నృపాలంలో ఎండాకాలం

“గజగామిని” సినిమా చూసొచ్చిన నా మిత్రుడొకడు “తన్వీ శ్యామా..” శ్లోకం చదివబడ్డ తీరుకి ముగ్ధుడై దాని అర్ధం ఏమిటని అడిగాడు. చెప్పగానే, “ఆ సీన్‌లో ఉండవలసింది మనీషా కొయిరాలా” అంటూ తన రసికతని వెళ్ళగక్కాడు. కాళిదాసు అక్కడ వర్ణిస్తున్నది నేపాల్‌కి దగ్గర్లో ఉన్న అమ్మాయినే అని నేను చెప్పగానే తన ప్రతిభకి ఇంకా మురిసిపోయాడు.

కాళిదాసు నృపాలదేశం (ఇప్పటి నేపాల్‌, చుట్టుపక్కలు) వాడనే ఒక వాదం ఉంది. దానికి చాలా ఆధారాలు అతని కవిత్వంలో చూపించారు. వాటిల్లో ఋతుసంహారం నుంచి ఏమీ తీసుకున్నట్టు లేదు. ఋతుసంహారం విషయానికి రాగానే “కుర్ర కాళిదాస”నో “పడగ్గదులకే పరిమితమయ్యాడ”నో అన్నవాళ్ళే ఎక్కువ. నా దృష్టిలో అతను డబ్బున్నవాళ్ళ గురించి రాసాడు. వాళ్ళు పడగ్గదుల్లో ఉంటే పడగ్గదుల్లో ఉన్నాడు. బయటకొస్తే వాళ్ళతోబాటు బయటకొచ్చాడు. ఋతుసంహారంలో ఇది కొట్టవచ్చినట్టు
కన్పిస్తుంది. విపరీతమైన మంచూ, చలీ, ఆ తర్వాత వచ్చే ఎండా.. ఇవన్నీ చూస్తే ఆతను ఋతుసంహారానికి ఎంచుకున్న ప్రదేశం హిమాలయాల పాదాల దగ్గరున్న ప్రదేశమేమో అనిపిస్తుంది. అది అతని స్వదేశమా కాదా అన్నది వేరే ప్రశ్న.

“అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”
అని తన కధానాయకుడు శ్రీ రాముడి ద్వారా ఎలుగెత్తి చాటినవాడు, మరొక భూమిని ఇలాంటి కావ్యానికి వస్తువుగా తీసుకుంటాడా? అని అనిపించడం సహజం.

ఏదైతేనేం .. అతని కావ్య భూమిలో …..
వసంతకాలం అయిపోయింది. మన్మధుడి విజృంభణ ఆగిపోయింది. తీవ్రమైన ఎండ,అందమైన చంద్రుడు, తగ్గిపోతున్న నీరు, దాంట్లో మునకలేస్తూ స్నానాలు, హాయిగొలిపే సాయంకాలాలు.. ఎండాకాలం వచ్చేసింది.

వెన్నెళ్ళు వెదజల్లే రాత్రుళ్ళు, విచిత్రమైన జలయంత్రాలతో ఉన్న మేడలు, ఆ మేడలమీద మణులు పొదిగిన అరుగులు, చల్లనిగాలి, తీసిన మంచి గంధం  .. ఇవీ ఇప్పుడు ప్రజలకి కావలసినవి.

ఆ మిద్దెలు, గాలీ, సువాసనతో కూడిన పన్నీరు, మనసుకి హాయినిచ్చే వీణపాటలు, ప్రియుల నోటినుంచి వచ్చే మధువుల
వాసన.. ఇవన్నీ వాళ్ళ వేసంగి వేడిని తగ్గిస్తునాయి.

తాజాగా ఉండడం కోసం తలంట్లు పోసుకుంటున్నారు. తలలకి రుద్దుకున్న ధాతువులు, ఒంటికి పూసుకున్నమంచిగంధం…. పరిమళాల్తో పరిసరాలు నిండిపోతున్నాయి. పల్చని బట్టలు, అవి ఒంటిమీంచి జారిపోకుండా వడ్డాణాలు, చల్లదనం కోసం
మెడల్లో ముత్యాల హారాలు..

అతి లావణ్యమైన పాదాలు, పాదాలమీద లాక్షారసంతో (గోరింటాకు లాంటిది) అలంకరణా, వాటిమీద మువ్వల పట్టీలు, వాటి
సవ్వడీ..  అంతా కోలాహలంగా ఉన్నారు..

ఒంటికి చెమట పట్టినప్పుడల్లా, ఇంకా పల్చని బట్టలు కట్టుకుంటున్నారు.

అడవుల్లో జంతువులు నాలుకలు పిడచకట్టుకుపోయి బాధపడుతూ దూరంగా కనిపించే నీలాకాశాన్ని చూసి నీరోమో అనుకుని భ్రమపడుతున్నాయి.

ఎండవేడి తట్టుకోలేక తల కిందకి పెట్టుకుని ప్పములు మెల్లగా నెమలి నీడలో తలదాచుకుంటోంది. ఈ ఎండల తాపానికి నెమలికూడా దాన్ని పట్టించుకోవటల్లేదు

పక్కనే ఉన్న ఏనుగుని శక్తి ఉడిగిన సింహాలూ చంపడానికి కూడా ప్రయత్నం  చెయ్యడం లేదు. వాటి ఒగర్పులకి జూలు అటూఇటూ ఊగుతోంది. ఏనుగులు కూడ దప్పికతో నీళ్ళ కోసం అటూఇటూ తిరుగుతున్నాయి. పక్కనే సింహాలున్నా అవి భయపడ్డం లేదు.

ఇలాగే కప్పల్లు పాములకి భయపడటల్లేదు. అడవి పందులు, లేళ్ళు, ఎద్దులు, పక్షులు, కోతులు .. అన్నీ దప్పికతో నీటికోసం వెతుక్కుంటున్నాయి. వేడి అన్నివర్గాల్లోనూ నీరసం కలిగిస్తోంది. వేడివల్ల ఆకళ్ళు కూడా వెయ్యటల్లేదు. అడవంతా ఎర్రని పూలచెట్లతో ఉందా అనిపించే విధంగా అడవిలో మంటలు రేగుతున్నాయి. క్షణాల్లో రాజుకుని, కొండల దిశగా, రెల్లుగడ్డిని
దారిగా చేసుకుని పరుగెడుతోంది ఆ దావాగ్ని. దాన్నిచూసి పశువులు హాహాకారాలు చేస్తున్నాయి. ఈ మంటల హడావుడిలో వాటి వైరాల్ని మర్చిపోయి అన్ని జంతువులూ నదుల్నీ, నీటివనరుల్నీ వెతుక్కుంటూ స్నేహితుల్లా మెలుగుతున్నాయి.

ఇలాంటి ఈ ఋతువులో సుఖమైనదేమిటో తెలుసా? మంచి సుగంధాలు వెదజల్లే తామరపువ్వులున్న కొలనులో స్నానం చెయ్యడం, రాత్రి చల్లని వెన్నెల్లో ముత్యాలహారాలు, పూలదండలు వేసుకుని సేదదీరడం, అందమైన అమ్మాయిలు సంగీతం వినిపిస్తూంటే చక్కగా సుఖించడం….


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...