టెలుగు వెలుగులు

‘‘సిటీలో షాపింగుకు వెళ్తే ప్రతిషాపు ముందరా నేమ్‌బోర్డ్‌ ఇంగ్లీషులో ఉంటోంది. దుకాణాల పేర్లన్నీ తెలుగులోనే ఉండాలని, దానికి తగిన చర్యలు తీసుకొంటామని తమరు సెలవి చ్చారు.’’

‘‘ద వెరీ ఐడియా ఇట్‌సెల్స్‌ ఈజ్‌ నాన్సెన్స్‌. క్యార్రీస్‌ నో మీనింగ్‌. ఏమయ్యా… ఎవడైనా దుకాణం ముందు బోర్డు ఎందుకు పెడతాడు? బజార్లో వచ్చేపోయే వాళ్ళకు ఆ షాపులో ఏముందో తెలియడానికి. మెడికల్‌షాప్‌ అని ఇంగ్లీషులో ఉండే బోర్డును నువ్వు టెల్గూలో రాయమంటావు. వాడు ‘మందుల దుకాణం’ అని రాస్తాడు. సాయంత్రం పొద్దు పోయింతర్వాత ఒకడొచ్చి బ్రాందీ క్వార్టర్‌ బాటిల్‌ ఇవ్వమంటాడు. షాపువాడు ‘ఇది ఆ మందుల షాపు కాదు. ఈ మందులు వేరు’ అంటాడు. వచ్చినవాడు ఒప్పుకోడు. మందంటే బ్రాందీ, విస్కీ, రమ్‌ ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే అని వాడి స్థిరమైన అభిప్రాయం. పెద్ద గొడవ అవుతుంది. అట్లాగే వైన్‌షాప్‌ అనే బోర్డును టెల్గూలో రాయాలంటే ఎంత చావొచ్చి పడుతుంది! ఆఖరికి వైన్‌షాపు వాడు ‘ద్రాక్షాసవ విక్రయకేంద్రం’ అని రాయిస్తాడు. దాన్ని చదివిన వాళ్ళు అర్థంకాక అయోమయంలో రోడ్డుకు అడ్డంగా పడిపోతారు. అప్పుడు శాంతిభద్రతల సమస్య ఒకటి మొదలవుతుంది. కాబట్టి మంత్రీ… దుకాణాలపేర్లు టెల్గూలోనే ఉండాలన్న నియమాన్ని వద్దనుకొంటే మంచిది. తర్వాత వచ్చే టెల్గూ గొడవ పాయింటేమిటో చెప్పు.’’

‘‘పాలనాభాషగా తెలుగునే ఉపయోగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను తెలుగులోనే కార్యకలాపాలు నిర్వ హించాలి అని ఆదేశించారు…’’ ప్రభువులవారు ఈ పాయింటుకు ఎలా స్పందిస్తారో అర్థంకాకుండా నిలబడ్డాడు మంత్రి.

రాజుగారు ఆలోచనలో పడ్డారు. మూడుమార్లు నిలువుగా, అయిదుమార్లు అడ్డంగా తల ఊపాడు. మంత్రి ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.

ఎట్టకేలకు రాజుగారు పెదవి విరుస్తూ నోరు తెరిచారు. ‘‘ఇది సమస్య ఎలా అయింది?’’ సూటిగా అడిగాడు.

‘‘ఎందుకంటే ` ఇంతవరకూ మనం పాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే జరుపుతున్నాము…’’

‘‘ఇప్పుడు ఆ ఇంగ్లీషును వదిలిపెట్టి అన్ని ఫైళ్ళూ టెల్గూ లోనే రాసుకోవాలి. అంతేకదా… స్ట్రిక్ట్‌గా ఫాలో కమ్మని ఆర్డర్‌ ఇష్యూ చేసేద్దాం… వెరీ సింపుల్‌…’’

‘‘అది మీరు చెప్పినంత సులభం కాదు మహాప్రభో… మన సిబ్బంది అంతా ఇంగ్లీషు కొట్టుడికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు తెలుగులో రాయాలంటే ప్రతి ఒక్కరూ చేతు లెత్తేస్తారు.’’

‘‘వై? వాట్స్‌ ద ప్రాబ్లెమ్‌?’’

‘‘ఫైల్‌ పదం దగ్గర్నుండి ఓట్‌, కేస్‌, కలెక్టర్‌, అప్పీల్‌, బిల్‌, మైల్‌, రబ్బర్‌, స్టేషన్‌, హాల్‌ — ఇలా అన్నీ ఇంగ్లీషు పదాలే… వీటికి తెలుగుపదాలు సులభస్థాయిలో దొరకవు.’’

‘‘వెరీబ్యాడ్‌ బ్యాడ్‌… అసలీ ఇంగ్లీషు పదాల్ని మన టెల్గూ భాషలోకి స్మగ్‌లింగ్‌ చేసిందెవరు?’’

‘‘ఇంగ్లీషోల్లు.’’

‘‘ఇంగ్లీషోల్లంటే గుర్తుకొస్తా ఉంది. ఆయనెవరో సి.పి. బ్రౌన్‌ అనే ఆయన టెల్గూ -ఇంగ్లీషు, ఇంగ్లీషు – టెల్గూ డిక్షనరీలు రాశాడు కదా… ఆయన నువ్వు చెప్పేలాంటి డిఫికల్ట్‌ వర్డ్స్ పట్టించుకోలేదా?’’

‘‘కొన్ని ఇంగ్లీషు పదాలకు తెలుగు రాశాడు. కొన్నింటికి రాయలేదు.’’

‘‘ఆ సి.పి. బ్రౌన్‌ను ఓమారు పిలిపించండి. నేను మాట్లాడుతాను. ఇంగ్లీషు – టెల్గూ కమిటీకి ఆయన్నే అధ్యక్షుడిగా చేసి ఈ సమస్యను పరిష్కరించేస్తాను.’’

‘‘నా జ్ఞానాన్ని తమరు క్షమిస్తానంటే ఒక మనవి…’’

‘‘క్షమించేశాను. అదేదో మనవి చేసుకోండి.’’

‘‘సి.పి. బ్రౌన్‌గారు చనిపోయి వంద సంవత్సరాలు దాటిపోయింది!’’

(నాయుని కృష్ణమూర్తి కథకుడు, నవలాకారుడు. పిల్లల కోసం నిఘంటువులు తయారుచేశారు. రామాయణ, భాగవతాలను సరళ తెలుగులో రచించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో విజయవాణి పబ్లికేషన్స్‌, ప్రింటింగ్‌ ప్రెస్సు నిర్వహిస్తున్నారు.)