భోజ్యేషు మాత!

సీతాపతి హ్యూస్టన్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పాసింజర్లు బయటికి వచ్చేచోట గంట నుంచీ ఎదురు చూస్తున్నాడు.

ఫ్రాంక్‌ఫర్డ్‌ నుంచి అప్పుడే విమానం దిగినట్టు గోడ మీద మానిటర్‌ చూపిస్తున్నది. సీత కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ పూర్తి చేసుకుని రావటానికి ఇంకో గంట పడుతుందని సీతాపతికి తెలుసు. అయినా అతని హడావిడి అతనిది.

దానికి కారణం రెండు నెలల క్రితం హడావిడిగా ఒక శనివారం ఇండియాలో దిగి, ఆదివారం అరడజను అమ్మాయల్ని చూసి, సోమవారం వాళ్ళల్లో తను ఎంచుకున్న సీతని చేసుకుంటానని చెప్పేసి, గురువారం పెళ్ళి చేసేసుకుని, శుక్రవారం మరోపని కూడా కానిచ్చేసి, మళ్ళీ శనివారం రాత్రికే బయల్దేరి అమెరికా వచ్చేశాడు. అప్పుడంత హడావిడి పడినవాడు ఇప్పుడు విశ్రాంతిగా ఎలా ఉంటాడు? కాలు గాలిన పిల్లిలా తిరుగుతుంటే కాళ్ళు నొప్పిపుట్టి, త్వరత్వరగా తెలుగులో నిమిషాలు లెక్కపెడుతూ అక్కడ వున్న కుర్చీలో కూర్చున్నాడు.

సీతాపతి ఏడేళ్ళ క్రితమే అమెరికా వచ్చాడు. మైక్రోబయాలజీలో పీహెచ్‌డి పూర్తి చేశాక, అక్కడే యూనివర్సిటీలో రీసెర్చి విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఇండియాకి వెళ్ళి పెళ్ళి కూడా చేసుకు వచ్చాడు. అన్నీ అతను అనుకున్నట్టుగానే జరుగుతున్నందుకు సంతోషపడుతూ, సీత రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

కొంచెంసేపటికి పెద్ద సూట్‌కేసులు బండిలో తోసుకుంటూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. వారిలో కొంతమంది భారతీయులు. ఆత్రంగా వారిలో సీత కోసం చూస్తున్నాడు సీతాపతి.

ఆ కొత్త వాతావరణానికి కొంచెం బిత్తరపోతూ, అటూ ఇటూ చూసుకుంటూ ముందుకి వెళ్ళిన ఒక సన్నపాటి సన్నజాజి, సీతాపతిని చూసి ‘‘ఏమండీ,’’ అని పిలిచింది చిరునవ్వుతూ.

ఆ అమ్మాయి ఎవరిని పిలుస్తున్నదో తెలియక సీతాపతి వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల ఎవరూ లేరు.

‘‘నేనండీ సీతని,’’ అంది సీత మూతిని సున్నాలా చుట్టి.

ఏ అమ్మాయి అయినాసరే మూతి అలా సున్నాలా పెడితే సీతాపతికి ఎంతో ఇష్టం. పెళ్ళిచూపుల్లో అలా చూసే, సీతని చేసు కుంటానని చెప్పాడు సీతాపతి. ఇప్పుడూ అది చూసే సీతని వెంటనే గుర్తు పట్టేశాడు కూడాను.

‘‘హాయ్‌ సీతా! ఎలా అయింది ప్రయాణం. ప్లేన్‌లో నిద్ర పోయావా? మన భోజనం పెట్టారా? కస్టమ్స్‌వాడు ఏమీ కస్టమ్స్‌ ఇవ్వలేదు కదా?’’ చకచకా అడిగేశాడు. అడిగి, జవాబులకి ఎదురుచూడకుండానే ఆమెని కౌగలించుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. సీత సిగ్గుపడిపోయి సామానుల బండిని ముందుకు నెట్టింది, అతన్ని తీసుకురమ్మని.

