మూడవ అంకం.
(అవంతిక(వాసవదత్త) ఆలోచిస్తూ వస్తుంది)
వాసవదత్త పెళ్ళివారితో నిండిపోయిన ఆ మండువా యింట్లో పద్మావతిని వదిలేసి ఈప్రమదవనానికి వచ్చాను. ఇప్పుడు భర్త లేకపోవడంవల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టుకుంటాను. (కాస్త ముందుకు నడిచి) అయ్యో! స్వామి ఇప్పుడు పరాయివాళ్ళ పాలయ్యాడు. (కూర్చుంటుంది) భర్తలేకుండా జీవించలేని చక్రవాకపక్షి ధన్యురాలుగదా! అటు ప్రాణాల్నీ వదులుకోలేకపోతున్నాను. ఇటు, ఏదో భర్తను చూస్తున్నాలే అనుకుంటూ ఆనందించలేకపోతున్నాను. ఏ అదృష్టం లేకుండా బతుకుతున్నా.
(పువ్వుల్తో చెలికత్తె వస్తుంది.)
చేటి అవంతిక ఎక్కడకెళ్ళింది? (ముందుకు నడిచి చూసి) అమ్మో! ఆలోచనల్తో శూన్యమైన మనస్సుతో, ఈ అవంతిక, మంచుతో కప్పబడ్డ చంద్రరేఖలా, అలంకారాలు లేకుండా, మంగళకరంగా వేషంవేసుకుని ఈ సంపెంగచెట్టుకింద కూర్చుంది. (సమీపించి) ఎప్పటినుంచి వెదుకుతున్నానో నీకోసం.
వాసవదత్త ఎందుకు?
చేటి “అవంతిక ఉత్తమకులంలో పుట్టింది, నేర్పరి, ప్రియమైంది” అంటూ రాణి నిన్ను తెగపొగుడుతున్నారు. అందువల్ల, ఇప్పుడు ఈకౌతుకపుష్పమాలని నువ్వే గుచ్చాలి.
వాసవదత్త ఎవరికోసం?
చేటి మన రాజకుమార్తెకోసం.
వాసవదత్త (తనలో) ఇదికూడా నేనే చెయ్యాల్సి వచ్చిందీ! అయ్యో! దేవుడికెంత దయలేదు!
చేటి అమ్మా! నువ్వు మరోఆలోచనలో పడవద్దు. అల్లుడుగారు మణిభూమిలో అలంకరించుకుంటున్నాడు. త్వరగా గుచ్చాలి.
వాసవదత్త (తనలో) మరొకదాన్నిగురించి ఆలోచించే స్థితిలో ఎలాగూలేను. (పైకి) అల్లుణ్ణి చూసావా?
చేటి ఆ! రాజకుమార్తెకి దగ్గరైనదాన్ని గాబట్టి, నాకున్నకుతూహలంకొద్దీ చూసాను.
వాసవదత్త ఎలా ఉన్నాడు?
చేటి ఏం చెప్పమంటావ్ ? ఇలాటివాణ్ణి ఇంతకుముందెప్పుడూ చూడలేదు.
వాసవదత్త అంత అందగాడా?
చేటి ధనస్సు, బాణాలూ లేని మన్మధుడని చెప్పవచ్చు.
వాసవదత్త ఇంక చాల్లే..
చేటి ఉన్నట్టుండి ఎందుకు ఆపేస్తున్నావు నన్ను.
వాసవదత్త పరాయి మగవాణ్ణి పొగుడుతూంటే వినడం మంచిది కాదు.
చేటి అలాగా! అయితే త్వరగా పూలు గుచ్చు.
వాసవదత్త సరే! గుచ్చుతా గాని ..తీసుకురా.
చేటి ఇవిగో!
వాసవదత్త (చూసి వదిలేస్తూ) ఈ ఓషధి ఏమిటి?
చేటి దీన్ని అవిధవాకరణం అంటారు (విధవ కాకుండా చూచేది)
వాసవదత్త (తనలో) ఇది నాకూ, పద్మావతికి తప్పక గుచ్చవలసింది. (పైకి) మరి ఈ ఓషధి ఏమిటి?
చేటి దాని పేరు సపత్నీమర్దనం. (సవతుల్ని చితక బాదేది).
వాసవదత్త అయితే గుచ్చక్కర్లేదు.
చేటి ఎందుకు?
వాసవదత్త అతనిభార్య చనిపోయింది గనక అనవసరం.
చేటి త్వరగా అమ్మా! అల్లుణ్ణి మ్తుౖతెదువలు అంతఃపురంలోని చతుశ్శాలలోకి తీసుకెళుతున్నారు.
వాసవదత్త నా ఆలస్యం ఏంలేదు. ఇదిగో తీసుకెళ్ళు.
చేటి బాగుంది. ఇక నేను వెళతాను. (వెళ్ళిపోతుంది)
వాసవదత్త అమ్మయ్య! ఇది వెళ్ళింది. స్వామి పరాయివాళ్ళ పాలయ్యాడు. నాకన్నీ కష్టాలే గదా! నేనుకూడా మంచమెక్కి పడుకుని నాదుఃఖాన్ని మర్చిపోతాను. (వెళ్ళిపోతుంది)