నిన్నటి నుంచి బువ్వ లేదు
బువ్వేమిటి గంజినీళ్ళైనా లేవు
అవ్వ నీరసంగా కుక్కిమంచం మీద
ముడుచుకు పడుకుంది.
ఈ పూటైనా కాసిని నూకలు
ఎలాగో ఓలాగ ఓపిక చేసుకొని
బయటకు వెళ్ళి సంపాదించుకోవాలి
గుడిసె వెనకని ఎండిపోతున్న
వంగమొక్కకి ఓ మెట్టొంకాయ వుంది
దాన్ని కుమ్ములో పెట్టుకొని
నూకల గంజిలో నంచుకు తినాలి.
అవ్వకి నోరూరింది.
దాంతో ఆకలి విజృంభించింది
ఇంతలో బయట ఒకటే కలకలం.
ఒక తల గుడిసె గుమ్మంలోంచి
లోపలికి తొంగి చూసి,
‘ఏయ్ అవ్వా! తొరగా లగెత్తుకు రా
పంచాయితీ ఆఫీసుకాడ నాయకులు
బియ్యం ఇస్తున్నారంట ‘నువ్వూ రాయే’
అని వచ్చినంత వేగంగా మాయమైంది.
అవ్వకి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది
గబగబా లేచి, కర్ర సాయంతో
పరుగులాంటి నడకతో
పంచాయితీ ఆఫీసుకు వచ్చింది
అబ్బో ఏం జనం?? ఏం జనం??
ఎన్నికల కార్యకర్తలు జనాల్ని అదిలిస్తూ
తలో దోసెడు బియ్యం పోస్తున్నారు
గంటసేపు తంటాలు పడగా పడగా
అవ్వ చిరుగుల చెంగులోకి
దోసెడు బియ్యం రాలాయి.
‘హమ్మయ్య! ఈవాళ్టికి పస్తు తప్పింది,
ఈ పూట తిని, మిగిలింది సంజకాడ తినొచ్చు’
చిరుగుల్లోంచి బియ్యం కారిపోకుండా
జాగ్రత్తగా మూటకట్టి ముడివేసింది
చేతికర్ర ఆసరాతో గబగబా అడుగులేస్తూ
గుడిసెకు చేరింది ఆయాసపడుతూ
ఆ తరువాత కార్యక్రమం చకచకా జరిగిపోయింది.
ఎండిపోతున్న వంగచెట్టు నుంచి వంకాయ త్రుంచి
అయిదారు చిల్లులు పొడిచి నిప్పుల్లో, కుమ్ములో పడేసింది
నిన్న ఏరిన మూడు బాదమాకులను విస్తరిలాగా చీపురుపుల్లలతో కుట్టింది.
వేడివేడి అన్నం, వంకాయ పచ్చడి అవ్వకి నోరూరింది
కుమ్ములో కమిలిన వంకాయ తీసి జాగ్రత్తగా తొక్క వలిచి విస్తట్లో పెట్టుకుంది
అన్నం మూకుడు దింపి నిప్పులార్పింది
ఇంతలో బయట మళ్ళీ కలకలం
బిలబిలా గుడిసెలోకి
అయిదారు తెల్ల ఖద్దరు టోపీలు చక్కా వచ్చాయి
‘అవ్వా! ఎవరొచ్చారో చూడు!’
అన్నారు పంచాయితీ ప్రెసిడెంటు
‘నమస్కారం అవ్వా! నేను వినాయకరావుని.
మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా
మీబోటి పేదవాళ్ళకి రెండుపూట్లా
కడుపునిండా తినే భాగ్యం కలుగజేసే
ప్రభుత్వం వచ్చేటట్టు చేస్తాం.
మీ వోటు నాకే వేసి, నన్ను గెలిపించాలి,
నాకు తరతమ భేదం లేదు, మనం అంతా ఒకటే’
‘అదేమిటి?? వంకాయ పచ్చడా? అబ్బా!!
నోరూరుతోంది, ఏదీ నాకు కాస్త పెట్టు!
నేను ఈ పూట ఇక్కడే బువ్వ తింటా’
అని గారాలు పోతూ గునుస్తూ చతికిలబడి
బాదమాకుల విస్తట్లోకి అన్నం వడ్డించుకొని
వంకాయపచ్చడితో నాలుగు ముద్దల్లో
వండిన అన్నం అంతా తినేశాడు
కెమెరాలు క్లిక్‌మన్నాయి
వీడియోలు చిత్రీకరించాయి
వినాయకులు లేచి ‘అవ్వా! నీ చేతివంట తింటే
మా అమ్మ చేతివంట తిన్నట్టే వుంది’
అని మళ్ళీ ఒక నమస్కారం పెట్టి
హుందాగా బయటికి నడిచారు.
‘అవ్వా! నువ్వెంత అదృష్టవంతురాలివి!
సాక్షాత్తూ వినాయకులుగారే స్వయంగా వడ్డించుకుని
నీ యింట్లో అన్నం తిన్నారంటే
అది నీ పూర్వజన్ఞ సుకృతం’
అంటూ ప్రెసిడెంటుగారు బయటికి నడిచారు
అంతా వెళ్ళిపోయారు, గాలిదుమారం ఆగింది.
ఖాళీగిన్నె, ఎంగిలి విస్తరి కేసి చూస్తున్న
అవ్వకి ఆకలి తిరగబెట్టింది. కళ్ళు బైర్లు కమ్మాయి.
ఆరోజు టీవీలో వినాయకులవారి
భోజన ప్రతాపం ప్రసారమయింది.
వారి నిరాడంబరతని వేనోళ్ళ ప్రశంసించారు.
గ్రామప్రజలు తమ ఊరికే ఈ ఘనత
దక్కినందుకు ఆనందపారవశ్యులయ్యారు.
పార్టీ కార్యకర్తలు పొంగిపోయారు.
మర్నాటి కార్యక్రమానికి ఆయత్తమవుతున్నారు.
క్షుద్భాధకు తాళలేని అవ్వ మాత్రం
కుక్కి మంచం మీద ముడుచుకు పడుకొనే ఉంది.