‘‘ఓ! సారీ!’’ అంటూ బండి తీసుకుని పార్కింగ్‌ గరాజ్‌ వేపు దారితీశాడు సీతాపతి.

సీతాపతి కారులో సామానులు ఎక్కిస్తున్నప్పుడు అంది సీత, ‘‘కస్టమ్స్‌వాడు కస్టమ్స్‌ ఏమీ ఇవ్వలేదు కానీ మూడు కేజీల ఆవకాయ, రెండు కేజీల గోంగూరపచ్చడి ప్యాకెట్లు తీసేసు కున్నాడు.’’

‘‘వాడేం చేసుకుంటాడు తెల్లవెధవ. గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ ముక్కలు నంజుకు తినాలని కూడా వాడికి తెలీదు,’’ అంటూ ఇంకా ఏదో అనబోయాడు కానీ, కొత్త పెళ్ళాం పక్కనే వుండటం వల్ల వూరుకున్నాడు.

కారులో ఇంటికి వస్తున్నప్పుడు అడిగింది సీత. ‘‘ఇందాక నేను లోపలి నుంచి వస్తున్నప్పుడు, మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు. అప్పుడే నన్ను మర్చిపోయారా ఏమిటి… ముప్ఫై రోజుల్లో తమిళంలాగా, నాల్రోజుల్లోనే పెళ్ళాడినందుకా…’’

ఎడం చేత్తో స్టీరింగ్‌ చేస్తూ, కుడి చేత్తో సీత మెడ నిమురుతున్న సీతాపతికి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ‘‘అవునూ! నీ రెండు జడలేమయిపోయాయి. అసలు నిన్ను పెళ్ళి చేసుకున్నదే నీ రెండు జడలు చూసి. ఇందాక నేను వెతుకుతున్నది ఆ రెండు జడల కోసమే,’’ అన్నాడు జుట్టు కత్తిరించేసుకున్న రెండు జడల సీత మెడ వెనుక లేని జడలు వెతుకుతూ.

ఫక్కుమని నవ్వింది సీత. ‘‘నిజంగానా! నాకు తెలీదు మరి! అమెరికాలోనే వుండే మా స్నేహితురాలు శైలజ. తను చెప్పింది, అమెరికాలో ఎవరూ జడలు వేసుకోరు, జట్టు కత్తిరించుకోవాలంటే ఖరీదు, ఇండియాలోనే కత్తిరించుకుని వెళ్ళమని…’’

‘‘ఎవరా అమ్మాయి? శైలజా, శూర్పణఖా? అందుకని బందరు లోనే జుట్టు కత్తిరించుకు వచ్చావా?’’

అతని కోపం చూసి నెమ్మదిగా అంది సీత. ‘‘లేదు హైద్రాబాదులోనే చేయించింది. మీకు రెండు జడలు అంటే అంత ఇష్టం అని నాకు తెలీదు. అందుకే…’’ చిన్నబుచ్చుకుని, మూతి సున్నాలా పెట్టుకుని అంది సీత.

సీత మూతి సున్నాలా పెడితే సీతాపతి మూర్ఛపోతాడనో, అలాటిదేదో అనుకున్నాం కదా ఇంతకుముందు. అందుకని సీతాపతి వెంటనే కరిగిపోయాడు. ‘‘ఎంత బాగున్నావు సీతా!’’ అన్నాడు ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

సీత సీతాపతి చేతిని మృదువుగా నిమిరింది. ‘‘ముందుకి చూస్తూ కారు నడపండి. ఏక్సిడెంట్‌ అయి మనిద్దరికీ ఏమన్నా అయితే, నేను క్షేమంగా చేరినట్లు మా అమ్మకి చెప్పేవాళ్ళు కూడా ఎవరూ వుండరు,’’ అంది నవ్వుతూ.

‘‘ఇంటికి వెళ్ళాక, నువ్వు స్నానం చేసే లోపల నేను కూర, అన్నం వండేస్తాను. ఇక్కడికి వచ్చే ముందర పప్పు, పులుసు చేసేశాను. అంతేకాదు, కాస్త పరమాన్నమూ చేశాను. రేపూ ఎల్లుండి శనాదివారాలు సెలవు. లేటుగా నిద్రలేవచ్చు. నీకూ ఈలోగా బడలిక తీరుతుంది…’’ అన్నాడు సీతాపతి.

