మలిపలుకు

ఈ “శిలాలోలిత” అనుభూతి, నాది. ఈ “శిలాలోలిత” హృదయం, నాది. ఈ “శిలాలోలిత” గొంతు, నాది కాకపోవచ్చు. ఈ “శిలాలోలిత” భావాలు, నావి కాకపోవచ్చు.

నేను ఎవరి రచనైతే చదివీచదివీ స్వప్నించి అనుభవించి లీనమయ్యానో, ఆ భాషే ఆ భావాలే నాలో యింకి నా సొంతమయ్యాయి. (అదే వ్యక్తి ఈ కవితలన్నిటినీ ఎడిట్ చేసి సరిచేసారు.)

ఈ గొంతు నా సొంతం కాదని మీరంటే సంతోషంగా ఒప్పుకుంటాను. నాకు రాయటం రాదు. ఏదో ఆవహించినట్లుగా ఒక్కో క్షణంలో అమాంతం రాసేస్తాను. ఇవన్నీ (1979)వొకే సంవత్సరంలో రాసినవి.

కానీ నేనేం రాస్తున్నానో నాకు తెలుసు. నేనెందుకు రాస్తున్నానో నాకు తెలుసు. అది ఈ రచనల్లో మీక్కూడా అనిపిస్తే “ఐతే నేనూ పర్లేదన్నమాట” అని మురిసిపోతాను.

ప్రపంచ మహాతత్వవేత్తల్లో వకడైన బ్రిటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూం తొలి గ్రంధం అచ్చయ్యాక ఎవరూ గమనించనే లేదు. It fell dead-born from the press — అని చమత్కరించుకున్నాడు. అలా, గొప్పవాళ్ళ మహర్దశ నాకు పట్టగూడదని అల్పసంతోషిగా ముగిస్తాను.

రేవతీదేవి
స్వప్న నిలయం
బడబాగ్ని రాత్రి
జనవరి 30, 1980

-*-*-*-

29-1-81… మీదగ్గర నుండి చాలా కాలానికి ఉత్తరం వచ్చిందనే సంతోషంతో కవరు చించగానే చీకటిమాటలు కనిపించటంతో యింకా ముందుకు చదవలేక కళ్ళు మూసుక కొంత సేపు కూచున్నాను. కల అయివుంటుందేమో అని కొంతసేపు సంశయించాను. కల కాదని తేలింది.

రేవతీదేవి ఇక ఈ పార్థివ జగత్తులో లేదు. ఆమెకు ఈ పార్థివ జగత్తు చిన్నదై నందున దీన్ని వదలి అపార్థివ జగత్తుకు పయనించింది! అరవిందుడు తన “Savitri” కావ్యంలో సావిత్రి గురించి అంటాడు: “She made earth her home for whom heaven was too small.” ఇక్కడ ఆ వాక్యాన్ని మనం తల్లకిందులు చేసి చెప్పుకోవలసి ఉంటుంది: “Revati made celestial globe her home for whom the terrestrial globe was too small.” అని.

ఆమె కావ్యానికి ముందుమాట వ్రాశాను. ఆమెను నేను చూడకుండా ఆమె నన్ను చూడకుండా, తన కావ్యాన్ని అచ్చులో చూచుకోకుండా ఈ మన్నుని వదలి మిన్నులోకి పయనించింది శాశ్వితంగా. అంతటితో ఆమె రచన మాత్రమే కావ్యం కాక ఆమె జీవితమే ఒక కావ్యంగా రూపొందింది. ధన్యజీవి! ఆమెకు మనం దగ్గరైనందుకు మనం కూడ ధన్యులం.

ఆమె తరఫు వారందరకీ నా స్వాంత్వనలు.
మీ సంజీవదేవ్

-*-*-*-[ఈ క్రిందది యీ పుస్తకానికి, ఆమె భర్తగారు అభిలషించిన సంస్మరింపు సమర్పణ]

17-2-1981

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
యస్.వి.యూనివర్సిటి, తిరుపతి.

తనదంటూ యొక ప్రత్యేకతను కాంక్షిస్తూ అందరికన్నా మిన్నగా ఉండాలని (ఉంటూ), అన్ని బాధలకు మరణమే నివారణమని నమ్ముతూ, ఏ చిన్న బాధను తట్టుకోలేక సతమతమవుతూ, పుట్టుక-చావుల మధ్య ఏమీ లేదంటూ, ఏమైన ఉన్నదేమోనని అన్వేషిస్తూ, ఏమైనా ఉందో లేదో సరిగ్గా రఘుకు వివరించకుండానే …….

తను ఏదైనా చెయ్యగలనని నిరూపించుకోవటానికే వ్రాసిన యీ గేయాల ప్రచురణ బాధ్యత ఎంతో సంతోషంగా స్వీకరించిన తన గురువుగారితో “మాస్టారూ, నా పుస్తకం అచ్చులో చూస్తానో లేదో …” అంటూ — చూడకుండానే …..

నాన్నే తను, తనే నాన్న అని “భ్రమిస్తూ”, తన భావోద్వేగాలన్ని పంచుకొన్న భర్త, తన కోసమేనన్నట్లు బ్రతుకుతున్న తల్లి ఎట్లా మనగలరో క్షణం తలపక, నాన్నకి పరలోక స్వాగతం జ్యోత్స్న సరిగ్గా పలుకుతుందో లేదోనని నా రేవతి నక్షత్రంగా ……

డి. రఘురామిరెడ్డి.