ఈ గది మూగది

మౌనంలోనే పరీక్ష
మౌనంలోనే ఫలితం
బెంచీకొకళ్ళు కూర్చున్నారు
భోజనానికి సిద్ధమైనట్టు
వాళ్ళ కాపలాదారు కొరకు ఒకరో ఇద్దరో

కంచాలు కాదు కాగితాలు పట్టుకున్నారు
వాళ్ళు పట్టుకున్న కలాల నుండి
చీమలై దూకుతూ అక్షరాలు
బట్ట మీద కుట్టుమిషన్‌ నడుస్తున్నట్టు చేతివేళ్ళు
గీత గీసిన లైన్ల మీద వరుస పెట్టి నడుస్తూ రైలు

మూతి ముడేసిన మౌనముద్ర తపస్సు కన్నా గొప్పది
శ్రవణస్తంభనంతో ప్రాణరహిత ప్రాంతంలో సంచరిస్తున్నట్టు
నిగూఢ రహస్య నిశ్శబ్దం నీడలు సంచరిస్తున్నాయి గదంతా

నిశ్శబ్దం ఎంత సుఖమో అంత భయంకరం
ఆలోచన ఎంత అద్భుతమో అంత అగాధం
మ్రానుపడింది… వాతావరణమంతా
కిటికీలోంచి గాలిరెప్పల రెపరెపలుగానీ
కిటికీ అవతల చెట్టుకొమ్మల మీద
ఆకుల చిలుకల కువకువలు గానీ లేవు
చుట్టూ చతుర్భజాల నిలువెత్తు
గదిగోడలు నాలుగు శవాలై వేలాడుతుంటే
కిటికీలు గుడ్లు తెరిచిన శివశక్తులై
గుమ్మం నాలుక సాచిన కాలికై భయపెడుతుంది
రక్షణ జయమో పరీక్ష భయమో తెలియదు

చుట్టూ తిరిగేవాళ్ళు వాకింగ్‌ చేస్తున్నట్టు
ఇన్విజిలేటర్లో స్క్వాడో తెలియదు
స్తబ్ధంగానే గంటంతో గీస్తూ
రాసేది పరీక్షనో పవిత్రగ్రంథమో తెలియదు
పేజీలకు పేజీలు నింపేస్తున్నారు

అది భవిష్యత్తులో భాగ్యాన్నీ భవితవ్యాన్నీ
ఓ మెట్టెక్కిస్తుందో లేదో తెలియదు
ఇక్కడ మాత్రం మౌనమాయా ప్రపంచం రాజ్యమేలుతుంది
కళ్ళున్న కబోది
వినికిడి ఉన్నా చెవిటిది
నోరున్నా మూగది ఈ గది
నిశ్శబ్దంలో గుండె ఆగుతుంది
నిశ్శబ్దంలోనే ప్రాణం పుడుతుంది