అనురాగ దగ్ధ సమాధి

నేనెవరినో మీకెవరికీ తెలియదు
ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును
నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన
జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు

ఆ కళ్ళు ఆ అనురాగం కళ్ళు
అనురాగం ఎంత అందంగా ఉండటానికి వీలుంటుందో
అంత అందంగానూ ఉండే ఆ అనురాగం కళ్ళు
లోకమంతట్లోనూ నన్నే చూసే ఆ అందమైన అనురాగం కళ్ళు
నాలోనే లోకమంతటినీ చూసే ఆ అనురాగపుటందమైన కళ్ళు
అనురాగ జలధులై
యుగయుగాల సమస్త ప్రాణికోటి అనురాగాన్నీ
నా పైన అవిరళంగా వర్షించే అనురాగమేఘాలు ఆ కళ్ళు

ఏమిటీ ఆ కళ్ళు మీకు తెలీదా
మూణ్ణిమిషాల్లా గడిచిన ఐదు శతాబ్దాలుగా
అనుక్షణం చూస్తున్న నాకే తెలియదు
ఆ కళ్ళ అనురాగ నీలిమలో కరిగికలిసి లీనమైపోవటం తప్ప

ఈ హృదయం
రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు
ఆ మమతల చెక్కిలిచేర్చనిదే
ఈ సెగ చల్లారదు

ఎర్రని మధువుతో వెచ్చగా చిప్పిలే యీ పెదాలతో
ఆ ఒళ్ళంతా తడవనిదే
ఈ సెగ చల్లారదు

వేడి నెత్తుటితీగలై సాగిన యీ చేతుల బిగింపులో
ఆ మెత్తని నున్నటి గట్టి శరీరం చిదకనిదే
ఈ సెగ చల్లారదు

ఈ సాంద్ర లాలసా తప్త వేదనాస్తిత్వం
ఆ ప్రగాఢాత్మీయ సాన్నిధ్య సాయుజ్యం పొందనిదే
ఈ సెగ చల్లారదు

ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ
ఆ శతసహస్ర ప్రకంపనల వేళ్ళు మీటనిదే
ఈ సెగ చల్లారదు

ఆ శ్వాసలో శ్వాసై ఆ ప్రాణంలో ప్రాణమై
ఆ ఊపిరిలో ఊపిరై ఆ జీవంలో జీవమై
భ్రమించి తపించి క్రమించి శ్రమించి గతించనిదే
ఈ సెగ చల్లారదు

ఆదిశంకర సౌందర్యలహరిలో పునీతమై తను
రాధామాధవ నైతికాద్వైత సమాగమంలో పవిత్రమై నేను
తనువంతటా మనసైన మనసంతటా తనువైన
నేనైన తనలో పరిపూర్ణమై మేము

ఈ కామమోక్ష మోక్షకామ అశాంతుల అగ్నిగోళ
మహారణ్యాల కాంక్షా సౌందర్య తాండవ కీలల్లో
దగ్ధమై ప్రభవించి ప్రభవించి దగ్ధమై
రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి