మన పద్యం – మన వ్యక్తిత్వం

ఈ యుగం ప్రత్యేకమైన కాలం. ప్రతి విద్యలోనూ ప్రత్యేక విభాగాలే. కాలికో వైద్యుడు, వ్రేలికో వైద్యుడు. ఏది వచ్చినా ఆదుకోగలననే ఆపద్బాంధవుడు లేడు. పదిహేనేళ్ళు డిగ్రీ వరకు చదువు చెప్పాక కూడా మళ్ళీ వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక శిక్షణ. సంభాషణానైపుణ్యానికి ప్రత్యేక శిక్షణ. నాయకత్వ లక్షణాలకి ప్రత్యేక శిక్షణ. అన్నింటికీ మూడేసి నెలలు శిక్షణ. మూడేసి వేలు భక్షణ. కడుపులోంచి ఇంకా బయటపడకుండానే కంగారుపడి తీసుకుపోయి కాన్వెంట్లలో అప్పగించినా, అక్కడి నుండి పదిహేనేళ్ళు రాచిరంపాన పెట్టినా పట్టుమని పది పద్యాలు అప్పగించలేడు. నోరు తెరచి నాలుగుముక్కలు కాగితం చూడకుండా మాట్లాడలేడు. ఇతరుల కోసం కాకపోయినా తన కోసం తాననయినా కష్టపడలేడు. నాయకుడు కాకపోయినా సరైన అనుచరుడైనా కాలేడు. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి చదివించినా చివరకు విద్యార్థులు వ్యక్తిత్వ హీనులుగానూ, ఈర్ష్యాళువులుగానూ, నిస్సంతోషులుగానూ, కోపిష్ఠులు గానూ, వృధావేశపరులుగానూ, పరభాగ్యోపజీవులుగానూ తయారు కావడానికి కారణం ఏమిటి?

పదో తరగతి వరకు తెలుగు పుస్తకాలు చూస్తే పదిరకాల ప్రక్రియలు నేర్పేద్దామనే తాపత్రయం తప్ప పది కాలాలపాటు పదిలంగా మనస్సు మీద ముద్రవేసేలా పది పద్యాలు నేర్పుదామనే ఆలోచన కానరావడం లేదు. ప్రాచీన పద్యసాహిత్యం మీద పక్కా వ్యతిరేకతతో పాఠాలు రూపకల్పన చేస్తున్నారనే అనుమానం సమాజంలో బలంగా ఉంది.

అదే ప్రాచీన సాహిత్యంలోని పద్యాల ద్వారా అత్యాధునిక విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగపడే ఎన్ని విషయాలు ఎంత చక్కగా నేర్పవచ్చో సావకాశంగా, సావధానంగా కాస్త ‘లోచూపుతో’ చూద్దాం.

వ్యక్తిత్వ వికాసం (Personality Development) అంటే పదిమందినీ మించిపోవడం కాదు. పదిమందినీ కలుపుకు పోవడం. సంభాషణా నైపుణ్యం (Communication Skills) అంటే దబాయించి వాదించడం కాదు. గుబాళించేలా మాట్లాడగల గడం. నాయకత్వ లక్షణం (Leadership Quality) అంటే పెత్తనం చలాయించడం కాదు, ప్రేమతో జయించడం. నిర్వహణా సామర్థ్యం (Managing Ability) అంటే నెత్తి మీద కత్తి పెట్టి పని చేయించడం కాదు, ఒత్తిడి లేకుండా ఒప్పించి పనిచేయించడం. ఇవన్నీ మన తెలుగు పద్యాల ద్వారా మనస్సుకి పట్టేలా చెప్ప వచ్చు.

తనకోసం బ్రతికింది బ్రతుకు కాదు, పదిమంది కోసం బ్రతికిందే బ్రతుకు. ఈ విషయాన్ని ఆంధ్ర మహాభారతంలో శకుంతల ఎంత విశ్లేషణాత్మకంగా చెప్పిందో చూడండి.

