సొరంగానికా చివర

“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్‌ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు రాఘవ.

“కళ్ళులేనివాడంటున్నావ్‌. ఏం చూస్తాళ్ళెద్దూ. పైగా నన్ను కూడా చూడనివ్వడు.”

“అసలు నేనే ఆయన్ని తీసుకెళతానని మాటిచ్చా. సుధకి ఒంట్లో బాగులేక కాని .. లేకపోతే, ఐ లవ్‌ టు డూ దట్‌”.

రాఘవ సహాయ కార్యక్రమాలు గట్రా ఎవరికి తెలియనివి? వాడికి సంఘసేవ ఆరో ప్రాణం. జీవితా న్నీ, ప్రపంచాన్నీ “టేకెన్‌ ఫర్‌ గ్రాన్టెడ్‌” అనుకునే నాలాటివాడికి ఇలాంటి బలవంతపు అవకాశాలొస్తేగాని సంఘసేవ చేసే అవకాశం రాదు. కాని ఒప్పుకుంటే ఇరుకున పడతానేమోనని భయం.

“నీకు ఇబ్బందేననుకో. ఏదైనా అడిగితే సమాధానం చెప్పు. ఆయన ప్రశ్నలెక్కువే వేస్తాడనుకో.. కాస్త విసుక్కోకుండా గైడ్‌ చెయ్యి. ఆరతి ప్రోగ్రామ్స్‌ చాలానే చూశావుగా. ఈ ప్రోగ్రాం కొత్తరకంగా చూస్తాననుకో.. సరిపోతుంది.”

తప్పక సరేనన్నాను.

“గో విత్‌ ఏన్‌ ఓపెన్‌ మైండ్‌.” భద్రంగారి వివరాలిస్తూ కన్నుగీటాడు రాఘవ.

తెల్లని మల్లెపువ్వులాంటి లాల్చీ, పొత్తు పంచ, తళతళలాడే రాళ్ళ ఉంగరాలు, పాపిడితీసి దువ్విన పల్చని జుట్టు, డబ్భయ్యోపడిలో పడి ముడతలు పడ్డా నిగారింపున్న ఒళ్ళు, కొనదేలిన ముక్కు, నుదుటబొట్టు, చలవకళ్ళద్దాలు; మనిషి హుందాగా ఉన్నా రాయన.

“మీకిది శ్రమ కాదుగదా! నాకు తెగ ప్రశ్నలడిగే అలవాటుంది. రాఘవ చెప్పాడోలేదో.” మృదువైన మాట. రాఘవ అంతా చెప్పాడని భరోసా ఇచ్చాను, ఇక మొదలుపెడతారులాగుంది అని లోలోపల అనుకుంటూ.

ఆటోలో వెడుతున్నంతసేపూ ఏమీ మాట్లాడలేదు. హాయిగా ఉందిలే అనుకున్నా. అడపాదడపా ఆయన కండువామీదనుంచి వచ్చే కునేగా సెంటు ఆహ్లాదకరంగా ఉంది. అందరు ముసలాళ్ళలా లేడులే అనుకున్నాను.

ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియమ్‌. ప్రేక్షకుల కోసం విడివిడిగా టేబుల్స్‌ వేసారు. నృత్యకార్యక్రమం తర్వాత భోజనం. ఒక టేబుల్‌దగ్గర కూర్చోపెట్టా. “పరిసరాలెలా ఉన్నాయి? నచ్చాయా?” మెల్లగా అడిగారాయన.

“ఆడిటోరియమ్‌, అలంకరణా చాలా బాగున్నాయి” ముక్తసరిగా అన్నాను.

“బాగున్నాయంటే సరిపోతుందా?” చిరునవ్వుతో కళ్ళజోడు సర్దుకుంటున్నారు సంఙ్ఞగా.

