టెలుగు వెలుగులు

రాజు గారి టేబుల్‌ మీద మూడు రకాల ట్రేలు ఉన్నాయి. ఎడంచేతివైపు ట్రే మీద ‘అత్యవసర సమస్యలు’ అని లేబుల్‌ ఉంది. మధ్య దానిమీద ‘అవసర సమస్యలు’, కుడిచేతివైపున్న దానిమీద ‘సమస్య కాని సమస్యలు’ అని ఉంది.

ఏమీ తోచని రాజుగారు అత్యవసర సమస్యలున్న ట్రేని ముందుకు జరుపుకొన్నాడు. ఒక్కో ఫైలుని తీసి కాగితాలు తిరగేశాడు. ఏదీ అత్యవసర సమస్యగా కనిపించలేదు రాజుగారికి. ఆ ఫైళ్ళన్నీ తీసి ‘అవసర సమస్యలు’ ట్రేలో పడేశాడు. ఆ ట్రేలో ఫైళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కాస్సేపు కళ్ళు మూసుకొని దాన్ని ముందుకు జరుపుకొన్నాడు. ఒక్కో ఫైలు తీసి, కొన్ని క్షణాలపాటు చూసి ‘సమస్యకాని సమస్యలు’ ట్రేలో పడేయడం మొదలు పెట్టాడు. ఆ పని పూర్తయింది.

ఇక తను పరిష్కరించాల్సిన సమస్యలేవీ కనిపించలేదు రాజుగారికి. ఫైళ్ళలో లేని సమస్యలేవన్నా బుర్రకు తోస్తాయా అని కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచించాడు. ఎంతసేపు ఆలోచించినా రాజ్యమంతా సుభిక్షంగా ఉన్నట్టు, ప్రజలకు ఏ సమస్యా లేనట్టు అనిపించింది.

ఎందుకైనా మంచిదని మంత్రిని పిలిపించాడు. ‘‘ఏమయ్యా మంత్రీ… మన రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ప్రజలంతా సుఖంగా ఉన్నారని నేననుకొంటున్నాను. నువ్వేమంటావు? ఔను కదూ…’’ గత్యంతరం లేని మంత్రి తల ఆడించాడు.

‘‘నేను ఉత్తమమైన రాజును అనుకొంటున్నాను. నువ్వే మంటావు? ఔనంటావు కదూ…!’’

‘‘ఎప్పటికప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించే వ్యక్తిని ఉత్తమమైన రాజు అనొచ్చు… మీరూ అలాంటివారే…’’ అంటూనే రాజుగారి టేబుల్‌ మీదున్న ఫైళ్ళ వంక చూశాడు. అత్యవసర సమస్యలు, అవసర సమస్యలు వాటికి సంబంధించిన ట్రేలలో లేవు. అన్ని ఫైళ్ళూ సమస్యకాని సమస్యల ట్రేలో ఉన్నాయి. అంటే వాటి భవిష్యత్తు చెత్తబుట్ట.

‘‘ప్రస్తుతం నాకు ఏ సమస్యా కనిపించడం లేదు.’’

రాజుగారి స్టేట్‌మెంట్‌కు టేబుల్‌ మీది నుండి చూపు తిప్పకుండానే మంత్రి తల ఆడించాడు ఔనన్నట్లు. రాజుగారు కొనసాగించారు. ‘‘నీ మంత్రి బుద్ధికి ఏ సమస్య అయినా ఉంది అనిపిస్తే చెప్పు. ఇరవై నాలుగ్గంటల్లోపల పరిష్కరించేస్తాను!’

మంత్రి నీళ్ళు నమలాడు. రాజుగారికి కోపం వచ్చింది. “నారాజ్యంలో ఎవరూ నీళ్ళు నమలడానికి వీల్లేదు. తప్పనిసరిగా ఏదో ఒకటి నమలుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ బ్రాందీనో, విస్కీనో, రమ్మో… అంతే! నీళ్ళు నమలకూడదు!”

