నేనూహించని కవిత

సాధ్యాసాధ్యాల మధ్య పొర్లాడే
నా ఆలోచనలు,
నిశ్శబ్దాల నీడల్లో తలదాచుకుంటే
గుండెలోపలి గుబాళింపులు
గుబుర్లుగా మొలకలెత్తి
మనసు పొరలు ప్రకంపిస్తాయి
వివిధ గీతికలు పాడుతూ

గుండెలో ఆకారం దిద్దుకుని
మేధలో ప్రాణం పోసుకుని
మాటల్లో రూపంతో ప్రభవించి
అనిపించని అర్థాల్ని విసిరే
భావానికి సంప్రాప్తించే
విభిన్న రూపాలను
విలక్షణార్థాలను
ఊహించని నా మనసుకు
ఆశ్చర్యంతో పిచ్చెక్కుతుంది

ప్రక్క చీకటి వాకిటిలోంచి
ప్రతిధ్వనించే నా గీతంలో
భావాలు తలకిందులై
త్రిశంకు స్వర్గం లోంచి
దీనంగా విలపిస్తాయి

అపుడపుడు
వేదనలో శోధనలో
విరాడ్రూపాన్ని దాల్చి
విస్మయంలో ముంచెత్తుతాయి

ఒక్కొక్కసారి నా యశఃకాయాన్ని
శతఘ్నుల్లా పేలుస్తాయి
అహంకారాన్ని క్షిపణుల్లా
వెంటాడతాయి
నా గుండెను కలంపై ఉరితీస్తాయి

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...