“చల్లని సాయంకాలం. ఆడిటోరియమ్‌ కొండమీద ఉందేమో.. మంచి సిటీ వ్యూ, సూర్యాస్తమయం. థియేటర్‌ వెనక దూరంగా గోల్కొండ ఖిల్లా. సాయంకాలపు వెలుగులో ఆ దూరదృశ్యం చూస్తూంటే, థియేటర్‌ వెనక్కాల వేసిన పెయింటింగ్‌లా ఉంది. మన చుట్టూ తురాయిచెట్లు విరగబూసాయి. సాయంకాలం ఎండలో తడుస్తున్న ఈ పువ్వులు మరింత ఎర్రగా ఉన్నాయి.” నవలా రచయితలా
మాట్లాడుతున్నా. కొంతసేపటికి నా కంఠం నాకే ఎబ్బెట్టుగా ఉంది.

కాళ్ళతో లాన్‌ని రాస్తున్నారాయన.

“పచ్చని లాన్‌ మీద తురాయి పువ్వులు పడి తివాసీ మీద డిజైన్‌లా ఉంది” నవ్వొచ్చింది నాకు.

“ఎందుకు నవ్వుతున్నారు?”

“మన పక్కన కూర్చున్నవాళ్ళని కూడా వర్ణించమంటారేమోనని”

“మీరు నవ్వి ఉండకపోతే అదే అడిగేవాణ్ణి.” ఆయన ముఖంలో ఏ మార్పూ లేదు. నీరెండకి ఎర్రబడిందంతే. ఏదో మబ్బు అడ్డు వచ్చినట్టుంది. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది.

పక్క టేబుల్‌ దగ్గర కూర్చున్న కుటుంబాన్ని గురించి నాకు అనిపించింది చెప్పా. జలతారంచుల గాగ్రా చోళీలో మెరిసిపోతున్న సుందరి కంఠం మీద కనబడుతున్న ఇంద్రధనస్సు వరకూ వెళ్ళిన వివరం, దాని గురించి చెప్పకుండానే ఆగిపోయింది. వయసు అడ్డు వచ్చింది చెప్పడానికి.

నేను ఇలాంటి ప్రోగ్రామ్స్‌ విడవకుండా చూస్తాను. అయితే, సాధారణంగా ఏదో ఒక పుస్తకం తెచ్చుకుని ప్రోగ్రాం మొదలయ్యేవరకూ చదువుకుంటూ కాలం గడుపుతా. ఎప్పుడైనా తెలిసినవాళ్ళో, అందమైన అమ్మాయో కనిపిస్తే దృష్టి మరల్చడం తప్ప .., ఇదే నా రొటీన్‌.

తర్వాత విడతలో రంగస్థలం ఎలా ఉంది? దానిని వర్ణింపుము లాంటి ప్రశ్నలయ్యాయి. విసుగ్గా ఉన్నా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నాను.

“ఇప్పుడు మన పక్కనుంచి నడిచి వెళ్ళిన అమ్మాయి కాలి పట్టీలు ఎలా ఉన్నాయి? ఒంటి వరసా? లేకపోతే, వలలా సస్పెన్షన్స్‌ ఉన్నాయా?”

“వావ్‌” అనుకుంటూ “వలల్లాగే ఉన్నాయి. ఎందుకడిగారూ?” ఆ అందెల సవ్వడి కూడా ఆయన పట్టించుకోవడం ఆశ్చర్యమనిపించింది.

“ఆ నడకలో గొప్ప లయ ఉంది. ఆవిడే ఆరతి కాదుగదా?”

అజంతా శిల్పంలాంటి ఆ గాగ్రా చోళీ సుందరి కేటరింగ్‌ వాళ్ళతో ఏదో మాట్లాడుతోంది లావణ్యంగా
వేళ్ళు తిప్పుతూ. నీరెండలో ఆ అమ్మాయి చెవి రింగుల్లో రాళ్ళు తళుక్కుమంటున్నాయి కళ్ళు చెదరగొడుతూ.

ఆయనకి సమాధానం చెప్పలేదన్న మాట మరిచిపోయాను.