‘‘మీరు వంట చేస్తానని చెప్పారు కానీ, ఇలా అన్ని రకాలూ చేస్తారని అనుకోలేదు!’’ అంది అందంగా నవ్వుతూ సీత.


విమానంలో ఏం పెట్టారో కానీ సరిగ్గా తినకపోవటం వల్ల ఆరోజు సీతకి అంతా గొప్ప విందు భోజనంలా వుంది.

‘‘యు ఆర్‌ ది బెస్ట్‌ కుక్‌ ఇన్‌ ది వరల్డ్‌,’’ అని సీతాపతి పెదవుల మీద ముద్దు పెట్టింది.

‘‘అబ్బ! ఎంత తియ్యగా వుందో!’’ అన్నాడు సీతాపతి.

పకపకా నవ్వింది సీత. ‘‘అంతకన్నా తీపిది ఇంకోటుంది. మీకోసం బందరు మిఠాయి తెచ్చాను,’’ అని సూట్‌కేస్‌ తెరిచి, బందరు లడ్డూలు నోటికి అందించింది. ఆ రాత్రి కూడా ఎంతో తీయగా గడిచింది. ఇండియా క్షేమసమాచారాలు చెబుతూనే అలసిన సీత సొలసి నిద్రపోయింది.


మామూలుగా శనాదివారాలు కొంచెం ఆలస్యంగా ప్రొద్దున ఎనిమిది గంటలకి నిద్రలేస్తాడు సీతాపతి. కానీ పక్కనే పక్కలో అందమైన పెళ్ళాం పడుకుని వుండటం కొత్తగా వుందేమో, ఏడింటికే నిద్ర మెలకువ వచ్చింది. శబ్దం చేస్తే సీతకి నిద్రాభంగ మవుతుందని చక్కటి ఆమె ముఖం చూస్తూ పడుకున్నాడు. ప్రయాణబడలిక వల్లా, ఆంధ్రా అమెరికాల కాలమానంలో ఎంతో తేడా వుండటం వల్లా, ఒళ్ళు మరచి నిద్రపోతున్నది సీత. నల్లటి జుట్టు తెల్లటి నుదుటి మీద నాట్యమాడుతున్నది. ఇంద్రధనుస్సు లాటి కనుబొమ్మల క్రింద అందంగా మూసుకున్న కళ్ళు బాపు బొమ్మని గుర్తు చేస్తున్నాయి. సన్నగా కోటేరులా వున్న ముక్కు తెల్లగా మెరిసిపోతున్నది. కొంచెం తెరుచుకున్న ఎర్రని పెదవుల మీద మందహాసం కవ్విస్తున్నది. సీతాపతికి ఒక్కసారిగా ప్రేమ ముంచుకొచ్చింది. కానీ సీత లేస్తుందేమోనని వూరుకున్నాడు.

ఇంకో గంట గడిచినా సీత నిద్ర లేవకపోయేసరికి తను లేచి, బెడ్‌రూం తలుపు వేసి బయటికి వచ్చాడు. టొమేట ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉప్మా చేశాడు.

ఆ ఘుమఘుమలకీ, పోపు ఘాటుకీ సీత నిద్రలేచి ఆవలిస్తూ, ‘‘అప్పుడే నిద్ర లేచేశారా?’’ అంది.

‘‘బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ,’’ అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు సీతాపతి.

‘‘ఉండండి… ముఖం కడుక్కుని వస్తాను,’’ లేస్తూ ఒళ్ళు విరుచుకుంది సీత.

‘‘అమ్మో! ఎంత బాగున్నావో,’’ అన్నాడు సీతాపతి.

‘‘అవును మరి! కొత్త పెళ్ళాన్ని కదా!’’ అని బాత్రూంలోకి వెళ్ళింది సీత.

సీత వచ్చేసరికి రెండు ప్లేట్లలో ఉప్మా, పక్కనే పచ్చడి, కాఫీ అన్నీ టేబుల్‌ మీద సర్ది వుంచాడు సీతాపతి.

