శుష్కించిన గోదావరి
డొక్కలు అంటుకుపోయిన కృష్ణ
కుక్కలు చింపిన విస్తరిలా కావేరి
నాయక సమాధులకి నెలవైన యమున
పాపప్రక్షాళనలతో శాపగ్రస్తంగా మారిన గంగ
ఎక్కడ ఏ పాతాళ బంధనాలలోనో చిక్కుకున్న సరస్వతి…
వానాకాలం గుర్తుచేసే వాగులూ వంకలే
మంజీరలూ, పెన్నలూ నాగులేళ్ళూ చంద్రవంకలే
ఇక మన తాత్కాలిక జీవనదులు…
నిస్వార్థజీవి చంద్రికలు
విద్యుదాధార కృత్రిమ దీపికలు…
మెండుగ మ్రోయు గజ్జెలును…
కోరిన విద్యల కెల్ల నొజ్జయై
కంఠోపాఠాలు కంటకప్రాయమైన వైనం
నవయవ్వన వానప్రస్థం
మోటారుసైకిలు చెక్కలబావిలో
గిరగిర బిరబిర
బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేవరకు
వెంటే వెంటిలేటరు
ఎవడికి పట్టింది అంటరానితనమిప్పుడు
భారత రాజ్యాంగగంగలో అంబేద్కరు ఆత్మని
అలవికాని సొరచేపలు మింగినప్పుడు…
దశ తెలియని
దిశ కానరాని కరిమబ్బులు కమ్మినచోట
ఎవరిని అడగాలి దారి
పల్లెల్ని పట్టుకుపోయే ఢిల్లీ సుల్తాన్…
భయం భయం
ముఖం మీద పులిపంజా పడినట్టు…
అమృత్‌సర్ నుంచి అయోధ్య
భగల్‌పూర్ నుంచి భాగ్యనగరం
రక్తసిక్త రహదారులన్నీ కలగాపులగంగా కలిసిపోయి
పౌరాణిక శూద్రఘోష
మంత్రమధు దళితభాష
దొరలూ రాజులూ ద్విజులూ
నవాబులూ ధవళభవన నల్లనయ్యలు…
హిబ్రూలో నెత్తురు ఎర్రగా ఉండదా
వెనీస్ కాలువలకి వర్షంతో పని వుండదా…
దశదిశలా విసరబడిన అసలు మనిషి విత్తనాల
ఆనవాలు ఎన్నడైనా ఎవరికైనా స్ఫురిస్తుందా…
అందరు అవతార పురుషులలో
ఒక్కడైనా తిరిగిరాడే…
దేహాన్ని శుష్కింపజేయగలను కానీ
బుద్ధా, ఆత్మనెలా శుష్కింప చేయడం
ఏమిటి దానికి దారి…
సంకటకంటకమయమైన బాట నుంచి
అష్టాంగ మార్గానికి మరలే సులువేది…
ఏకావతారా… ఓయీ దశావతారా…
ఎవరూ పలకరేం…?