శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు

( క్రితం శుక్రవారం జూలై 18, 2003 న అట్లాంటా లో శ్రీ. వెలమూరి శ్యాంసుందర్‌గారి ఇంట్లో జరిగిన

సాహిత్య కార్యక్రమమిది. సుమారు 50, 60 మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ ముచ్చట్లు

మన ఈమాట పాఠకులతో పంచుకోవాలని నా యీ చిన్ని ప్రయత్నం. మీరంతా చదివి ఆనందిస్తారని

ఆశిస్తూ…మీ ఫణి డొక్కా )
సంచాలకులు శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు గారు

పృఛ్ఛక వర్గం

1) ఆశువు శ్రీ పెమ్మరాజు వేణు గోపాల రావు గారు

2) నిషిద్ధాక్షరి డాక్టర్‌దశిగి వేణు గారు

3) దత్తపది డొక్కా శ్రీనివాస ఫణి కుమార్‌

4) సమస్య డాక్టర్‌పూడిపెద్ది శేషు శర్మ గారు

5) వర్ణన డాక్టర్‌యెర్రమిల్లి దుర్గ గారు

6) వ్యస్తాక్షరి శ్రీ వెలమూరి శ్యాం సుందర్‌గారు

7) అప్రస్తుత ప్రసంగం శ్రీ యెల్లంరాజు శ్యాం సుందర్‌గారు

8) కావ్యపఠనం వ్యాఖ్య శ్రీమతి వేదాల లక్ష్మి గారు

నిషిద్ధాక్షరి డాక్టర్‌దశిగి వేణు గారు

అంశం నస్త్రీ స్వాతంత్రమర్హతి అన్నారు కదా, దీనిపై మీ వ్యాఖ్య, పద్య రూపం లో

నిషేధం     స  మ   హ   స    న     న    న    మ    *    చ    మ    మ
స్త్రీ  ని  సా   ధ్వి  య  య్యు బ   య   ట    స్వే   ష్ట    త    ని    డి

నిషేధం –   య    త    య    గ    ర    మ    ట    వ    *    ప    క    ట
పం    పి    రా    కా   శ     రా   జ్ఞి    గా   పై   న    గ    ల్ప

(మిగితా రెండు పాదాలు రెండవ రౌండు లో పూర్తిచేయడం వల్ల నిషేధం చెయ్యబడలేదు)

నమ్మను నిలిపి ఆమెయే అతివలకును
నేటికారాధ్యయయ్యె యింకేటి గోల !

పూర్తి పద్యం

్త్రీసని సాధ్వియయ్యు బయట స్వేష్టత నిడి
పంపిరాకాశ రాజ్ఞిగా పైన గల్ప
నమ్మను నిలిపి ఆమెయే అతివలకును
నేటికారాధ్యయయ్యె యింకేటి గోల !
( ఇది భారత ధృవతార కల్పనా చావ్లా పై చెప్పిన చక్కటి పద్యం )

2) సమస్య డాక్టర్‌పూడిపెద్ది శేషు శర్మ గారు

ఇచ్చిన సమస్య   వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో

పూరణ

వెధవల్‌బుట్టిరి వింతదేశమున నవ్వే వచ్చెడిన్‌విన్నచో
కథలున్‌గోడలకెక్కె యీ కళకు పక్కా సంస్థలున్‌లేచె యీ
సుధలీనేలను రోగ రూపమున సంక్షోభమ్ము పుట్టించునో
వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో

3) దత్తపది డొక్కా శ్రీనివాస ఫణి కుమార్‌

ఇచ్చిన పదాలు ఆకాశం, సూరీడు, యవ్వారం, నారాయుడు
అడిగిన అంశం బాపు రమణలకు కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే పద్య కుసుమం

చెప్పిన పద్యం

ఆకాశంబది యెర్రబారినది ఏ హత్యల్‌జొరంబారెనో
సోకుల్నేర్చిన బాపు కుంచియలతో సూరీడు నేరేడగున్‌
ఆకే చాకుగ తోచు నా బుడుగు, ఈ యవ్వార మెవ్వారిదో
నాకంబందున ముళ్ళుపూడె ఇటకా నారాయుడేవచ్చెనో!