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్క్రతువది మేలు;తత్క్రతు శతంబున కంటె నుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడఁగన్‌

మూడు రోజులు ఏకాంతంగా గడిపి, గర్భిణిని చేసి, కుమారునితో వచ్చిన స్త్రీని నువ్వెవరో నాకు తెలియదన్న పెద్ద మనిషిని ‘సూనృతవ్రత!’ అని నిండుసభలో సంబోధించడంలోనే శకుంతల ధైర్యం, నన్నయగారి ఉక్తి చమత్కారం కనబడుతున్నాయి. ఒక కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే నుయ్యి కంటె పదిమందికీ ఉపయోగపడే ఊరబావి మంచిదనడంలో నీకోసం నువ్వు బ్రతకడం అవసరమే అయినా పదిమంది కోసం బ్రతికే ప్రయత్నం కూడా చెయ్యమనే సందేశం లేదా? బావులు త్రవ్వడం కంటె యజ్ఞం గొప్పది. యజ్ఞంలో మఱ్ఱి, మారేడు, జువ్వి, రావి, జమ్మి, రేగు మొదలైన ఔషధ వృక్షాల సమిధలు వాడతారు. వాటి ధూమం గాలిలో కలిసి మేఘాలను కదిలించి వర్షాలు కురిపిస్తుంది. కాబట్టి నూరు బావులు త్రవ్వడం కంటె ఒక యజ్ఞం చేయడం మేలని చెప్పింది. వర్షాలు లేకపోతే త్రవ్విన నూతులు, బావుల వల్ల ఉపయోగం ఏముంది? వంద యజ్ఞాలు చేయడం కంటె ఒక కొడుకుని కనడం గొప్ప విషయమని పేర్కొంది. ఎందుకంటే ఆ కుమారుడు మళ్ళీ యజ్ఞాలు చేస్తాడని. అంతేకాని వైద్యవిద్యో, యంత్రవిద్యో (ఇంజనీరింగ్‌) పూర్తిచేసి అమెరికాకో, ఆస్ట్రేలియాకో చెక్కేస్తాడని కాదు.

ఇటువంటి సందర్భాలలోనే కొంతమంది ప్రాచీన సాహిత్యానికి లింగవివక్ష ఆపాదిస్తారు. అందుకే కాస్త ‘లోచూపు’ అవసరం. స్త్రీ ప్రక్కన లేకుండా పురుషుడు ఎటువంటి యజ్ఞ యాగాలు చెయ్యడానికి అధికారం లేదు. అందుకని యజ్ఞం చేసే కొడుకుని వీరు కంటే, ప్రక్కన కూర్చునే కూతుర్ని ఇంకొకరు కంటారు. ఆ రకంగా యజ్ఞాలు, తద్వారా వర్షాలు, తద్వారా పంట, తద్వారా పాడి తద్వారా వ్యక్తికి అభివృద్ధి, గ్రామానికి పురోగతి అన్నీ సాధ్యమవుతాయి.

ఇంతవరకు భౌతికాభివృద్ధిని గురించి మాట్లాడిన భారతీయ నాయిక ‘శకుంతల’ సారాంశంగా నైతికాభివృద్ధి గురించి మాట్లాడుతోంది. వందమంది కొడుకుల్ని కలిగి వుండడం కంటె కూడా ఒక్క సత్యవాక్యానికి కట్టుబడి ఉండటం గొప్ప విషయమని చెప్పింది. (వందమంది కొడుకులు కలిగిన ధృతరాష్ట్రుని పతనం, సత్యానికి కట్టుబడ్డ ధర్మరాజు విజయం ఇక్కడే సూచింపబడ్డాయి.) ఆ రకంగా దుష్యంతుని బుద్ధికి ధర్మ దీపికను చూపించింది. ఈ ఒక్క పద్యం ఎంతమంది వ్యక్తిత్వాల నైనా వికసింపజేయడానికి బంగారు బాట కాదా?

విద్యార్థులు ప్రతిభ ఎలా పెంచుకోవాలో, ఆ ప్రతిభను ఎలా కాపాడుకోవాలో, ఆ ప్రతిభను ఎవరి కోసం వినియోగించు కోవాలో, ఎంత ఆకర్షణీయంగా ఆ ప్రతిభను అందించాలో, అలా అందించగలిగితే అతనికేం ప్రయోజనమో, దేశానికి ఏం ప్రయోజనమో అన్నీ ఒకే ఒక పద్యంలో వివరించాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న.

అటఁజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్‌

పైకి హిమాలయ వర్ణనలా కనిపిస్తున్నా ఈ పద్యంలో రత్నాలు చాలా ఉన్నాయి. (అనర్ఘ రత్నాలకు హిమాలయం పుట్టినిల్లు గదా!) హిమాలయ శిఖరాలు అంబరాన్ని చుంబిస్తున్నాయని, అక్కడి నుండి జారిపడే జలధారలు మృదంగ ధ్వనులు వినిపిస్తున్నాయని, ఆ ధ్వనులకు ఆకర్షింపబడిన నెమళ్ళు బయటకు వచ్చి పురి విప్పి నాట్యం చేస్తున్నాయని పైకి కనిపించే భావం. పదవ తరగతి పరీక్షల్లో ఎనిమిది మార్కులు సంపాదించడానికి అది చాలు. కాని విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలంటే ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళాలి.

విద్యార్థి ప్రతిభ ఆకాశమంత ఎత్తు ఎదగాలి. కాని అక్కడే ఉండి పోకూడదు. ఆ ప్రజ్ఞ సెలయేటిలా క్రిందికి రావాలి. తన తల్లిదండ్రులకి, తన గ్రామప్రజలకు సేవచేయడం కోసం స్వాదు జలంలా ఆ ప్రతిభ అందుబాటులోకి రావాలి. అలా ప్రవహించేటప్పుడు మృదంగధ్వనిలా ఆకర్షణీయంగా సాగాలి. విద్య ఎంత ఉన్నా దాన్ని ఆకర్షణీయంగా అందించడం చేతకాకపోతే ఏ రంగంలోనూ ఎవరూ రాణించలేరు. అలా అందించగలిగితే నెమళ్ళు తమంత తామే వచ్చి పురివిప్పి నాట్యం చేస్తాయంటే ప్రతిభావంతుడైన మేధావి ఎవరూ తన వినియోగదారుల్ని, ఖాతాదారుల్ని, పాఠకుల్ని, శ్రోతల్ని, ప్రేక్షకుల్ని వెదుక్కోవలసిన అవసరం లేదని సారాంశం. రత్నాల్లాంటి ఈ భావాలు పద్య సముద్రాల గర్భాల్లో ఉంటాయి. ఆ మహాకవుల అంతరంగాలు అంత లోతైనవి. వాళ్ళు సమస్త శాస్త్ర సాగరాలను ఆపోశన పట్టిన కుంభసంభవులు (అగస్త్యులు). ఇటువంటివి ఉపాధ్యాయులు శోధించి సాధిస్తే, ఆకర్షణీయంగా వివరిస్తే మధ్యాహ్న భోజనాలు, ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు అవసరం లేకుండానే విద్యార్థులు పాఠశాలలో ఉంటారు, వింటారు, బాగుపడతారు.

ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా వాక్చాతుర్యంతో బయటపడటం తెలుగు పద్యాలు తీయతీయగా నేర్పిస్తాయి. మిత్రుల మధ్య అపార్థాలు తొలగిపోవడానికి, శత్రువుల వల్ల అనర్థాలు కలగకుండా జాగ్రత్తపడటానికి ఆంధ్ర మహా భారతం – శాంతిపర్వంలోని ఒక్క పద్యం చక్కని దారి చూపిస్తుంది.