ముందు సాయంకాలవర్ణన, తర్వాత పుర వర్ణన, తర్వాత పురస్త్రీ వర్ణన … ఏమిటో మనసు మహాకావ్యం రాస్తున్నట్లుంది. ఆ ఫీలింగ్‌ రాగానే నా వాగ్ధాటి పెరిగింది. “ఈ కొండమీద ఒక చిన్న పాన్డ్‌ తవ్వి పిస్టియా పువ్వులు వేసారు.” మళ్ళీ అందుకున్నాను.

“అవును బాతుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి.. అది సరే .. ఆ గాగ్రా చోళీ అమ్మాయి గాజుగాజులేసుకుందా?” కొంటెగా నవ్వుతున్నారాయన. అమ్మాయిల ప్రస్తావన నాకిష్టమని ఆయనకి తెలిసిపోయినట్టుంది.

అజంతా సుందరి నుదుటిమీద పడ్డ ఉంగరాలజుట్టు సర్దుకున్నప్పుడల్లా, ఆ గాజుగాజులు మెత్తగా నీళ్ళు జారిపడుతున్నట్టు ఒక వింత శబ్దం చేస్తున్నాయి. ఆయన అడిగేవరకూ నేనది గమనించనేలేదు.

కార్యక్రమం మొదలైంది. ఆరతి అద్భుతమైన డాన్సర్‌. తగ్గట్టుగానే నట్టువాంగానికి మంచి ఆర్టిస్స్ట్‌ వచ్చారు. వీణ, వయొలిన్‌, వేణువు.. చక్కగా వాయిస్తున్నారు.

మొదటి రెండు ఐటమ్స్‌ అయేవరకూ భద్రంగారేమీ మాట్లాడలేదు. నాకేదో వెలితిగా అనిపించినా డాన్స్‌లో లీనమై ఎక్కువగా ఆలోచించలేదు దానిగురించి. సంగీతం వింటూ ఆనందిస్తున్నారేమోలే అని సరిపెట్టుకున్నాను.

మూడవ నృత్యం మొదలవగానే అడిగారు, “ఆరతి ఏ రంగు దుస్తులు వేసుకుంది?” అని. ఆయన మాట నాకే వినిపించలేదు. అంత మెల్లగా మాట్లాడుతున్నారాయన. నేను కూడా సాధ్యమయినంత మెల్లగా సమాధానం చెప్పాను. ఆ రంగుకీ, ఆ పాటకీ, భావానికీ సంబంధం ఉందన్నారు. అలా.. సంగీతానికీ, నృత్యాలకీ, భావానికీ, గీతానికీ, అభినయానికీ ఉన్న సాపత్యం అర్ధంచేసుకోడానికన్నట్టు ఎన్నో ప్రశ్నలు వేసారాయన. ఒక క్షణంలో ఉక్కిరిబిక్కిరయాను. ఆయన ప్రతీ ప్రశ్న నన్ను ఆలోచింప జేస్తోంది. నాకు తెలియకుండానే ఎంతో మెలకువగా, లోతైన సమాధానాలిస్తున్నాను. నిజానికి అదివరకెన్నో ప్రోగ్రామ్స్‌ చూసా. కాని.. నాలో ఈ పరిశీలన లేదు. ఈ స్పందన లేదు. అప్పటికీ, ఇప్పటికీ రసానుభూతిలో భేదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
సంగీతంలో కొత్త అర్ధాలు, నృత్యంలో కొత్త హొయళ్ళూ ఆస్వాదించడం ఆయన ప్రశ్నలు నాకు నేర్పుతున్నాయి.

ఒక్కొక్కసారి “ఆరతి ఎలా చేస్తోంది” అని అడగకుండా “ఇలా చేస్తోందా?” అంటూ తన ఊహల్ని జోడిస్తున్నారు. రాగతాళాలు మారినప్పుడల్లా టేబుల్‌పైన ఆయన వేళ్ళ నృత్యంలో మార్పులు, స్టేజ్‌ మీద ఆరతి పదవిన్యాసం కనా ఉన్నతంగా, భిన్నంగా ఉన్నాయి.

