5. పద్యం, గద్యం, వచన పద్యం వగైరా

‘వచన పద్యం పద్యమే’ అన్న వ్యాసంతో శ్రీ సంపత్కుమార ఒక గడుసైన ప్రశ్న వేశారు. ఒక వ్యాసంలోని వాక్యాలను భావ, భావాంశాల పద్ధతిలో పాదవిభజన చేసి వచన పద్యంగా నిరూపించ వచ్చునని నేనన్న దానికి అంగీకరిస్తూనే ఇలా ప్రశ్నించారు -’మరి సాంప్రదాయిక ఛందస్సుల ననుసరించి, వ్యాసాన్ని ఇరవయ్యారేసి అక్షరాలుగా (అంతకు తక్కువగా కూడా) విభజించి విషమ వృత్తాలుగా నిరూపించవచ్చు. ఈ విధంగా ఈనాటి వచన పద్యాన్ని ‘విషమ వృత్తం’గా పరిగణించవచ్చునని ఒక మిత్రుడు సూచించినాడు. మరి దీనికి ఏమనాలి?’ దీని అర్థం ఏమిటంటే గద్య పద్యాన్ని వేరు చేసే శక్తి భావగణ పద్ధతికి లేనిమాట నిజమే అయినా, ప్రాచీన ఛందస్సిద్ధాంతానికి కూడా ఈ అవస్థ తప్పదని. ఇది నిజమైతే ప్రాచీన ఛందస్సాంప్రదాయం ఈ మేరకు లోపభూయిష్టం కావాలి. ఏ ఛందస్సిద్ధాంతమైనా గద్యపద్యాల్ని వేరు చెయ్యలేకపోతే, దాని ప్రధానమైన ప్రయోజనమే దెబ్బ తిన్నట్టు. ఈ దృష్టితో ప్రాచీన ఛందశ్శాస్త్రాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రాచీనుల ఛందశ్శాస్త్రాన్ని ఈ కింది పద్ధతిలో ఒక వృత్తనిర్మాణ యంత్రంగా ఊహిస్తున్నాను. ఇట్లాంటి యంత్రాన్ని ఇదే పద్ధతిలో వాళ్ళు ఊహించారని నా ఉద్దేశం కాదు. ప్రాచీన ఛందస్సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి ఈ ఊహాయంత్రం సహాయకారి అని మాత్రమే.


వృత్త నిర్మాణ యంత్రం

ఈ యంత్రంలో మూడు భాగాలున్నై. 1. పాదోత్పత్తి విభాగం, 2. పాదనియమ విభాగం, 3. పాదబంధన విభాగం. మొదటి అర అక్షర క్రమాల్ని ఉత్పత్తి చేస్తుంది. రెండో అర పాదాలకు అంతర్నియమాలను విధిస్తుంది. మూడో అర సమానమైన పాదాలను ఏరుకొని ప్రాసనియమంతో బంధిస్తుంది. విషమ వృత్తాలకు సంబంధించిన నియమాలు కూడా ఈ అరలోనే ఉంటై. ఈ యంత్రానికి ముడిసరుకు భాషలో వాక్యాలు. చివరికి ఉత్పత్తి అయ్యేవి వృత్తాలు. జాతులు, ఉపజాతులు, మాత్రాఛందస్సులకు ఈ యంత్రం సరిపోదు. అక్షర ఛందస్సులకు మాత్రమే ఇది సరిపోతుంది.