4) వర్ణన డాక్టర్‌యెర్రమిల్లి దుర్గ గారు
వర్ణనాంశం అమెరికా లో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే..

చెప్పిన పద్యం

అమెరికా కన్య ఓ యంచు ననగ జనదు
ఇండియా కన్య వూరకే వుండబోదు
మౌన భాషణ లొక్కచో స్నానమాడ
లండనున చల్లబడ్డది గుండెమంట

5) ఆశువు శ్రీ పెమ్మరాజు వేణు గోపాల రావు గారు

అడిగిన అంశం 1) యంత్ర పరికరాలతో విశ్వ శోధన చేసి మరో గురు గ్రహాన్ని
కనుక్కున్నారు. ఆ సూర్యు గురు గ్రహాల సంభాషణ ని ఆశువుగా రెండు పద్యాలలో చెప్పడం

చెప్పిన పద్యాలు

సౌరమండలంబు సహచారి గురుగాంచి
తారలేగెనంచు తరలి నవ్వె
తిరుగ తిరుగ తాను గురుడౌనొ శిష్యుడో
తిరుగ వలదటంచు తిరిగి చెప్పె

తిరిగి చెడ్డవాడ గురుడనేమందునో
గగనమునకు రాజు గాంచ నీవె
తిరిగి కాళ్ళు లాగె తిరుగలులైపోయె
నన్ను చూడకయ్య కన్న తండ్రి !

రెండో అంశం కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి పై పద్యం

పంచెగట్టిరి పద్యాలు పంచి ఇడిరి,
నాల్గుకన్నులు సంద్రాలు నాల్గు గాగ
ధారణా కంకణమ్ములు దాల్చినారు
మాయమైనారు కలలోనె గాయమయ్యె !

6) కావ్యపఠనం వ్యాఖ్య శ్రీమతి వేదాల లక్ష్మి గారు

అడిగిన రెండు అంశాలు 1) తినవెంటన్‌సిరి అనే పద్యం పై వ్యాఖ్య 2) గోపికా శ్రీకృష్ణుల అనుబంధం పై వ్యాఖ్య ( వేదాల లక్ష్మి గారు రాగ, భావ యుక్తం గా రెండు పద్యాలూ చక్కగా పాడి వినిపించారు )

అవధాని గారు చక్కటి వ్యాఖ్య చేసారు. దేవుణ్ణి నిర్మల మైన భక్తితో, అచంచలమైన విశ్వాసం తో కొలిస్తే, ఆయన తప్పక వస్తాడని చెబుతూ, అనేక ఉప కథలను జోడించి, యే కోరికలూ కోరకపోవడమే మంచిది, అన్నీ ఆ పరమాత్ముడే చూసుకుంటాడు అని పూర్తి చేసారు. అదేవిధంగా గోపికా కృష్ణుల పవిత్ర ప్రేమానుబంధాన్ని వర్ణిస్తూ, ఉద్ధవుని కథ చెప్పి, గోపికల ఆత్మల్లో నివాసమున్న శ్రీకృష్ణ పరమాత్ముని భక్తి, ప్రేమ తత్వాలను వివరించారు.

7) వ్యస్తాక్షరి శ్రీ. వెలమూరి శ్యాం సుందర్‌గారు

ఇచ్చిన వాక్యం అం చె లం చె లు లే ని మో క్ష ము చా ల క ష్ట మె భా మి నీ

(ఇది శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా లో పాట అనుకుంటాను. ఇంత పెద్ద వాక్యాన్ని కూడా అవధానిగారు

అవలీలగా, అలవోకగా చెప్పగలిగారు. )

8) అప్రస్తుత ప్రసంగం శ్రీ యెల్లంరాజు శ్యాం సుందర్‌గారు

పృఛ్ఛకులైన  శ్యాం సుందర్‌అడిగిన ప్రశ్నలకు, అవధానిగారు చతురతతో, సమయస్ఫూర్తితో మంచి రంజైన సమాధానాలనిచ్చి అవధానం రక్తికట్టేలా చేసారు. ఆ ప్రశ్నలలో కొన్ని..

