తన మాట కోసం

పెద్ద పెద్ద నగరాల్లో జట్కాబండి వాళ్ళ కొరడా వంటి నాలుకతో ఎవరి వీపులు చీరిపోయాయో, చెవులు పగిలిపోయాయో, వారికి – అమృత్ సర్ జట్కాబండి వాళ్ళ పలుకులు చల్లటి లేపనమే నంటే నమ్మండి. అదేంటో, పెద్ద నగరాల్లో అంతంత వెడల్పాటి రహదారుల్లోనూ, గుఱ్ఱాల వీపులూ చిట్లగొడుతుంటారు, వాటి తాతమ్మలతో తమకున్న యౌవనసంబంధాలనూ గుర్తు చేసుకుంటుంటారు, పశువైద్యులకు కూడా తెలియని వాటి గుప్తాంగాల వివరాలను తేటతెల్లం చేస్తుంటారు! అంతేనా, బాటసారుల కాళ్ళకు కళ్ళు లేవని జాలి చూపుతుంటారు, వారి పాదాలపై బండి అలవోకగా జార్చేయడమే కాక ప్రపంచంలోని కష్టాలన్నీ తమకేనన్నట్టు ఏకరువు పెడుతుంటారు, తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.

అదే అమృత్ సర్ జట్కాబండి కుటుంబీకుల మాట తీరే వేరు. వారు దారికడ్డొచ్చిన ప్రతీవాడి తోనూ కొండంత ఓపికతో, జాగ్రత్త ఖాల్సాజీ, తప్పుకో అన్నా, కాస్తాగు తమ్ముడూ, దారివ్వవయ్యా, జరుగు బాబూ అంటూ తోపుడు బండ్లు, చెరకు బండ్లు, బాతులు, గాడిదలు ఇంకెన్నో వచ్చి వెళ్ళే ఇరుకుదారుల్లోనే దారి చేసుకుంటూ వెళ్తుంటారు. జీ, సాహెబ్ అనకుండా ఒక్కరినైనా దారిమ్మనడమే? ఇంకా నయం. అలా అని వాళ్ళు కఠినంగా మాట్లాడలేని వాళ్ళేం కాదు, మెత్తగా మాట్లాడుతూనే పదునైన రీతిలో దెబ్బ కొడతారు. ఏ ముసలమ్మయినా వారికి మాటిమాటికీ అడ్డొచ్చిందంటే, తప్పుకో తప్పుకో పెద్దమ్మా, నీ పిల్లలకు నీవంటే చాలా ఇష్టం, వాళ్ళకోసమన్నా నాలుగురోజులుండవా? నీవు చాలా అదృష్టవంతురాలివి, ఇంకా ఆయుష్షుందమ్మా, నా బండి చక్రాలకింది కెందుకొస్తావమ్మోయ్! ఇలా అంటుంటారు.

ఇలాంటి బండ్లను తప్పుకుంటూ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక కూడలిలో ఉన్న కొట్లో కలిశారు. అబ్బాయి పొడుగాటి జుట్టు, అమ్మాయి వదులు పైజమా చూస్తే వాళ్ళు సిక్కులని తెలుస్తూనే ఉంది. అతగాడు వాళ్ళ మామ తలంటుకోడానికి పెరుగు కోసం వస్తే, ఆమె వంటకు వడియాల కోసం కొట్టుకు వచ్చింది. కొట్టువాడు ఎవరో కొత్తవాళ్ళకు సేర్లకొద్దీ అప్పడాలు అమ్మడంలో మునిగి తేలుతున్నాడు.

“మీ ఇల్లు ఎక్కడ?”

“మగర్‌లో. మరి మీది?”

“మాంఝే. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు?”

“అతర్ సింగ్ బ్లాక్‌లో. అక్కడ మా మామ వాళ్ళింటికొచ్చాను.”

“నేనూ మా మామ వాళ్ళింటికి వచ్చాను. వాళ్ళిల్లు గురుబాజార్లో ఉంది.” (నవ్వు.)