అక్షర భేదాల సంఖ్య (గురు-లఘువులు) 2. ఇది స్థిరాంకం. పాదంలో అక్షరాల సంఖ్య 1 నుంచి 26 వరకూ ఉండొచ్చు. 26 అక్షరాలకు మించి పాదాలున్న లయగ్రాహి (30), లయవిభాతి (34), లయహారి (37) వంటి వృత్తాలను పేర్కొనటాన్ని బట్టి చూస్తే పాదంలో అక్షరాల సంఖ్య మీద గరిష్ఠ పరిమితి విధించటం ప్రాచీనుల ఉద్దేశం కాదని ఊహించవచ్చు. కాని, 26 అక్షరాల సంఖ్య వరకు మాత్రమే పేర్లు పెట్టారు. అంతకు ఎక్కువ ఉండటాన్ని వారు నిషేధించలేదు. ఒక్కో ఛందస్సులో అక్షరక్రమాల సంఖ్య 2n (2 to the power of n) అనే గణిత సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. పాదంలో ఎన్ని అక్షరాలుంటే అన్నిసార్లు అక్షరభేద సంఖ్యను క్రమంగా రెట్టిస్తూ పోతే పాదంలో అక్షరక్రమాల సంఖ్య వస్తుంది. అదే ఒక్కో ఛందస్సులో పుట్టే వృత్తాల సంఖ్య. పాదోత్పత్తి విభాగం చేసే పని ఇది. ఈ పద్ధతిలో, పాదంలో అక్షరాల గరిష్ఠ సంఖ్య 26 అయితే 13,42,17,726 అక్షరక్రమాలు (ఇదే మొత్తం సమవృత్త సంఖ్య కూడా) సాధ్యమవుతై. విషమ వృత్తాలను పరిగణిస్తే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.

‘ప్రస్తారము వలన ఇన్ని కోట్ల వృత్తములున్నట్లు తెలిసినను, ప్రయోగములో నున్న మొత్తము వృత్తాల సంఖ్య అత్యల్పము. వంద, వంద యేబదికి మించకపోవచ్చును’ (సంపత్కుమార, 1962). ఈ ప్రయోగంలో ఉన్న 100 లేక 150 పద్యాలకు లక్షణం చెపితే సరిపోయేది గదా! ఇన్ని కోట్ల వృత్తాలను అనవరసరంగా పుట్టించటం ఎందుకు అనే సందేహం రావడం సహజం. ఉన్న పద్యాలకు లక్షణం చెప్పటం పరిమిత లక్ష్యం. భాషలో సాధ్యమైన వృత్తాలన్నింటికీ ఆటోమేటిక్‌గా లక్షణ నిర్వచనం చేసే యంత్రంగా ప్రాచీన ఛందఃకారులు ఛందశ్శాస్త్రాన్ని పరిగణించారు. దీన్నే ఆల్గొరిథమ్ అంటారు. ఈ లక్ష్యం భాషాశాస్త్రంలో వచ్చిన జనరేటివ్ సిద్ధాంత లక్ష్యం వంటిది. ఒక వ్యవహర్త ప్రయోగించే వాక్యాల సంఖ్య పరిమితం అయినా అతనికి అనంతమైన వాక్యాలను ఉపయోగించలగల దక్షత ఉంది. ఇది అతను నిర్మించుకున్న అమూర్త వ్యాకరణం ఇచ్చిన శక్తి. దీనికి భౌతికమైన అవధులు ఉండటం వల్ల వ్యవహర్త ప్రయోగించే వాక్యాల సంఖ్య ఎప్పుడూ పరిమితమే. అట్లాంటి అనంత వాక్యప్రయోగ దక్షత ఇచ్చిన అమూర్త వ్యాకరణానికి మూర్త రూపకల్పనే వ్యాక్కర్తల లక్షం. ఇట్లాంటి దక్షతను ప్రతిభ అని వాక్యప్రయోగాన్ని ప్రవృత్తి అని తెలుగులో వ్యవహరిస్తున్నాను. కేవలం ప్రయోగించిన వృత్తాలకు లక్షణం చెప్పడం కాకుండా భాషలో సాధ్యమైన వృత్త సమస్తానికి ఆటోమేటిక్‌గా లక్షణ నిర్వచనం చేసే సిద్ధాంతంగా ఛందశ్శాస్త్రాన్ని ప్రాచీనులు పరిగణించారు గనుక వీరి సిద్ధాంతాన్ని కూడా జనరేటివ్ సిద్ధాంతంగానే గుర్తిస్తున్నాను.