1) ప్రశ్న లావొక్కింతయు లేదు అంది కదా ఏనుగు, అంతలావు ఏనుగు, ఇంకా లావు లేదంటుందేవిటండీ?
సమాధానం నాయనా, ఆ “లా” తెలుగు లా కాదు, అది యింగ్లీషు పదం. చట్టం అని అర్థం. యీ అడవిలో బోల్డంత సన్మానింపబడి రాజులా వుండాల్సిన నన్ను యీ మొసలి యాతన పెడుతోంది. ఇది చట్ట  విరుద్ధం అని ఏనుగు ఏడుస్తోందని దాని అర్థం !! (అనడంతో సభంతా నవ్వులతో నిండిపోయింది )

2) ప్రశ్న పెళ్ళానికీ పక్కింటావిడకీ తేడా ఏవిటండీ ?

సమాధానం పెళ్ళం యేం చేసినా బావుండదు. పక్కింటావిడ యేం చేసినా బావుంటుంది.

అవధాని గారు చెప్పిన మరికొన్ని జోకులు

1) భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరా డు ఉంది, ధర్మరాజు కి లేదు..ఎందుకంటే, ఆయన అరణ్యవాసం లోనూ, అజ్ఞాతవాసంలోనూ, కూర్చుని యింగ్లీషులో ఆజ్ఞలు జారీ చేసేవాడట (అన్నగారు కదా, అందుకని) భీమా..డు, అర్జునా..డు, నకులా..డు, సహదేవా..డు..అంటూ…అందుకే వాళ్ళ పేర్లకి చివర డు వచ్చి చేరింది

2) ఈ మధ్యన టీ వీ లో అనౌన్సర్లెవరూ వత్తులు పలకట్లేదు ఏంచెయ్యమంటారు

లక్ష వత్తుల నోము చేయిస్తే సరి !!

3) తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది, మరి ఆఫీసులో టైపిష్టు ఏంచూస్తుంది ?

–        నువ్వు పని చెయ్యకుండా చూస్తుంది !!

ఇలా ఆద్యంతం సరసోక్తులతో, ఎంతో ఆహ్లాదంగా జరిగింది నాటి కార్యక్రమం. చెప్పిన పద్యాలన్నీ విధిగా ధారణ చేసి తన ధారణా ప్రతిభను చాటుకున్నారు అవధాని గారు. అవధాని గారు సరస్వతీ దేవిని స్తుతిస్తూ పలికిన ప్రార్థనా పద్యంతో యీ వ్యాసం ముగిస్తాను.

యే పాద తీర్థమ్మునీ పాటి సేవింప
భాషా సముద్రాలు పర్వులెత్తు

యే వీణ తీవియలిసుమంత మ్రోగిన
సంగీత సాగర స్నానమగునొ

యే కంటి చూపు పూరేకంత సోకిన
ఆకంటి పూవంటి అరుగు కవిత

యే సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను
నలువకైనను నోట పలుకు రాదొ

అట్టి మదుపాస్య కవి హృదయాంబుజాస్య
పుణ్య గుణవశ్య కవిలోక పూర్ణిమాస్య
రమ్య గుణలాస్య, కవితా విలాసలాస్య
శారదాదేవి నా యెద జాలుగాక

నిర్వహించిన యెల్లంరాజు శ్యాం సుందర్‌ గారికీ, ఆతిధ్యమిచ్చిన వెలమూరి శ్యాంసుందర్‌ దంపతులకీ, అధ్యక్షత వహించిన మా వేణుగోపాల రావు గారికీ, పృఛ్ఛకులకీ, విచ్చేసిన  రసజ్ఞులకీ, డిన్నరు యేర్పాట్లు చేసిన ఆడవారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ….నమస్తే