ఇంతలో కొట్టువాడు వీళ్ళ సామాన్లు ఇచ్చాడు. తీసుకొని ఇద్దరూ కలిసి నడవసాగారు. కాస్సేపాగి ఆ అబ్బాయి ముసిముసిగా నవ్వుతూ – నీకు పెళ్ళి కుదిరిందా? అనడిగాడు. అమ్మాయి ముఖం చిట్లించి, ఫో! అనేసి పారిపోయింది. అబ్బాయి చూస్తూ ఉండిపోయాడు.

తరువాత కూడా కూరలబండి దగ్గరా, పాలకేంద్రం దగ్గరా రెండు మూడు సార్లు అనుకోకుండా కలిశారిద్దరూ. నెల రోజులపాటూ ఇదే ప్రహసనం జరిగింది. మూడునాలుగుసార్లు అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడగడమూ, అమ్మాయి ఫో! అంటూ పారిపోవడమూ.

ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్ళిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.

2.

“ఇదేం యుద్ధంరా బాబూ, ఖర్మ! పగలూ రాత్రి ఈ కందకాల్లో కూర్చొని కూర్చొని ఎముకలు పట్టేశాయి. లుధియానా కంటే పదిరెట్లు చలి, వాన, పైనుంచి మంచు పడడం! మోకాళ్ళవరకూ బురదలో కూరుకుపోతున్నాము. గెలుపు మాట అటుంచు. ఇక్కడ పరిస్థితి చూడు! గంటగంటకూ చెవులు పగిలేలా పేలుళ్ళతో ఈ కందకాలు కదిలిపోతుంటాయి. భూమి వంద గజాల వరకూ దద్దరిల్లుతుంది. ఈ కందకాల్లోంచి బయటకు పోతే కదా యుద్ధం చేసేది? నాగర్‌కోట్‌లో భూకంపాలు విన్నాము. ఇక్కడ రోజుకు యాభై అరవై అవుతుంటాయి. కందకం బయట కొంచెం అలికిడి అయినా టక్కున తుపాకి పేలుతుంది. ఈ వెధవలు ఏ మట్టిలో దాక్కొనుంటారో, ఏ గడ్డికింద పడుకొని ఉంటారో ఎవరికి తెలుసు?”

“లహనాసింగ్! ఇంకా మూడు రోజులుంది. నాలుగు రోజులు ఈ కందకంలోనే గడిపేశాము. ఎల్లుండి రిలీఫ్ ఆర్ఢర్ వచ్చేస్తుంది. వారం రోజులు సెలవూను. మన కిష్టమైనట్టు హాయిగా కడుపునిండా తిని దర్జాగా పడుకోవచ్చు ఆ ఫ్రెంచ్ ఆమె తోటలో వెల్వెట్ లాంటి మెత్తని పచ్చికబయలుంది కదా. పండ్లు, పాలు కావలసినన్ని తెచ్చిస్తుంది. ఎంత చెప్పినా డబ్బు తీసుకోదు. వద్దు, నా దేశాన్ని కాపాడడానికి వచ్చిన రాజువి నీవు అంటుంది.”

“నాలుగు రోజుల్నించీ కంటిమీద కునుకు లేదు. పారలేక గుఱ్ఱమూ, పోరు లేక సిపాయీ పనికి రాకుండా పోతారు. ఈ తుపాకీ పట్టుకుని మార్చ్ చేయమని కమాండ్ ఒక్కటి వస్తే చాలు, కనీసం ఏడుగురు జర్మన్లనైనా ఒక్కణ్ణే చంపి రాకపోతే నాకు దర్బార్ సాహెబ్ గడప మీద సాష్టాంగపడే అదృష్టం రాకుండుగాక! ఈ గుఱ్ఱాన్నీ ఈ తుపాకులనూ చూసి, ఆ తుచ్ఛుల మొగాలు వెలవెల బోతాయి, కాళ్ళ బేరానికొస్తారు. చీకట్లో అయితే మూడు మూడు మణుగుల గుండ్లు విసురుతారు! ఆరోజు దాడి చేశానా, నాలుగుమైళ్ళ వరకూ ఒక జర్మన్‌ను కూడా వదిలిపెట్టలేదు. వెనకనుంచి జనరల్ సాహెబ్ వచ్చేయమన్నాడు, లేకపోతేనా…!’

