గడి-నుడి 7 సమాధానాలు

గడినుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు:

  1. పం.గో.కృ.రావు
  2. రవిచంద్ర ఇనగంటి
  3. సుభద్ర వేదుల
  4. కె. వి. గిరిధరరావు
  5. సుధారాణి

ఒక తప్పుతో సమాధానాలు పంపినవారు: పి. సి. రాములు, సూర్యప్రకాశ్.

గమనిక: 6 నిలువుకు రాచరికాలు/ రాజరికాలు; 36 నిలువుకు బజంత్రి/ భజంత్రి/ బజంత్రీ/ భజంత్రీ- లలో ఏదయినా ఒప్పుగానే పరిగణించాము.

అడ్డం

  1. మదగమన నగుమోము తలాతోకలమీదే ధ్యానం (4)
    సమాధానం: మననము. అంటే ధ్యానం కదా?
  2. రాయలేని ఆటంకముతో చావు (3)
    సమాధానం: అంతము. అంతరాయములో ‘రాయ’లేకపోతే వచ్చేది.
  3. హారతి పడితే పట్టనీరా ప్రజలు (5)
    సమాధానం: నీరాజనాలు. నీరా ప్రజలులో సూచించబడింది.
  4. దీని చిగురుతో బెంగ (2)
    సమాధానం: చింత. చింతచిగురు వినే వుంటారు.
  5. మా లయ మారితే టక్కులాడి అవుతుంది (5)
    సమాధానం: మాయలమారి. టక్కులాడి కదా!
  6. కత్తిరివావిలి చెట్టు నించి దిగిన మరదలు (3)
    సమాధానం: రిత్తిక. వెనకనుండి చూడమని సూచన.
  7. కిటుకుని పాటిస్తే చిటికలో నిద్ర ముంచుకొస్తుంది (5)
    సమాధానం: కునికిపాటు. మాటల పొందికలో కనిపిస్తుంది.
  8. కవి కాలు కదపడం ప్రారంభిస్తే చెల్లాచెదురై పటాపంచలు అవుతుంది (5)
    సమాధానం: కకావికలు. చెల్లాచెదురుగా కనిపిస్తోంది.
  9. తాకట్టు పెట్టుకోడానికి పనికొచ్చేది? (2)
    సమాధానం: తల. వాడుకలో తల తాకట్టుపెట్టడం వినే ఉంటారు.
  10. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇది పఠిస్తే తప్పించుకోవచ్చు (6)
    సమాధానం: పలాయనమంత్రం. ఎదుర్కోలేనప్పుడు పఠించే మంత్రం అదేకదా?
  11. ఆదిమధ్యాంతాలులేని ప్రేమతో కీలు (2)
    సమాధానం: మర. ప్రేమ అంటే మమకారము. అందులో ఆది, మధ్య, అంతాలు లేకపోతే మర మిగుల్తుంది.
  12. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రదేశం (5)
    సమాధానం: రాయలసీమ.
  13. యమున వాలు చూసి పారితే స్త్రీలు వ్రతాలు చేస్తూ ఇచ్చేవి (5)
    సమాధానం: వాయనములు. అక్కడే ఉంది.
  14. 23 అడ్డం తిరగబడింది (2)
    సమాధానం: లక్ష్మి. 23అడ్డం తిరగబడితే రమ కదా?
  15. ఎల్లవేళలా కాదు (6)
    సమాధానం: అడపా తడపా. అప్పుడప్పుడు కదా?
  16. శంభో! గంగాధరా! ఇక్కడే దాగుంది సుఖం (2)
    సమాధానం: భోగం. ఇక్కడే దాగుంది.
  17. జలపుష్పాలు? (5)
    సమాధానం: కలువపూలు. జలపుష్పాలు [అంటే చేపలు అనే అర్థం ఉన్నా] అన్నది కావాలని వాడడం జరిగిందిక్కడ. ఎందుకంటే కలువపూలు కూడా నీటిలోనే కదా వికసించేది.
  18. తప్పుచేసినవాడు లెక్కపెట్టేవి (5)
    సమాధానం: కటకటాలు. ఖైదీలు లెక్కపెట్టేవి అవే కదా?
  19. తలాతోకాలేని పాము మధ్య మిగిలిన దేవర (3)
    సమాధానం: జంగమ. భుజంగమము అంటే పాము. తలాతోకా లేదు.
  20. స్త్రీ అంటే అపరంజి ప్రతిమా? (5)
    సమాధానం: పుత్తడిబొమ్మ. అపరంజి అంటే పుత్తడి. ప్రతిమ అంటే బొమ్మ.
  21. ఈ దొర అంటే సూర్యుడు (2)
    సమాధానం: తమ్మి. తమ్మిదొర అంటే సూర్యుడు.
  22. ఈ జంతువు స్నానం మధ్యలో కంటపడిందో జాగ్రత్త! (5)
    సమాధానం: జలకంటకం. స్నానం అంటే జలకం. మధ్యలో కంట పడింది.
  23. చర్మానికి రాక్షసి (3)
    సమాధానం: తాటకి. తాట+కి. తాట అంటే చర్మం కదా.
  24. విద్యావంతుడిని పోషించదు వరిగడ్డిభోజనం (4)
    సమాధానం: చదువరి. అందులోనే దాగుంది.

నిలువు

  1. వరిపొలం పరిశుద్ధం (2)
    సమాధానం: మడి. దీనికి వరిపొలం, పరిశుద్ధం అనే అర్థాలు.
  2. పిల్లలేని నల్లపిల్లిలో నలిపెయ్యాలనిపించే కీటకం (2)
    సమాధానం: నల్లి. నల్లపిల్లిలో పిల్ల లేకపోతే వస్తుంది. నల్లిని నలిపినట్టు వాడుకలో వింటాం కదా.
  3. మునిమాత కల కంటే శ్రేష్ఠము కాదా? (6)
    సమాధానం: తలమానికము. అంటే శ్రేష్ఠమైనది. అక్కడే ఉంది.
  4. ప్రభుత్వాలు (5)
    సమాధానం: రాచరికాలు, రాజరికాలు. రాజరికము అంటే ప్రభుత్వం కదా.
  5. నాత మధ్య పచ్చగడ్డి వేస్తే సంస్కృతి (5)
    సమాధానం: నాగరికత. పచ్చగడ్డి అంటే గరిక. నాత మధ్యలో చేరింది.
  6. కేక దెబ్బ కలిస్తే పిలిస్తే వినపడేంత దూరం (4)
    సమాధానం: కూతవేటు. కూత అంటే కేక. వేటు అంటే దెబ్బ. రెండూ కలిసేయి.
  7. పోలిక రాశి (2)
    సమాధానం: తుల. తుల అంటే పోలిక. రాశి ఉండనే ఉంది.
  8. తునాతునకలు అయినా కనపడే ప్రతిరూపం (3)
    సమాధానం: నకలు. అందులోనే ఉంది.
  9. అబద్ధపు లెక్కలు వెయ్యడానికి పనికొచ్చే ప్రాణి (2)
    సమాధానం: కాకి. కాకిలెక్కలు వింటుంటాం కదా.
  10. వాడు పట్టుకుని చెల్లాచెదురైతే ఇక బట్టలెవడుకుడతాడు? (6)
    సమాధానం: కుట్టుపనివాడు. అక్కడే ఉంది.
  11. రవి సాము సరిగ్గా చేస్తే జలపుష్పం దొరుకుతుంది (4)
    సమాధానం: విసారము. చెల్లాచెదురైన చేప.
  12. పాలకులు తమ పరిపాలనలో తాంబూలాలకి విధిగా వాడేవారు (6)
    సమాధానం: తమలపాకులు. ఇవిలేకుండా తాంబూలం అవుతుందా?
  13. నయముగా పారే నది (3)
    సమాధానం: యమున. అక్కడే పారుతోంది.
  14. సంక్రాంతి ముందురోజు వేసేవి (3)
    సమాధానం: మంటలు. సంక్రాంతి ముందు వచ్చేది భోగి. అప్పుడు వేసేవి మంటలే కదా.
  15. ఆగమనం రమ్ము చివర (3)
    సమాధానం: రాకడ. రమ్ము అంటే రా. చివర అంటే కడ.
  16. జయతో కూడిన స్త్రీ (3)
    సమాధానం: లలిత. జయలలితలో ఉన్న స్త్రీ కదా. శశికళ అనుకున్నారా?
  17. జాగ్రత్తగా ఉండాలంటే కాపలా తిరిగే సేవకుల మెరిక అవసరం (4)
    సమాధానం: మెలకువ. తిరిగేలో వెనుకనుండి వెతకమని సూచన.
  18. తోటలు బొమ్మలా పేరిస్తే జానపదకళారూపం (6)
    సమాధానం: తోలుబొమ్మలాట. పేరిస్తే అవుతుంది.
  19. పసుపు-నలుపు రంగులు కలిసిన గోవు (5)
    సమాధానం: గంగమయిల. నలుపు పసుపు రంగుల మిశ్రమం. గంగమయిలావు వినే ఉంటారు.
  20. మండు పుటక వలన కలిగే అసూయ (5)
    సమాధానం: కడుపుమంట. అందులోనే ఉంది.
  21. తమకములో తడబడితే సేద్యము (4)
    సమాధానం: కమతము. తడబడి చెల్లాచెదురైంది.
  22. నడుము చూడడం వెనుకటిపని (2)
    సమాధానం: కటి. అందులోనే ఉంది.
  23. వాద్య విశేషం (3)
    సమాధానం: బజంత్రి. (బజంత్రీ, భజంత్రి, భజంత్రీ లను కూడా ఒప్పుగానే పరిగణించాము.)
  24. తాబేలు పైభాగం (2)
    సమాధానం: డిప్ప.
  25. చేబదులు అక్కడక్కడ తీసుకుంటే రుచిగానే ఉంటుంది (2)
    సమాధానం: చేదు. చేబదులులో అక్షరాలు తప్పించి చూస్తే కనబడుతుంది.
  26. పత్రికల్లో రాసేవాడు మధ్యలో చీటీ చిరిగి పువ్వుగా మారేడు (2)
    సమాధానం: విరి. విలేఖరిలో లేఖ తీసేస్తే విరి మిగుల్తుంది.