‘‘థాంక్యూ! అన్నీ ఎంత తొందరగా చేశారండీ. యు ఆర్‌ గ్రేట్‌. మిమ్మల్ని పెళ్ళిలో చూసి నీకు ఎంతో మంచి మొగుడు దొరికాడే అంది మా బామ్మ!’’

‘‘నేను వంట బాగా చేస్తానని మీ బామ్మకెలా తెలుసు?’’ అడిగాడు అమాయకంగా సీతాపతి.

అతని నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది. ‘‘మీ వంట చూసి కాదు. అమాయకంగా వుండే మీ ముఖం చూసి,’’ అంది.

ఉప్మా తింటూ, ‘‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? ఏమను కోరు కదూ,’’ అంది సీత.

‘‘అడుగు… నాకు ఏ అమ్మాయి వంట నేర్పిందనా…’’

‘‘అమెరికాలో ఇన్నేళ్ళు వుంటే వంట ఎందుకు రాదు. అదికాదు, మా నాన్న ఈమధ్య ఓ కొత్త ఫ్రిడ్జ్‌ కొన్నాడు. కొనే ముందు మూడు నెలలు ఏ ఫ్రిడ్జ్‌ మంచిది, ఏది ఎక్కువ రోజులు మన్నుతుంది, ఫీచర్స్‌ ఏమున్నాయి అని ఎంతో రీసెర్చి చేశాడు. కనపడ్డ మిత్రుల్నీ, కనపడని శత్రువుల్నీ అందర్నీ విచారించాడు…’’

‘‘అవును మరి, అంత డబ్బు ఖర్చు పెట్టి కొనేటప్పుడు విచారించాలి కదా… అది సరిగ్గా పనిచేయకపోతే తర్వాత నిజంగా విచారించాలి మరి!’’ అన్నాడు సీతాపతి చిరునవ్వుతూ.

‘‘వెధవ ఫ్రిడ్జ్‌కే అన్నాళ్ళు చూస్తామే మనం. అలాటిది జీవితాంతం మీతో కాపురం చేయాల్సిన భార్యని అరగంటలో చూసేసి, అర నిమిషంలో ఊఁ కొట్టేసి, ఇలా వచ్చి అలా పెళ్ళి చేసేసుకుని వెళ్ళిపోయారే… ఎందుకని?’’

‘‘నీ నున్నటి పాలరాతి నుదుటి మీద వందేళ్ళ వారెంటీ చూసి చేసుకున్నాను,’’ అన్నాడు సీతాపతి నవ్వుతూ.

‘‘హాస్యానికి కాదు, నిజంగా అడుగుతున్నాను,’’ అంది సీత.

‘‘నిజంగా చెబుతున్నాను. నీ చక్రాల చక్కెర మూతి చూసీ, రెండు జడలు చూసీ, హోల్‌సేల్‌గా నీ అందాన్ని చూసీ చేసుకున్నాను. మా అమ్మా నాన్నా ముందే ఒక జేమ్స్‌బాండ్‌ని మీ కుటుంబం మీదా, మీ వంశం మీదా క్షుణ్ణంగా విచారించారు కూడాను,’’ అన్నాడు నవ్వుతూ.

ఒక్కక్షణం ఆగి అన్నాడు, ‘‘మరి నువ్వూ అంతేగా! ఒక్క చీర కొనటానికే పది షాపులు తిరుగుతావ్‌! నన్నెందుకు అలా చూసి, ఇలా చేసుకున్నావ్‌?’’

‘‘అమెరికా అబ్బాయి అనగానే ఎగిరి గంతేసి చేసుకున్నా ననుకున్నారా, కాదు. మానాన్న మీ అమెరికా నుంచి సిఐఏ వాళ్ళని తెప్పించి విచారించమంటే, వాళ్ళు పాపం ఇక్కడ అమెరికాలోనూ, అక్కడ ఇండియాలోనూ విచారించారుట,’’ అంది.