ఒక ఎలుక ఉదయాన్నే జీవయాత్ర కోసం బయలు దేరింది. కన్నం దాటి నాలుగడుగులు (ఎలుక కాళ్ళతో) వేసిందో లేదో యమధర్మరాజులా పిల్లి ప్రత్యక్షమయింది. కంగు తింది. అంతలోనే స్తిమితపడింది. ఆ పిల్లి వేటగాడి వలలో చిక్కుకొని ఉంది. అమ్మయ్య! అనుకొని కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళే సరికి చెట్టు మీద గుడ్లగూబ, పొదలోంచి ముంగిస ఎలుకవైపు గుర్రుగా చూస్తున్నాయి. ‘ఇది ఎక్కడి సంకటంరా దేవుడా!’ అనుకొంది కానీ ధైర్యం కోల్పోలేదు. (ఎల్‌కేజీ నుండి ఎంసెట్‌ వరకూ చదివి ఆంగ్లభాషా సాగరాలు ఆపోశన పట్టిన అరివీర భయంకర విద్యార్థులెవ్వరిలో ఇంత ధైర్యం కనబడదు.) ఒక్కక్షణం చురుగ్గా ఆలోచించింది. పిల్లిని చూస్తే ముంగిస, గుడ్లగూబ భయపడతాయి. కాబట్టి పిల్లి రక్షణలో ఉన్నట్లుంటే అవి తన జోలికి రావు. అంతే! ఒక ‘ఐడియా’ జీవితాన్ని నిలబెడుతుంది గదా! పిల్లి రక్షణ కోరింది. వలత్రాళ్ళు కొరికి పిల్లిని రక్షిస్తానంది. ప్రాణం మీద ఆశతో పిల్లి ఒప్పుకుంది. పిల్లి రక్షణలో ఉన్న ఎలుకను ఏమీ చేయలేమని నిర్ణయించుకొని మసకకళ్ళ గుడ్లగూబ, మందబుద్ధి ముంగిస అక్కడ నుండి జారుకున్నాయి. ఎలుక హాయిగా ఊపిరి పీల్చుకొంది. ఇంక పిల్లిని విడిపించాలి. తనకు ప్రాణాపాయం లేకుండా చూసుకోవాలి. అందుకే పిల్లి ఎంత కంగారుపడుతున్నా వేటగాడు దగ్గరకు వచ్చేవరకు వలత్రాళ్ళు కొరకలేదు. వేటగాడు సమీపించాక హడావుడిగా తెగ్గొట్టి పారేసింది. బ్రతుకుజీవుడా అంటూ పిల్లి పారిపోయింది. బ్రతికానురా దేవుడా అంటూ ఎలుక కన్నంలోకి దూరింది.

ఇంతటితో కథ అయిపోలేదు. ఎలుక చేసిన మేలు మరచిపోలేని పిల్లి జీవితాంతం స్నేహంగా ఉందాం రమ్మని కన్నం దగ్గరికి వచ్చి మరీ ఆహ్వానించింది. జీవితాంతం స్నేహం అక్కరలేదు. స్నేహం వల్ల జీవితం అంతం కాకుండా ఉంటే చాలని ఆలోచించిన ఎలుక ఇలా సమాధానం చెప్పింది.

అరులన్‌ మిత్రులన్‌ దెలియ నారయుటెంతయు సూక్ష్మకృత్య, మవె
వ్వరవతి దుష్కర, మ్మరులు వీరన నుండియు మిత్రభావమున్‌
చొరయుటయున్‌ సుహృజ్జనము పోలిఁకిఁగల్గియు శత్రుతాగుణ
స్ఫురణ మొకప్డుసూపుటయు చూతుముగాదె ధరిత్రి నెల్లెడన్‌

జీవితంలో మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోవడం చాలా కష్టం. కొంతమంది పైకి చురచురలాడే ముఖాలతో కనిపిస్తారు. కాని అవసరానికి ఆదుకొంటారు. కొందరు రాసుకు పూసుకు తిరుగుతారు. అవసరానికి ముఖం చాటేస్తారు. ఇవన్నీ జీవనయానంలో అలవాటుపడ్డ శకునాలే. అందువల్ల పిల్లిని నమ్మి ఎలుక స్నేహం చెయ్యడం ఎప్పటికీ అవివేకమే పొమ్మని చెప్పింది.

ఈ వివేకం ఈనాటి యువతులకి ఉంటే అపాయకారులయిన అబ్బాయిల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండగల్గుతారో కదా! అర్ధరాత్రి బండి మీద విహారాలు, పబ్బులకి, క్లబ్బులకి కలిసి తిరగడాలు, విచ్చలవిడి విహారయాత్రలు కొంతయినా తగ్గే అవకాశం ఉంది కదా!

