చిట్లని నీటిబుడగ

నేను పుట్టినప్పుడు నా చుట్టూ
సౌందర్యమూ ఐశ్వర్యమూ అధికారమూ
అందరి ప్రేమానురాగమూ
ఇప్పటికీ

నా వేలికి గుండుసూది గుచ్చుకుంటే గుండెలో చురకత్తి దిగబడినట్లుగా
కరెన్సీనోట్లబొత్తులూ రాజకీయప్పలుకుబడులూ
ఉద్యోగాధికారాలూ అసాధారణవైద్యవిజ్ఞానమూ
బంధుకోటీ మిత్రబృందాల అందరి ఆర్ద్రతా
ఇప్పటికీ

సరదాగా జాలీజాలీగా సంతోషంగా నవ్వులు చిందిస్తూ
అన్నింటి లోంచి అందరి లోంచి నాలోకి
అందరికీ తెలిసిన నేను ఎవరికీ తెలీని నాలోని నాలోకి
జాలిజాలిగా నిర్వాణవిషాదంగా అదృశ్యాసృధారగా
అలాఅని ఈ నామరూప సంఘాతాన్ని విప్పాలనీ అనిపించలేదు

అన్నీ ఉన్న ఏమీలేని మానసం లోంచి
ఎవరికీ యివ్వని ఏదీ తీసుకోని మనసు లోంచి
ఏదో ఎప్పుడో ఎక్కడో

ఈ మాయపొరలు చీల్చమనీ ఈ ఇహావధుల దాటమనీ
షడ్దర్శనాలన్నప్పుడూ నాకేమీ అనిపించలేదు కానీ

ఏమీ అనని ఏదీ అనిపించని ఏదో
ఏదో ఏదోలేనట్లు ఏదో ఛాయ
ఎప్పటిదా ఛాయ ఎక్కడిదా భావం
నిన్నటిదీ మొన్నటిదీ కాదు
చిననాటిదీ కాదు

చిన్ననాటి కంటె వెనకటి అనాది యవ్వనంలో రసజ్వలించిన
ఎప్పుడో తెలీని ఏదో తెలీని ఎప్పటిదీ కాని
త్రికాల పరివేష్టిత వర్తమానం కాబోలు

ఏదో ఎందుకో తెలీని అందుక్కాకపోతే
ఈ నీటిబుడగజీవితాన్ని
నిమిషమాత్రపు నీటిబుడగను చిదిమితే ఏం

కోటికోట్ల క్షణికాల నిమిషం ఎంతకీ అంతమవని అనంతంలా
ఏం చిదిమితే ఏం

అనిర్వచనీయ అమూల్య అపూర్వ
పితృవాత్సల్యానురాగ సమశీతోష్ణంలో
ఆవిరవ్వని గడ్డకట్టని ఈ నీటిబుడగని
అందాకా ఆగే చిదిమితే మాత్రమేమిటి
ఆందుకే ఎందుకైనా అందాకా ఎందుకు ఆగకూడదు