సాధ్యమైన అన్ని క్రమాలను పద్యభేదాలుగా లెక్క గడితే గద్యానికి పద్యానికి భేదం ఎక్కడ? ఏ వాక్యం తీసుకున్నా ఏదో ఒక అక్షర సంఖ్య ఉంటుంది. ఏదో ఒక అక్షర క్రమం ఉంటుంది. ఇల్లాంటివి నాలుగు కూరిస్తే భిన్న అక్షర క్రమాలతో కూడిన విషమవృత్తం అవుతుంది కదా? అల్లాంటప్పుడు ఏ వ్యాసాన్నయినా ఆ పద్ధతిలో పాదవిభజన చేసి విషమవృత్తాలుగా నిరూపించటానికి వీలులేదా? ఇది సంపత్కుమారగారు ఉద్దేశించిన ప్రశ్న. ఇంత జనరేటివ్ సిద్ధాంతాన్ని ఊహించిన ఛందశ్శాస్త్రకారులకు మాత్రం ఈ ప్రశ్న తట్టి ఉండదా? అందుకే వృత్త నిర్మాణయంత్రంలో మిగతా భాగాలు, వాటిలో నియమాలు. పాదోత్పత్తి విభాగానికి అపరిమితమైన, అవసరానికి మించిన ఉత్పాదకశక్తి ఉంది. దాన్ని అట్లాగే వదిలేస్తే భాషంతా పద్యమే అయే అవకాశముంది. ఈ అపరిమితోత్పాదకశక్తికి కొన్ని కళ్ళేలు తగిలించాలి. ఆ పనే మిగతా అరలు వివిధ నియమాల రూపంలో చేస్తై. ఈ నియమాలు ఒకరకంగా వడపోత పనీ చేస్తై. ఉత్పత్తి అయిన పాదంలో నిర్దిష్ట స్థానంలో విరామం ఉండాలని, పాదాంతంలో విరామం ఉండాలని సంస్కృతంలో పెట్టిన నియమాలు ఇట్లాంటివి. నిర్దిష్ట స్థానంలో యతిమైత్రి ఉండాలనేది తెలుగువాళ్ళు చేసిన కళ్ళెం. ఈ విరామం గాని, యతిమైత్రిగాని ఐచ్ఛికం అని వాదించవచ్చు. విరామం తప్పనిసరి అని వాదించవచ్చు. విరామం తప్పనిసరి అని సంస్కృతంలో కొందరైనా భావించారు (సంపత్కుమార, 1962). యతిమైత్రిని ఐచ్ఛికంగా తెలుగులో ప్రాచీనులెవరూ భావించలేదు. ఐచ్ఛికమని భావించిన వారిలో అక్కిరాజు ఉమాకాంతంగారు ముఖ్యులు. అయితే యతిమైత్రి స్థానంలో విరామం ఉండాలని ఆయన మతం.

ఏకాక్షర ద్వ్యక్షర వృత్తాలుగా వాక్యాలను విభజించవచ్చు. కాని, ఒక వ్యాసాన్నంతటినీ అట్లా విభజించటం సాధ్యం కాదు. పాదాంత విరామం చివరికంటా సరిపడదు; కేవలం ఒక అక్షరంతో గాని, రెండక్షరాలతో గాని అంతమయ్యే మాటలు ఎన్ని ఉంటై? పైగా రెండక్షరాలనగానే తెలుగులో ప్రాసమైత్రి అనేది అడ్డుకుంటుంది. పది అక్షరాల లోపునే పాదపరిమితిని పాటిస్తూ విషమ వృత్తాలు సృష్టించవచ్చు. కాని, పాదాంత విరామం గాని, ప్రాసమైత్రి గాని దెబ్బ తినకుండా ఒక వ్యాసాన్ని వృత్తంగా నిరూపించటం సాధ్యమౌతుందనుకోను. ఇక్కడ గుర్తించాల్సిన విషయ మొకటుంది. ఈ వృత్త నిర్మాణ యంత్రంలో కొత్తనియమాలు పెట్టుకోవటానికి వీలుంది. అట్లాంటి వీలుండటం వల్లనే తెలుగు వాళ్ళు ప్రాసమైత్రి, యతిమైత్రిని చేర్చుకోగలిగారు. ఇట్లాంటి నియమాలకు వీలున్నంత వరకూ వ్యాసాల్ని వృత్తాలుగా నిరూపించే అవకాశమే లేదు. వడపోత నియమాలు ఉండటం వల్ల ప్రాచీన ఛందశ్శాస్త్రం గద్య పద్య విభాగం సరిగ్గానే చెయ్యగలుగుతున్నది. సంపత్కుమారగారి వచన పద్య లక్షణాలకు సిద్ధాంత బలం లేదు. గద్యపద్యాలను వేరు చేసే శక్తి లేదు. అర్థం మీద గాని, భావం మీద గాని ఆధారపడి పద్యరూపాన్ని నిర్వచించే ఏ లక్షణానికైనా ఈ శక్తి ఉండదు.