ఈరోజుల్లో చాలామంది యువతీయువకుల్లో అనుకూల దృక్పథం కొరవడుతోంది. ప్రతిదానికీ ప్రతికూలంగా ఆలోచించడం, ఆందోళన చెందడం, ఒత్తిడికి లోనవడం తరచుగా కనబడుతోంది. ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనబడుతుంది. ‘సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప’ అంటారు ఆదిశంకరాచార్య. ఏ వ్యక్తి అయినా మనం ఎలా చూస్తే అలా కనబడతాడని చెప్పడానికి ప్రబంధాల్లో వర్ణనలన్నీ ఉదాహరణలే. ఎంత వ్యతిరేకి అనుకొన్నా అతనిలో మనకు కావలసిన లక్షణాలు కొన్నయినా ఉంటాయి. అదే విషయాన్ని ఉత్తర హరివంశం అనే ప్రబంధంలో నాచన సోమన బలరామదేవుని వర్ణనలో స్పష్టం చేస్తాడు.

పాతాళాధిపుఁడైన శేషుఁడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతింబుట్టిన శంకరుండని జనుల్‌ పేర్కొన్నచో నంధకో
ద్భూత స్నేహముఁ గామపాలతయుఁ దప్పున్‌ దప్పుఁగాకేమి? వి
ఖ్యాతిం బొందఁడె పాండురాంగ మహిమన్‌ హాలాహల స్వీకృతిన్‌

నాచన సోమన తిక్కనగారి గాఢాభిమాని. ఆయనలాగే ఈయన కూడా హరిహరనాథునికే కావ్యాంకితం చేశాడు. ఉత్తర హరివంశంలో కథ అంతా శ్రీకృష్ణ విజయమే. కాబట్టి కృష్ణునికి తోడునీడైన బలరాముని శివుని అవతారంగా వర్ణించాలని ఆయన తాపత్రయం. కాని శివుడు అంధకవైరి. బలరాముడు అంధకమిత్రుడు (అంధక వంశం వారు యాదవుల మిత్రులు). శివుడు కామపాలుడు (మన్మధుని శాసించినవాడు). బలరాముడు మన్మధుని శ్వాసించినవాడు. ఇన్ని వైరుధ్యాలున్నా కలిసే లక్షణాలు ఉండకపోతాయా, కవి పరిశీలించగా అద్భుతమైన పోలికలు రెండు దొరికాయి.

బలరాముడు, శివుడు ఇద్దరూ తెల్లనివారే. ‘పాండురాంగ మహిమ’ ఇద్దరికీ ఉంది గదా అని సమర్థించాడు. ఇంకో పోలిక ‘హాలాహల స్వీకారం’ అన్నాడు. శివుడు హాలాహల స్వీకారం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి బలరాముని విషయంలో ఇది ఎలా సరిపోతుంది? మనసుండిన మార్గముండదా? నాచన సోమన భాషానైపుణ్యంతో దాన్ని సాధించాడు. బలరాముడు హాల (మద్యం), హలము (నాగలి) విడిగా స్వీకరించాడు గదా అన్నాడు. అంటే శివుని విషయంలో ఏక పదమైన హాలాహలం బలరాముని విషయంలో రెండు పదాలు కలిసిన ద్వంద్వ సమాసం అయింది. కవిగారి నాలుకకి రెండువైపులా పదునుండటం అంటే ఇదే.

సారాంశంగా మనం ఎంత వ్యతిరేకించే వారిలోనయినా మనకు కావలసిన లక్షణాలు కొన్నయినా ఉంటాయని గ్రహించ వచ్చు. ఈ భావంతో జీవిస్తే ప్రపంచంలో ప్రతికూలతలుంటాయా? ఇంతకంటె వ్యక్తిత్వ వికాసం ఉంటుందా? ఈ నాలుగు పద్యాల్లోనే ఇంత ఉంటే మొత్తం పద్యసాహిత్యంలో ఇంకెంత ఉంటుంది! అందువల్ల తెలుగుపద్యమే తెలుగువారి వ్యక్తిత్వం.

ఒక పద్యమ్మును నేర్చుకొన్న ధనమైయోగమ్మునై ధ్యానమై
సుకవిత్వాంచల దీప్తిదర్శన సుధాస్రోతస్విని స్నామై
అకలంక ప్రతిభాసమన్విత మృదువ్యాహారమై హారమై
సకలోర్వన్‌ కొనగోట నెత్తినటులుత్సాహమ్ము దీపంచెడిన్‌