‘‘జవాబులు మాత్రం భలే చెబుతావ్‌. ఇవాళ కార్యక్రమం ఏమిటంటే బజారు వెళ్ళి కూరలూ, ఇంకా కావాల్సినవి తెచ్చు కుందాం. వీలుంటే అక్కడే ఎక్కడో తినేద్దాం. రాత్రికి మాత్రం ఎన్నాళ్ళ నించో ఎదురుచూస్తున్న నీ చేతి వంట. ఇక లే! స్నానం చేద్దాం,’’ అంటూ లేచాడు సీతాపతి.


గ్రోసరీ షాపులో కూరలూ, పళ్ళూ కొన్నారు. ‘‘ఇక్కడ ఎన్ని రకాలు దొరుకుతాయో!’’ అని ఆశ్చర్యపోయింది సీత.

అక్కడి నుంచి మాల్‌కి వెళ్ళారు. అక్కడ కొన్ని అమెరికన్‌ డ్రెస్సులూ మొదలైనవి కొనుక్కుంది. మాల్‌లో నడుస్తుంటే, వాళ్ళకి ముందర నడుస్తున్న ఒక తెల్ల అమ్మాయి కొంచెం లావుగా వున్నా, పొడుగ్గా వుంది. చక్కగా దువ్విన జడ ఎంతో పొడుగ్గా నడుం మీద నాట్యం చేస్తున్నది. పక్కనే నడుస్తున్న ఇంకో అమ్మాయి నడుం మీద చేయి వేసి, ఒకళ్ళకొకళ్ళు హత్తుకుని వెడుతున్నారు.

‘‘ఛీ పాడు,’’ అంది సీత.

‘‘పాడు ఏమోగానీ ఆ జడ చూడు, అమెరికాలో అమ్మాయిలు జడలు వేసుకోరన్నావే… చూడు,’’ అన్నాడు సీతాపతి.

ఆ మాటలకి ముందు వెడుతున్న జడ అమ్మాయి వెనక్కి తిరిగింది. అది అమ్మాయి కాదు. పెరిగిన గడ్డం, మీసం వున్న ఒక తెల్లతను. సీతాపతికి నోట మాట రాలేదు.

సీత ఫక్కున నవ్వింది. ‘‘జడబ్బాయి!’’ అంది ఇంకా పెద్దగా నవ్వుతూ.

సీతాపతి కూడా నవ్వాడు. ఇద్దరూ అక్కడే పిజ్జా తిని ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే నిద్ర వస్తున్నది బాబూ అంటూ ఇంకా జెట్‌లాగ్‌ తీరని సీత మంచం మీద వాలిపోయింది. సీతాపతికి మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు కనుక, సీత తెచ్చిన తెలుగుపత్రికలు చదువుతూ సోఫాలో పడుకున్నాడు. సాయంత్రం ఆరయినా సీత లేవకపోతే, తనే కిచెన్‌లోకెళ్ళి, కూర కోసం వంకాయలు తరిగాడు. దాంట్లోకి, పప్పులోకి, పులుసులోకి కావలసిన కూరగాయలన్నీ తరిగాడు. మధ్యమధ్యలో, ‘‘సీతా! ఇక నిద్ర లేవరాదూ! మరీ అంతగా పడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు,’’ అని కనీసం అరడజను సార్లు అన్నాడు.

‘‘అయ్యో! చాలాసేపు పడుకున్నాను. సారీ,’’ అంటూ నిద్రలేచింది సీత.

‘‘ఏదీ నీ వంట రుచి చూపిస్తానన్నావ్‌! కూరలు, ఉల్లి పాయలు, మిరపకాయలు అన్నీ తరిగేశాను. పోపు సామాన్లు, మిగతావన్నీ ఇక్కడే పెట్టేశాను,’’ అన్నాడు సీతాపతి.

సీత, ‘‘వస్తున్నా! వస్తున్నా!’’ అంటూ పది నిమిషాల తర్వాత వచ్చింది. ఆమె చేతిలో వంట పుస్తకం వుంది.

‘‘అదెందుకు?’’ అడిగాడు సీతాపతి ఆశ్చర్యపోతూ.