అయితే, వ్యాసానికీ వచన పద్యానికీ అచ్చులోనేనా భేదం? ‘అంతే’ అని సంపత్కుమార సంతోషంతో అంటారనుకోను. కాని, వారి భావగణ పద్ధతిని అంగీకరిస్తే ఇంకో మార్గం లేదు. వాక్యనిర్మాణంలో భేదం కనిపిస్తుంది. వ్యాకరణ సహాయంతో ఈ భేదాన్ని నిరూపించటం సాధ్యం కావచ్చు. అప్పుడైనా, వచనపద్యాన్ని ఛందోవిభాగంగా నిరూపించటం సాధ్యం కాదు. మామూలు వచనానికి, ఛందోనియమంలేని కవిత్వపు వచనానికి వాక్యనిర్మాణంలో ఎట్లాంటి భేదం ఉందో తెలుసుకోవచ్చు. సాధారణ వ్యవహారాతిరిక్త భాషాప్రయోగం సాహిత్యానికి కనీసం ఒక లక్షణం. ఛందస్సుల్లో ఈ అసాధారణత్వం అక్షరాల కూర్పు వల్ల సాధించబడింది. అంటే, ఇక్కడ అక్షరాల పరిమాణానికి, నిర్ణీతమైన వాటి ఏర్పాటుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ అసాధారణత్వం ధ్వని సంబంధమైనది. వచన పద్యంలో దీనిమీద దృష్టి ఉండదు. అసాధారణత్వం ఇంకో మార్గంలో సాధింపబడాలి. అది వాక్యనిర్మాణం ద్వారా సాధ్యపడుతుంది. ఈ అసాధారణత్వాన్ని గుర్తించటానికి వ్యాకరణం – ముఖ్యంగా వాక్యనిర్మాణ విభాగం – సాయపడుతుంది. (ఈ పేరాలో వాడిన ‘అసాధారణత్వం’ అనే మాటను పరిభాషగా గ్రహించాలి.) ఈ మార్గంలో వచన పద్యాన్ని పరిశీలిస్తే కొన్ని కొత్త విషయాలు బయటికి రావచ్చు. భావగణ పద్ధతివల్ల వచన పద్యాన్ని గురించి మనం గ్రహించగలిగింది ఏమీ లేదు.