“ప్రస్తుతం ప్రజలు అదేపని చేస్తున్నారు మహాప్రభో… దేశంలో ఏ మూల చూసినా మంచినీటి కరవే కనిపిస్తోంది. అందుకని ప్రజలు నీళ్ళు నమలడానికి బదులు చీప్‌ లిక్కర్‌ నీళ్ళు నములుతున్నారు!”

‘‘చాలా మంచిపని చేస్తున్నారు. దీనర్థం ఏమిటంటే మన దేశం అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది. నీకో రహస్యం తెలుసా? అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో మంచినీళ్ళకు బదులు బీరు తాగుతారు.’’

‘‘అయితే మనకు మంచినీటి సమస్య లేదంటారు…’’

‘‘నో… ఉంది అనిపించినా అది సమస్య కాదు. మనం చీప్‌ లిక్కర్‌ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేని దుస్థితి ఏర్పడితే అప్పుడు మంచినీటి సమస్య ఉన్నట్టు. అండర్‌స్టాండ్‌… అర్థమయిందా? గుర్తు పెట్టుకో… మంచినీళ్ళు లేకుండా ఎవరూ చనిపోరు…’’

మంత్రి అందుకొన్నాడు. ‘‘ఒకవేళ ఎవరైనా చనిపోయినట్టు వార్త వస్తే కారణం మంచినీటి కొరత కాదు. మద్యం కొరత అని అర్థమవుతుంది.’’

‘‘వెరీగుడ్‌! బాగా చెప్పావు. ఇంకేదైనా సమస్య అనిపిస్తే చెప్పు.’’

‘‘విద్యుత్తు…’’

రాజుగారు పకపకా నవ్వారు. ‘‘నీళ్ళే లేకపోతే విద్యుత్తు ఎలా వస్తుందయ్యా? కాబట్టి విద్యుత్తు కొరత అనేది సమస్య కానేకాదు.’’

మంత్రికి ఒప్పుకోవాలనిపించలేదు. ‘‘మీరది సమస్య కాదంటే ఎలా? విద్యుత్తు కొరత కూడా ఒక సమస్యే అని నాకు బలంగా అనిపిస్తోంది.’’

రాజుగారు మంత్రిని కొంచెం దగ్గరగా రమ్మని, రహస్యం చెబుతున్నట్టు, ‘‘మనం దేన్నయితే పరిష్కరించలేమో దాన్నసలు సమస్యగానే గుర్తించకూడదు.’’

జ్ఞానోదయమయినట్లు మంత్రి తల ఆడించాడు.

‘‘కాబట్టి మంత్రీ… మనం పరిష్కరించగలిగే సమస్య ఏదైనా ఉంటే చెప్పు. ఇప్పుడే దాని అంతు చూసేద్దాం.’’

మంత్రి నోరు తెరచి ఏదో చెప్పబోయే లోపలే రాజు మళ్ళీ అందుకొన్నాడు. ‘‘నువ్వు ఆహార సమస్యల్ని, రైతు సమస్యల్ని ఏకరువు పెట్టొద్దు. అవన్నీ నీటితో లింకు ఉండేవే. మనమేమైనా మాంత్రికులమా మేఘాల్ని సృష్టించి, వర్షాలు కురిపించి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి!’’

మంత్రి తలాడించడం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాడు. ఇద్దరూ కళ్ళు మూసుకొని ప్రజాసమస్యల్ని గుర్తించడానికి ఆలోచించసాగారు.

చప్పున ఏదో గుర్తుకు వచ్చినట్లు తల విదిలించుకొన్నాడు మంత్రి. ‘‘ప్రభూ… ఈమధ్య తమరు ప్రపంచ తెలుగు మహా సభల్ని విజయవంతంగా నిర్వహించారు. గుర్తుందా?’’

‘‘యస్‌ యస్‌… అండ్‌ ఇట్‌ వాజె గ్రాండ్‌ సక్సెస్‌… నా కెంతో హ్యాపీగా ఉంది.’’

