత సహజంగా చిత్రిస్తోన్న కథకులు మరోవైపు ప్రజా ఉద్యమాల విషయం వచ్చేటప్పటికి ఒక ధిక్కార స్వరంతో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దుయ్యబడుతూ, ఎండగడతూ కథలు రాయడం విశేషం ….
గత పదిహేనేళ్ళ తెలుగు కథానికని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు రెండు దశాబ్దాల తెలుగు సమాజ జీవన పరిణామాలని మనం దర్శించవచ్చు …. ఈ కథల్లోని పాత్రలేవీ పాత్రలు కాదు …. రక్తమాంసాలున్న సజీవమైన మనుషులే …. అందుకే వాళ్ళు వాళ్ళ స్వంత భాషని మాట్లాడుతారు …. స్వంత కష్టాలని చెప్పుకుంటారు …. స్వంత దిగుళ్ళని పాఠకులతో పంచుకుంటారు …. జీవన తాత్త్విక పొరల్లో నుంచి గుండెని తడుముతారు ….
ఇవ్వాళ తెలుగుకథ ఒక కథ కాదు …. జీవన కఠోర వాస్తవం …. జీవితాల్లోని వివిధ రకాల దోపిడీని, పీడననూ, హింసనూ, వేదననూ …. ఆ మొత్తం దురవస్థల నుంచి బయటపడడానికి మనుషులు చేస్తోన్న పెనుగులాటలను, ఆరాట పోరాటాలనూ చీకటి వెలుగుల కలనేతగా పొదుగుకున్న ఒక సజీవ చిత్రరాజ్యం …. *