సంపత్కుమారా ‘తేషాం ఋక్, యత్రార్థవశేన పాదవ్యవస్థా’ అనే జైమినీయ మీమాంసా న్యాయసూత్రాన్ని ఒకటి ప్రమాణంగా పట్టుకొచ్చారు. అది వచన పద్య పాదవిభజనలో ఎట్లా ఉపకరిస్తుందో నాకు బోధపడటం లేదు. ఎందుకంటే ఋక్కులు వచన పద్యాలు కావు కదా. బండి నాగరాజుగారు (చూ. అనుబంధం) అడిగినట్లు, పఠనంలోనా? లేఖనంలోనా? ఋక్కుల్లో పాదవిభజన పఠనానికి. వచన పద్యంలో పాదవిభజనకు అసలు ప్రయోజనమేమిటో నాకు తెలీదు గాని అచ్చులో మాత్రమే దాని ప్రాధాన్యం కనిపిస్తుంది. పైగా ఋక్కులు అక్షర ఛందస్సులు (గాయత్రి, అనుష్టుప్ మొ.) వాటిల్లో అక్షర సంఖ్య నిర్దిష్టం. నిర్దిష్టమైన అక్షర సంఖ్య ఉన్నా ఇతర నియమాలు లేనప్పుడు పాదవిభజన గ్రహించటం కష్టం అవుతుంది. అటువంటప్పుడు పాదాంతంలో విరామం ఉంటే పాదవిభజన గ్రహించటం తేలికవుతుంది. అట్లా విరామం ప్రకృతి ప్రత్యయాల మధ్య గాని, పదమధ్యంలో గాని సాధ్యం గాదు. అందువల్ల అర్థభంగం కాని విధంగా పాద విరామం ఉండాలి. ‘యత్రార్థవశేనా పాద వ్యవస్థా’ అనే దానికి ఎక్కడపడితే అక్కడ పాదవిభజన చెయ్యవచ్చు అని అర్థం ఉందనుకోను. అట్లా అయితే ఋక్కుల్ని వచన పద్యాలుగా ఎందుకు భావించకూడదు? అక్షర సంఖ్యా నిబద్ధమైన పద్య పాదాల్లో పాదవిభజన అర్థభంగం కలిగించని విధంగా ఉండాలని పై సూత్రానికి తాత్పర్యంగా గ్రహిస్తున్నాను. వచన పద్యాలకూ ఋక్కులకూ ఎట్లా సంబంధం లేదో, వాటిని గురించి చేసిన ప్రతిపాదనలకూ అంతే సంబంధం లేదు. అదీకాక హేతుబద్ధతే ప్రమాణం కన్నా ఎక్కువ విలువైందిగా గ్రహిస్తాను.

ఒక్కోచోట మేమిద్దరం ఒకర్నొకరం అర్థం చేసుకోలేకపోతున్నాం. బహుశా కొన్ని మాటల్ని మేమిద్దరమూ ఒకే అర్థంతో వాడటం లేదేమో? హేతుబద్ధంగా విషయాన్ని పరిశీలించటానికి ఇద్దరమూ ప్రయత్నిస్తున్నా అంగీకారానికి రాలేకపోతున్నాం (రావాలని నియమం ఏమీ లేదు.) బహుశా నేననుకునే హేతుబద్ధత, ఆయననుకునే హేతుబద్ధత ఒకటి కాదేమో.

పూర్వ వ్యాసాల్లో కొన్నిటిని చాలా సంక్షిప్తంగా చెప్పటం వల్ల అవి అపార్థాలకు తావిచ్చినై. ఉదాహరణకు ‘పూర్వ పరవ్యంజనంతో సంబంధం లేకుండా దీర్ఘాచ్చుగాని, పరవ్యంజనంతో మూతబడ్డ హ్రస్వాచ్చుగాని గురువు అవుతుంది’ అన్నాను. దీర్ఘాచ్చు ఎప్పుడైనా గురువే అవుతుందని, హ్రస్వాచ్చు పరవ్యంజనంతో మూతపడ్డప్పుడు మాత్రమే గురువు అవుతుందని నా ఉద్దేశం. పై సూత్రీకరణ అక్షరాలు (Syllables) ఆధారంగా చేసుకుని చెప్పింది. అయితే, నేను కొన్నిటిని వదిలేశాననుకొని సంపత్కుమార వాటిని పూరించారు. అందులో తప్పు లేదు గాని, ఆ పూరణకు అవసరం లేదు. అదే సందర్భంలో గురు లఘు నిర్ణయంలో హేతుబద్ధత లేదన్నారు సంపత్కుమార. అట్లా ఎందుకనుకుంటున్నారో నా కర్థం కావటం లేదు. నేననుకుంటున్న హేతుబద్ధతను కొంచెం సూచిస్తాను.