“ఔనౌను. నేరుగా బెర్లిన్‌కే వెళ్ళిపోయేవాడివి! కదా!” సుబేదార్ హజారాసింగ్ చిన్నగా నవ్వాడు. “యుద్ధాలు జమాదారో, సోల్జరో చెప్పినట్టు జరగవందుకే. పెద్ద ఆఫీసర్లు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయిస్తారు. మూడు వందల మైళ్ళ దారి! ముందుకే వెళ్ళిపోతుంటే ఎలా?”

“సుబేదార్, నిజమే చెప్పారు. కానీ ఏం చేస్తాం చెప్పండి. కదలకుండా ఉంటే ఎముకలు పట్టేస్తున్నాయి చలికి. సూర్యుడి జాడే లేదు. ఈ గొయ్యికి అటూ ఇటూ పిచ్చి పట్టినట్టుగా అస్తమానం దుమికే జలపాతాలు! ఒక్క దాడి చేసినామంటే వేడి పుట్టదూ!”

“సరేనయ్యా యోధుడా! లే. ఆ చలి కాచుకునే బట్టీ చూడు, బొగ్గులు ఇంకొన్ని తెచ్చివేయి. వజీరా! మీరు నలుగురూ చేద తీసుకొని గోతిలో నీళ్ళన్నీ ఎత్తిపోయండి. మహాసింగ్! సాయంత్రమైంది, ఈ గోతికి కాపలా వాళ్ళను మార్చు.” ఆదేశాలిస్తూ సుబేదారు కందకం అంతా కలియతిరుగుతున్నాడు.

వజీరాసింగ్ ఆ బృందానికే విదూషకుడు. బాల్టీతో నీళ్ళెత్తిపోస్తూ, “ఇదిగో నేను పంతుల్ని. జర్మన్లకు తర్పణం వదుల్తున్నా!” అనగానే కందకం అంతటా గలగలా నవ్వులు! ఉదాసీనత దూదిపింజెలా ఎగిరి ఎటుపోయిందో! లహనాసింగ్ ఇంకో బాల్టీతో నీళ్ళు తోడి అందిస్తూ, “ఇదో, నీ తోటలో కరబూజ మొక్కలకు నీళ్ళు పెట్టు. ఇక్కడున్న నీళ్ళు పంజాబ్ అంతటా కూడా దొరకవు,” అన్నాడు.

ఆహాఁ! మన దేశమే స్వర్గం. నేనైతే ఈ యుద్ధం తర్వాత సర్కార్ ఏ పది సెంట్ల భూమో ఇస్తే పండ్లతోట పెంచుకుంటా!”

“పెండ్లాన్ని పిలిపించుకుంటావా లేక ఆ పాలు పోసే ఫ్రెంచ్ దొరసానితో…”

“ఛ ఛ, ఆపవోయ్. ఇక్కడివాళ్ళకు సిగ్గూ శరం ఉండవు.”

“దేశానికి తగినట్టు అలవాట్లు. ఈ రోజు వరకూ సిక్కులు పొగ తాగరనే విషయాన్ని వాళ్ళు నమ్మనే నమ్మరు. ఆ ఫ్రెంచ్ ఆమె సిగరెట్ తీసుకొమ్మంటుంది. తానే నోట్లో పెడతానంటుంది. నేను వద్దని తప్పుకుంటే రాజు క్కోపం వచ్చిందా, ఇంక నా దేశం కోసం యుద్ధం చేయడం మానేస్తావా అంటుంది.”

“ఔనూ, బోధాసింగ్ కెట్లుంది ఇప్పుడు?”

“బాగుంది.”

“ఆఁ, నాకు తెలీదూ, రాత్రంతా నీ రెండు కంబళ్ళూ వాడికే కప్పావు. నీవా బట్టీ దగ్గరే కాలం గడిపావు. వాడి డ్యూటీ కూడా నీవే చేశావు. నీవు బాగా ఎండ బెట్టుకున్న చెక్కమంచం మీదా వాడిని పడుకోబెట్టావు. నీవీ బురదలోనే తిరుగుతున్నావు. జాగ్రత్త, నీవు జబ్బు పడేవు! ఇక్కడి చలికి న్యుమోనియా గాని వస్తే చావాల్సిందే. చస్తున్నా మురబ్బా కూడా దొరకదు.”