‘‘మా ఇంట్లో మా బామ్మ ఎప్పుడూ నన్ను వంటింట్లోకి రానిచ్చేది కాదు మడి అని. అందుకని ఈ పుస్తకం కొని తెచ్చుకున్నాను,’’ అంది సీత కొంచెం బిడియపడుతూ.

బిత్తరపోయాడు సీతాపతి. ‘‘మరి మా జేమ్స్‌బాండ్‌ నీకు వంట బాగా వచ్చని చెప్పాడే!’’ అన్నాడు.

‘‘మీ సిఐఏ వాళ్ళు కూడా, మీకు వంట బాగా వచ్చని చెప్పారు. అయినా నేను వాళ్ళ మాటలు నమ్మలేదు. మీ వంట చూశాక, వాళ్ళు ఆబద్ధం ఆడలేదని తెలిసింది,’’ అంది సీత.

‘‘అంటే మీ జేమ్స్‌బాండ్‌ అబద్ధం చెప్పినా నేను నమ్మాను. మా సిఐఏ వాళ్ళు నిజం చెప్పినా నవ్వు నమ్మలేదు. అందుకేనేమో అంటారు ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం కష్టం అని. అసలు నువ్వెప్పుడైనా వంట చేశావా?’’ అడిగాడు సీతాపతి.

‘‘ఒక్కసారి చేశాను. మా బామ్మ పక్కింటి మందపాటి పిన్నిగారితో తిరపతి వెళ్ళినప్పుడు. అప్పుడు కూర మాడిపోయింది. పప్పులో ఉప్పు ఎక్కువయింది. ఘాటుచారు చేస్తే, వేడిచారులా వచ్చింది. అందుకని మా తమ్ముడు వేడిచారుని ఏడిచారు అని ఎగతాళి చేసి, ఉడిపి హోటల్లో తిని వచ్చాడు అప్పుడు. అప్పటి నుంచి మళ్ళీ వంట చేయలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి పాపం మీరే వండుకు తింటున్నారు. నేను వచ్చి మీకు చక్కగా మంచి భోజనం పెడతాననుకుంటే, మిమ్మల్ని నిరుత్సాహపరిచాను. సారీ!’’ అంది సీత అమాయకంగా. సీత కళ్ళల్లో నీళ్ళు మెరుస్తున్నాయి.

సీతని అలా చూడగానే ఒక్కసారిగా కరిగిపోయాడు సీతాపతి. ‘‘ఛీ అదేమిటి! కొత్త పెళ్ళానివి అలా కంటనీరు పెట్ట కూడదు. వంట ఏమీ బ్రహ్మవిద్య కాదు. నేను నేర్పుతానుగా. మూడు వారాల్లో గురువుని మించిన శిష్యుడివయిపోతావు,’’ అన్నాడు సీతాపతి, సీతని దగ్గరికి తీసుకుంటూ.

‘‘శిష్యుడు కాదు, శిష్యురాలు!’’ అంది సీత, మళ్ళీ అమాయకంగా మూతి సున్నాలా చుట్టి.

‘‘అమ్మదొంగా! మాటలు చెప్పటం మాత్రం బాగా తెలుసు,’’ అని, ఆమెని కౌగలించుకుని, ఆ ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు సీతాపతి.

(సత్యం మందపాటి గత 31 సంవత్సరాలుగా టెక్సాస్‌లో ఆస్టిన్‌ నగరంలో వుంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలోనూ, అమెరికాలోనూ వున్న దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలోనూ 300 పైగా కథలు, మూడు నవలలూ, ఎన్నో వ్యాసాలు, నాటికలు, కవితలు, శీర్షికలు రాశారు. పది పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. వాటిలో అమెరికా బేతాళుడి కథలు, ఎన్నారై కబుర్లు ఒకటి, ఎన్నారై కబుర్లు మరోటి రెండవ ముద్రణ చేయబడ్డాయి. తెలుగుబడి నిర్వహించి, తెలుగు అసలు రానివారికి, ఇంగ్లీష్‌ ద్వారా తెలుగు నేర్పటానికి ఒక సిలబస్‌ తయారుచేశారు.)