అగ్ని సంస్కారం కోసం

పసిపిల్ల కిరాతకుడి చేతిలో
ఛిద్రమై ధ్వంసమైనపుడు
మార్కెట్‌ చెదర్లేదు కూల్లేదుగానీ
ఆకాశం మాత్రం తప్పక ఆగ్రహించే వుంటుంది
దుఃఖిస్తూ-

అపుడు భూమి విచలించిందన్న నిజాన్ని
అటు డాలరూ ఇటు రూపాయీ
పట్టించుకోలేదు కానీ
పసిపిల్లల్లాంటి పూలు గుర్తెరిగి తెగి
రాలిపడి వుంటాయి తడిగా-

అపుడు పలు ఛానెల్స్‌ పోటీపడి
అమానుష ఘటనను పదేపదే ఫోకస్‌ చేశాయి కానీ
మర్నాడే కుతంత్రాల చాంతాళ్ళ సీరియళ్ళతో
రాత్రి క్రైమ్‌ కథనాల్తో వెర్రి విన్యాసాల్తో
టీఆర్‌పీ రేటింగ్‌ పరుగులో మునిగిపోయాయి

అపుడు దారుణం దారుణం అని
ఉత్తి గొంతుకల్తో నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని
ఊగిపోతూ ప్రకటించారు కానీ
ఆ తెల్లవారే సింహాసనాల కోసం
యాత్రల్నీ, సరికొత్త డెడ్‌లైన్లను
రూపొందించే నాటకీయతలోకి
వడివడిగా మళ్ళిపోయారు

అపుడు మాల్సూ పబ్బులూ మల్టీప్లెక్సులూ
మౌనపడలేదు మూతపడలేదు కానీ
ఇంటా బయటా ఆడపిల్లలకు
కత్తులదారులే మిగిలినందుకు
ఇళ్ళల్లో తల్లులు భయచిత్తులై
‘ఇందుకా కొడుకుల్ని కనేది’ అని
కడుపు తరుక్కుపోయేట్టు రోదిస్తూ
కుప్పకూలారు శోకగర్భాల్తో`
ఐనా ఏమనుకుని ఏం లాభం
అగ్ని చల్లారిన కాలం ఇట్లా కాక
ఇంకెట్లా వుంటుంది

పెంపకాల్లో అగ్ని లేదు
పరిసరాల్లో అగ్ని లేదు
దూరతీరాలకూ భారీ ప్యాకేజీలకు
ఎగరడమొక్కటే నేర్పే
చదువుల వాకిళ్ళలో అగ్ని అసలే లేదు
చేతులు కీబోర్డులకే అంకితమైనాక
పిడికిళ్ళెందుకుంటాయి
సంపాదనలే సర్వస్వాలైన
జీవన ప్రణాళికల్లో అగ్నికి చోటేది

జెండాల ఎజెండాల్లో జీవితాలు కాక
సింహాసనాలే చేరిపోయాక
అగ్ని ఎలా వీస్తుంది విస్తరిస్తుంది
అంతటా సర్దుబాట్ల శీతల ఒడంబడికలు
కుదిరిపోతున్నపుడు
అగ్ని ఎలా బతుకుతుంది
అగ్ని చల్లారిన కాలం
మృతశిశువులాగా కాక ఇంకెలా వుంటుంది

కిరాతకుల్ని క్షణాల్లో బూడిద చేసే
కణకణమండే అగ్నిని తెచ్చేవారి కోసం
ఈ నేల ఎదురు చూస్తున్నది
ఒక్క నేలేనా!
ఆడపిల్లను కన్న ప్రతి తల్లీ
ఎదురుచూస్తున్నది మోదుగుపూల కళ్ళతో!