ఈ అనుభవం వింతగా తోస్తోంది నాకు. కొత్త అనుభూతి. ఇన్నాళ్ళూ నాలో అగమ్యంగా, అస్తవ్యస్తంగా ఉన్న భావాలకి రూపాలు వచ్చాయి. నా గుండె కోటలో కొత్త గదుల్నీ, వాటిలో అమూల్యమైన సంపదల్నీ కనుక్కుంటున్నాను.

నృత్యగీతం చివరికొస్తూండగా భద్రంగారి ప్రశ్న “మన పక్కనున్న అమ్మాయి కాలిమీద కాలు వేసుకుని కూర్చుందిగదూ!” ఏమిటీయన ప్రశ్న? ఏమిటీ రసాభాస? ఇంతవరకూ రసగంగలో తేలిన వ్యక్తేనా? పాట ఆగిపోయింది. ఎప్పుడు కుర్చీ మారిందో నా పక్కన అజంతా సుందరి. నిజమే.. కాలుమీద కాలేసుకుని కూర్చుంది. ఈయనకెలా తెలిసింది? జుట్టు సర్దుకుంది జలపాతాల సంగీతంతో. అదేసమయంలోనే కండువా సర్దుకున్నారు భద్రంగారు. వెన్నెట్లో పరిమళాలు వెదజల్లబడ్డాయి.

ప్రోగ్రాం మళ్ళీ మొదలయింది. ఈసారి పాటలో అంతర్లీనంగా చిరుమువ్వలు తాళబద్ధంగా వినబడుతున్నాయి. కళ్ళు పైకెత్తకుండా అజంతా సుందరి కాళ్ళవంక చూసాను. పాదాల్ని లయబద్ధంగా ఊపుతోంది. పచ్చని పాదాలపైన మెరుస్తున్న వెండి పట్టీలు. చివర్న వేళ్ళాడుతున్న మువ్వలు. ఓ! ఇంతసేపూ తాళం వేస్తోందన్నమాట!

నాకు నృత్యం, సంగీతం, మువ్వల సవ్వడికి హిప్నొటైజ్‌ అయిపోతున్నట్లనిపిస్తోంది. ఆరతి
పాదాలు అందలేని అంచుల్ని అందుతున్నట్టున్నాయి. వివిధ ఋతువుల్లో వివిధ భంగిమల్లో కదిలే లేత తమలపాకుల్లా ఉన్నాయి ఆ పాదాలు. భద్రంగారి ప్రశ్నలు తగ్గి పోయాయి. అడపాదడపా ఒకటీ, రెండూ.. నేను పూనకం వచ్చిన వాడిలా సమాధానమిస్తున్నాను.

ఎంతసేపయిందో తెలియదు. “రండి! భోజనానికి ముందుండాలి” భుజం తడుతున్నారు భద్రంగారు. ప్రోగ్రాం అయిపోయింది. చెవులు అదిరిపోయేలా చప్పట్లు. ఇహలోకంలో పడ్డట్టుంది. “అప్పుడే అయిపోయిందా?” అడగబోయి సిగ్గుపడి అడగలేదు. అజంతా సుందరి కోసం వెతికాయి నా కళ్ళు. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కిసుక్కని నా వంక చూస్తూ నవ్వింది తన కళ్ళూ మూసి తెరుస్తూ.

అప్పుడర్ధమైంది.. ఆ మువ్వల హిప్నాసిస్‌లో పడి ఇంతసేపూ కళ్ళు మూసుకుని కూర్చున్నాననీ, అలాగే ఆయన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాననీ..

భోజనాల సమయంలో, ఎన్నో సార్లు ఆ విషయం భద్రంగారికి చెపుదామని నోటిచివరి వరకూ వచ్చింది కాని, అంత ముఖ్యమైనది కాదులే అనిపించి చెప్పలేదు. అవాక్కయిన నా మనసుకి అంతకన్న ముఖ్యమైన విషయాలెన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. కాని మాట్లాడలేకపోయాను.

చెవుల్తో చూసే ముని .. ఆయనకి అన్నీ చెప్పాలా? నా మౌనం అర్ధమయినట్లు ఆయన మళ్ళీ నన్ను మరో ప్రశ్న వెయ్యలేదు.


రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...