అద్వైత దర్పణం

మనది కానిది
కోల్పోవడంలో బాధ,
మనదైన దాన్ని
నిర్లక్ష్యం చేయడంలో ఆనందం,
రెండూ రంగరించిన రాగంలో
నిష్కృతిలేని సంగతుల్తో
వాయులీన తంత్రులపై
నగ్న గానం చేస్తూ
మనం నర్తించ లేదూ?

కలవని మన చేతుల్ని
జీర్ణ పతాకాల్లా ఎగరేస్తూ,
గుండెల్ని మూసి పట్టుకొని,
మన వేదికల మధ్య
సూర్యకాంతిలో మిలమిల్లాడే
సుందర ప్రకృతికి
పులకించి పోయినట్లు,
ఎన్ని ఊసులాడలేదూ?

పగులుతున్న కనురెప్పలు,
ఉబికివచ్చే ధారలతో
అతుక్కుంటున్నట్లు
ఇన్నేళ్ళూ
యోగనిద్ర నటించలేదూ?

మనలో
ఒకరుంటే చాలు
వేరొకరున్నట్లే…

(“రిల్‌కే” రచనలు కొన్ని ఈ కవితకు స్ఫూర్తి కలిగించాయి.)


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...