అచ్చులో హ్రస్వ దీర్ఘ భేదాలున్నై. ఒక్కోసారి ఉచ్ఛారణలో మనం హ్రస్వాచ్చు లనుకుంటున్నవి, దీర్ఘాచ్చు లనుకుంటున్న వాటికన్నా దీర్ఘంగా వినిపించవచ్చు. దీర్ఘాచ్చు లనుకుంటున్న వాటిల్లో కూడా తరతమ భేదాలుండవచ్చు. అందువల్ల వీటి మీద ఆధారపడ్డ గురు లఘు నిర్ణయంలో వ్యత్యయం రాదా అనే ప్రశ్న రావటం సహజం. హ్రస్వ దీర్ఘ స్వర భేదం భాషలో సైకలాజికల్ రియాలిటీ మీద ఆధారపడి ఉంది. ఇది ఫిజికల్ రియాలిటీతో భేదించవచ్చు. ఒకటి రెండు ఉదాహరణలిస్తాను.

తెలుగులో నాకు-చింత అనే మాటల్లో మొదటి మాటలో పదాది, వ్యంజనాన్ని, రెండో మాటలో సున్నాతో సూచించిన వ్యంజనాన్ని ఒకటిగానే గుర్తిస్తున్నాం. (స్పర్శం ముందు అనునాసిక వ్యంజనాన్ని, సున్నాతో సూచించడానికి కారణం ప్రెడిక్టబిలిటీ.) వీటిమధ్య భౌతికమైన ఉచ్ఛారణ భేదం ఉంది. మొదటిది దంతమూలీయం. రెండోది దంత్యం. అయితే, రెండుచోట్లా ‘త’వర్గానునాసికంగానే పరిగణిస్తున్నాం. అట్లాగే మనం స్పర్శాలుగా పరిగణిస్తున్న వర్ణాలు కొందరి ఉచ్ఛారణలో ఊష్మాలు కావచ్చు. ఉదా: ఫలితం, కఫం. మనం ఉభయోష్ఠ్యాలుగా పరిగణిస్తున్న వర్ణాలు కొందరి ఉచ్ఛారణలో దంతోష్ఠ్యాలుగా వినిపించవచ్చు. ఉదాహరణకు ప, బ, మలు, రెండు పెదాలూ మూయడానికి ఇబ్బంది ఉన్న వ్యవహర్తల ఉచ్ఛారణలో దంతోష్ఠ్యాలుగా వినిపించవచ్చు. ఈ వ్యవహర్తల తెలుగు భాషకు చేసే వర్ణ నిర్ణయంలో భౌతికమైన భేదాలు అడ్డు కావు. సైకలాజికల్‌గా ‘న’ వర్ణం దంత్యమే. ‘ఫ’ వర్ణం స్పర్శమే. ‘ప, బ, మ’లు ఉభయోష్ఠ్యాలే. ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తి లేదు. ఇది హేతుబద్ధమైన నిర్ణయమే. అట్లాగే గురు లఘు నిర్ణయం కూడా. గురు లఘు భేదం భాషలో అక్షర పరిమాణానికి సంబంధించింది. భాషకు సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు సైకలాజికల్ రియాలిటీనే పరిగణించాలి. గురు లఘు నిర్ణయంలో ప్రాచీనుల్లో మత భేదాలున్నంత మాత్రాన వాటిని వ్యవస్థారాహిత్యానికి సూచకాలుగా గ్రహించకూడదు.

నేను ప్రత్యేకంగా ప్రస్తావించని విషయాలను నేను అంగీకరించినట్టుగా భావిస్తున్నారు సంపత్కుమార. ‘అయితే, నేను విభజించిన రీతిని గూర్చి రామారావుగారు ఏమీ అనలేదు కాబట్టి నా విభజన సరిగానే ఉందనుకోవాలె’ అని రాశారు. వచన పద్యంలో పాదవిభజనకు నిర్దిష్ట సూత్రం ఏమీ లేదని వాదించే నేను, ఆయన గానీ, మరొకరు గానీ చేసే పాదవిభజనను ఎట్లా అంగీకరిస్తాను? అసలు అంగీకరించటం, నిరాకరించడం అన్న సమస్య కూడా రాదు. ఆర్బిట్రరీగా జేసే విభజన తప్పు కాదు, ఒప్పూ కాదు.