“నా గురించి బెంగెందుకు? నేను బులేలకీ కాల్వ ఒడ్డునే చచ్చేది. కీరత్‌సింగ్ ఒళ్ళో తల పెట్టుకొని ఉంటాను, నా చేతుల్తో నాటిన మా పెరటి మామిడి చెట్టు నీడలో. తెలుసా?”

వజీరా సింగ్ కనుబొమలు ముడేసి తీక్షణంగా “ఎందుకీ చావు మాటలు! ఆ చావేదో శత్రువులైన జర్మన్ తురకలకు రానీ! ఆఁ, భయ్యా, ఏంటదీ,” అంటూ పాట ఎత్తుకున్నాడు.

“ఓహో దిల్లీ కెళ్ళే పిల్లాదానా!
నగలూ నట్రా మాత్రం కాదు,
లవంగాలు గట్రా కొని తేవాలే,
వగలమారీ! గుమ్మడి కూరా
రుచిగా వండి తినిపించావా,
లొట్టలు వేస్తూ తినిపెడతానే.”

ఎవరనుకుంటారు ఈ గడ్డాలవాళ్ళు, సంసారపక్షం వాళ్ళు ఇటువంటి ఒక అల్లరిచిల్లర పాట పాడతారని! కానీ కందకంలో ఈ పాట మళ్ళీ మళ్ళీ పలికింది. సిపాయిలందరూ ఎంత హాయిననుభవించారో! నాలుగు రోజులనుంచీ వాళ్ళు సెలవుల్లో మజా చేస్తూన్నారేమో అన్నంతగా తేరుకున్నారు.

3.

అర్థరాత్రి కావస్తోంది. అంతా చీకటి. స్తబ్ధంగా ఉంది. బోధాసింగ్ ఖాళీ బిస్కట్ల డబ్బాలు మూడు పరచుకొని వాటి మీద తన రెండు కంబళ్ళనూ పరచుకొని పైన లహనాసింగ్ ఇచ్చిన రెండు కంబళ్ళనూ, ఓవర్ కోట్‌నూ కప్పుకొని నిద్రపోతున్నాడు. లహనాసింగ్ కందకానికి కాపలా డ్యూటీలో ఉన్నాడు. ఒక కంట కందకపు ప్రవేశద్వారాన్నీ, ఇంకో కంట బోధాసింగ్ బక్కచిక్కిన దేహాన్నీ చూస్తున్నాడు. బోధాసింగ్ గట్టిగా అరవడం విన్నాడు.

“ఏంటి బోధాసింగ్, ఏమయింది?”

“కాసిని నీళ్ళు ఇస్తావా?”

లహనాసింగ్ లోటాతో నీళ్ళు తెచ్చి తాగిస్తూ, “ఎలా ఉంది ఇప్పుడు?” అని అడిగాడు.

నీళ్ళు త్రాగి బోధా, “వణుకు తగ్గింది. కానీ వళ్ళంతా చలి పాకుతున్నట్టుంది. నోట్లో పండ్లు ఇంకా టకటక కొట్టుకుంటున్నాయి.” అన్నాడు.

“అయ్యో అవునా! సరే, నా జెర్సీ కూడా కప్పుకో.”

“మరి నీవు?”

“నేను బట్టీ దగ్గరే ఉంటాను కదా, వేడిగా అనిపించి చెమటలు పోస్తున్నాయి నాకు.”

“వద్దొద్దు. నేను తీసుకోను. నాలుగురోజుల్నించీ నీవన్నీ నాకే…”

“ఆఁ! అన్నట్టు గుర్తొచ్చింది. నా దగ్గర ఇంకొక జెర్సీ కూడా ఉంది. ఈరోజే వచ్చింది. విదేశాలనుంచీ ఎవరో అల్లి పంపుతున్నారంట అందరికీ. దేవుని దయవల్ల వాళ్ళు బాగుండాలి.” అంటూ తన కోటు, జెర్సీ విప్పసాగాడు.

“నిజమేనా?”

“మరి! అబద్ధమనుకుంటున్నావా?” అంటూ బోధా వద్దంటున్నా జెర్సీ కప్పి మళ్ళీ తన ఖాకీ కోటు, చొక్కా తొడుక్కొని కాపలా కాయడానికి తిరిగి వచ్చాడు. విదేశాలనుంచి ఎవరో జెర్సీలు అల్లి పంపడం అంతా కథే.