‘‘ఆ సభల సందర్భంగా తమరు ఒక అజెండాను ప్రకటించారు. గుర్తుందా?’’

రాజుగారు నొసలు చిట్లించారు. ‘‘మాటిమాటికీ గుర్తుందా గుర్తుందా అంటావేమిటయ్యా! జరిపిన సభలన్నింటినీ, వాటి అజెండాలతో సహా గుర్తు పెట్టుకోవాలా? అసలు నిన్ను నేను అడిగిందేమిటి? నువ్వు చెబుతున్నదేమిటి? ప్రజా సమస్యలేవైనా ఉంటే చెప్పవయ్యా మగడా అంటే… నువ్వేదో టెల్గూ మహాసభల గురించి చెబుతున్నావు…’’

‘‘ఆరోజు మీరు సభలో ఒక ప్రకటన చేశారు. మన తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉంది. మన తల్లి భాషను మనం కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సమస్యగా నేను పరిగణిస్తున్నాను అన్నారు.’’

‘‘సర్సరే… ఆ అజెండా పాయింట్లేవో చెప్పు. క్షణాల్లో పరిష్కరించేస్తాను.’’

మంత్రి అయోమయంగా, ‘‘క్షణాల్లోనా…?’’ అన్నాడు.

‘‘ఏం? అంతకంటే ఎక్కువ టైం పడుతుందా? చెప్పు. మొదటి పాయింటేదో చెప్పు చూద్దాం.’’

‘‘ప్రతి విద్యార్థీ పదోతరగతి వరకూ చదివే సబ్జెక్టుల్లో తెలుగు కూడా విధిగా ఉండి తీరాలి. ఇదీ మొదటి పాయింటు.’’

ఒకక్షణం ఆలోచించారు రాజుగారు. ‘‘ఇది సమస్య ఎందుకయింది? ప్రతి క్లాసులోనూ టెల్గూ సబ్జెక్టు చెప్పండి అని ఒక ఆర్డర్‌ పడేస్తే పోలా?’’

‘‘తెలుగు సబ్జెక్టు చెప్పడానికి తెలుగు పాఠ్యపుస్తకాలు వుండాలి కదా…’’

“అయితే దిస్సియర్‌ టెక్‌స్ట్‌ బుక్‌ ప్రిపరేషన్‌, నెక్‌స్ట్‌ ఇయర్‌ టీచింగ్‌ అందాం.”

‘‘మీరు చెప్పినట్లు అన్నీ అంత సులభంగా జరగవు. ఈ భాషా సంస్కృతుల వ్యవహారం చూడ్డానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి.’’

‘‘ప్రత్యేకంగా దీనికోసం ఒక మంత్రిని పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే ముందుకొచ్చేవాళ్ళు ఎవరు? ఒక రహస్యం చెప్పనా? టెల్గూ భాషలో ఉండే అక్షరాలన్నీ తప్పుల్లేకుండా రాయగలిగినవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరూ ఉండరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఈ శాఖను వద్దు పొమ్మంటారు. వాళ్ళు కోరుకొనే శాఖలు వేరు. కాబట్టి నో టెల్గూ మంత్రి శాఖ.’’

‘‘సంగీత, నాటక, సాహిత్య అకాడెమీల పునరుద్ధరణ కూడా చేస్తామన్నారు.’’

‘‘దట్స్‌ నో ప్రాబ్లెమ్‌. మనవాళ్ళలో చాలామంది ఈ పోస్టుకు ఎగబడతారు.’’

‘‘నిజమే ప్రభూ… ఈ అకాడెమీ ఇన్‌ఛార్జ్‌లకు మంచి వినోద కాలక్షేపం. ఆప్తులకు, బంధువులకు, తమ ప్రాంతంవారికి బహుమతులు ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు. ఎంతోమంది కళాకారులు పరిచయమవుతారు.’’

‘‘యస్సెస్‌… రేపు గుర్తుచెయ్‌. ఆ పని పూర్తి చేద్దాం. నెక్‌స్ట్‌ పాయింట్‌…’’